తెలుగు జానపద కథలు - కాళీ కటాక్షం

Telugu folklore story of a thief who turned honest and saved his kingdom and king. Best Telugu janapada kathalu to read.

ధారానగర ప్రభువైన కీర్తిసేనుడు హఠాత్తుగా కాలధర్మం చెందటంతో, అతని కుమారుడైన వీరసేనుణ్ణి మంత్రులు సింహాసనమెక్కించారు. వీరసేనుడు అంతవరకు గురుకులంలో విద్యలు నేర్చుకుంటుండేవాడు. తండ్రి మరణించే సమయానికి ఆ రాజపుత్రుడు అవివాహితుడు. సంవత్సరం దాకా వివాహం చేయకూడదని మంత్రులు భావించి, అంతవరకూ రాజ్యపాలన కుంటుపడకూడదనీ, రాజు లేని రాజ్యం అరాచకమవుతుందనీ, ఇరవై మూడో సంవత్సరపు వయసులోనే వీరసేనుడికి పట్టాభిషేకం జరిపించారు. అంతకు ముందునుంచే ధారానగరంలోనూ, ఆ చుట్టు ప్రక్కల ప్రదేశంలోనూ విపరీతమైన దొంగతనాలతో, దోపిడీలతో ప్రజల్ని గడగడలాడించిన వీరడనే ఓ గజదొంగ ఆ సమయంలో మరింత విజృంభించాడు. ఎక్కడ చూసినా దొంగతనాలే! ఎక్కడ విన్నా దోపిడీలే! ఏ క్షణంలో వీరడు ఏ రూపంలో తన అనుచరులతో వచ్చి మీదపడతాడో ఎవరికీ అర్థంకావటం లేదు. రాజాజ్ఞ ప్రకారం మంత్రులు ఆ గజదొంగను పట్టుకొనటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఎంతో మందిని నేర్పరులైన దళపతులను సైనిక దళసమేతంగా ఆ దొంగను పట్టుకోటానికి నియోగించారు. కానీ వీరడు ఎప్పటికప్పుడు దళపతుల కళ్ళల్లో కారం కొట్టి, తన పబ్బం గడుపుకుంటూ పోతుండేవాడు. రాజధానీనగర ప్రాంతంలోనే కాకుండా రాజ్యమంతటా వీరడు తన అనుచరులతో కలిసి విచ్చలవిడిగా దొంగతనాలూ, దోపిడీలూ ముమ్మరం చేయడంతో దేశం నలుమూలల నుంచి ప్రజలు మహారాజుకు ఆ దొంగల బెడదను గురించి అనేకమైన విజ్ఞప్తులు చేయటం ప్రారంభించారు. క్రమంగా ధారానగర రాజ్యానికి వీరడి బెడద పెద్ద సమస్యగా పరిణమించింది. వీరడి దౌర్జన్యానికి గురియైన ప్రజల విజ్ఞప్తులను వీరసేనుడు స్వయంగా పరిశీలించాడు. ఆ దొంగచేసే దోపిడీ విధానాలు కూడా ఆ విజ్ఞప్తిలో పొందుపరిచారు. వీరడు రకరకాల మారువేషాలతో దొంగతనాలు చేస్తున్నాడనీ, అతనికి మెరికల్లాంటి అనుచరులు వున్నారనీ, తెలుసుకున్నాడు. ఇక తన దళపతులవల్ల వీరడిని పట్టుకునే కార్యక్రమం అలాగే కొనసాగుతూనే వుంటుందనీ, దానివల్ల వుపయోగం లేదనీ భావించిన రాజు, వీరడిని పట్టుకోవటానికి తానే రంగంలో దిగాడు.

అప్పటి నుంచి రాత్రిళ్ళు తాను కూడా మారువేషంతో నగరసంచారం చేస్తూ, ఆ దొంగ ఆచూకీ తెలుసుకోవటానికి ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే వీరసేన ప్రభువుకు గజదొంగగా ప్రసిద్ధికెక్కిన వీరడి నివాసం ఎక్కడ వుంటుందో, అతని అనుచరులు ఎక్కడ వుంటారో మొదలైన వివరాలు ఎంత మాత్రం తెలియలేదు. అయినా వీరసేనుడు నిరుత్సాహపడలేదు. తన మారువేష సంచార కార్యక్రమాన్ని ప్రతిదినం యధావిధిగా కొనసాగిస్తూనే వుండేవాడు. ఒకనాడు రాజు ఓ  సాధువు వేషంతో నగరమంతటా కలియతిరుగుతూ, అర్థరాత్రి దాటాక దక్షిణంవైపు కోట ముఖద్వారానికి సమీపంలోని ఓ బురుజు దగ్గరికి వచ్చాడు. అప్పుడే కొందరు సాధువులు కోట గోడ వెలుపల నుంచి, లోపలి దూకుతున్న దృశ్యం కనిపించింది సాధువు వేషంలో వున్న రాజుకి. అక్కడ కోట గోడ కాస్త శిథిలావస్థలో వుంది. కొన్ని రాళ్ళు పడిపోయి వున్నాయి. పైగా ఆ పరిసర ప్రాంతమంతా బైటా, లోపలా ముళ్ళ చెట్లు విపరీతంగా వుండటంతో, అక్కడికి సర్వసాధారణంగా కాపలా భటులు వెళ్ళరు గస్తీ తిరగటానికి. కోట ముఖద్వారాల దగ్గర వున్న కాపలా భటులు కూడా అడపాదడపా ఏ పది రోజులకో ఓ మారు కోట గోడచుట్టూ తిరుగుతారు తప్ప, ప్రతిరోజూ తిరగరు. రాజు ఆ సాధువులు అలా దొంగచాటుగా కోటలో ప్రవేశిస్తున్నది తప్పకుండా వీరడి దొంగల ముఠా అయివుంటుందని వూహించాడు. ఈ దినం నగరంలోనే దోపిడీ కార్యక్రమం కొనసాగించాలని వాళ్ళు పథకం వేసి వస్తున్నారు. రాజు గదిని చాటున కటిక చీకటిలో దాక్కుని, తన సునిశిత దృష్టులను ఆ సాధువుల వైపే కేంద్రీకరించి, వాళ్ళు ఎటు వెళతారోనని పరీక్షించసాగాడు. ఆ సాధువులలో నల్లని గడ్డమూ, నల్లని మీసాలూ కలిగి, ఆజానుబాహువులను హుందాగా వూగించుకుంటూ అటూ ఇటూ చూసుకుంటూ ముందు నడుస్తున్న ఓ సాధువు రాజును ఆకర్షించాడు. బహుశా అతడే వీరడై వుంటాడని భావించాడు. ఆ సాధువులంతా తమ ముందు వెళుతున్న తమ నాయకుడ్ని అనుసరించి నడుస్తూ గదిని ప్రక్కగానే నడక సాగించారు. వీరసేనుడు వూపిరిసైతం బిగబట్టి, అక్కడే నిల్చుండి పోయాడు. దొంగలంతా అక్కడినుంచి వెళ్ళిన తర్వాత తాను కూడా అక్కడినుంచి బయలుదేరి రహస్యంగా వాళ్ళను వెంబడించసాగాడు. ఆ దొంగలు కొంతదూరం వెళ్ళేసరికి ఓ సత్రం కనిపించింది. 

అంతలో ప్రక్క వీధిలోంచి "పహారా హుషార్" అన్న రాజభటుల హెచ్చరికలు వినిపించడంతో ఆ సాధువుల బృందం చటుక్కున ప్రక్కన వున్న సత్రంలోకి దూరింది. వీరసేనుడు కూడా గబగబా అక్కడికి నడిచి, ఆ సత్రం వెనక భాగంలో వున్న ఓ కిటికీ దగ్గర నిల్చున్నాడు. "దొరా! మనం వచ్చిన వేళావిశేషం బాగా వున్నట్లు లేదు. ఈ పూటకు ఖజానా దోపిడీ కార్యక్రమాన్ని విరమించి, ఏదయినా చిల్లర మల్లర దొంగతనాలతో సరిపెట్టుకుని వెళదాం పదండి. ఖజానా సంగతి మరోసారి చూడవచ్చు" అన్న మాటలు సత్రం లోపలి భాగం నుంచి మెల్లని కంఠస్వరంతో వినిపించేసరికి సత్రం వెలుపల కిటికీ దగ్గర వున్న రాజు అత్యంత ఆసక్తితో కిటికీకి చెవిని ఆనించి లోపలి మాటలను శ్రద్ధగా వినటం ప్రారంభించాడు. ఆ సాధువులు తాను వూహించినట్లు వీరడి ముఠా అయినందుకు, వారితో కలిసి వీరడూ వచ్చినందుకూ రాజుకు చాలా ఆనందం కలిగింది. "అనుకున్నదానిని సాధించకపోవటం ఈ వీరడి జాతకంలో లేదు. ఇటువంటి శకునాల పిచ్చితో కార్యక్రమాల్ని మార్చుకోవటం, అనుకున్నవాటిని వాయిదాలు వేసుకోవటం నాకు నచ్చని పనులు. ఏమైనా సరే ఈ దినం ఖజానా వూడ్చి వెయ్యాల్సిందే!" అన్న గొంతుక కూడా విన్పించింది రాజుకు. ఆ విధంగా సాగే లోపలి సంభాషణను కొంత తడవు విన్న తర్వాత రాజు ఆలోచనల్లో పడిపోయాడు. ఇలా సత్రం వెలుపల వుండి వాళ్ళ మాటలు వింటుంటే సరిపోదు. వాళ్ళెవరో, వాళ్ళ పథకమేమిటో తనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు వారంతా సత్రంలోని చివరి అరలో, అంటే సత్రానికి వెనక వున్న గోడకి సంబంధించిన అరలో వున్నారు. తాను వీళ్ళతో పరిచయం కలిగించుకోవాలి. అందరినీ కట్టగట్టి పట్టుకోవాలి. ఎలా? అనుమానం కలుగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తేగాని వీళ్ళు తనను నమ్మరు. ఇప్పట్లో శక్తికంటె యుక్తినే వుపయోగించాలి. ఆ విధంగా ఆలోచించిన వీరసేనుడు అప్పుడే ఒక యుక్తి మెదడులో తట్టగా, దానిని ఆచరణలో పెడుతూ అక్కడినుంచి కదిలి సత్రం మొగసాలకు వచ్చాడు. ఆ సత్రంలో ఎవరూ కనిపించలేదు వీరసేనుడికి. అక్కడికి కాస్త దూరంలో వున్న వీధిదీపపు వెలుతురు కొద్దికొద్దిగా పడుతోంది సత్రం మొదటి అర దగ్గర. అందువల్లనే ఆ దొంగలు చివరి అరలోకి వెళ్ళారని నిశ్చయించుకుని, అప్పటికే వీరడి దృష్టి తనమీద పడివుంటుందని వూహిస్తూ రాజు తాను కూడా ఓ దొంగలా అభినయిస్తూ తనను ఎవరైనా చూస్తున్నారేమోనన్న అభిప్రాయంతో అటూ యిటూ చూస్తోన్నట్లు ఇతరులకు భ్రమ కలిగిస్తూ తలను నలువైపులా త్రిప్పుతూ మొదటి అరలోంచి రెండవ అరలోకి వెళ్ళాడు. 

అప్పుడు కనిపించారు అతనికి కొంతమంది సాధువులు చీకట్లో కూర్చుని. వాళ్ళకు కాస్త ఎడంగా ఓ సాధువు కూర్చుని వున్నాడు. అతడే గజదొంగ వీరడై వుంటాడని భావించాడు వీరసేన మహారాజు. కొద్దిసేపు స్తబ్దంగా గడిచిపోయింది. ఎవరూ మాట్లాడుకోలేదు. అంతలో మూడవ యామం ప్రారంభదశను, రెండవ యామం అంతాన్నీ సూచిస్తూ, కోటలో గంట మ్రోగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీరడు రాజును చూస్తూ, "ఏ వూరు పెద్దయ్యా మీది?" అని అడిగాడు. రాజు నవ్వాడు. "ఏ వూరని అడిగితే నవ్వుతావేమిటి?" అని ప్రశ్నించాడు వీరడు. "ఇదే ప్రశ్న నేనడిగితే నువ్వు సరిగ్గా జవాబు చెప్పగలిగే స్థితిలో వున్నావా? నా పరిస్థితి కూడా నీ స్థితి లాంటిదే! అందుకే నవ్వాను" అన్నాడు రాజు. "అంటే మీరెవరో తెలుసుకోవచ్చునా?" "ఒక దొంగ దగ్గర మరో దొంగకు దాపరికం అనవసరం. నేను ఈ దినం రాజుగారి ఖజానా దోచెయ్యాలని బయలుదేరాను." ఆ మాట వినగానే వీరడు తన అనుచరుల కేసి ఓ మారు చూసి, తిరిగి తనవేపు తిరగడం రాజు సూదంటు రాళ్ళలాంటి కళ్ళు గమనించాయి. "ఏమన్నారు? ఖజానా దోచెయ్యాలని బయలుదేరారా?" "అవును. నిన్ననే దేశం నలుమూలలనుంచి శిస్తు వసూళ్ళు వచ్చాయి. ఖజానా నిండా ధనం మూలుగుతోంది." "ఆ సంగతి నీకెలా తెలుసు?" అతని ప్రశ్నకు రాజు మళ్ళీ నవ్వాడు. "నేనేది అడిగినా అలా నవ్వుతావేం?" "నీ ప్రశ్నలలా వున్నాయి. నేను ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుని, పరిశీలించనిదే ఓ నిర్ణయానికి రాను. రాజుగారి కొలువులో నాకు తెలిసిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళ ద్వారా నాకు ఖజానా విషయం తెలిసింది." "సరే ఒంటరిగా ఖజానాను దోచుకోటానికి బయలుదేరారు. మీ ధైర్యం మెచ్చదగినదే గాని వెంట కొంతమంది అనుచరులు వుండటం అవసరం కదా?" "నీ వెర్రిగాని, ఎంతమంది అనుచరులున్నా రాజు బలగాన్ని యెదిరించటం సాధ్యమౌతుందా? యుక్తితో పని సాధించుకుని బయటపడాలి. అంతెందుకు నేను ఇప్పటికి ఎన్నో దొంగతనాలు చేశాను. అన్నీ ఒంటరిగానే చేశాను. ఎక్కడా పట్టుబడలేదు. నేను చేసిన దొంగతనాలు కూడా నీ దొంగతనాల్లో కలిసిపోయాయి." "అంటే?" 

"ఏముంది? ఈ రాజ్యంలో వీరడు గొప్ప గజదొంగ అనీ, రకరకాల మారువేషాలతో దోపిడీలూ, దొంగతనాలూ వుధృతంగా కొనసాగిస్తున్నాడని, అందరికీ తెలిసిన విషయమే! అందువల్ల నేను చేసిన దొంగతనాలు కూడా నువ్వు చేసినట్లే అయ్యాయి. రాజుగారికి ఫిర్యాదులు ఒక్క నీ మీదనే అందుతున్నాయి కూడా." రాజు మాటలకు సాధువు వేషంలోని వీరడు ఆశ్చర్యపోయాడు. "నేను వీరడినని ఎవరు చెప్పారు?" "నాకు తెలుసు. బహుశా నువ్వు కూడా రాజుగారి ఖజానా దోచెయ్యటానికే వచ్చి వుంటావు. ఎందుకంటే నగరంలోనూ, చుట్టుపట్ల వూళ్ళలోనూ ఈ పాటికే చాలా దొంగతనాలూ, దోపిడీలూ చేశావు. ఈసారి భారీ ఎత్తున చెయ్యాలనుకుని బయలుదేరి వుంటావనుకుంటున్నాను." "అదేం కాదు. నేను నువ్వనుకుంటున్న మనిషిని కాదు. నువ్వేం చెబుతావో విందామని మాటలు కలిపి మాట్లాడాను. నేను నిజమైన సాధువునే." "భయపడుతున్నావా? నేను నిర్భయంగా నా గురించి చెప్పాను. పైగా నేను ముందే వెల్లడించాను. ఒక దొంగ దగ్గర మరో దొంగకు దాపరికం వుండకూడదని. నువ్వు ప్రసిద్ధ గజదొంగవు. ఇద్దరం కలిస్తే, ఖజానాను సునాయాసంగా దోచుకోవచ్చు. ఇద్దరం చెరిసగం పంచుకుందాం. ఏమంటావ్?" వీరడు ఆలోచించాడు. కొత్త దొంగ చాలా తెలివైన వాడిలా కన్పించాడు అతనికి. ఖజానాను గురించి, తనను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. పైగా చాలా నేర్పుతో తాను సాగించే దొంగతనాలన్నీ తన మీద వేస్తూ వచ్చాడు. ఇతణ్ణి వుపయోగించుకోవటం తనకే లాభం. అంత సొమ్మును దోచుకునేటప్పుడు వాటా ఇవ్వటానికి అభ్యంతరమేముంది? పైగా ఇతనికి రాజుగారి కొలువులో కొందరు తెలిసిన వాళ్ళున్నారు. కనుక ఖజానా దగ్గర కూడా అట్టే గందరగోళం లేకుండా పని జరిగిపోతుంది. నువ్వు ఆలోచనలతో కాలయాపన చేస్తే, సమయం కాస్తా దాటిపోతుంది. ఖజానా దోచెయ్యటానికి ఇది మంచి సమయం. నేనూ ఒకే పని మీద వచ్చాను, నువ్వూ అదే పని మీద వచ్చావు. త్వరగా ఓ నిర్ణయానికి వచ్చి, నాతో చేతులు కలుపు. నువ్వు వీరడివి కానన్నంత మాత్రాన కాకుండా పోవు. నాతో చెయ్యి కలిపి నాతో వస్తే సంతోషం. రాకపోతే నేను బయలుదేరతాను. కాని మీ సంగతి ఏ రాజభటులకైనా చెబుతానని మాత్రం అనుకోకు. వస్తా" అని రాజు తను కూర్చున్న చోటునుంచి లేచాడు. వీరడు అతడు రెండడుగులు వేసేసరికి ఓ నిర్ణయానికి వచ్చి, "ఆగండి, మేమూ వస్తాం. మీ షరతు అంగీకరించాను" అన్నాడు. మారువేషాలతో రాజు, వీరడు, అతని అనుచరులు రాజవీధిలో ప్రవేశించారు. 

ఎవరైనా తమ్ము చూస్తారేమోనని దారిపక్కన నడుస్తూ వీధిదీపపు వెలుతుర్లు తమమీద పడకుండా జాగ్రత్త వహిస్తూ రాజు ముందు నడుస్తుండగా అతని ప్రక్కన వీరడు, వాళ్ళ వెనుక అనుచరులు నడవసాగారు. రాజవీధి మలుపు తిరిగేసరికి అప్పుడే యిద్దరు కాపలా భటులు హఠాత్తుగా ప్రక్క వీధిలోంచి అక్కడికి వచ్చారు. ఊహించని విధంగా అక్కడ కాపలా భటులు తారసిల్లేసరికి వీరడు, అతని అనుచరులు కాస్త కంగారుపడ్డారు. ఈ యిద్దరినీ లెక్కచేయల్సిన అవసరం లేదు. వీళ్ళు ఈల వేస్తే బిలబిలమంటూ ఎక్కడెక్కడినుండో రాజభటులు వచ్చిపడతారు. అంతలో రాజభటుల్లో ఓ వ్యక్తి వాళ్ళను చూస్తూ, "ఎవరయ్యా మీరు? ఎక్కడికిలా వెళుతున్నారు?" అని అడిగాడు గద్ధింపు ధోరణిలో. "మేం సాధువులం" అన్నాడు రాజు. "ఆ సంగతి మీ జేగురుగుడ్డలు చెబుతున్నాయి. ఎక్కడైనా సత్రంలో తలదాచుకోకుండా యిలా వూరు తిరుగుతున్నారెందుకు? అసలే దొంగతనాలతో, దోపిడీలతో ప్రజలు భయపడుతున్నారు. మీ ప్రవర్తన సందేహంగా వుంది. కొత్వాలు దగ్గరికి పదండి" అన్నాడు ఆ భటుడు. రాజు వెంటనే తన అంగుళీయకం ఆ భటులకు కనిపించేటట్టు చేతిని కాస్త ముందుకు సాపి, "బాబూ! మేము మామూలు పొట్టకూటి సాధువులం కాదు. ఇతరుల మంచి కోసం శ్రమించే సాధువులం. మీ రాజుగారి క్షేమం కోరి, మీ ప్రజల బాగోగులను దృష్టిలో వుంచుకుని, మేము దైవ ప్రార్థన చేస్తూ నగరమంతా తిరుగుతున్నాం. ఇప్పటికి వూరంతా తిరిగాం. ఈ రెండు వీధులూ తిరిగితే, మా నగర ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఆ తరువాత మాదారిన మేము వెళ్ళిపోతాం..ఈ మాత్రం అర్థం చేసుకో.. చాలు" అన్నాడు. ఆ భటుడు "సరే..సరే..త్వరగా మీ పని మీరు చూసుకుని వెళ్లిపోండి" అని తన అనుచరునితో కలిసి వెళ్ళిపోయాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక వీరడు రాజుతో "నువ్వు మంచి మాటకారివి.. ఆ భటుల వల్ల యేదైనా బెడద వస్తుందేమో ననుకున్నాను. చాలా సులభంగా తప్పించావు. నీ కళ్ళలో వశీకరణం లాంటిదేదైనా వుందా మిత్రమా?" అన్నాడు చిరునవ్వుతో. "ఏదో ఒకటి చెప్పి ముందుకు సాగిపోవాలి కదా. అదిగో ఆ .. కనిపిస్తున్నది గజశాల .. ఆ ప్రక్కన అశ్వశాల యిటు ప్రక్కన ఆయుధశాల. ఆయుధ శాలకు అనుబంధంగా వున్న భవనమే ఖజానా. ఖజానా కాపలాదార్లు అట్టేమంది వుండరు. మనం త్వరగా వెళదాం" అన్నాడు రాజు. "పదండి" అన్నాడు వీరడు. కొంత దూరం నడిచి వాళ్ళు ఖజానాను సమీపించారు. 

ఆయుధశాల ప్రహరీ గోడ చీకటిలో నిల్చున్నారు అందరూ. "ఏం ఆగిపోయారేం?" "కాపలావాళ్ళు, సరిగ్గా వాకిలి దగ్గరే వున్నారు. కొంచెం సేపు ఆగుదాం..ఈలోగా వాళ్ళు అటో యిటో కదలకపోతే, అప్పుడు చొరవ చేద్దాం." అన్నాడు రాజు. రాజు కావాలనే కాలయాపన చేయటం ప్రారంభించాడు. వీరడు మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు. "ఏమన్నారు? మహారాజుగారు సాధువు వేషంలో కనిపించారా? వారివెంట కొంతమంది సాధువులు వున్నారా?" ప్రధానిమంత్రి కళ్ళు చిట్లిస్తూ, భృకుటి ముడివేస్తూ అన్నాడు. "అవును మహామంత్రీ! మేము తమ్ము గుర్తించాలని వారు అంగుళీయకం మాకు కనిపించేటట్లు చెయ్యి ముందుకు సాచారు. వారి మాటలు కూడా నర్మగర్బంగా తోచాయి." "ఏమన్నారు?" కాపలాభటుడు అంతకు ముందు సాధువు వేషంలో వున్న మహారాజుగారు చెప్పిన మాటలు చెప్పాడు. ప్రధాని కొన్ని క్షణాలు ఆలోచించాడు. ఆయన ముఖంలో మార్పు వచ్చింది. వెంటనే లేచి నిల్చున్నాడు. "భద్రా! వారు మారువేషంలో వున్న మన మహారాజుగారే. దొంగలను పట్టుకోవటానికి స్వయంగా రంగంలోకి దిగినట్లున్నారు." "అయితే.. వారి వెంట వున్న సాధువులు యెవరై వుంటారు?" "ఆ సాధువులంతా దొంగలు. బహుశా వీరడి ముఠాకి సంబంధించిన వారై వుంటారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నువ్వు దళపతి ఇంటికి వెళ్ళి, కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని రమ్మని చెప్పు. త్వరగా రావాలని చెప్పు" అన్నాడు. ఆ భటులు ఇద్దరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ప్రధాని దుస్తులు మార్చుకుని, కరవాల సహితమైన ఒరను నడుముకు తగిలించుకుని, సిద్ధంగా వున్నాడు. అంతలో.. దళపతి ఓ ఇరవై మంది సైనికుల్ని వెంటబెట్టుకుని వచ్చి ప్రధానికి నమస్కరించాడు. "మనం వెంటనే ఖజానా దగ్గిరికి వెళ్ళాలి. ఖజానాను సమీపించేటప్పుడు ఎవ్వరూ ఏ శబ్దమూ చెయ్యరాదు. అక్కడ మహారాజుగారు దొంగలను పట్టుకునే ప్రయత్నములో వున్నారు. వారి పరిస్థితిని పసికట్టి సందర్భాన్ని బట్టి మనం రంగంలోకి దూకాలి. నేను ఆజ్ఞ ఇచ్చే దాకా మీరంతా ఆ ప్రాంతంలో చీకట్లో వుండాలి" అన్నాడు ప్రధాని. "చిత్తం" అన్నాడు దళపతి. ఆ తర్వాత ప్రధాని దళపతిని, సైనికులను వెంటబెట్టుకుని, ఖజానా ప్రాంతానికి వెళ్ళారు. ఖజానా దగ్గర ఇద్దరు కాపలా భటులు మాత్రమే కనిపించారు. 

సాధువుల జాడ లేకపోయేసరికి, బహుశా మహారాజుగారు సాధువుల వేషంలోని దొంగలకు యేదో చెప్పి, మభ్యపెడుతూ చాటుమాటున వుండి వుంటారని భావించాడు. ఎందుకంటే, కాపలా భటులు తమ్ము గుర్తించిన తరువాత తప్పకుండా తన దగ్గిరికి వెళతారని మహారాజు వూహించి వుంటారు. తాను సర్వసన్నాహంగా ఖజానా దగ్గిరికి రావటానికి కొంత సమయం పడుతుందనీ, ఆ సమయం సమీపించేదాకా వాళ్ళను అలా మభ్యపెట్టి ఆపుచేయటం అవసరమని భావించి వుంటారు మహారాజు. ప్రధాన మంత్రి పై విధంగా అలోచించి, దళపతిని, సైనికులను అక్కడక్కడ చీకట్లో దాక్కోమని చెప్పి, తాను కూడా చీకట్లో దాగాడు. "ఇంకా ఎంతసేపు? ఆ భటులిద్దర్నీ నా అనుచరుల్లో ఒక్కడు చాలు మట్టికరిపించటానికి. పదండి ఖజానా దగ్గిరికి వెళదాం" అన్నాడు వీరడు రాజుతో. ఇంకా ప్రధాని సిబ్బందితో అక్కడికి రాలేదని, ఇటుగా తాను ఒంటరిగానే వీళ్ళని ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తూ రాజు చీకట్లోంచి కదిలాడు. వీరడి అనుచరులు కూడా చీకట్లోంచి బైటికి రాగానే వీరడు హఠాత్తుగా రాజు రెండు చేతులూ తన చేతుల్తో వెనక్కి విరిచి పట్టుకుని చిన్నగా నవ్వాడు. "ఏమిటిది? నన్ను మోసం చేస్తావా నువ్వు?" అన్నాడు రాజు. "నువ్వు చేయబోయే మోసానికి యిది విరుగుడు మహారాజా!" అన్నాడు వీరడు రాజును అటూ యిటూ కదలకుండా వీపును తన వక్షభాగానికి బిగిస్తూ. "నేను మహారాజునా? ఏమిటి నువ్వంటున్నది?" అన్నాడు మహారాజు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తూ. "నువ్వు కాపలా భటులకు చేతివ్రేలి అంగుళీయకాన్ని చూపించినప్పుడే నేను నిన్ను గుర్తించాను. ఆ కాపలా భటులు కూడా నిన్ను గుర్తించి కూడా గుర్తించనట్లే యెందుకు ప్రవర్తించి అలా వెళ్లిపోయారో తెలుసుకోలేనంత బుద్ధిహీనుడిననుకున్నావా? వాళ్ళు వెళ్ళి మంత్రినో, సేనానినో, సిబ్బందినో తీసుకుని వస్తారనీ, అప్పుడు మమ్మల్ని సులభంగా పట్టుకోవచ్చుననీ అలోచించి, ఆయుధాలశాల ప్రహరీగోడ చాటున చీకట్లో అనవసర కాలయాపన చేశావు. అలా చేయటంతో నాలోని అనుమానం మరింత బలపడి, యీ ప్రాంతాన్ని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ వచ్చాను. నీ మనుషులు రావడం, అక్కడక్కడ చీకట్లో దాక్కోవటం నేను గమనించాను. అయితే, మనం కనిపించకపోవటంతో నీ అనుచరులు చాలా తెలివిగా దాక్కున్నారు, సమయం చూసి బయట పడదామన్న వుద్దేశ్యంతో! ఆ సమయాన్ని నేనే నా చేతుల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నీ అనుచరులు యీ దృశ్యాన్ని చూస్తుంటారు చీకట్లోంచి. కాని, బయటపడటానికి సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చిక్కావు. ఇక నేను చెప్పినట్లు చెయ్యటం కంటే నీకు గత్యంతరం లేదు కనుక! ఊఁ, నా అనుచరులు ఖజానా దోపిడీ కార్యక్రమాన్ని పూర్తిచేసేదాకా నీ అనుచరులెవరూ బైటకి రాకుండా గొంతెత్తి అరచి చెప్పు. మా పని పూర్తయిన తర్వాత నిన్ను మాతో కొంతదూరం తీసికెళ్ళి అప్పుడు విడిచిపెడతాను" అన్నాడు వీరడు. గత్యంతరం లేని మహారాజు వీరడు చెప్పినట్లు చేశాడు. వీరడు తన అనుచరులను ఖజానా దోచెయ్యమని ఆజ్ఞ యిచ్చాడు. మెరుపువేగంతో మహారాజు తల పైకిలేచింది. వూహించని విధంగా వీరడి గడ్డానికి మహారాజు తన తలతో ఢీకొట్టాడు. వీరడు కళ్ళు బైర్లు క్రమ్ముతుండగా మహారాజును బిగించి పట్టుకున్న తన చేతులను జార విడిచి వెనక్కి తూలాడు. చీకట్లో నిల్చుని ఆ చర్యలన్నిటినీ పసికడుతున్న మంత్రి దళపతికి, సైనికులకు ఆజ్ఞయిచ్చాడు. కన్నుమూసి తెరిచేంతలో దళపతి తారాజువ్వలావచ్చి వీరడిని పట్టుకున్నాడు. నలుగురైదుగురు సైనికులు వీరడి పెడరెక్కలు విరిచి బంధించారు. తక్కిన సైనికులు ప్రధాని ఆజ్ఞ ప్రకారం దొంగలందరినీ తరిమి పట్టుకున్నారు. 

మహారాజు తన దుస్తులపైన గిరికెలదాకా వున్న కాషాయం అంగరభాను తీసిపారేశాడు. తలమీద తగిలించుకున్న జుట్టునూ, కృత్రిమంగా పెట్టుకున్న గెడ్డం, మీసాలను లాగిపారేశాడు. "ప్రభూ..! వీడు వీరడేనా..?" అన్నాడు ప్రధానమంత్రి. అవునన్నట్లు తలను వూగించాడు మహారాజు. మహారాజు రాత్రి స్వయంగా వీరడిని పట్టుకున్నాడనీ, ఆ దినం న్యాయస్థానంలో అతడ్ని శిక్షించనున్నారనీ, తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా రాజసభకు వచ్చారు. వీరసేన మహారాజు దొంగలందరికీ మూడు సంవత్సరాల కారాగారవాస శిక్షను విధించి, వీరడికి ఉరిశిక్ష విధించాడు. ఆ ఉరిశిక్షను ఆ దినమే అమలుపరచాలని కూడా ఆదేశించాడు. ప్రజలందరూ ఆడామగా అతడ్ని చూడటానికి వీలుగా వీరడిని పురవీధులన్నీ వూరేగించి, ఆ తర్వాత ఉరితీయవలసిందిగా రాజు తలారులను ఆదేశించాడు. మహారాజు ఆజ్ఞప్రకారం రాజభటులు వీరడిని బండి మీద ఓ పెద్ద కొయ్యకు విరిచికట్టారు. తలారులు వెంటనడుస్తుండగా ఆ బండి పురవీధులు తిరగసాగింది. అంతకాలం నుంచి దొంగతనాలతో, దోపిడీలతో రాజ్యం మొత్తాన్నీ గజగజలాడించిన వీరడిని చూడటానికి పురవీధుల్లో పౌరులు గుంపులు గుంపులుగా చేరారు. స్త్రీలు మేడలమీదా, మిద్దెలమీదా నిల్చుని, ఆ వింతను చూడసాగారు. బండి తోలేమనిషి జనాన్ని తప్పుకొమ్మని హెచ్చరిస్తూ ఎడ్లను నెమ్మదిగా నడిపించడం ప్రారంభించాడు. ఊరేగింపు కొన్ని వీధులు తిరిగి, చివరకు రైతులు నివసించే వీధిలోకి వచ్చింది. ఆ వీధిలో ధర్మయ్య అనే ఓ సంపన్న రైతు నివసిస్తున్నాడు. ధర్మయ్యకు ఒకే కూతురు..నిర్మల! ఆమెకు పద్దెనిమిదేళ్ళుంటాయి. వీరడిని చూడటానికి అందరితో బాటు నిర్మల కూడా ఉత్సుకతను ప్రదర్శిస్తూ, తమ మేడపైకి యెక్కింది. బండి కొంత సేపటికి ధర్మయ్య మేడ పరిసర ప్రాంతానికి వచ్చింది. వీరడు దొంగగా ప్రసిద్ధికెక్కాడేగాని, అతడు మంచి అందగాడు. పాతిక సంవత్సరాలుంటాయి.  

అతను తల వాల్చుకుని వున్నాడు. ఉంగరాలు తిరిగిన నల్లని తల వెంట్రుకలు నుదుటి మీదకు వ్రాలివున్నాయి. నిర్మల వీరడిని చూడగానే అచ్చెరపాటుతో కళ్ళు చిట్లించి మరీ చూసింది. అతడు భయంకరంగా, అసహ్యంగా వుంటాడేమోననుకుంది అంతకుముందు. ఇతడు దొంగతనాలు, దోపిడీలు చేసి, రాజ్యాన్ని భయపెట్టాడా? తనను చూసి అసహ్యించుకునే ప్రజలను తలెత్తి చూడలేక తల వాల్చుకున్నాడు. ఇక కొద్ది సేపటిలో తలారుల కత్తులకు బలికాబోతున్నాడు. ఎంత నేరస్థుడికైనా ఉరిశిక్ష శిక్ష కాకూడదు. అది మానవత్వమనిపించుకోదు. వీరడిని శిక్షనుంచి తప్పించాలి. అతని పరిస్థితికి జాలిపడుతూ, అతణ్ణి గురించి ఆలోచిస్తోన్న నిర్మల మనసులో కన్నెప్రేమ అంకురించింది. క్షణంలో అది ఆమె మనస్సంతా ఆక్రమించింది. వీరడిని ఆమె ఎలాగైనా శిక్ష తప్పించాలనుకున్నప్పుడు ఆమెలో ప్రేమబీజం మొలకెత్తింది. వెంటనే మేడ మీదినుంచి క్రిందికిదిగి తండ్రి దగ్గరికి వెళ్ళింది. "నాన్నగారు! ఇంతకు ముందు మీరు నా వివాహం తలపెట్టినప్పుడల్లా వద్దనే దానిని. ఇప్పుడు వివాహం చేసుకుంటాను." అంది నిర్మల తండ్రితో. ఆ మాటలకు ధర్మయ్య ఆనందంతో పొంగిపోయాడు. "నా తల్లే! ఎంత చల్లని మాట చెప్పావే! త్వరలో మంచి సంబంధం చూసి చేస్తానమ్మా.." అన్నాడు ధర్మయ్య. "త్వరలో కాదు నాన్నా! ఇప్పుడే చెయ్యండి." "ఇప్పుడా!" ధర్మయ్య పిచ్చివాడిలా కూతురివేపు చూశాడు. "అవును." "ఇప్పటికిప్పుడు వరుణ్ని ఎక్కడ నుండి తీసుకు వస్తానమ్మా! మన తాహతుకు తగిన యోగ్యుడైన వరుణ్ని వెతకాలిగా." "మీరు వరుని కోసం శ్రమ పడనవసరంలేదు నాన్నా. నేనే చూశాను." "ఎవరమ్మా?" "అడుగో!" సరిగ్గా బండి మీద అప్పుడే తమ ఇంటి ముందుకి వచ్చిన వీరడి వేపు చూపుడు వ్రేలిని చూపిస్తూ అంది నిర్మల. "అమ్మా! నీకేమైనా మతిపోయిందా తల్లీ!" అన్నాడు ధర్మయ్య. "నువ్వా మాట అంటావని నాకు తెలుసు నాన్నా! అనవసర కాలయాపన చేస్తే, అతడు నాకు దక్కకుండా పోతాడు" అంది నిర్మల ఆందోళనతో. "వాడు పచ్చి దొంగ. లోకమంతా ఏవగించుకొనే జీవితం గడిపేవాడు. మహారాజుగారిచేత ఉరిశిక్షను పొందాడు. ఇక కొద్ది సేపటిలో మరణించనున్నాడు. అటువంటి హీనుణ్ణి, అల్పాయుష్కుడినీ పెళ్ళి చేసుకోవాలన్న తలంపు నీకెలా కలిగింది?"

"ఎలాగో కలిగింది. ఇప్పుడు మీరు మహారాజుగారి దగ్గరికి వెళ్ళి, వీరడికి క్షమాభిక్ష ప్రసాదించమని ప్రార్థించండి. అతడికి ఉరిశిక్ష తప్పించి, నా వివాహం జరిపించండి." "నువ్వనుకున్నంత తేలికకాదు తల్లీ! అంత పాపాత్ముణ్ణి స్వయంగా పట్టి బంధించిన రాజు యెట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. అనవసర ప్రయాసతప్పితే, ప్రయోజనం వుండదు." "నాన్నా!" నిర్మల తీవ్రంగా అంది. "మీరు వెళ్ళి మహారాజుగారిని ఒప్పించటానికి ప్రయత్నించండి. రాజు అతనికి క్షమాభిక్షను ప్రసాదించకపోతే ఉరిశిక్ష అమలు జరిగేలోగా కనీసం వీరడిచేత తాళి కట్టించుకునే అవకాశమైనా కలిగించమని అడగండి." "అమ్మా!" "అవును! నేను తొలిచూపులోనే వీరడిని ప్రేమించాను. మానసికంగా అతను నా భర్త అయ్యాడు. ఇక లోకానికి తెలిసేటట్టు అతనిచేత తాళి కట్టించుకుని అతడికి ఉరిశిక్ష అమలు జరగకముందే ప్రాణం విడిచిపెడతాను. సుమంగళిగా ఈ లోకం విడిచిపెడతాను. మీరు కన్నకూతురికి కనీసం ఈ మాత్రమైనా చేయకపోతే ఇప్పుడే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను" అంది నిర్మల. అప్పటికి వీరడిని తీసుకుని వెళుతున్న ఊరేగింపు బండి చాలాదూరం వెళ్ళిపోయింది. ఒక్కగానొక్క కూతురు ఈ విధంగా హఠాత్తుగా మారిపోయి అలా మాట్లాడేసరికి ధర్మయ్య విచారానికి అంతులేకపోయింది. కూతురు పట్టుదల అతడికి తెలుసు. అందువల్ల ఇక ఏ విధంగానూ ఆమె నిశ్చయం మరల్చటం సాధ్యంకాదని భావించి, ధర్మయ్య "అలాగే తల్లీ! వెళ్ళి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ అదృష్టం ఎలా వుందో" అని అప్పటికప్పుడు హడావిడిగా రాజమందిరానికి వెళ్ళాడు. "ధర్మయ్యా? నీ కూతురికి పిచ్చి పట్టిందా? ఆ దొంగని వివాహం చేసుకోవటానికి అంత మూర్ఖంగా మొండి పట్టుదల పడితే, తగిన బుద్ధి చెప్పకుండా, నా దగ్గరికి వచ్చావా?" వీరసేన మహారాజు తన ఎదురుగా చేతులు కట్టుకుని బ్రతిమాలుకున్న ధర్మయ్యను చూస్తూ గద్దించాడు. "చిత్తం! ఎంతోచెప్పి చూశాను. వినటం లేదు ప్రభూ! తమరు దయతో నా ప్రార్థన మన్నించి, వీరడిని విడిచి పెట్టండి. నా కూతురి జీవితం నిలబెట్టండి..." అని మళ్ళీ ప్రాధేయపడుతూ అడిగాడు ధర్మయ్య. 

వీరసేనుడు నిప్పులు క్రక్కుతున్న కళ్ళతో చూశాడు అతణ్ని. "ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? బాధ్యత కలిగిన ఓ పౌరునిగా నువ్వు ఆ గజదొంగను విడిచిపెట్టమని అడగడంలో ఔచిత్యం వుందా? వాడు యీ విధంగా తప్పించుకుని, మళ్ళీ దేశంమీద పడి గగ్గోలు చెలరేగిస్తే, ప్రజలంతా అల్లాడిపోరా? అసలు రాజు అన్నవాడు చెయ్యవలసిన పనేనా యిది? యీ సూత్రమైన ఆలోచించకుండా యెలా వచ్చావు? నీ  కూతురి జీవితం కోసం రాజ్యప్రజలందరి జీవితాలతో చెలగాటమాడలేను. ఇది మన వ్యక్తిగతమైన విషయం కాదు. రాజ్యానికి సంబంధించిన విషయం! ఇంతెందుకు నువ్వు ఎంత బ్రతిమాలుకున్న నిష్ప్రయోజనం. వీరడిని విడిచిపెట్టడం జరగని పని. అనవసరమైన అభ్యర్థనలతో నన్ను విసిగించకుండా వెళ్ళు" అన్నాడు. ధర్మయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇక ఎలాగూ తన కూతురు తనకు దక్కదనుకున్నాడు. అయితే ఆమె కోరిన రెండో కోరికనైనా తీర్చడం తండ్రిగా తన విద్యుక్త ధర్మం. ఆ విధానానికైనా మహారాజుగారిచేత అనుమతి పొందాలి. ఆ విధంగా ఆలోచించుకున్న ధర్మయ్య "ప్రభూ! వీరడిని విడిచిపెట్టకుంటే మానె, మరో అభ్యర్థననయినా దయతో పరిశీలిస్తారా?" అన్నాడు. "ఏమిటది?" ధర్మయ్య వీరసేన మహారాజుతో తన పుత్రిక రెండవ కోరికను మనవి చేశాడు. రాజు కొన్ని క్షణాలు అలోచించి "ఏమిటయ్యా నీ కూతురుకు అంత మొండి పట్టుదల! చనిపోయే ముందు ఆ దొంగ చేతుల్తో తన మెడలో తాళి కట్టించుకుని, అతడికంటే ముందుగా సుమంగళిగా తన ప్రాణాలు విడిచిపెడుతుందా? ఈ పాతివ్రత్యం చాలా విచిత్రంగా వుంది. అయినా అది ఆమె యిష్టం. యీ విధానానికి నాకు అభ్యంతరం లేదు. అలాగే జరిపించుకో" అన్నాడు. "దయచేసి ఆ ప్రకారంగా తలారులకు, రాజభటులు శాసనం వ్రాయించి ఇవ్వండి ప్రభూ" అన్నాడు ధర్మయ్య. వెంటనే వీరసేనుడు తన అంగరక్షకుల్లో ఒకతన్ని పిలిచి, "ఈ ధర్మయ్య కూతురితో వీరడి వివాహం జరిపించి ఆ తర్వాత ఉరితీయవలసిందిగా తలారులకు మా మాటగా చెప్పు" అన్నాడు. "ఆజ్ఞ ప్రభూ!" అన్నాడు అంగరక్షకుడు. మహారాజు ధర్మయ్య వేపు తిరిగి "ఇక వెళ్ళవయ్యా! ప్రపంచంలో యెవరూ కననట్లు ఓ విచిత్రమైన మనస్తత్వం కలిగిన కూతుర్ని కన్నావు" అన్నాడు. ధర్మయ్య మహారాజుకు నమస్కరించి, అంగరక్షకునితో కలిసి అక్కణ్ణించి కన్నీళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయాడు. 

వీరడిని మహారాజు బంధించటం యెంతటి సంచలన వార్త అయిందో, ధారానగరంలో నిర్మల వీరడిని వివాహము చేసుకోబోతోందన్న వార్త కూడా అంత సంచలనాన్ని కలిగించింది. ఆ వింత చూడటానికి మగవాళ్ళకంటే, ఆడవాళ్ళే యెక్కువగా కుతూహలాన్ని ప్రకటిస్తూ, వూరిముందరి వధ్యస్థానానికి చేరుకున్నారు. ధారానగర ప్రజల్లో దాదాపు సగంమంది అక్కడకు చేరారు. రాజోద్యోగులు ప్రజల్ని అదుపులో పెడుతూ తిరుగుతున్నారు. ధర్మయ్య విషాదవదనుడై, ముత్తయిదువులతో పరివేష్టింపబడిన పెళ్ళికూతుర్ని తీసుకుని మంగళవాద్యాలతో వధ్యస్థానానికి వచ్చాడు. అంగరక్షకుడు తలారులకు మహారాజు ఆజ్ఞ తెలియజేయటంతో వాళ్ళు వీరడికి ఆ విషయం చెప్పారు. తనవంటి నిర్భాగ్యుణ్ణి, ఇక కొద్దిసేపట్లో ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోతున్న మృతజీవుణ్ణీ నిర్మల ప్రేమించి, పెళ్ళిచేసుకోవటానికి అంత తతంగం నడిపించడం వీరడికి అత్యంతమయిన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ యువతి తండ్రి మొదలుకొని, ఇరుగుపొరుగు చుట్టుపక్కల, ఎవరెవరు ఎన్నివిధాలుగా చెప్పినా వినకుండా తనచేత తాళికట్టించుకుని, సుమంగళిగా మరణించాలని నిర్ణయించుకోవడం యెంతో అచ్చెరువు కలిగించింది వీరడికి. అటువంటి సౌశీల్యవతి అయిన ఉత్తమ కన్యారత్నం భార్యగా లభించినా తన మనుగడ అంతటితో అంతరించిపోవడం కేవలం తన దురదృష్టమని అనుకున్నాడు వీరడు. అతడలా ఆలోచిస్తూ కన్నీరు నింపసాగాడు. అంత కఠినంగా అంతకాలం నుంచి దొంగతనాలూ, దోపిడీలూ కొనసాగించిన ఆ గజదొంగ కళ్ళవెంబడి అశ్రువులు రాలటం చూసి అక్కడివాళ్ళలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ధర్మయ్య మనుషులు ఉరిస్తంభానికి ఎదురుగా చితిని పేర్చడం ప్రారంభించారు. వాళ్ళు చితిపేర్చటం పూర్తిచేసేసరికి, వీరడు నిర్మల మెడలో తాళికట్టడం జరిగిపోయింది.

నిర్మల వీరడి పాదాలకు నమస్కరించి కళ్ళకు అద్దుకుంది. ఆ తర్వాత తండ్రి పాదాలకు నమస్కరించి కళ్ళకద్దుకుంది. కంటికి మంటికీ ఏకధారగా దుఃఖిస్తున్న తండ్రితో "నాన్నా! ఇంకా ఎందుకలా దుఃఖిస్తావు? వారిని విడిపించటానికి అంగీకరించక పోయినా యీ మాత్రమయినా అవకాశం కలిగించినందుకు మహారాజుగారి కృతఙ్ఞతలు చెప్పుకుంటూ ఇక నేను నిశ్చింతగా మరణిస్తాను. సెలవు" అని చెప్పి నిర్మల చితి దగ్గరికి నడిచింది. చితికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి చితిపైన కూర్చుని, రెండు చేతులు జోడించుకుని భగవధ్యానం చేసుకోసాగింది నిర్మల. ధర్మయ్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. అతడు నేలమీదపడి నెత్తి బాదుకుంటూ.. "అమ్మా నిర్మలా! నన్ను విడిచిపోతున్నావా నా తల్లీ! మన వీధి అంతా పందిరేసి, యెంతో ఖర్చుచేసి మహావైభవంగా వివాహం జరిపించాలని కలలుగన్నానే! అన్నీ నీళ్ళపాలు చేసి, నన్నన్యాయంచేసి వెళ్ళిపోతున్నావా తల్లీ! తల్లి లేని నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్నందుకు నాకు ఇదేనా ఫలితం తల్లీ!" గోడుగోడున యేడవసాగాడు ధర్మయ్య. అటు నిర్మల పరిస్థితికి, ఇటు ధర్మయ్య దుఃఖానికి అక్కడున్న వాళ్ళందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. క్రమంగా ఆడవాళ్ళ కళ్ళు వరదలు అయిపోయాయి. వధ్యస్థానం దగ్గర తలారుల మధ్యన నిల్చుని కన్నీటి వర్షంతో వీరడు రెండు చేతులూ పైకెత్తి, "భగవంతుడా! ఆరిపోయే జీవితానికి ఇటువంటి దేవతా స్వరూపిణియైన భార్యను ఎందుకు అనుగ్రహించవు? ఈ పవిత్ర సౌశీల్యవతితో కలిసి, సత్ప్రవర్తనతో జీవించే అవకాశం లేకుండా నా ప్రాణాలను ఇక కొద్దిసేపటిలో శూన్యంలో కలిపి వేయబోతున్న నీకిది ఏం వినోదం తండ్రీ?" అని ప్రార్థించాడు. ధర్మయ్య వెళ్ళిన తర్వాత వీరసేనుడు తీవ్రంగా ఆలోచించాడు. నిర్మల ధోరణి ఆ కోపంలోనూ తనకు వింతగానూ, చికాకుగానూ అనిపించింది. అందువల్ల చీదరించుకుని, ధర్మయ్యను కోప్పడి పంపించాడు గాని, నిదానంగా ఆలోచించిన మీదట, అతనికి స్త్రీ మనస్తత్వం బోధపడసాగింది. గురుకులంలో స్త్రీల మనస్తత్వాన్ని గురించి ఆచార్యుడు చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి ఆ మహారాజుకి. కన్య ఉత్తమురాలు అయినప్పుడు, ఆమె మనసులో ఒక పురుషుడు చోటుకుంటే యిక అతడి ముద్ర చెరిగిపోదు. ఎన్ని అవాంతరాలు యేర్పడినా, యే బాధలను అనుభవించయినా,  అతడినే భర్తగా పొందడానికి ప్రయత్నిస్తుంది గాని, పొరపాటున కూడా మరో పురుషుణ్ని చేసుకోడానికి ఇష్టపడదు.

అంతగా అయితే ప్రాణత్యాగానికి అయినా సిద్ధపడుతుంది. పద్మినీజాతి స్త్రీ కన్నెత్వ దశను గురించిన విషయం చెబుతూ, ఆచార్యుడు ఉద్ఘాటించిన విషయం వీరసేన మహారాజు చెవుల్లో మారుమ్రోగాయి. నిర్మల అటువంటి గొప్ప కన్యగా అతని మనసుకు తోచింది. ఆమె వీరడిని తొలి చూపులోనే ప్రేమించి, యిక ఆ ప్రేమకు తిరుగులేని విధంగా నడుచుకుంది. వీరడిని తాను విడిచిపెట్టడం జరగదని ఆ యువతి కూడా వూహించి ఉంటుంది. అందుకే తాను మానసికంగా భర్తగా పొందిన వీరడి చేత తాళి కట్టించుకుని, సుమంగళిగా తన జీవితాన్ని అంతం చేసుకోవటానికి సిద్ధపడింది. ఇది అపూర్వమైన విషయం. మహారాజు ఆ విషయాన్ని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుండగానే, పురస్త్రీలు నిర్మలను చూడటానికి తండోప తండాలుగా వధ్యస్థానానికి వెళుతున్నట్లు భటులు వచ్చి చెప్పారు. కొంతమంది మగవాళ్ళు కూడా గుంపులు గుంపులుగా వెళుతున్నారని చెప్పారు. వీరసేనునికి ఆశ్చర్యంతో బాటు కుతూహలం కూడా చెలరేగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం! కనుకనే పురంలోని వారంతా అలా వెళుతున్నారు. అటువంటి కన్యారత్నం మెడలో తాళి కట్టబోయే పవిత్ర దృశ్యం తాను చూడాలి. ఆ విధంగా నిర్ణయించుకున్న రాజు వెంటనే మారువేషం వేసుకుని హుటాహుటీగా వధ్యస్థానానికి వెళ్ళాడు. ఏం జరుగుతుందోనని అందరిలాగే తనూ చూస్తుండిపోయాడు! ఆ తరువాత ధర్మయ్య కూతుర్ని పెళ్ళి కూతుర్ని చేయించి తీసుకురావటం మొదలుకొని, వీరడు చివరిసారిగా తన జీవితాన్ని గర్హించుకుంటూ భగత్ ప్రార్థన చేసేదాకా అంతా చూశాడు, అంతా విన్నాడు. వీరసేనుడు వీరుడే కాదు విద్యావంతుడైన యువకుడు. ధర్మము జాలి కలిగిన ఉదారుడు. అయితే వీరడి విషయములో తాను కఠిన వైఖరిని అవలంబించక తప్పదు. చివరన వీరడు భగవంతుడ్ని ఉద్దేశించి చేసిన ప్రార్థన అతని దయామయ హృదయాన్ని కదిలించి వేసింది. అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్లు అవిరళ ధారాపాతంగా స్రవిస్తోన్న అశ్రువులు చెబుతున్నాయి. తాను వీరడికి ఒక అవకాశం ఇచ్చి చూడటం మంచిది! వీరడు తిరిగి పూర్వ పద్ధతిలోనే నేర జీవితాన్ని అవలంబించకుండా తాను ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి. తన మంచితనంతో వీరడు చెలగాటమాడితే అప్పుడు చూసుకోవచ్చు. 

ఒకసారి తనచేత బంధితుడైన వీరడు అవసరమైతే మళ్ళీ తనచేత బంధితుడు కాక యెక్కడికి పోతాడు? వీరసేనుడు ఆ విధంగా ఆలోచిస్తుండగానే ఆ జనంలో ఒక స్త్రీ, "అయ్యో.. చితికి నిప్పు కూడా అంటిస్తున్నారే! ఈ సౌభాగ్యవతి కథ ఇంతటితో ముగిసిపోతుందా? ఇటువంటి ఉత్తమురాలైన పతివ్రత మా నగరంలో లేకుండా పోతున్నదే! ఏ దేవుడైనా అడ్డుపడి ఈ ఘోరాన్ని ఆపకూడదా?" అని దుఃఖించడం వినిపించింది. రాజు పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని కంగారుపడుతూ గబగబా చితి దగ్గరికి వచ్చి "ఆగండి" అన్నాడు. వెంటనే చితికి నిప్పంటించబోతున్న ధర్మయ్య మనుషులు ఆగిపోయారు. ఆ గద్దింపుకు చితి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని భగవంతుని ధ్యానించుకుంటూ, కళ్ళు మూసుకుని వున్న నిర్మల కళ్ళు తెరిచింది. "అమ్మా! నువ్వు క్రిందికి దిగిరా!" అన్నాడు మహారాజు. అతడు మారువేషంలో వున్నందుకు యెవరూ గుర్తించలేదు. "క్షమించండి.. నేను నా భర్త మరణానికి ముందుగానే ఈ లోకాన్ని విడిచి పెట్టాలనుకుంటున్నాను. నా ప్రయత్నానికి ఆటంకం కలిగించకండి" అంది నిర్మల ప్రశాంత గంభీర కంఠస్వరంతో. "నీ భర్తకు మరణ భయం లేదు. నువ్వు దిగిరా!" "ఆ విధంగా చేయగలిగిన శక్తి ఒక్క మహారాజుగారికే వుంది. మీకు లేదు. మీరు అనవసర ప్రయాస విడిచిపెట్టండి." "నేనే ఆ మహారాజును చెల్లీ! నీ సతీత్వం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నీవంటి ఉత్తమ పతివ్రతకు నిలయమైన నా రాజ్యం ఎంత గొప్పదో ఇప్పుడే నాకు అర్థమైంది. నీ భర్తకు నేను విధించిన మరణ శిక్షను ఈ మహాజనులందరి సమక్షంలో రద్దుచేస్తున్నాను." మహారాజు అలా అంటుండగా వీరడు నిశ్చేష్టుడై కొయ్య బొమ్మలా నిల్చుండిపోయాడు. అతనికి మహారాజు కంఠస్వరంతోను, మరువేషాలతోనూ బాగా పరిచయం వుంది గనుక ఆ వ్యక్తి మారువేషంలో వున్న మహారాజేనని విశ్వసించాడు. మహారాజుకు తనపట్ల అలా నిర్హేతుకమైన దయాభావం ఏర్పడటానికి కారకురాలు తన అర్ధాంగేనని గ్రహించాడు అతడు. "ఏమన్నారు మీరు మహారాజుగారా?" ఆనందాశ్చర్యాలతో అంది నిర్మల కళ్ళు చిట్లించి చూస్తూ. అప్పుడు తొలగించివేశాడు మహారాజు తన మారు వేషాన్ని. ప్రజలంతా భయ భక్తులతో చేతులు జోడించుకుని "మహారాజు.. మహారాజు" అన్నారు. 

వెంటనే అంగరక్షకుడు, రాజోద్యోగులు, అక్కడికి వచ్చి తలలు వంచి నమస్కరించి, మహారాజు ప్రక్కన నిల్చున్నారు. మహారాజు ప్రకటన ప్రకారం తలారులు వీరడి బంధనాలను తొలగించి అతన్ని మహారాజు దగ్గిరికి తీసుకువచ్చారు. అప్పుడే చితి నుండి క్రిందికి దిగిన నిర్మల సంతోషంతో మహారాజు దగ్గిరికి నడిచింది. ఆ తర్వాత తన పాదాలకు నమస్కరించిన వధూవరులను గ్రుచ్చియెత్తి దీవించారు మహారాజు. ధర్మయ్యకు అది నిజమో కలో అర్థంకాక ఆనందం కలిగింది. రెండు చేతులూ జోడించుకుని వచ్చి మహారాజు పాదాల మీద పడబోయాడు. మహారాజు అతడిని వారిస్తూ, "ధర్మయ్యా! నీ కూతురు లోకోత్తర సుగుణవతి. దేవతా స్త్రీలతో మెప్పులందుకోవలసిన సౌశీల్యవతి. ఈ ఉత్తమురాలిని కన్న నువ్వు ధన్యుడివి. ఇకనుంచి నీ అల్లునికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. అతడు గతాన్ని పూర్తిగా మరిచి, ఈ కొత్త జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాడనుకుంటాను. ఇప్పటి నుంచి వీరడు వీరనాయకునిగా నగరరక్షక దళాలకు అధికారియై, ఉన్నతస్థానంలో విరాజిల్లుతాడు. నగర రక్షణాధికారిగా ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఇక నీ అల్లుడినీ, కూతురినీ తీసుకుని ఇంటికి వెళ్ళు" అన్నాడు. మహారాజు అలా అనగానే వీరడు వీరసేనుని ముందు మోకరిల్లాడు. "ప్రభూ! మీరు ప్రసాదించిన నా కొత్త జీవితాన్ని పవిత్రవంతంగా, ఆదర్శవంతంగా కొనసాగిస్తాను. మీ కోసం నన్ను ఇంతగా అభిమానించి ఆదరించిన ప్రజల కోసం, అవసరమైతే నా  ప్రాణాలైనా ధారపోస్తానని  ఈ నా ప్రియధర్మపత్ని మీద ప్రమాణం చేస్తున్నాను." అన్నాడు. ఆ తర్వాత అక్కడి స్త్రీపురుషులంతా "మహాపతివ్రత నిర్మల వర్ధిల్లాలి! వీరసేన మహారాజుకు జై, వీరనాయక నగర రక్షక దళపతికి జై!" అని నినాదాలు చేశారు. వీరనాయక దళపతి రాత్రిళ్ళు వీరవేషం ధరించి అశ్వమెక్కి నగరమంతటా సంచరిస్తూ, అప్పుడప్పుడు రాజమందిర పరిసర ప్రాంతాలను కలియతిరుగుతూ, కాపలా కాస్తుండగా ప్రజలు నిశ్చింతగా తమ తమ ఇళ్ళలో పడుకుని నిద్రపోయేవారు. తెల్లవారేదాకా గస్తీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఆ తర్వాత వీరసేనుడు ఇంటికి వెళ్ళేవాడు. నెల రోజులు గడిచాయి. 

నగరంలో ఎవరినుంచి ఏ ఫిర్యాదులూ రాజుకు అందలేదు. పట్టణంలో శాంతిభద్రతలకు కొరతలేదని తృప్తి పొందాడు మహారాజు. వీరసేన మహారాజు వీరనాయకుడిని ఒకనాటి ఉదయం గస్తీ కార్యక్రమం ముగిసి ఇంటికి వెళ్ళబోతున్న సమయంలో తన దగ్గరికి రప్పించుకున్నాడు. అతడు వచ్చి నమస్కరించాడు. రాజు అంతకుముందు ఓ పళ్ళెంలో సిద్ధంగా వుంచబడిన ధనాన్ని అతనికిస్తూ, "వీరనాయకా! నీకు నిర్ణయించిన పారితోషకం నెలకు పదివేల దీనారాలు. మొదటి జీతం నా చేతుల మీదుగా అందజేస్తున్నాను. ఇకమీదట ప్రతి నెల కోశాగారాధ్యక్షుడు అందజేస్తాడు" అని చెప్పాడు. వీరనాయకుడు ఆ ధనాన్ని స్వీకరించి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తర్వాత రాజు ఓ దళపతిని పిలిచి యిలా చెప్పాడు. "నువ్వు రహస్యంగా వీరనాయకుడిని వెంబడించి అతను ఈ ధనాన్ని ఏ విధంగా ఖర్చుచేస్తాడో, అతడి దినచర్యలేమిటో తెలుసుకుని వచ్చి సాయంత్రం నాకు తెలియజెయ్యి" అన్నాడు. దళపతి రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. అతడు సాయంత్రం తిరిగి రాజు దగ్గరకి వచ్చి యిలా చెప్పాడు. "ప్రభూ! నేను మీ ఆజ్ఞ ప్రకారం వీరనాయకుడిని రహస్యంగా వెంబడించాను. అతడు ధనాన్ని తీసుకుని ఇంటిముందరికి వెళ్ళి గుర్రం దిగగానే అతని భార్య ఎదురువచ్చింది. వీరనాయకుడు తన చేతిలోని దీనారాల మూటను భార్యకిచ్చాడు. "ఇదేమిటండీ! ఈ దినం కొత్తగా ఏదో మూట తెచ్చి ఇచ్చారు" అంది ఆమె. "దేవీ! మహారాజుగారు నాకు నెలకు పదివేల దీనారాలు జీతంగా నిర్ణయించారు. మొదటి నెల జీతం తమ చేతుల మీదుగా ప్రసాదించారు" అన్నాడు చిరునవ్వుతో. ఆమె ఆ ధనపు మూటను కళ్ళకద్దుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. అనంతరం కొంచెంసేపటికి వాళ్ళు శుచిగా బయటకి వచ్చారు. నగర మధ్యలోని దుర్గాలయానికి వెళ్ళి పూజలు చేశారు. వీరనాయకుడు తన జీతంలో సగం ధనాన్ని మహారాజుగారి శ్రేయస్సును, దేశ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ, భగవంతుడికి కైంకర్యం చేస్తున్నట్లు అక్కడి బీదసాదలకు పంచిపెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ ఇంటికి వెళ్ళారు. వీరనాయకుడు కాసేపు భార్యతో చదువు చెప్పించుకున్నాడు. తర్వాత అతని భార్య వంట గదికి వెళ్ళింది. అంతలో అతని మామగారు పొలంనుండి తిరిగివచ్చి, కాసేపు అల్లునితో పొలం పనులను గురించి, వ్యవసాయం గురించి మాట్లాడాడు. అంతలో మధ్యాహ్నమైంది. 

వీరనాయకుడు మామగారితో కలిసి, భార్య వడ్డిస్తుండగా భోజనం చేశాడు. భోజనం చేసిన కాసేపటికి మేడమీదికి వెళ్ళి నిద్రించాడు. సాయంత్రం కాగానే క్రిందికి వచ్చి స్నానాదులు పూర్తిచేసుకుని, యోధవేషం ధరించి భార్యకు వీడ్కోలు చెప్పి, అశ్వారూఢుడై, రాచనగరికి కొలువుకు వచ్చాడు" అని వివరించి దళపతి "ప్రభూ! వీరనాయకుడి దైనందిన జీవితానికి సంబంధించిన విశేషాలు ఇంతే! ఇంతకంటే ఇంకేమీ నాకు తెలియలేదు" అన్నాడు. "తెలియటానికి ఇంకేమున్నాయి? అన్నీ చెప్పావు గదా? ఒక ఉత్తమ రాజోద్యోగి లక్షణాలను వీరనాయకుడు అక్షరాలా కలిగి వున్నాడు. అతడు మీకందరికీ ఆదర్శప్రాయుడు" అన్నాడు మహారాజు చిరునవ్వుతో. "అవును ప్రభూ! మన ఉద్యోగులంతా వీరనాయకుడి అడుగుజాడలలో నడుచుకుంటే, ఇక మన రాజ్యం రామరాజ్యమే అవుతుంది. పాలకుడు ఎలాగూ ఉత్తముడు కనుక, ఉద్యోగులు ఉత్తములయితే ఇక ప్రజల సౌఖ్యానికి, రాజ్యం శాంతి సౌభాగ్యాలతో ఓలలాడటానికి ఆటంకమేమిటి ప్రభూ?" అన్నాడు దళపతి. వీరనాయకుడి ప్రవర్తన తననేగాక, ఆ విధంగా ఉద్యోగులను కూడా కదిలించినందుకు వీరసేన మహారాజు ఎంతగానో సంతోషిస్తూ వీరనాయకుడిని అభినందించుకున్నాడు. ధర్మయ్య పొలాలు నగరానికి కాస్త దూరంలో వున్నాయి. పాలేర్లతో చేలలో కలుపులు తీయిస్తూ, బాట దగ్గర వేయించిన గుడిసె ముందు కూర్చుని వున్నాడు. అప్పటికి సూర్యుడు బారెడు పైకి వచ్చాడు. ఎండ కొద్దిగా ముదురుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి బాటమీద వడివడిగా నడుస్తూ నగరంలోకి వెళుతున్నవాడల్లా పాక ముందు కూర్చుని వున్న ధర్మయ్యని చూసి గబగబా అక్కడికి వచ్చాడు. "ధర్మయ్య బాబాయ్! పొలాల్లో పనులు చేయిస్తున్నావా?" అన్నాడు ఆగంతకుడు ధర్మయ్యను సమీపించి. ధర్మయ్య ఇటుకేసి తిరిగి, "అరెరె ఎప్పుడొచ్చావురా అబ్బిగా! ఇంటి దగ్గరికి వెళితే అమ్మాయి చెప్పిందా ఇక్కడున్నానని! రా రా.. కూర్చో" అని తన ప్రక్కన వున్న ఈతాకుల చాపను చూపించాడు. ఆ వ్యక్తి చాప మీద కూర్చున్నాడు. "నేను ఇంటికి వెళ్ళలేదు. దారిలోనే నిన్ను చూసి యిలా వచ్చాను" అన్నాడతను.

"వూళ్ళో మీ నాన్నా, అమ్మా, నీ భార్యా, పిల్లలూ అందరూ క్షేమంగా వున్నారా?" ధర్మయ్య సాదరంగా అడిగాడు. "అంతా బాగానే వున్నారు బాబాయ్! చెల్లెమ్మ పెళ్ళి గురించి విని మేమంతా చాలా సంతోషించాం. ఎటొచ్చీ రాలేకపోయామనుకో!" "మీరు రాకపోవటం మీ తప్పుకాదులేరా..ఆ పెళ్ళి అలా జరిగిపోయింది, అంతే!" "బావగారికి రాజుగారి కొలువులో గొప్ప ఉద్యోగమట కదా? మనవాళ్ళంతా చాలా సంతోషించారు." "మంచిది.. ఏమిటి విశేషాలు?" "నేను ఓ ముఖ్యమయిన పని మీద నీ దగ్గరికి వస్తున్నాను బాబాయ్!" "ఏమిటో చెప్పు." "ఈ సంవత్సరం కొత్తగా మరో ఇల్లు కట్టిస్తున్నాను. కాస్త డబ్బు అవసరమైంది. వచ్చే ఏడు పైరు డబ్బు చేతికి రాగానే తెచ్చి యిస్తాను." "దానికేంలేరా! నీకు అవసరమైనంత పట్టుకుపోదువుగానిలే." "హమ్మయ్యా! కొండంత బరువు దిగిపోయినట్లయింది. అన్నట్లు..బాబాయ్! మీ రాజుగారు వివాహం చేసుకోవాలన్నది మా రాజుగారి కూతురినేనా?" "నాకంతగా తెలీదూ? మహారాజుగారు మరణించి ఇంకా సంవత్సరం కాలేదుగా? అందువల్ల ఇప్పుడు ఆ ప్రస్తావన ప్రజల్లో నానలేదు. బహుశా మంత్రిగారికి, రాజోద్యోగుల్లో కొందరికీ, మహారాజుగారికి తెలిసి వుండవచ్చు. అయినా నీకేం ఆ ప్రస్తావనతో" "నేను మా నగరం నుండి తెల్లవారుఝామున బయలుదేరాను. మీ రాజ్యం సరిహద్దు సమీపిస్తుండగా ఓ పెద్ద సత్రం కనిపించింది బాట ప్రక్కన. ఇంకా చీకటి వుంది కదా, తెల్లవేరేదాకా ఆ సత్రంలో విశ్రమించి వెళదామని అక్కడ ఆగాను. ఆ సమయంలో అటుప్రక్క అరలో కొంతమంది త్రాగుబోతులు మద్యం త్రాగుతూ మాట్లాడుకుంటున్న మాటలు నాకు ఆందోళన కలిగించాయి. "ఆ త్రాగుబోతులెవరో ఏదో మాట్లాడుకుంటే.. మధ్యలో నీకు ఆందోళన ఎందుకు కలిగిందోయ్?" "అది అత్యంత ఘోరమైనది కనుక." "ఏమిటా ఘోరం?" "వివరంగా చెపుతాను విను" అని ఆగంతకుడు ధర్మయ్యకు యిలా చెప్పడం ప్రారంభించాడు. "ఆ! ఇంకొంచెం పోయరా బావమర్దీ!"అన్నాడు ఓ దుండగుడు తన చేతిలోని మద్యం పాత్రను ముందుకు చాపుతూ. "ఉన్నదంతా నువ్వే త్రాగితే మాకందరికీ ఎలారా? మేం సగంలోనే వున్నాం..నువ్వప్పుడే రెండుసార్లు పోయించుకున్నావ్!" "పోయవేంరా.. నీ సొమ్మేదో వూడిపోతున్నట్టు. అట్టే తిక్కరేగిస్తే పళ్ళు రాలగొడతాను. మన దుర్జయులవారు యీ రాత్రికి శాంతినగరాన్ని నానాగందరగోళం చేసి అశాంతి నగరంగా మార్చివేయమన్నారు కదా? అప్పుడు శాంతినగరంలోని మద్యశాలలన్నీ మన సొత్తేకదా? మీ యిష్టం వచ్చినట్లు త్రాగుదురుగాని. ఇంతకూ మిమ్మల్ని పిలుచుకువచ్చింది నేను! నాకే ఎసరు పెడతారటరా?" అని హుంకరించాడు ఆ త్రాగుబోతు.

"ఏం? నువ్వు పిల్చుకు వచ్చింది మా కోసమా, నీ కోసమా? మేము ప్రాణాలకు తెగించి ఎందుకు వచ్చాం నీ వెంట? ధనానికి ఆశపడేకదటరా!" "అయినా, అవకాశాలు దొరకాలికదటరా...! నేను మిమ్మల్ని కాకుండా బోయపాలెం వాళ్ళను పిల్చుకు వచ్చివుంటే కుదిరివుండేది తిక్క!" "ఏం బెదిరిస్తున్నావటరా! పోనీ ఇక్కడ్నుంచి యిటే వెళ్ళిపోతాం, ఇప్పుడుపోయి పిల్చుకోవచ్చుగా?" "ఇప్పుడు? మరి మనకిస్తానన్న ధనంలో కొంత సొమ్ము ముందుగానే తీసుకున్నారు, అది తిరిగి ఇస్తారా?" "తిరిగి యివ్వటానికి మాదగ్గరెక్కడుందిరా? వద్దు వద్దంటున్నా మద్యం కుండలు పది కొనిపించావు. రెండు మేకపోతులను కోయించావు. ఇరవై మందికి రెండువందల రొట్టెలు చేయించావు. ఇదంతా యిప్పటికి కొంతభాగం అందరి కడుపుల్లోకి పోయింది. ఇచ్చిన ధనం తిరిగి యిమ్మంటే మేమివ్వగలమా? ఆ మాటకొస్తే నువ్వివగలవా?" "ఓరి నీ యబ్బ! కాస్త మద్యం పోయండిరా అంటే ఎంత చదువు చదివావురా!" "అదేం కుదరదు. నీ వాటా నీ ముందు పడేస్తాం. ఎప్పుడన్నా త్రాగు, ఎప్పుడన్నా తిను" అని అవతలి మనిషి పేచీ పెట్టాడు. "సరే అలాగే తగలెయ్యండి." నలుగురైదుగురు ఓ మద్యం నిండిన పాత్రను అతడి ముందుకు తెచ్చారు, ఆహారపదార్థాలను కూడా పంచి యిచ్చారు. "ఓరి! నీ యబ్బ! నన్ను ఒక్కడినీ ఇలా వేరుచేస్తారటరా! చూస్తాను..చూస్తాను.. మీరూ నా చేతిలో చిక్కరూ ఎప్పటికయినా! అప్పుడు చూపిస్తాను నా తడాఖా!" "ఏడిశావు నీ మొహం! మేము నీ చేతిలో చిక్కడమేమిటి?" "ఒకవేళ వీళ్ళ నాయకుడి దగ్గర్నుండి సొమ్ము ఇప్పించేటప్పుడు ఏదయినా తిరకాసు చేద్దామనుకుంటున్నాడేమో!" "ఎలా చేస్తాడు?" "మొత్తం ధనం తన చేతికి తీసుకుని, తన చేతుల మీదుగా మనకిస్తానని వీడు తీసుకుని ఉడాయిద్దామనుకుంటున్నాడేమో!" "అలా చేస్తే ముందు వీళ్ళ నాయకుడికీ, తర్వాత వీడికీ మన చేతుల్లో బడితెపూజలు జరుగుతాయి. మన ఎరుకల గూడానికి ఈడ్చుకెళ్ళి నందిదేవతకు బలిపెట్టమూ?" "ఓరి నీయబ్బ! మీరు నేనిక్కడ వుండగానే మన నాయకుడ్ని ఎంతలేసి మాటలంటున్నారు! నేనట్లా ఏం చేయనుగాని..నోరుమూసుకు చావండి. మీరట్లా  వాగటం ఆయన చెవిన పడితే మీ ఎరుకలగూడెం అగ్గితో బుగ్గి కావటం ఖాయం."

"ఏడిశావ్! మాతో పంతాలకి పోయినవాళ్ళెవరూ బ్రతికి బట్టకట్టలేదు." "ఒరే...పోలయ్యా! నీకు ఈ అనవసరపు వాగుడెందుకురా! త్రాగుతున్నావ్, తింటున్నావ్! మర్యాదగా వుండలేవూ?" "ఏం? నేను మర్యాదగాలేనని ఎవరన్నారు? మద్యం కాస్త ఎక్కువ త్రాగే అలవాటున్న ప్రాణిని గనుక కక్కుర్తిపడ్డాను. ఈ మాత్రానికే మీరంతా అంతంత మాటల జోలికి వెళ్ళాలటరా?" "ఎంతంత మాటలజోలికి వెళ్ళినా మనమంతా ఒకటేలెండిరా! ఇక ఈ సోదెలూ, కొట్లాటలూ చాలించి అసలు విషయానికి వద్దాం...ఈ రాత్రికి మనం శాంతినగరంలో ఏమేం చెయ్యాలో మరోసారి వివరంగా చెప్పు." "ఇంతకు ముందు చెప్పానుగా. ఇంతలోకే మర్చిపోతే యెలారా? యిలా మాటి మాటికీ చెప్పటం నగరంలోకి వెళ్ళిన తర్వాత కుదరదు." "ఈ ఒక్కసారీ చెప్పవోయ్...! ప్రతిదానికీ నువ్వు మహా గీరపోతున్నావ్! పని అంత ముఖ్యమైనదే కాబట్టి మరోసారి జ్ఞాపకం చేసుకోవటం కంటే, ఒకటికి పదిసార్లు మీ దొరచేత చెప్పించుకున్న వాడివి నీకు బాగా తెలుసు కనుక చెప్పమంటున్నాను." "అవునురా పోలయ్యా...! ఇటువంటివి మనం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటే అంత మంచిది. కాకపోతే ఒకటి చెయ్యాలిసి వుండగా మరొకటి చేశామనుకో! మొత్తం కథంతా అడ్డం తిరిగి, మీ దుర్జయసేనాని నోట్లో దుమ్ము పడుతుంది." అతడి మాటలకు అక్కడి త్రాగుబోతులంతా బిగ్గరగా నవ్వారు. "ఆపండిరా మీ నవ్వులు, చెబుతాను వినండి" అని పోలయ్య ఇలా చెప్పడం ప్రారంభించాడు. "మనం తెల్లవారిన తరువాత ఇక్కణ్నుంచి బయలుదేరుతాం. ప్రొద్దు బారెడు యెక్కేసరికి శాంతినగరంలోకి చేరుకుంటాం. పగలంతా అందరం కోటలోపల అంతా కలియతిరుగుతాం. చీకటి పడిన తర్వాత, నగరంలోని యేపూటకూళ్ళ కొంపలోనో మెక్కి, ఆ తర్వాత కోట నాల్గు ద్వారాల దగ్గరికి ఐదుగురేసి చొప్పున చేరుకుంటాం. అర్ధరాత్రి అయ్యేసరికి మా దుర్ముఖ సేనాని తాను ప్రభువుతో కలిసి, సైన్యాలను వెంటబెట్టుకుని శాంతినగరం కోట దగ్గరికి వస్తాడు. ఆ సైన్యాలు కోట నలువేపులా వున్న నాలుగు ముఖద్వారాల ముందు చేరుకుంటాయి. ఆ సైన్యాలు అక్కడికి చేరుకునే సమయం, బయటి కోలాహలాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అప్పుడు కోట తలుపులు కొక్కాలను సడలించి కోట తలుపులు ప్రక్కకు తొలగిపోయేటట్టు చెయ్యటంతో మన పని పూర్తి అవుతుంది." "ఒరే...పోలయ్యా..! నాకు తెలియక అడుగుతానుగాని, ఎలాగూ అంత సైన్యంతో మీ సేనాని వస్తున్నాడు కదా? పైగా మీ రాజునుకూడా వెంటబెట్టుకుని వస్తున్నాడు. అటువంటప్పుడు కోట ద్వారం దగ్గరవున్న కాపలాభటులను సులభంగా చంపి, లోపలి రావచ్చుకదా...? ఇంత తతంగం దేనికంటా?"

"నీ మొహం తిన్నందుకంటా! ఆ మాత్రం కూడా తెలీదా?" "చెప్పవోయ్! అడిగితే అలా విసుక్కుంటావెందుకు?" "ఒరే..బైటి కాపలావాళ్ళను చంపడం చాలా తేలిక. అయితే.. కోట తలుపుల కొక్కాలు లోపల వుంటాయి. మళ్ళీ కొంతమంది సైనికులు బురుజు దాటి, ఇటు ప్రక్కకు వచ్చి, క్రిందికి దిగి కోట తలుపుల కొక్కాలు విడదీయాలి. ఈలోగా అలజడి తప్పకుండా అవుతుంది. నగర రక్షక దళాలు యీ అలజడి పసికట్టి జాగ్రత్తపడతారు. క్షణాల మీద రాజనగరు మేలుకుంటుంది. అప్పుడు మా సేనానిగారి పథకం తారుమారు కావచ్చు. అందుకని, సులభమైన పద్ధతిలో కోట తలుపుల్ని తీయించే వుపాయం ఆలోచించాం. అందుకు తగిన మనుషులు మీరుగాని, బోయపాలెం వాళ్ళుగాని అయితే బావుంటుందనుకున్నాం. ఎందుకంటే.. ఇటువంటి పనుల్లో మీ రెండు వర్గాలు ఆరితేరి వున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు సులభంగా కన్నాలు వెయ్యగలిగిన మీ హస్తలాఘవం ఇంకెవరికీ వుండదు గనుక మీ రెండు వర్గాలలో యెవరో ఒకరిని తీసుకురమ్మన్నారు. నేను మీమీది అభిమానంతో మిమ్మల్ని తీసుకువచ్చాను. పని పూర్తికాగానే మీ ధనం మీకు అందుతుంది." "ఓరి నక్కనాయాలా! ఎంత సోది చెప్పావురా! అంతా బాగుందిగాని, ఇలా అర్ధరాత్రిళ్ళు కట్టెలుకొట్టి బ్రతక్కపోతే ఏం, మీ రాజుకు, మీ సేనాధిపతికి?" "కేవలం రాజ్యం కోసమే కాదుగదా ఇదంతా." "మరెందుకు?" "మా రాజుగారు శాంతినగరరాజు పుత్రికమీద మనసుపడ్డారు." "పడితే, మర్యాదగా అడిగి పెళ్ళి చేసుకోవచ్చుగా?" "అలా అడిగి ఇదివరకు భంగపడడం జరిగింది." "ఏం?" "మా రాజుగారి సంగతి నీకు తెలీదనుకుంటాను. విపరీతమైన చెడు వ్యసనాలు కలిగినవాడు. అదీగాక వయసుపైబడ్డ ముదురుబెండ. అటువంటి వాడికి తన పుత్రికను ఇవ్వటానికి శాంతినగర మహారాజు అంగీకరిస్తాడా?" "ఇవ్వనన్నాడా?" "అలా అంటే బావుంటుంది. తన పుత్రికను ధారానగర రాజపుత్రుడైన వీరసేనునికి ఇచ్చి వివాహం చెయ్యటానికి నిర్ణయం జరిగిందనీ, అయితే ఆ రాజపుత్రుని తండ్రి మృతిచెందినందువల్ల సంవత్సరందాకా వివాహము జరిపించకూడదు కనుక వేచివున్నామనీ వివరించారు. మళ్ళీ ఇటువంటి తుచ్ఛమైన ఆలోచనల్తో పిచ్చి పిచ్చి కబుర్లు పెడితే, తగిన శాస్తి జరుగుతుందనీ, తనకూ, మా రాజుకూ నాగలోకానికి, నక్కకూ వున్నంత తేడా వుందనీ, చెప్పి పంపించారు." 

"చాలా బాగా చెప్పి పంపించారు." "ఏం నీకేమొచ్చిందోయ్?" "నాకు రావటంకాదురా! నేనొకసారి ఈ మధ్యకాలంలో ధారానగర ప్రభువైన వీరసేన మహారాజుని చూశాను. ఆ రాజపుత్రుడు గొప్ప అందగాడు. చాలా మంచి రాజు అని స్వల్ప సమయంలోనే రాజ్యమంతటా పేరు తెచ్చుకున్నారు. ఇక శాంతినగర రాజపుత్రిక అందచందాలలో, చదువు సంధ్యలలో, తెలివితేటలలో, ఉత్తమ గుణగణాలలో, ఈనాటి రాజపుత్రికలలో మేటి అని మేము విన్నాం. ఆ ఇద్దరికీ జోడు కలిస్తే అందం చందం గాని, చుక్క దున్నపోతులాంటి మీ రాజుకు ఆ రాజపుత్రిక ఎందుకురా...కాకిముక్కుకు దొండపండు అన్న సామెత విన్నావా?" ఆ మాటలు వినగానే పోలయ్య కస్సున లేచాడు. "రేయ్..రేయ్! నువ్విప్పుడు త్రాగుతున్నది, తింటున్నది ఎవరి సొమ్మో ఆలోచించావా?" "ఆలోచించటానికేముంది? మా సొమ్మే! మేం కష్టం చేయబోతున్నాం కదా." "అయినా మీరు నా తరపున పని చేసేది మా రాజుగారి ధనంతోనే కదా." "అయితే?" "ఆయన పనిచేస్తూ, ఆయనను విమర్శించటం మంచి పద్ధతంటావా?" "నోర్ముయ్! పద్ధతంట పద్ధతి. ఈ ప్రపంచంలో ఎవరేం చేసినా కేవలం డబ్బుకోసమేగా చవటా. మీ రాజు చేసినా, మా సేనాని దుర్జయుడు చేసినా, మేము చేసినా, అంతే. ఉన్నమాట చెప్పుకోవటానికి, పనులు చెయ్యటానికీ సంబంధం లేదు. ఇలా అన్నానని శాంతినగరంలో మీ పని చెడగొడతామని అనుకోకు. ఈ యెరుకదొరల నోటంట ఒకసారి ఒక కూత వచ్చిందంటే, ఇక దానికి తిరుగులేదు... మా పని మాది, మా ధనం మాది." అంతలో తెల్లవారే సమయం కావడంతో ఇక అక్కడ వుండడం మంచిదికాదని, అక్కడ విశ్రాంతి కోసం ఆగిన వ్యక్తి లేచి తన పని కొద్దీ తాను వెళ్ళాడు. అలా జరిగినదంతా చెప్పి "విన్నావా బాబాయ్! నేను విన్నదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాను. మా మహారాజుగారు ఇప్పుడు గొప్ప ఆపదలో చిక్కుకోబోతున్నారు. మీ మహారాజుగారికి చెబుతావేమిటి? తనకాబోయే భార్యను కాపాడుకోవటానికి ఈయనైనా ప్రయత్నిస్తాడేమో" అన్నాడు అబ్బిగాడు. "పోనీ నువ్వు వెళ్ళి ఈ సంగతంతా మీ మహారాజుగారితో చెప్పకూడదటరా" "అయ్యబాబోయ్ నేను ఇలాంటివి చెప్పటమే, పిచ్చివాడినేమోనని నాలుగు బాదుతారు గాని, నమ్ముతారా! నాకు అసలే భయం రాజుగారంటే."

"సరే ఇంటికి వెళదాం పద! మా అల్లుడుగారికి చెబుదాం. అతడు రాజుగారికి చెప్పి, ఏదైనా చర్య తీసుకుంటాడేమో, మొత్తానికి దుర్మార్గం యెక్కువైపోయిందిరా" ఆ తర్వాత ఆ యిద్దరూ అక్కడ నుంచి నగరానికి చేరారు. ధర్మయ్య తన చుట్టంతో ఇల్లు చేరేసరికి, వీరనాయకుడు భార్యతో మాట్లాడుతూ మంచం మీద కూర్చుని వున్నాడు. నిర్మల అబ్బిగాడిని చూడగానే "ఏరా! ఇదేనా రావడం? అమ్మా, నాన్నా అంతా కులాసా?" అని సాదరంగా అడిగింది. "ఆ! అంతా కులాసాగా వున్నారు చెల్లెమ్మా.." అన్నాడు అబ్బిగాడు. "మీ బావగారు" అని వీరనాయకుడ్ని చూపించింది నిర్మల. అబ్బిగాడు నమస్కరించగానే వీరనాయకుడు కూడా చిరునవ్వుతో "రండి.. ఇలా కూర్చోండి" అన్నాడు. "అమ్మాయ్! భోజనాలకు ఏర్పాటు చెయ్యి తల్లీ.." అన్నాడు ధర్మయ్య. నిర్మల అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ధర్మయ్య వీరనాయకునితో "అల్లుడూ! ప్రస్తుతం మహారాజుగారి బంధువైన శాంతినగర ప్రభువుకూ, ఆయన పుత్రికకూ ఆపద కలగనుంది" అన్నాడు. "ఏమన్నారు! మన మహారాజుగారికి, వారి బంధువైన శాంతినగర ప్రభువుకూ, ఆయన పుత్రికకూ ఆపద కలగనున్నదా? ఆశ్చర్యంగా వుందే." "ఇదిగో నీ బావమరిది అంతా చెబుతాడు విను.." అన్నాడు ధర్మయ్య. అబ్బిగాడు అంతకముందు చేని దగ్గర ధర్మయ్యతో చెప్పిన వివరాలన్నీ పూసగ్రుచ్చినట్లు వీరనాయకునికి వివరించాడు. అంతా వినగానే వీరనాయకుడి ముఖం గంభీరంగా మారిపోయింది. "ఇప్పుడేం చేద్దాం.. మీ మహారాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెబుతావా?" "అది సరైనది కాదు మామయ్య." "ఏం?" "ఈ విషయం ప్రభువుల దృష్టికి తెచ్చి వారికి మనస్తాపం కలిగించడం నాకిష్టంలేదు. ఒకవేళ సర్వసన్నాహంతో శాంతినగరానికి వెళ్ళామనుకో, అక్కడ ఇప్పుడు మనవాడు చెప్పింది, ఏదీ జరగకపోతే అభాసుపాలు అవుతాము. మహారాజు మనల్ని ఏమనుకుంటారు. పరాచికాలాడటానికి నాకంటే మీకెవరూ దొరకలేదా అని విసుక్కున్నారనుకో అప్పుడేమవుతాం?" "వీడు స్వయంగా విని వచ్చాడు కదా నాయనా!" "మనవాడు వినటంలో పొరబాటు పడివుంటాడని నేననటం లేదు. యే కారణంచేతనైనా ఆ దుర్మార్గులు యీ రోజుకు తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారనుకోండి. అప్పుడేమిటి పరిస్థితి? మన రాజుగారి దృష్టిలో మనం చులకన కావటం, అవతల శత్రువు జాగ్రత్త పడటానికి దోహదం కలిగించటం ఒకటే అవుతుంది."

"మరేం చేద్దామయ్యా!" "నేనొక్కడినే శాంతినగరానికి వెళతాను." "ఒక్కడివీ వెళతావా?" "అవును. అక్కడి పరిస్థితి విషమించిపోయే లక్షణాలు కనిపిస్తే, అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. అంతేగాని, యిది ఇటు మన మహారాజుగారికిగాని, అటు శాంతినగర ప్రభువులకుగాని, తెలియజేసే విషయం కాదు." "మరి, నువ్వు శాంతినగరం వెళ్ళటానికి మహారాజుగారి అనుమతి తీసుకోవాలిగా? ఏమని చెబుతావు?" "నేను వెళ్ళను. ఈ దినం సెలవు పెడతాను. ఉత్తరం తీసికెళ్ళి మన మహారాజుగారికి మీరే యివ్వండి. వివరాలు అడిగితే ఏమీ చెప్పకండి. యీ ఉత్తరం మీకిమ్మనానని మాత్రం చెప్పండి." "అలాగే! నువ్వు మాత్రం జాగ్రత్త!" అంతలో, నిర్మల భోజనానికి పిలిచింది. "పూజ్యులైన వీరసేన ప్రభువులకు, నేను అత్యవసరమైన పని మీద గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. తమను కలుసుకొని సెలవు అడిగే వ్యవధిలేనందున యీ ఉత్తరం మూలంగా అభ్యర్థిస్తున్నాను. రేపటిదినం యధాప్రకారం నా విధికి నేను వచ్చి చేరుకొంటాను. ఈ ఒక్కదినం రాత్రి గస్తీ సమర్థులైన నా సహచరులు నిర్వర్తించే ఏర్పాట్లు చేసి వెళుతున్నాను. మీ విశ్వసపాత్రుడు, వీరనాయకుడు" వీరసేనుడు ఆ ఉత్తరం చదువుకుని చిరునవ్వుతో ధర్మయ్యవేపు తిరిగాడు. "అంత అవసరం ముంచుకొచ్చిన పని మీ అల్లుడికేమొచ్చింది ధర్మయ్యా?" "నాకు తెలియదు ప్రభూ!" "పోనీ మీ అమ్మాయికైనా చెప్పలేదటనా?" "మా అల్లుడుగారిది అదో విచిత్రమైన స్వభావం. తాను విశ్వసించింది చేస్తాడు తప్ప, ఎవరికీ చెప్పడు." "వూరికే మాటవరసకి అడిగాను. ఇదేమంత ముఖ్యమైన విషయం కాదులే! ఇక నువ్వువెళ్ళు" అన్నాడు మహారాజు. ధర్మయ్య నమస్కరించి వెనుతిరిగాడు! వీరసేనుడు అలా వున్నట్లుండి గ్రామాంతరం వెళ్ళటానికి కారణం గురించి, మహారాజు ఆలోచించలేదు. అతడు విశ్వాస పాత్రుడైన వ్యక్తి అని తాను నమ్మటం అందుకు కారణం!

సాయంత్రమయ్యేసరికి వీరనాయకుని అశ్వం శాంతినగరం ప్రవేశించింది. అతడు ఓ వుపాహారమందిరం ముందు అశ్వాన్ని కట్టివేసి, లోపలికి వెళ్ళాడు. మొహం, చేతులూ కడుక్కుని, వుపాహారం తీసుకున్నాడు. అక్కడే కూర్చుని, వీధిలోకి చూపులను ప్రసరింపజేసి ఆలోచిస్తూ వుండిపోయాడు. అప్పటిదాకా అతనికి ఓ కార్యక్రమమంటూ రూపొందలేదు! తీవ్రంగా ఆలోచిస్తూనే వున్నాడు. ఇక్కడ తాను తెలుసుకోవలసిన విషయాలంటూ ఏమీ లేవు. అన్నీ అబ్భిచెప్పి వున్నాడు. అయితే, ఆ దుండగులు తమ కార్యక్రమాన్ని యే కారణంచేతనైనా వాయిదావేసుకుంటే అప్పుడేం చెయ్యాలి? యీ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి! ఏదో ఒకరోజున యీ పాపాత్ములు తమ పథకాన్ని కొనసాగించకుండా వూరుకోరు. ఈ విషయం శాంతినగర మహారాజుకు చెప్పడం వుచితం కాదు. మరెలా! ఆపద ఆపదే! అది ఎప్పటికైనా తప్పదు. దీనిని ఈ రోజే తుదముట్టించగలిగిన అవకాశాన్ని భగవంతుడు తనకు అనుగ్రహిస్తే బావుంటుంది. అతడలా ఆలోచిస్తుండగానే యిద్దరు వ్యక్తులు ఆ వుపాహార మందిరంలోకి వచ్చారు. వాళ్ళిద్దరూ వీరనాయకుడు కూర్చున్న బల్లకు అటు ప్రక్కగా కూర్చున్నారు. రెండు బల్లలకు మధ్యన ఓ స్తంభం అడ్డువుంది. "కాస్త మద్యం కడుపులో పడితేచాలు, వెధవకు ఆకలి ముంచుకొస్తుంది. ఎక్కణ్నుంచి వస్తుందిరా నీకు ఆకలి?" "అది మొదట్నుంచి వున్న మంచి పద్ధతి నాకు. తాగి తినకపోతే పేగులు తెగి చస్తారురా చవటా?" "తిను, తిను, నువ్వేమైనా కష్టపడి సంపాదిస్తున్నావా? అడ్డమైన పనులు చేసి సంపాదించే ధనమేగా" "అడ్డదిడ్డమేమిటి? ఏదో ఒక పని చేసి బ్రతకటంలో తప్పేముంది?" "మనం చేస్తున్నది కూడా ఒక పనేనంటావటరా? సొమ్ములకు ఆశపడి, శత్రువులకు తోడ్పడుతూ మన రాజుగారిని మోసం చేస్తున్నాం." వీరనాయకుడు అక్కడినుంచి లేవబోతున్నవాడల్లా ఆ యిద్దరి సంభాషణ ఆసక్తికరంగానూ, తనకు వుపయోగకరంగానూ వుండటంతో, అక్కడే కూర్చుని మొహం త్రిప్పుకొని ఆ మాటలు శ్రద్ధగా వినటం ప్రారంభించాడు. 

వీరనాయకుడు తమకు కనిపించకపోవడంతో అక్కడ ఎవరూలేరని నిస్సంకోచంగా మాట్లాడుకోసాగారు వాళ్ళు. ఇంతలో ఆ వుపాహార మందిరంలో వడ్డన చేసే ఓ కుర్రవాడు వచ్చి ఏం కావాలని అడిగాడు వాళ్ళని. వాళ్ళు చెప్పారు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. "పోలిగాడు యిప్పుడు మీ ఇంటిదగ్గరే వున్నాడా?" అడిగాడు ఒకడు మళ్ళీ. "లేడు. ఆ గాడిద కొడుకు ఏ గుడిసెల్లోనో వుంటాడు. బాగా చీకటి పడిన తర్వాత కోట ముఖద్వారం దగ్గిరికి తన అనుచరులతో కలిసి వస్తాననీ, మనల్ని మనవాళ్ళతో అక్కడకు రమ్మన్నాడు. "మరి, తక్కిన ద్వారాల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళనవసరం లేదటనా?" "వాడు అన్ని ద్వారాలను చూసి వచ్చాడు. మా కోటకు ఎనిమిది ద్వారాలు వున్నాయి. పగలు కోటలో వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళి వస్తుంటారు. గనుక, అన్ని ద్వారాలూ తెరవబడి వుంటాయి. ఆ ద్వారాల దగ్గర రాత్రిళ్ళు అట్టే కాపలా వుండదు. బైటమాత్రం పది పన్నెండుమంది కాపలా భటులు వుంటారు. ముఖద్వారం దగ్గర అలా కాదుగా?" "ఏం? మరోలా ఏముంటుంది?" "కట్టుదిట్టమైన కాపలా బైట లోపలా వుంటుంది. పోలయ్యగాడు ఆ విశేషాన్నే కనిపెట్టి వచ్చాడు." అంతలో వుపాహారాలు తెచ్చి, కుర్రవాడు బల్ల మీద సర్ది వెళ్ళిపోయాడు. ఆగంతకులు తింటూ మళ్ళీ సంభాషణకు వుపక్రమించారు. "మన వాళ్ళనెంతమందిని మాట్లాడాడు పోలిగాడు?" "వాడు మాట్లాడటమేమిటి? అన్ని ఏర్పాట్లు ఈ వూళ్ళో నేను చేయవలసిందేగా?" "సరే. ఎంతమందిని మాట్లాడావు?" "ఇరవై మందిని." "సరిపోతారంటావా?" "సరిపోక ఏం చేస్తారు? కాపలా భటులు ఆ అర్ధరాత్రి సమయంలో నిద్రమత్తులో వుంటారు. బైట మేల్కొని వుండొచ్చుగాని, లోపల వున్నవాళ్లు అంత శ్రద్ధగా తమ విధి నిర్వహణలో వుండరుగా." "ఆ సమయంలో మనమంతా వాళ్ళమీద పడి చంపాలన్నమాట! అంతేగా?" "అంతే!" "మరి, కోట తలుపుల కొక్కాలు తీయటం లాంటి పనులేవో వున్నాయన్నాడే!" "అదేమంత పనిరా..!కాపలావాళ్ళు చనిపోయిన తర్వాత కోట తలుపుల కొక్కాలను సడలించటం కష్టమేముంది?" "అందుకేగా మనల్ని అంతవరకే తోడ్పడి ఆ తరువాత వెళ్లిపొమ్మన్నాడు. కొక్కాల విషయం పోలయ్యగాడూ, వాడి మనుషులూ చేసుకుంటారటలే!"

"మరి, ఈ దినం అర్ధరాత్రి దాటాక దుర్జయసేనాని తమ రాజుతో కలిసి సైన్యాలను వెంటబెట్టుకుని మన కోట మీదికి వస్తాడు. వాళ్ళ పద్ధతి ప్రకారం శాంతినగరం కోట సులభంగానే వాళ్ళ వశం అవుతుంది. మన మాటేమిటి? ఇప్పుడు ఒప్పుకున్నంతేనా?" "నీ ఏడుపేమిటో సరిగ్గా ఏడు?" "ఏంలేదు! వాళ్ళకు ఇంతగా తోడ్పడుతున్నాం కదా! యింకేమీ ఇవ్వరా?" "అదా? పోలిగాడు పెద్దపరిదిలోకి వెళ్ళిపోతాడు. వాణ్ని మనం విడిచిపెట్టం కదా? అన్నీ వాడే చూస్తాడులే." "అలాకాదు.. మనం యీ పనికి వెళ్ళబోయే ముందుగానే పోలిగాడిని యీ విషయం గురించి మరోమారు గట్టిగా మాట్లాడాలి. ఏమంటావ్?" "సరే.. ఆ గుడిసెల్లో వుంటాడు. అక్కడికే వెళ్ళి మాట్లాడుదాం పద.." అన్నాడు మొదటివాడు. అంతటితో తినటం పూర్తయినందున ఆ ఇద్దరూ బైటికి వచ్చారు. ఉపాహారం యజమాని బల్లముందు డబ్బుచెల్లిస్తోన్న ఆ యిద్దరినీ ఓమారు పరిశీలనగా చూశాడు వీరనాయకుడు. ఆ యిద్దరూ నల్లగా, పొట్టిగా, బలిష్టంగా వున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వీరనాయకుడు తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఇప్పుడతనికి మార్గం సుగమమైంది. నిశ్చయంగా శత్రువులు ఈ రాత్రికి శాంతి నగరం కోటను పట్టుకోవటానికీ, తమ దుష్టకార్యాన్ని నెరవేర్చుకోవటానికీ రాబోతున్నారు. అయినా... యీ విషయం శాంతినగరం ప్రభువుకుగాని రాజోద్యోగులకుగాని తెలియనివ్వకూడదు. తానే యీ దుష్టకార్యాన్ని అడ్డుకోవాలి. శత్రువుల ఆట కట్టించి, తమ ప్రభువుకు కాబోయే బంధువును ఆపద నుంచి తప్పించాలి. తమకు కాబోయే మహారాజుని రక్షించటంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు. ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత వీరనాయకుడు అక్కడి నుండి లేచాడు. అర్థరాత్రి కావస్తోంది. పోలిగాడు తన సహచరులు నల్గురితోనూ, తన వెనుకగా వస్తోన్న మరో యిరవై మంది శాంతినగరానికి చెందిన దుండగులతోనూ కోట ప్రధాన ముఖద్వారం లోపలిభాగాన్ని సమీపించాడు. కోట ముఖద్వారం యివతల కాపలా పెద్దగా లేదు. పది పన్నెండు మంది భటులు కత్తులు పట్టుకుని, ముఖ ద్వారానికి ఇటూ అటూ వెల్గుతోన్న కాగడాల వెలుతుర్లో నిల్చుని వున్నారు. "ఒరేయ్! వాళ్ళు మేలుకునేవున్నారు. వెనక వచ్చే వాళ్ళు దగ్గరికి రానీ, ఏం చెయ్యాలో చెబుతాను. నిద్రిస్తుంటారేమో అనుకున్నాను మొదట్లో. అట్టే చూస్తే, ప్రతిఘటన తీవ్రమయ్యేట్టుంది" అన్నాడు పోలిగాడు. 

"ఆ పది పన్నెండు మందితో ప్రతిఘటన ఎంత తీవ్రమౌతుంది! మన చేతిలో చచ్చి వూరుకుంటారు." "అలా కాదు. నిద్రపోతోన్న వాళ్ళను కడతేర్చటానికీ, మేల్కొని వున్నవాళ్ళను తలపడిపోరాడి చంపటానికి చాలా తేడా వుంది." పోలయ్య తన వాళ్ళతో అలా మాట్లాడుతూండగానే వెనుక జట్టు వచ్చి కలుసుకుంది. అక్కడికి వీధిదీపాల వెల్తురు ప్రసరించటంలేదు! అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లూ, గవినులూ, బురుజులూ వున్నాయి కనుక ఆ ప్రాంతంలో మనుషులు యెక్కడ వుండినా, యెవరైనా ఆ సమయంలో వీధిలో తిరుగుతున్నా కనిపించటం కష్టం. వెనక జట్టు దగ్గరగా రాగానే పోలయ్య అందరితో ఇలా చెప్పాడు. "కాపలా వాళ్ళు మేల్కొనే వున్నారు. అందరం మెల్లిగా గోడచాటుగా వెళదాం. ఒక్కసారిగా మీదపడి కడతేర్చుదాం. ఇలాగే వెళ్ళామనుకోండి, వాళ్ళు అరిచి కేకలుపెట్టే అవకాశం వుంది జాగ్రత్త!" ఆ తరువాత పోలయ్య ముందుగా నడుస్తుండగా అందరూ తమ తమ ఆయుధాలను చేతపట్టుకుని, నిశ్శబ్దంగా నడవటం ప్రారంభించారు. వారంతా గోడచాటున చీకటిలో రావటంవల్ల కాపలా వాళ్ళకు కనిపించలేదు. పోలయ్య తన చేతిలోని కత్తిని విసురుగా ఓ భటుని మీదకు ఝుళిపించాడు. మరుక్షణం...రెప్పపాటు కాలంలో ఓ పిడిబాకు రివ్వున దూసుకుంటూ వచ్చి, పోలయ్య కడుపులో పిడిదాకా దిగబడిపోయింది. పోలిగాడు కెవ్వున కేకపెట్టి, చేతిలోని కత్తిని జారవిడుస్తూ, వెనక్కి విరుచుకుపడిపోయాడు. తమ ప్రక్కన యెవరో చావుకేక పెట్టటానికి విస్తుపోతూ, ఆ భటులు చటుక్కున ప్రక్కకు తిరిగి చూశారు. అంతలో, చీకటిలో పొంచివున్న పోలిగాని అనుచరులంతా తమ తమ ఆయుధాలను ఝుళిపిస్తూ కాపలా భటులమీద పడ్డారు. మరుక్షణం, అక్కడికి దగ్గరలోని ఓ ప్రక్కన చీకటిలో అశ్వాన్ని నిలుపుకుని, పిడిబాకు విసురుతూ పోలిగాడిని హతమార్చిన వీరనాయకుడు తన గుర్రాన్ని పరుగెత్తించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఉత్తరక్షణం అతడి ఒరనుంచి కరవాలం బైటికి వచ్చింది. ఒక్కసారిగా అంతమంది దుండగులు వచ్చి మీద పడడంతో ఉక్కిరిబిక్కిరవుతూ, బెరుకు బెరుకుగా పోరాటం కొనసాగిస్తోన్న శాంతినగర కాపలా భటులకు రక్షణ కలిగిస్తూ, వీరనాయకుడు శత్రువుల మీద వీరావిహారం చేశాడు. 

కొంతసేపు ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు చెలరేగాయి. దుండగులంతా విగత ప్రాణులై నేలమీద పడిపోగానే వీరనాయకుడు కత్తిని ఒరలో యిముడ్చుకున్నాడు. కాగడా వెల్తురులో వీరముద్రల్తో ప్రకాశిస్తోన్న ఆ యువకుణ్ని చూసి, కాపలా భటులు అతనికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు. "బాబూ..!తమరెవరోగాని, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. బ్రతికినంత కాలం మిమ్మల్ని పూజించుకుంటాం" అన్నాడు కాపలాభటుల నాయకుడు. "భద్రా! మనమంతా ఒకటే! నేను మీకు పరాయివాడిని కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగినట్లే తక్కిన ముఖద్వారాల దగ్గర కూడా కొంతమంది దుండగులు మనవాళ్ళ మీద అఘాయిత్యం చేయటానికి సిద్ధపడుతుంటారు. ఇక నేను యిక్కడ ఆలస్యం చెయ్యటానికి వీలులేదు. బైటినుంచి కూడా మీ నగరానికి ఆపద ముంచుకు రానున్నది. చూసుకుని వస్తాను నేను" అని చెప్పి వీరనాయకుడు తన అశ్వాన్ని పరిగెత్తించుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఓ కాపలాభటుడు కాపలాభటుల నాయకుణ్ని చూస్తూ "దొరా! ఈ వీరుడు చెప్పింది మనకు సరిగ్గా అర్థం కాకపోయినా, మొత్తానికి మన కోటకు యేదో ఆపద ముంచుకు రానున్నదన్న వార్త మాత్రం సత్యం కావచ్చు. నేను వెళ్ళి సేనానిగారికి ఆయన చెప్పింది చెబుతాను" అన్నాడు. "వద్దు. నేనే వెళ్తాను. ఇదంతా చాలా గందరగోళంగా వుంది. సేనానిగారికి ఆ వీరుడు చెప్పిందంతా చెప్పి, వారు చెప్పినట్లు రహస్యంగానే ఇక్కడికి తీసుకువస్తాను" అని చెప్పి ఆ కాపలా భటులు నాయకుడు అక్కణ్నుంచి గబగబా వెళ్ళిపోయాడు. "ఎవరు? ఓ వీరభద్రుడా! ఏమిటి ఇంత రాత్రి సమయంలో వచ్చావు?" సేనాని ఇంటిముందు కాపలా భటుడు అడిగాడు కోట ముఖద్వారం వెనుకభాగంలో కాపలాకాసే కాపలాభటుల నాయకుణ్ని చూడగానే. "అవును నేనే. అత్యవసరంగా సేనానిగారితో ఒక విషయం చెప్పాలి" "ఏం తెల్లవారాక చెప్పకూడదా?" "తెల్లవారితే మనం ఇక్కడ కాపలా వుంటామన్న నమ్మకం లేదు గాని, వెళ్ళి నేను వచ్చాననీ, దర్శనం కోరుతున్నాననీ చెప్పు. నిద్రలేపు" అన్నాడు వీరభద్రుడు ఆందోళనతో. కాపలా భటుడు గబగబా అక్కణ్ణించి లోపలికెళ్ళి పోయాడు. 

కొద్దిసేపటి తర్వాత సేనాని కాపలా భటునితో కలిసి బయటకి వచ్చాడు. "ఏం వీరభద్రా! ఇంత రాత్రిసమయంలో వచ్చావేం?" అన్నాడు సేనాని హడావిడిగా వీరభద్రుని దగ్గరకు వచ్చి. "దొరా! మీతో ఏకాంతంగా నేను ఒక ముఖ్యమయిన విషయం చెప్పాలి. అలా చెప్పమని ఓ వీరుడు సెలవు ఇచ్చాడు." వీరభద్రుడు అలా అనగానే సేనాని కాపలా భటుణ్ణి చూస్తూ.. "నువ్వలా ప్రక్కకు వెళ్ళు" అన్నాడు. కాపలాభటుడు ప్రక్కకు వెళ్ళగానే, "ఏమిటో చెప్పు, ఎవరా వీరుడు?" అన్నాడు. వీరభద్రుడు ప్రధాన ముఖద్వారం దగ్గర నిలబడి జరిగిందంతా విపులంగా చెప్పాడు. "ఆ? మన కోటకు ముప్పు రాబోతున్నదా? ఆ అజ్ఞాత వీరుడెవరై వుంటారు?" చాలా ఆశ్చర్యంతో అన్నాడు సేనాని. "ఆ యువకవీరుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి మాతో చెప్పిన మాటల్ని బట్టి మనకు చాలా ఆత్మీయుడై వుంటాడనుకుంటున్నాను దొరా!" "మరి మీ రాజ్యానికి, మీ కోటకి అని మాట్లాడాడే! దానినిబట్టి ఆ వీరుడు మన రాజ్యానికి చెందినవాడు కాదని అర్థం అవటంలేదూ?" "నిజమే! ఏమైనా ఆ వీరుడు మనకు అత్యంత ఆప్తుడు. తమరు ఈ విషయం మంత్రిగారికి గాని, మహారాజుగారికి గాని చెప్పకుండా, రహస్యంగా కోట ముఖద్వారం దగ్గరికి వచ్చి కలుసుకోమన్నాడు. ఈలోగా వారు కూడా అక్కడికి వస్తారట." "సరే మనం కూడా అక్కడికే వెళదాం పద. ఇక్కడ చర్చించుకోవడం యెందుకు? అన్ని విషయాలు అక్కడే తెలుస్తాయి" అని సేనాని లోపలికి వెళ్ళి యోధావేషం ధరించి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి, కోట ముఖద్వారం దగ్గరికి వచ్చారు. అప్పటికి అక్కడి కాపలాభటులు దుండగుల మృతశరీరాల నన్నిటినీ ఒకచోట కుప్పగా పేర్చివుంచారు. అదిగో మనవాళ్ళు అందరి శవాలను అక్కడ పేర్చి పెడుతున్నారు చూడండి. వీళ్ళంతా యెవరో, ఎలా వచ్చారో మనకి అర్థం కావడంలేదు" అన్నాడు వీరభద్రుడు సేనానితోసహా కోటద్వారాన్ని సమీపించగానే. సేనాని ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడికి నడిచాడు. కాపలాభటులు అతనికి నమస్కరించారు. "వీరభద్రా! వీళ్ళంతా మన నగరానికి చెందినవాళ్ళే నేమో చూడు" అన్నాడు సేనాని. 

ఓ కాపలాభటుడు కాగడా పట్టుకొచ్చి శవాల్ని కదిలించాడు. వాళ్ళలో కొందరిని గుర్తుపట్టాడు ఒక కాపలాభటుడు. "దొరా! వీళ్ళు జాండ్రపేటకు చెందిన జనం. రకరకాల నేరాలతో వీళ్ళకు సంబంధం వుంది. వీళ్ళు అంతా చాలాసార్లు కారాగారానికి వెళ్ళి వచ్చినవాళ్ళే" అన్నాడు ఆ భటుడు. "ఎంత నేరాలు చేసి, చెరసాలకు వెళ్ళివచ్చిన వాళ్ళయినా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చంపాలని యెందుకనుకున్నారో అర్థం కావడం లేదు" అన్నాడు సేనాని. "మాకు ప్రాణ రక్షణ కలిగించిన వీరుడు చెప్పిన మాటలను బట్టి, బయట శత్రువుల ప్రమేయం వున్నట్లుంది. ఆయన వచ్చిన తర్వాత వివరాలు చెపుతానన్నాడు. మొత్తానికి యేదో పెద్ద యింద్రజాలంలాంటిది యీ రాత్రి మన కోటకు దాపురించినట్లువుంది" అన్నాడు కాపలాభటుల నాయకుడు. అంతలో, అల్లంత దూరాన గుర్రపు గిట్టల చప్పుడు వినిపించింది. అందరూ అటుకేసి చూశారు. కొద్ది క్షణాలలో వీరనాయకుడి గుర్రం అక్కడ వచ్చి ఆగింది. వీరనాయకుడు గుర్రం మీద నుంచి క్రిందికి దిగాడు. సేనానిని చూడగానే అభివాదం చేశాడు. "దొరా! యీ వీరుడే" అన్నాడు కాపలాభటుల నాయకుడు. "మిత్రమా! మీరెవరో గాని, హఠాత్తుగా యేర్పడిన ఆపదను తొలగించటానికి వచ్చిన ఆపద దైవం అనుకుంటున్నాం. దయచేసి తమరు ఎవరో చెబితే సంతోషిస్తాం" అన్నాడు సేనాని వీరనాయకుడికి ప్రతి నమస్కారం చేస్తూ. "నేను ధారానగర నగరరక్షక దళాధికారిని. నా పేరు వీరనాయకుడు" అని వీరనాయకుడు చెప్పగానే సేనాని అతణ్ని రెండుచేతులతో కౌగిలించుకున్నాడు. "మిమ్మల్ని గురించి యిరుగు పొరుగు రాజ్యాలలోని ప్రజలు కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. త్వరలో మా మహారాజుగారి అల్లుడు కాబోయే మీ మహారాజుగారు మీపట్ల చూపించిన ఔదార్యాన్ని కూడా మా ఉద్యోగులందరం చెప్పుకుంటుంటాం. హఠాత్తుగా మీ రాక, యిక్కడ జరిగిన సంఘటనలు, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయో! మిమ్మల్ని కలుసుకున్నందుకు అంత ఆనందంగానూ వుంది. దయచేసి వివరంగా చెప్పండి. ఈ దుండగులు ఎందుకు మా కాపలా భటులను చంపటానికి వచ్చారు? మా నగరానికి రానున్న ఆపద ఎటువంటిది? అన్నాడు సేనాని. 

"మహాసేనానీ! నేను మిమ్మల్ని రహస్యంగా రమ్మని చెప్పిన కారణం ఇంచుమించు నేను బయలుదేరి మీ నగరానికి వచ్చినటువంటిదే! నేనిక్కడికి వచ్చినట్లు మా ప్రభువులకు తెలియదు. విశ్వాసవంతుడైన సేవకుడు తను చేయబోయే, లేదా చేసిన పనిని గురించి యజమానికి చెప్పటంలో అంత ఔచిత్యం వుండదు. అందువల్ల నేను మీ విషయంలో ఒంటరిగానే తలదూర్చాను. అయితే యిక్కడికి వచ్చి, కొన్ని పరిస్థితుల్ని తెలుసుకున్న తర్వాత మీకు వివరంగా చెప్పి, కోట రక్షణ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకొమ్మని హెచ్చరించటం నా ధర్మమనిపించింది.. వినండి. ఈ తతంగమంతా నడవటానికి జరిగిన సంఘటనలు మీకు పూర్తిగా వివరిస్తాను" అని వీరనాయకుడు శాంతినగర నివాసియైన తన బంధువు అబ్బిగాడు తన మామగారితో మాట్లాడిన దగ్గర్నుంచి, అప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ పూస గ్రుచ్చినట్లు చెప్పాడు. అతడు చెప్పినవన్నీ వినగానే కాపలా భటుల నాయకులు దిగ్భ్రాంతి చెందారు. "ఆ! ఆ దుర్జయసేనాని తన రాజుతో కలిసి ఇంత దురాగతానికి సిద్ధపడ్డాడా? ఒకసారి మా ప్రభువులచేత చీవాట్లు తిన్న తర్వాత కూడా ఆ దుష్టరాజుకు బుద్ధి రాలేదన్నమాట! సరే అన్నిటికి తగిన ఫలితం అనుభవిస్తారు.." అని పళ్ళు కొరికాడు. "మహాసేనానీ! తమరు ఇప్పుడు దేశంలో అక్కడక్కడ సైనిక స్థావరాలలో వున్న సైన్యాలను ఇక్కడికి రప్పించలేరు. మనకు వ్యవధిలేదు. నగరంలోని భద్రతాదళాలను సిద్ధం చేయించండి చాలు. ఈ విషయం మంత్రిగారితోగాని, మహారాజుగారితో చెప్పవలసిన అవసరంలేదు. ఈ మాత్రానికే వారిని ఎందుకు ఆందోళనకు గురి చెయ్యాలి. శత్రువుల్ని నిర్జించిన తర్వాత ఎలాగూ తెలుసుకుంటారు వాళ్ళు" అన్నాడు వీరనాయకుడు. ఆదర్శసేవాపరాయుడివైన  నీ సూచనలను అక్షరాలా అమలు జరిపిస్తాను మిత్రమా! పదండి.. మన భద్రతా దళాలను తరలించుకుని వద్దాం" అన్నాడు సేనాని. అంతలో.. నగరం వెలుపల సైనిక సంచారం ఏర్పడినట్లు కోలాహలం వినిపించింది. వీరనాయకుడు సేనానితో "తమరు త్వరగా వెళ్ళి భద్రతాదళాలను సిద్ధం చేసుకుని రండి. ప్రస్తుతం కోట నలువైపులా వున్న తలుపుల దగ్గర కొంతసేపటిదాకా భయంలేదు. ఎందుకంటే లోపల తమవాళ్ళు కాస్త ఆలస్యమైనా తలుపులు తీస్తారని బైటివాళ్ళు నిరీక్షిస్తారు. ఈలోగా మనం సర్వసన్నాహం కావాలి. అంతగా కోట తలుపులు బ్రద్దలుకొట్టి శత్రువులు లోపలికి రావటానికి ప్రయత్నిస్తే నేను చూసుకుంటాను" అన్నాడు వీరనాయకుడు. 

"అలాగే, నేను త్వరలోనే భద్రతాదళాలను సిద్ధం చేసుకుని వస్తాను" అని కాపలా భటులను వీరనాయకునికి తోడుగా వుండమని హెచ్చరించి, సేనాని హుటాహుటిగా వెళ్ళిపోయాడు. శాంతినగరం కోట చుట్టూ దుర్జయుడు తన సైన్యాలను వ్యూహం పన్నించాడు. తన రాజుతో కలిసి అతడు ముఖ్య ద్వారం దగ్గర వున్నాడు. "దుర్జయా! నువ్వు ఏర్పాటు చేసిన మనుషులు ఇంకా తలుపులు తీయలేదేం?" అన్నాడు రాజు. "మనం వచ్చినట్లు ఇప్పుడే తెలిసి వుంటుంది వాళ్ళకు. కొంచెంసేపట్లో తీస్తారనుకుంటాను ప్రభూ!" "ఏమో! ఈలోగా శాంతినగర రక్షక బలాలకు మన రాక గురించి తెలిస్తే అల్లకల్లోలమౌతుంది కదా..? ఆ కల్లోలంలో రాజపుత్రిని వాళ్ళు ఏ రహస్యమార్గం ద్వారానో సురక్షిత స్థానానికి తరలిస్తే ఎలా?" దుర్జయుడు నవ్వాడు. "మీ ఆందోళన అర్థం లేనిది ప్రభూ! త్వరలోనే మనం కోట లోపలికి వెళతాం..శాంతి నగరాన్ని అశాంతిపాలు చేసి, రాజమందిరాన్ని ఆక్రమించుకుంటాం..రాజును, సైన్యాధికారులను బందీల్ని చేస్తాం..రాకుమారిని దక్కించుకుంటాం.." అని దుర్జయుడు ఇంకా ఏదో అనబోతుండగానే కోట తలుపులు తెరుచుకున్నాయి. "అదిగో.. మనవాళ్ళు తలుపులు తీశారు" అని అంతలోనే లోపల్నుంచి వందలాది కరదీపికలు ధరించిన శాంతినగర భద్రతా బలాలు ఆయుధసాములై, అశ్వారూఢులై కన్పించగానే దుర్జయుడు అదిరిపడ్డాడు. ఆ సైనికులకు అగ్రభాగంలో వీరమూర్తియైన వీరనాయకుడు, సర్వసేనాధిపతి, ఆయుధసాములై గుర్రాల మీద వస్తూండటం దుర్జయుని గుండెల్లో పిడుగులు పడినట్లయింది. దుష్టరాజు తెల్లమొహం వేశాడు ఎదురుగా వస్తోన్న సైనికులనూ, తన సేనాని తెల్లబోయిన మొహాన్ని చూసి. "ప్రభూ! ఆ వస్తోన్న వీరుడు ధారానగర ప్రభువుకు అత్యంత ఆప్తుడు, విశ్వాసపాత్రుడు, మహావీరుడు అయిన వీరనాయకుడు. అతడు పూర్వం గజదొంగగా ప్రసిద్ధికెక్కి, ఈ మధ్యనే రాజు మన్ననలను పొంది, నగర రక్షకదళాల అధికారాన్ని చేపట్టాడు. ఇంతకుముందు ఒకసారి చూశాను కూడా! ఇతడు ఇక్కడికెలా వచ్చాడు? మన పథకం ఎలా వెల్లడయింది? నాకేమీ అర్థం కావటంలేదు" అన్నాడు. 

"అర్థం..అనర్థం...తర్వాత చూసుకోవచ్చు. ముందు వాళ్ళను ఎదుర్కోవటం సంగతి చూడు. ఆ విధంగా ఆ ఇద్దరూ భయకంపితులై, చివరకు ప్రాణాలకు తెగించి గుర్రాలను ముందుకు పరుగెత్తించారు. ఇద్దరూ ఒరలనుండి కత్తులు దూశారు. అయితే వాళ్ళ గుర్రాలకంటే మరింత విసురుగా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన వీరనాయక, సేనానాయక గుర్రాలు ఆ గుర్రాలను ఢీకొన్నాయి. వీరనాయకుడి కరవాలానికి దుష్టరాజు, సేనానాయకుడి కరవాలానికి, దుష్టసేనాని బలియై నేలకొరిగారు. ప్రారంభంలోనే బలిపశువుల్లా తమ రాజు, సేనాని శత్రువులచేత చంపబడటంతో, శత్రుసైనికులు తెల్లమొహాలు వేశారు. తాము ఎంతమంది వుండినా నాయకుడు లేని గొర్రెల మంద అవుతామన్న భయం వాళ్ళను ఆవరించింది. అదే సమయంలో వీరనాయకుని సూచన ప్రకారం శాంతినగర సేనాని తన గుర్రాన్ని శత్రుసైనికుల ముందరికి పరుగెత్తించి యిలా హెచ్చరించాడు. "మీ రాజు మరణించాడు. మీ సేనాని కూడా అసువులు బాసాడు. ఇక మీరంతా మా బలాలతో తలపడి ప్రాణాలు పోగొట్టుకోవటం వృధా. కాబటికి అందరూ మాకు లొంగిపోవటం శ్రేయస్కరం. అనవసర రక్తపాతం ఇష్టం లేక ఈ హెచ్చరిక చేస్తున్నాను." సేనాపతి మాటలు వినగానే శత్రుసైనికులంతా తమ తమ ఆయుధాలను పారేసి లొంగుబాటును ప్రదర్శించారు. కోట ప్రధాన ముఖద్వారం దగ్గర సంఘటనలు తెలియగానే నలువైపులా వున్న శత్రుసైనికులు కూడా సేనాని దగ్గరకి వచ్చి లొంగిపోయారు. ఏ మాత్రం అలజడి, గందరగోళం, రక్తపాతం లేకుండా ఆ విధంగా సులభమైన పద్ధతిలో తమకు రానున్న ఆపదను తొలగించడమే కాకుండా శత్రురాజ్యం కూడా తమ శాంతినగర రాజ్యానికి వశమయ్యేట్టు చేసిన వీరనాయకుడిని శాంతినగర సేనాని అభినందించాడు. "ప్రియమిత్రమా! తమరు మా ప్రభువులు దగ్గరికి రావాలి. మీరు చేసిన ఘనకార్యాలకు ముగ్ధులై వారు మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. అది చూసి నేను ఆనందంతో పొంగిపోవాలనుకుంటున్నాను" అన్నాడు సేనాని. వీరనాయకుడు "మిత్రమా! నేను ఇంతకముందు చెప్పింది మర్చిపోయినట్లున్నారు. మన కర్తవ్యం మనం నెరవేర్చాం. నేను తెల్లవారేసరికి మా నగరం చేరుకోవాలి. సెలవు. మా ప్రభువుల వివాహ సమయంలో మనమందరం మా నగరంలో కన్నులపండువుగా కలుసుకుందాం. సెలవు" అని వీరనాయకుడు శాంతినగర సేనాని జవాబుకు కూడా ఎదురుచూడకుండా తన అశ్వాన్ని ధారానగరం వేపుగా పరుగులు తీయించాడు.  

వీరనాయకుడు వీరసేన మహారాజును సందర్శించాడు. "ఉన్నట్లుండి గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చిందని ఉత్తరం పంపించావు. వెళ్ళిన పని సవ్యంగా జరిగిందా వీరనాయకా!" చిరునవ్వుతో ప్రశ్నించాడు వీరసేనుడు. "చిత్తం" "మంచిది, వెళ్ళి నీ పని చూసుకో" వీరనాయకుడు వెళ్ళిపోయాడు. అప్పుడు సమయం సాయంత్రం. మధ్యాహ్నమే వీరసేనానికి శాంతినగరం నుంచి వర్తమానం వచ్చింది. రాత్రి జరిగిన సంఘటనలన్నీ అందులో వివరించబడి, వీరనాయకుని గురించి స్తుతి పురస్కారంగా శాంతినగర ప్రభువు వీరసేనునికి ఉత్తరం పంపాడు. వీరనాయకుడు ఆ విషయమేమీ చెప్పనందుకు వీరసేనుడు అతని ప్రభుభక్తికి ముగ్ధుడయ్యాడు. అటువంటి ఉత్తముడైన వీరుడు తన వుద్యోగిగా వున్నందుకు రాజు ఎంతగానో సంతోషించాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాటి అర్థరాత్రి సమయంలో వీరనాయకుడు గస్తీ తిరుగుతూ రాజవీధిలోకి వచ్చాడు. అప్పుడు ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని, ఓ కుడ్యం ప్రక్కన దుఃఖిస్తుండటం గమనించి, వీరనాయకుడు ఆమె దగ్గరికి వెళ్ళి గుర్రం దిగాడు. అదే సమయంలో రాజు కూడా అంతకుముందు ఆ స్త్రీ దుఃఖిస్తుండటం మందిరం పైనుండి చూసి, సంగతేమిటో తెలుసుకుందామని వచ్చాడు. అంతలోనే వీరనాయకుడు కూడా అక్కడికి రావటంతో తాను ప్రక్కకు తప్పుకుని, ఏం జరుగుతుందోనన్న కుతూహలంతో చూస్తుండిపోయాడు. "అమ్మా! నువ్వెవరివి తల్లీ! ఎందుకలా దుఃఖిస్తున్నావు?" అన్నాడు వీరనాయకుడు. అందుకామె "ఏం చెప్పమంటావు నాయనా! నేను నగర సౌభాగ్యదేవతను. మహా ధర్మాత్ముడు, సంస్కారవంతుడు, ఉదారుడు అయిన మహారాజు ఇక రెండు రోజులలో ఆకస్మిక మరణానికి గురికానున్నాడు. అందువల్ల నేను దుఃఖిస్తున్నాను" అంది ఆ స్త్రీ దుఃఖిత స్వరంతో. ఆమె మాటలు రాజుకు విభ్రాంతిని కలిగించాయి. వీరనాయకుడు నిశ్చల గంభీర దృష్టులతో ఆ యువతిని చూస్తూ "తల్లీ! మహారాజుగారిని రక్షించుకోవటానికి మార్గమేమైనా వుంటే చెప్పగలవా?" "ఉంది, ఉత్తమ రాజభక్తితో నేవళందేరిన ఓ సద్గుణవంతుడు తన అర్ధాంగిలక్ష్మి చేతితో కాళీమాతకు తన తలను నైవేద్యంగా సమర్పిస్తే, రాజు గండం తొలగిపోతుంది" అని చెప్పి ఆ స్త్రీ అంతర్థానమైంది. 

వీరనాయకుడు అశ్వం అధిరోహించి, చటుక్కున ప్రక్కకు మరలించాడు. రాజు ఆ మాటలన్నీ విన్నాడు. వీరనాయకుడు అంత శీఘ్రంగా వెనుతిరిగి పోవటం అతనికి భయాన్ని కలిగించింది. ఏం జరగబోతోంది? వీరనాయకుడి స్వభావం తనకు తెలుసు. రాజు వెంటనే మందిరంలోకి వెళ్ళాడు. దుస్తులు మార్చుకుని, గబగబా అశ్వశాల దగ్గరికి నడిచాడు. తన అశ్వాన్ని ప్రక్కకు తీసి అధిరోహించాడు. గుర్రాన్ని సరాసరి కాళీ ఆలయం మందిరానికి పరుగులు తీయించాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రాజు గుడి లోపలికి వెళ్ళేసరికే అతడికి రెండు శవాలు కనిపించాయి. వీరనాయకుడి తల కాళీదేవి విగ్రహం పాదాల దగ్గర పడివుంది. నిర్మల తల కూడా తెగిపడి వుంది. ఆమె మొండెం భర్త మొండెం మీద వుంది. జరిగిందంతా వూహించాడు రాజు. తను వచ్చేముందే భార్యతోసహా వీరనాయకుడు ఇక్కడికి వచ్చాడు. ఆ మహాసాధ్వి భర్తవాక్కు ప్రకారం తన శ్రేయస్సు కోరి, భర్త శిరస్సును ఖండించి, కాళీమాతకు నైవేద్యం పెట్టింది. ఆ తర్వాత భర్తలేని బ్రతుకు తనకెందుకని, తనను కూడా తన చేతులతో అంతం చేసుకుంది. ఈ వీరనాయకుడి కోసం ఇంతకముందు ప్రాణాలర్పించటానికి సిద్ధపడింది. అప్పుడు తాను అడ్డుకుని, ఆమె జీవితాన్ని ఉద్ధరించాడు. ఇప్పుడు ఆ జగజ్జనని ఈ ఉత్తమురాలి జీవితాన్ని కాపాడలేకపోయింది. తాను ఇటువంటి ఉత్తమ సహచరుడిని కోల్పోయాడు. ఉత్తమ యిల్లాలు తన కారణంగా మృతిచెందింది. ఇక తాను జీవించటం మాత్రమెందుకు? ఈ పుణ్య దంపతులు లేని తన నగరం తనకు నివాసయోగ్యం కాదు. మృత్యు సన్నిధే తన నివాసయోగ్యం. ఆ విధంగా నిశ్చయించుకుని వీరసేనుడు ఒర నుంచి కరవాలం దూశాడు. "తల్లీ! జగజ్జననీ!! నీ కృపా కటాక్షానికి నోచుకోలేని నిర్మల జీవితాన్ని దారుణంగా బలితీసుకున్న అపరాధిని. ఉత్తమోత్తముడైన అనుచరుడిని పొట్టన బెట్టుకున్న దోషిని. నన్ను కూడా నైవేద్యంగా తీసుకో!" అని మెడకు గురిచేసి కత్తితో వేటు వేసుకోబోయాడు. "ఆగు మహారాజా! నీమీది భక్తితో నీ అనుచరుడు మరణించాడు. తన భర్త లేని జీవితం తనకెందుకని నిర్మల తన జీవితాన్ని అంతం చేసుకుంది. ఇక ఏ సంబంధమూ, బంధమూ లేని నువ్వు వాళ్ళకోసం ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోవటం నీలోని ఉత్తమ రాజత్వాన్ని సూచిస్తోంది. నీ అనుచరుడిని భార్యాసమేతంగా బ్రతికిస్తాను. నీ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకో" అన్న మాటలు లలిత గంభీరమైన ఓ స్త్రీ కంఠస్వరం నుంచి వినిపించాయి వీరసేనుడికి. అతడు ఆనందంతో ప్రక్కకు తొలగి నిల్చున్నాడు. మరికొద్ది క్షణాలకే వీరనాయకుడి శిరస్సు మొండానికి అతుక్కుంది. ఆ ఇద్దరూ నిద్రలేచినట్లు లేచారు. ఎదురుగా కరవాలహస్తుడై నిల్చున్న మహారాజు కనిపించగానే ఆ యిద్దరూ అతనికి నమస్కరిస్తూ లేచి నిల్చున్నారు. "వీరసేన మహారాజా! నీ అత్మత్యాగ ప్రయత్నంతో నీ ప్రియ సహచరుడిని, అతని ధర్మపత్నిని బ్రతికించుకున్నావు. ఇక మీరు నగరానికి వెళ్ళి, చిరకాలం సుఖజీవితాలు గడపండి" అన్న మాటలు మళ్ళీ వినిపించాయి. "ప్రభూ!" అని అయోమయంగా తనకేసి చూసిన వీరనాయకుణ్ణి కౌగలించుకుని "వీరనాయకా! ఇది కాళీ కటాక్షం" అన్నాడు.

Comments