తెలుగు జానపద కథలు - మంత్ర పుష్పం

Telugu folklore fairy tale of a brave prince in search of a rare flower to cure his father. Janapada kathalu.

మగధ రాజ్యాన్ని చంద్రసేనుడు పరిపాలిస్తున్న రోజుల్లో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు కరువు కాటకాలు, ఈతి బాధలు లేక గుండెలపై చేతులు వేసుకుని సుఖంగా నిద్రించగలిగేవారు. ఆకలి మంటలు ఎలాంటివో వారెరుగరు. దీనంతటికీ మహారాజు ధర్మపాలనయే కారణమని చెప్పుకుని ఆనందించేవారు మగధ ప్రజలు. చంద్రసేన మహారాజుకి ప్రతాపసేనుడు ఒక్కడే సంతానం. ప్రతాపసేనుడు తండ్రికి తగ్గ కొడుకు. యుక్తవయస్కుడయ్యేసరికి సకల విద్యల్లోనూ ఆరితేరాడు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం అతనికి వెన్నతో పెట్టిన విద్యలు. కొడుక్కి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలని అనుకొన్నాడు మహారాజు. అయితే, ఇంతలో పరిస్థితులు ఎదురు తిరిగాయి. అకస్మాత్తుగా మహారాజు వక్షస్థలం మీద ఓ విచిత్రమైన వ్రణం పుట్టింది. రాజవైద్యులు రకరకాల చికిత్సలు చేశారు. కాని ఫలితం కన్పించలేదు. రాజ్యంలో పేరుమోసిన ఘనవైద్యులందరూ మహారాజు వ్యాధి నయం చేసేందుకు రప్పించబడ్డారు. కాని ఎవరి తరమూ కాలేదు. వైద్యం సాగుతూనే ఉన్నది. మహారాజు చిక్కిశల్యమయ్యాడు. ఇలా ఉండగా, ఒకనాడొక సిద్ధుడు మగధ రాజ్యం మీదుగా పోతూ, మహారాజు వింత వ్యాధి గురించి విన్నాడు. స్వయంగా రాజభవనానికి పోయి, మహారాజుని పరీక్షించాడు. కొద్ది క్షణాల తదుపరి తల పంకించి, "రాజా! ఈ వ్యాధిని చిటికెలో నయం చేయగల దివ్యౌషధం వింధ్యారణ్యంలో ఉంది. అది ఒక అపురూప పుష్పం. దాన్ని సాధించటం దుస్సాధ్యం. అయినా ప్రయత్నిస్తే ఫలితం లభించగలదు" అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు.

మహారాజు వెంటనే ఈ సంగతి దండోరా వేయించాడు. ఆ పుష్పాన్ని సాధించి తెచ్చినవారికి పదివేల సువర్ణాలు పారితోషిక మివ్వబడుతుందని ప్రకటించాడు. ధనాశకు లోబడి అనేక మంది యువకులు పుష్పాన్వేషణకై వింధ్యారణ్యనికి వెళ్ళారు. కాని ఆ వెళ్ళిన వారి అజా పజా తెలీకుండాపోయింది. పది వేలు యాభై వేలకి పెంచబడ్డాయి. ఫలితం శూన్యం! మహారాజు విసిగిపోయాడు. చివరికి అర్ధ రాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అర్ధరాజ్య కాంక్షతో పుష్పసాధనకు అనేకమంది యువకులు ఉత్సాహంగా వెళ్ళారు. ఐతే ఆ వెళ్ళిన వాళ్ళలో అతి తక్కువ మంది మాత్రమే రిక్తహస్తాలతో వచ్చారు. మిగతావారి జాడ తెలీకుండా పోయింది. చంద్రసేన మహారాజు నానాటికీ కృంగి కృశించి పోతున్నాడు. ప్రతాపసేనుడు తండ్రి బాధ చూడలేకపోయాడు. ఈసారి తనే స్వయంగా వెళ్ళి, ఆ దివ్యపుష్పాన్ని సంపాదించాలని నిశ్చయించుకొన్నాడు. రాజదంపతులతో తన నిర్ణయం తెలియజేశాడు. మహారాణి ససేమిరా ఒప్పుకోలేదు. "నాయనా! ఒక్కగా నొక్క కొడుకువి. మా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకు జీవిస్తున్నాం. వంశాన్ని ఉద్ధరించవలసిన వాడివి. నువ్వు మాకు దూరమైతే మేము భరించలేం. నీ నిర్ణయాన్ని మార్చుకో!" అని బ్రతిమాలాడింది మహారాణి. ప్రజాసేనుడు అప్పటికి ఊరుకున్నాడు. రాజదంపతులు ఊరట చెందారు. ఓనాటి అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా తన పంచకల్యాణి గుర్రాన్నెక్కి, పుష్పాన్ని సంపాదించడానికి బయల్దేరి వెళ్ళిపోయాడు. నిజానికి అతనికి వింధ్యారణ్యానికి మార్గం తెలీదు. ఎవరో ఒకరు చెప్పకపోతారా అనే మొండి ధైర్యంతో, కార్యదీక్షతో ముందుకు సాగిపోయాడు. తెల్లవారేసరికి మగధ రాజ్యానికి చాలా దూరం ప్రయాణం చేశాడు. అప్పటి కతను పూర్తిగా అలసిపోయాడు. పొద్దు నెత్తి చేరేసరికి ఓ నదీతీరం చేరాడు. చుట్టూ కీకారణ్యం. గుర్రాన్ని నిలిపి దిగాడు. దప్పిక తీర్చుకున్నాడు. గుర్రానికి నీరు పట్టించి పచ్చికపై వదిలాడు. ఓ చెట్టు నీడన కాసేపు నడుం వాల్చాడు. కాసేపట్లో నిద్రలోకి జారిపోయాడు. 

అకస్మాత్తుగా వినిపించిన ఒక స్త్రీ ఆర్తనాదం ప్రతాపసేనుణ్ణి నిద్రనుండి లేపింది. తృళ్ళిపడి లేచి, కరవాలాన్ని చేత ధరించి ఆర్తనాదం వినవచ్చిన దిక్కున పరిగెత్తాడు. గుబురుగా పెరిగిన ఆ అరణ్యంలో ఓ చోట భయంకర దృశ్యం అతని కళ్ళబడింది. అతని వేడి రక్తం ఉరకలు వేసింది. మొలనుండి చివ్వున ఛురికను లాగి విసిరాడు. అక్కడ ఓ పెద్దపులి ఒక స్త్రీ పైకి ఉరికేందుకు సిద్ధంగా ఉంది. ప్రతాపసేనుడు విసిరిన ఛురిక దాని కాలికి తగిలి, ఒక్కసారిగా ఆ స్త్రీ విషయం వదిలి, ప్రతాపసేనుడి మీది కురికింది. ప్రతాపసేనుడు పులితో తలపడ్డాడు. దాని పంజా దెబ్బనుండి ఆత్మరక్షణ కావించుకుంటూ దాన్ని పొడిచి చంపాడు. పంజా చేసిన గాయం నుండి రక్తం స్రవిస్తోంది. ఇంతలో వెనక నుండి మరొక పులి గాండ్రింపు వినిపించింది. చటుక్కున అటు చూసిన ప్రతాపసేనుడికి మరో పులితో పోరాడుతున్న ఓ యువకుడు కనిపించాడు. అతని వస్త్రాలన్నీ చీలికలు వాలికలై రక్తం ధారలు కట్టింది. ప్రతాపసేనుడు అతనికి సాయం వెళ్ళేసరికి ఆ యువకుడు పులి కంఠంలో బలంగా కత్తి దించి దాన్ని చంపేశాడు. ప్రతాపసేనుడికి ఆ యువతీ యువకులు కృతజ్ఞత తెలుపుకున్నారు. "మీరెవరు? ఈ మహారణ్యంలో ఎందుకున్నారు? ఈ పులుల పాలి ఎలా పడ్డారు? చెపితే నా చేతనైన సాయం చేయటానికి సిద్ధంగా వున్నాను" అన్నాడు ప్రతాపసేనుడు. ఆ యువకుడు రెండు క్షణాల మౌనం తర్వాత యిలా చెప్పాడు. "మాది కుంతల దేశం. దానికి రాజు ప్రభాకరవర్మ. ఈమె అతని కుమార్తె వీణావతి. నేనా దేశపు మంత్రి కుమారుణ్ణి. నన్ను జయంతుడంటారు. మేమిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం. మా ప్రేమ కలాపాలు తెలిసి రాజు మండిపడ్డాడు. వీణావతిని  నిర్బంధించాడు. నేను అతి కష్టం మీద యీమెను కల్సుకున్నాను. కష్టమైనా సుఖమైనా కలిసి అనుభవించాలని బాసలు చేసుకున్నాం. రాత్రికి రాత్రి కుంతల దేశం వదిలి పారిపోయి వస్తున్నాం. కాలి నడకనే ప్రయాణం. తెల్లవార్లూ నడుస్తూనే వున్నాం. ఈ అరణ్యం గుండా ప్రయాణం చేస్తుండగా, రెండు ప్రక్కల నుండి అకస్మాత్తుగా రెండు పులులు మా మీద లంఘించాయి. నేనీ పులితో తలపడి పోరుతుండగా, తమరు ఆపద్భాంధవుడిలా వచ్చి వీణావతి ప్రాణం రక్షించారు. మీ ఋణం జన్మ జన్మలకూ తీర్చుకోలేనిది. మీరు చూడగా రాకుమారులవలే వున్నారు. మా గురించి మీకు మరీ శ్రమ యివ్వదలచుకోలేదు. మాకు శెలవీయండి." అన్నాడతను చేతులు జోడించి నమస్కరించి. 

"మీ ధైర్యాన్ని, తెగింపుని అభినందిస్తున్నాను. నేను ఒక గురుతరమైన పని మీద బయల్దేరాను. మీకు నా అంగుళీయిక మిస్తాను. దాన్ని మా తండ్రి గారికి చూపిస్తే మీకు మా భవనంలో ఏ లోటూ లేకుండా చూస్తారు. నా క్షేమవార్త మా తండ్రిగారికి తెలిసినట్టూ వుంటుంది. ఏమంటారు?" అని ప్రశ్నార్థకంగా జయంతుడి వంక చూసాడు ప్రతాపసేనుడు. అప్పటికి పొద్దు వాలిపోయింది. జయంతుడు మొదట అంగీకరించలేదు. ప్రతాపసేనుడిని ఇబ్బంది పెట్టాల్సి వుంటుందని.  కాని, గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్లవారుతూనే మగధ రాజ్యం పోవాలని నిర్ణయించుకున్నాడు జయంతుడు. ప్రతాపసేనుడు వారికి తోడుగా ఆ రాత్రి ఆ కీకారణ్యంలోనే గడపటానికి నిర్ణయించుకున్నాడు. అడివిలో దొరికిన ఫలాలు, పుట్టతేనె వాళ్ళ కడుపులు నింపాయి. తెల తెల వారుతోంది. పక్షుల కిల కిలారావాలతో ఆహార సముపార్జన కోసం బయల్దేరుతున్నాయి. జయంతుడికి చటుక్కున మెలకువ వచ్చింది. వీణావతి కనిపించలేదు. అతని గుండె జల్లుమంది. తమకి మరికొంత దూరంలో విశ్రమించిన ప్రతాపసేనుణ్ణి నిద్ర లేపి, పరిస్థితి వివరించాడు. ప్రతాపసేనుడు దిగ్గున లేచాడు. ఇద్దరూ ఆత్రుతగా అడవంతా గాలించారు వీణావతి కోసం. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అలా చాలా దూరం వెతుకుతూ పోయారు. ఓ చోట తపస్సమాధిలో వున్న మునీశ్వరుడు కనిపించాడు వారికి. అయన కనులు తెరిచే వరకు మౌనంగా అక్కడే నిల్చున్నారు. జరిగిన విషయం ఆయనకు చెప్పుకున్నారు. 

ఆ ముని వారితో యిలా అన్నాడు. "నాయనలారా! ఇక్కడికి రెండు క్రోసుల దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టుంది. దాన్ని భూతాల మర్రి అంటారు. దాని తొర్రలో ఏకదంతుడనే రాక్షసుడున్నాడు. అతను స్త్రీలందరినీ చెరబట్టి తెచ్చి, వివాహమాడమని వేధిస్తుంటాడు. పగలు వారిని రాతి విగ్రహాలుగా మర్చి వేస్తుంటాడు. రాత్రులందు మాత్రమే నిజస్వరూపాలు పొందుతారు. ఒకవేళ అతను వీణావతిని చెరబట్టి వుండవచ్చును. ఇంతవరకు ఆ మర్రిలో ప్రవేశించినవారు ప్రాణాలతో బయటపడడం నే చూళ్ళేదు. మీరిద్దరూ అతి మెలకువగా మెలగాలి! వెళ్ళండి. శుభం కలుగుతుంది" ప్రతాపసేన, జయంతులు ఆయనకు కృతఙ్ఞతలు చెప్పుకుని, మునీశ్వరుడు చెప్పిన గుర్తులు గల భూతాల మర్రిని వెతుక్కుంటూ పోయారు. త్వరలో ఆ మర్రి కనిపించింది. ధైర్యంగా మర్రి తొర్రలోనికి దిగారు. క్రిందికి మెట్లు కనిపించాయి. మార్గమంతా గాఢాంధకారంగా వుంది. భరించలేని దుర్వాసన. దానికి తోడు ఎక్కడ నుంచో భయంకర ధ్వనులు వినిపిస్తున్నాయి. మృగాల గర్జనలు, గాండ్రింపులు ఎంత ధైర్యశాలికైనా గుండె పగిలేలా వినవస్తున్నాయి. వారిద్దరూ ధైర్యం కోల్పోకుండా మెట్లు ఒకటొకటే దిగి, ఓ సమతల ప్రదేశం చేరుకున్నారు. అక్కడ "దేవలోకమా!" అనే విభ్రాంతి కలిగించే ఓ దివ్య భవనం వారి కళ్ళబడింది. వారిద్దరూ ఆ భవనం సమీపించేసరికి పెద్ద ఉరుము వురిమిన శబ్దమై, ఓ కొండ చిలువ నోరు తెరుస్తూ వారిపైకురికింది. వారిద్దరూ ఒడుపుగా దాన్ని పట్టి హతమార్చేసరికి వారి కళ్ళెదురుగా ఓ బ్రహ్మాండమైన ఆకారం గల రాక్షసుడు నిలబడివున్నాడు. అతని శరీరం రెండు తాటి చెట్ల నిలువున ఉంది. చేతులు మోకాళ్ళు దాటి వున్నాయి. రొమ్ము బాగా పెద్ద కవాటంలా వుంది. కనుగుడ్లు అగ్ని గోళాల్లా మెరుస్తున్నాయి. అతని శరీరచ్ఛాయ అమావాస్య నాటి అర్థరాత్రిని జ్ఞప్తికి తెస్తోంది. అతను వికటాట్టహాసం చేసి, కర్కశంగా యిలా అన్నాడు.

"ఓరీ నరులారా! ఈ ఏకదంతుడి పరాక్రమం గురించి మీరు వినలేదా? వినివుంటే ప్రాణాలకు తెగించి యిలా వచ్చేవారా? నా వనంలోకి ప్రవేశించటానికి ఎంత ధైర్యం మీకు? నా పరాక్రమం కొద్దిగా చవి చూడండి ప్రస్తుతానికి!" అని భవనం దద్దరిల్లేలా నవ్వుతూ, వారిరువురినీ తన చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. వాళ్ళు కత్తులు దూసేలోపల నేలమీద ఎత్తి పడేశాడు. వెంటనే యిద్దరికీ స్పృహ తప్పిపోయింది. వారిద్దరూ తెలివి తెచ్చుకుని చూసేసరికి ఓ విశాలమైన గదిలో బంధింపబడి వున్నారు. కటిక చీకటి. అది రాత్రిలో ఏ భాగమో తెలియలేకుండా వుంది. భయంకరమైన నిశబ్దం. కీచురాళ్ళ శబ్దాలు భీకరంగా వినిపిస్తున్నాయి నిశ్శబ్దాన్ని చీల్చుకుని. ఇద్దరూ లేచి కూచోవాలని ప్రయత్నించారు. కానీ, కాళ్ళు చేతులు బంధింపబడి వున్నాయి. దిక్కు తోచని స్థితిలో వుండగా, ఎక్కడినుంచో మాటల సవ్వడి వినిపించింది వాళ్ళకి. చెవులు రిక్కించారు. ఆ శబ్దం ఎక్కడనుంచి వస్తున్నదీ చాలా సేపటివరకు అర్థం కాలేదు. అది తామున్న గది క్రిందినుంచి వస్తూన్నట్టు గ్రహించాడు ప్రతాపసేనుడు. నేలమీద పడుకుని భూమికి చెవియొగ్గి వినసాగాడు. అవి స్త్రీ కంఠాలు. "ఎవరమ్మా నీవు? నిన్నీ దుర్మార్గుడు కొత్తగా చెరబట్టి తెచ్చినట్టున్నాడు. వీడి సంగతి నీకు తెలీదు. పరమ దుర్మార్గుడు. వీడి బారి నుండి మనల్ని కాపాడే దిక్కులేదు" అంటోంది ఓ స్త్రీ కంఠం నిరాశగా. ప్రతాపసేనుడి పద్ధతి ననుసరించి వింటున్న జయంతుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ కొత్తగా చెరబట్టిన యువతి వీణావతే అయ్యుంటుందనే నిర్ణయానికొచ్చారిద్దరు. తిరిగి మరో కంఠం వినిపించింది. "ఎవరైనా సాహసవంతులు యీ ఏకదంతుణ్ణి చంపి, వాడి మంత్రదండాన్ని మన మీద తాకిస్తే మనకీ చెరనుండి, శిలా రూపాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని ఆ రాక్షసుడే ఓసారి గొప్పకి చెప్పుకున్నాడు. అయితే, వీణ్ణి చంపగల సాహసి ఎవరొస్తారు?" నిరాశగా అందా కంఠం. 

"ఇన్ని మంత్ర తంత్రాలు గల దుర్మార్గుడు అంత సులభంగా చస్తాడా? మన పిచ్చిగాని!" అంది మరో కంఠం. "ఆ సంగతీ సేకరించాను. వీడికి ఒకే ఒక దంతముంది. దాన్ని కాస్తా పెకిలించి పారేస్తే చచ్చి ఊరుకుంటాడు" అంది, యిందాకటి కంఠం. "అసలు వాణ్ణి సమీపించగల వారెవరు? వాడసలే మాయలమారి. మనది అడియాసే! మన బతుకులింతే!" "భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు మంచే జరుగుతుంది. ఈ సమయంలో ఆ భగవధ్యానం తప్ప మనకి మరో దారి లేదు!" అంది వీణావతి గొంతు. ఆ తర్వాత మాటలు నిలిచిపోయాయి. వీణావతి అక్కడున్న సంగతి నిశ్చయమైపోయింది. ఆ ఏకదంతుణ్ణి మట్టు పెట్టి, వారందరికీ విముక్తి కలిగించటమే తక్షణ కర్తవ్యమని నిర్ణయించుకున్నారు. మెల్లిగా ఒకరి బంధనాలు మరొకరు నోటితో విప్పుకుని, కాళ్ళ బంధనాలు ఛురికతో తెంచుకుని బంధవిముక్తులయ్యారు. ఇంతలో వెలుగు రేఖలు మెల్లి మెల్లిగా ఆ చీకటి గదిని కాంతివంతం చేశాయి. తెల్లవారింది. ప్రభాతాన ఏకదంతుడు దేవీ పూజ చేస్తున్న సమయంలో, అతనికి అపజయ సూచనాలు కనిపించాయి. వెలుగుతున్న దివ్వెలు ఆరిపోయాయి. రాక్షసుడు కోపోద్రేకుడై మంత్రదండాన్ని ధరించి, ప్రతాపసేన, జయంతుల్ని బంధించిన గదికి బయల్దేరాడు. కవాట రంధ్రాల ద్వారా అతని రాకను గమనించిన వాళ్ళిరువురు తలుపు చెరియొక ప్రక్కకు తప్పుకున్నారు. రాక్షసుడు తటాలున తలుపు తెరిచి లోనికి ప్రవేశించాడు హుంకరిస్తూ. తక్షణమే యిద్దరు యిరువైపులనుండి రాక్షసుడి చెరో చేతి మీదకి దూకి గట్టిగా పట్టుకున్నారు. రాక్షసుడు వారిని విదిలించుకోవాలని ప్రయత్నించాడు. కాని వాళ్ళు తమ పట్టు విడిచిపెట్టలేదు. క్రమంగా జయంతుడు రాక్షసుడి తల వైపుగా పాకసాగాడు. ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజిక్కించుకో ప్రయత్నిస్తున్నాడు. 

రాక్షసుడేం చేయాలో తోచక తన క్షుద్ర శక్తుల్ని పేరు పేరునా పిలవటం సాగించాడు. ఇంతలో జయంతుడు రాక్షసుడి మెడ వరకు ఎగ బ్రాకాడు. రాక్షసుడు తన చేత్తో జయంతుణ్ణి అందుకోజూశాడు. సమయం కోసం నిరీక్షిస్తున్న ప్రతాపసేనుడు తన కత్తితో వాడి చేతిని నరికేశాడు. అదొక పెద్ద బండరాయిలా నేలబడింది. రాక్షసుడి అఘాతం నుండి తేరుకునే లోపల జయంతుడి ఏకదంతుడి ఒక దంతాన్ని పెరికేశాడు. అదే సమయంలో ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజిక్కించుకున్నాడు. రాక్షసుడు గిలగిల్లాడుతూ నేలకూలాడు. వాడితో పాటూ ప్రతాపసేన జయంతులు కూడా నేలపై పడిపోయారు. ప్రతాపసేనుడు ఎగిరి దూరంగా పడ్డ మంత్రదండాన్ని తీసుకుని, జయంతుడితో కలిసి, తాము క్రితం రాత్రి మాటలు విన్న గదిలోకి ప్రవేశించాడు. శిలారూపంలో వున్న రాకుమార్తె లందరినీ మంత్రదండంతో తాకి, నిజ రూపాల్ని తెప్పించాడు. జయంతుణ్ణి చూడగానే వీణావతి పరుగున వచ్చి నిలిచింది. జయంతుడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తక్కిన రాకుమార్తెలందరూ వారిద్దరికీ కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. ప్రతాపసేనుడు మంత్రదండాన్ని గాలిలో వూపి, వారందరూ తమ రాజ్యాలకి తిరిగి వెళ్ళగలిగేలా చేశాడు. ప్రతాపసేన జయంతులు వీణావతిని తీసుకుని ఆ భవనం నుండి బయటపడ్డారు. అయితే వాళ్ళకి తాము మొదట ప్రవేశించిన బిల మార్గం ఎక్కడుందో కనిపించలేదు. తిరిగి తిరిగి బయల్దేరిన చోటికే వచ్చారు. వారికెదురుగా కాళీ మాట విగ్రహం కనిపించింది. నాల్కలు చాచి, భయంకరంగా వుంది. ప్రక్కన ఎదో చక్రం వంటి సాధనం కనిపించింది. దాన్ని తిప్పగానే పూజామందిరం చివర బిల ద్వారం ఏర్పడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే క్రిందికి మెట్లు కనిపించాయి. ముగ్గురూ బిలంలో ప్రవేశించారు. గాఢాంధకారం. కొంత దూరం పోయేసరికి ఎక్కడినుండో సన్నటి వెలుగు కిరణాలు ప్రసరించాయి. ముగ్గురూ ఆ వెలుగు నాధారం చేసుకుని నడిచారు. 

అక్కడ చిన్న చిన్న గుహల్లాంటివి నాలుగైదు గదులు కన్పించాయి. అందులో చివరి గదిలో ఓ వృద్ధుడు కనిపించాడు వారికి. అతడి ముఖం ఏదో తెలీని కాంతితో వెలిగిపోతోంది. ముగ్గురూ అతణ్ణి సమీపించారు. ఆ వృద్ధుడు సవ్వడి విని, వెనక్కి తిరక్కుండానే యిలా అన్నాడు. "ఏకదంతా! నీకేన్నో విద్యలు, మంత్ర తంత్రాలు నేర్పాను కదా! గురువునని కూడా చూడకుండా నన్ను బంధించావు కదూ? మీకు మృత్యువు కాచుకుని వుంది, మర్చిపోకు. నా మాట విని బంధించిన యువతుల్ని విడిచిపెట్టు. నీ అహంకారం విడిచిపెట్టు. నాది నా కప్పగించు. నీకు శుభమవుతుంది. లేదా నికృష్టమైన చావు చస్తావు" అంటూ వెను తిరిగిన వృద్ధుడు, వారి ముగ్గుర్నీ చూసి ఆశ్చర్యపోయాడు. "మీరెవరు? ఇక్కడికెలా రాగలిగారు? రాక్షసుడు మిమ్మల్ని చూస్తే విడిచిపెట్టడు. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి!" అన్నాడు వృద్ధుడు హెచ్చరికగా. జయంతుడు పెద్దగా నవ్వి, "రాక్షసుడు అందలమెక్కి చాలాసేపయింది" అన్నాడు. వృద్ధుడు నమ్మలేదు. ప్రతాపసేనుడు మంత్రదండాన్ని చూపాడు. ఏకదంతుణ్ణి ఎలా హతమార్చిందీ చెప్పాడు. వృద్ధుడు మంత్రదండాన్ని తాకి, ఓ బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు. నిశ్చేష్టులై చూస్తున్న వారి వంక చిరునవ్వుతో చూసి, "బిడ్డలారా! భయపడకండి. ఇదే నా నిజ రూపం. నేనెవరికీ అపకారం చేసేవాడిని కాదు. శాప ఫలితంగా నేనీ రూపం పొందాను. మీరు సంహరించిన ఏకదంతుడు నా శిష్యుడు" అన్నాడు బ్రహ్మరాక్షసుడిగా మారిన వృద్ధుడు. "మీకీ శాపమెలా వచ్చింది? వినాలని కుతూహలంగా వుంది" అన్నాడు ప్రతాపసేనుడు. బ్రహ్మరాక్షసుడి వదనం విచారమయమైంది. "నా చరిత్ర వింటారా? నాది ఆనంద విచార సమ్మిశ్రిత గాథ. ఆవేదనా స్రవంతి. మీరు నాకు ఆప్తులయ్యారు. మీకు తప్పక చెపుతాను" అని చెప్పసాగాడు. 

"నేను గంధర్వలోక వాసిని. నన్ను మణిభూషణు డంటారు. నేనొకనాడు విహారార్థమై విమానంలో వెళ్తుండగా, నా దృష్టి ఓ సుందరి నెత్తుకుపోతున్న రాక్షసుడిపై పడింది. ఆమె స్పృహ కోల్పోయి వుంది. వాడామె నపహరించుకుపోతున్నాడని గ్రహించాను. తక్షణం నేను వాణ్ణి ఎదుర్కొని సంహరించాను. ఆ మరుక్షణమే రాక్షసుడి స్థానంలో ఓ ముని బాలకుడు కనిపించాడు. అతని వదనం తేజస్సుతో వెలిగిపోతోంది. నేను ఆశ్చర్యపోయాను. అతను వినయంగా నమస్కరించి తన వృత్తాంతం చెప్పాడు. అతను మునికుమారుడు. విద్యాభ్యాసం చెయ్యటానికి ధూర్జటి మహాముని వద్ద శుశ్రూష చేస్తూ, మునిపత్నిని చెరపట్టబోయాడు. మునిపత్ని ఆగ్రహించి రాక్షసుడిగా వెయ్యేళ్ళు పడుండమని శపించింది. శాపవిమోచనం కోరిన మునికుమారుడితో, 'నాలాగే వంచించటానికి ఓ యక్షిణిని గొనిపోతుండగా, మణిభూషణుడనే గంధర్వుడు నిన్ను సంహరిస్తాడు. అప్పుడు నీకు విముక్తి' అని విమోచన మార్గం చెప్పింది గురుపత్ని. ఆమె చెప్పిన ప్రకారం నా వలన ముని బాలకుడు విముక్తుడయ్యాడు. నాకు కృతఙ్ఞతలు తెలిపి తన దారిన పోయాడు. "ఈ లోపల యక్షిణి మూర్ఛనుండి తేరుకుని, నన్ను చూసి కంగారు పడింది. నేను జరిగిన సంగతి చెప్పి ఆమెను నా విమానంలో స్వస్థలం చేర్చాను. అప్పుడే మా యిరువురి మనసుల్లోనూ అనురాగ బీజం మొగ్గ తొడిగింది. అది క్రమంగా, కొమ్మలు వేసి పుష్పించింది. మేమిద్దరం అనేకసార్లు ఏకాంతంగా కల్సుకుని ఒకరి మనసు మరొకరికి అర్పితం చేసుకున్నాం. ఇది ఆమె తండ్రి కంటబడింది. నన్ను ఆమె వంక చూడరాదని శాసించి, ఆమెను నిర్బంధించాడు. నేను ఆమెను కల్సుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిట్టచివరికోనాడు ఆమె తండ్రి లేని సమయం చూసి ఆమెను నిర్బంధించిన భవనం ప్రవేశించాను. ఆమె నా ఎడబాటుకి కుమిలిపోతోంది."

"నన్ను చూసి ఆనందంతో నోట మాట రాలేదు. అయితే మా ఆనందం క్షణికమే! ఆమె తండ్రి ఆమెను చూడ వస్తున్నాడని వార్త వచ్చింది. నేను తప్పించుకొనేంతలో ఆయన రానే వచ్చాడు. నన్ను చూసి కోపం పట్టలేక, 'రాక్షస మాయతో యిక్కడికి ప్రవేశించావు కాబట్టి, బ్రహ్మరాక్షసుడివై పడివుండు' అని ఘోరంగా శపించాడు.  నేను, ఆయన కుమార్తె కాళ్ళావేళ్ళా పడి ప్రార్థించగా మనసు కరిగి, 'అరచేత పుట్టు మచ్చ గల వీరుడి చేతిలో మరణిస్తే, శాపవిమోచనం కలుగుతుం' దని చెప్పాడు. ఇదే ఆ నాటి నా రూపం! నేను కొంతకాలం తపస్సు చేసి సిద్ధుణ్ణయ్యాను. ఎన్నో మాయలు, మంత్ర తంత్రాలు నా వశమయ్యాయి. ఈ మర్రిచెట్టు నా నివాసంగా చేసుకుని, దీని తొర్రలో సొరంగం సృష్టించి, యీ భవనాలు నేనే నిర్మించాను. ఇలా ఉండగా ఒకరోజు యీ ఏకదంతుడు యీ చెట్టు క్రింద విశ్రమించటం చూశాను. అతన్ని శిష్యుడిగా స్వీకరించాలని కోరిక కలిగింది. అతను కూడా గురువు కోసం వెతుకుతున్నాడని తెలిసింది. వెంటనే అతన్ని నా దగ్గరుంచుకుని అన్ని విద్యలూ నేర్పాను. మంత్ర తంత్రాల్లో నా అంతవాణ్ణి చేశాను. ఇద్దరం యిక్కడే కలిసిమెలిసి వుండేవాళ్ళం. కొంతకాలం గడిచింది. నా శిష్యుడు స్త్రీ వ్యామోహంతో పరస్త్రీలను, అందునా ముక్కుపచ్చలారని రాజకుమార్తెల నపహరించుకు వచ్చి నిర్బంధించడం నా కళ్ళబడింది. తప్పని వారించిన నన్ను వృద్ధుడిగా మార్చి, మంత్రదండంతో నిర్వీర్యుణ్ణి చేశాడు. తనకి అడ్డు తగలకుండా యీ గదిలో బంధించాడు. అదీ వాడు నాకిచ్చిన గురు దక్షిణ! మీరు సంహరించిన ఆ ఏకదంతుడే నా శిష్యుడు" అని ముగించాడు బ్రహ్మరాక్షసుడి రూపంలో వున్న మణిభూషణుడు. ప్రతాపసేనుడు శ్రద్ధగా ఆలకించి, "మీకు శాపవిమోచనం అరచేత పుట్టుమచ్చగల వీరుడివల్లకదూ అవుతుందన్నారు?" అన్నాడు సాలోచనగా. "అవును నాయనా! అలాంటి వీరుడికోసమే ఎదురుచూస్తున్నాను. ఏదో నాటికి ఆ వీరుడు రాక పోడు. యక్షిణి తండ్రి ఇచ్చిన గడువు పూర్తి కావస్తోంది కూడా" అన్నాడు మణిభూషణుడు.

ప్రతాపసేనుడు తన ఎడమ చేతి అరచేయి మణిభూషణుడికి చూపించాడు. కందిగింజంత పుట్టుమచ్చ కొట్టవచ్చినట్టు కనిపించింది. మణిభూషణుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. "వచ్చావా తండ్రీ! ఇంతకాలం ఎదురుచూస్తున్నది నీ గురించే! నీకు నా చరిత్ర చెప్పకుంటే, నువ్వే ఆ వీరుడివని నాకు తెలిసే అవకాశం లేకపోయేది. నీ కత్తితో నన్ను సంహరించి, నన్ను ఈ ఘోర శాపం నుండి విముక్తుణ్ని చెయ్యి, మహానుభావా!" అన్నాడు మణిభూషణుడు ఆనందంగా. జయంతుడు, వీణావతి సంభ్రమంగా చూస్తున్నారు. ప్రతాపసేనుడు కత్తినెత్తి ఒక్క వ్రేటుతో మణిభూషణుడి తల తెగ నరికాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుట్టి, బ్రహ్మరాక్షసుడి స్థానంలో ఓ దివ్యపురుషుడు నిలుచుని ఉన్నాడు. "నీ దయవలన నేటికి విముక్తి లభించింది నాయనా! నీకు నా కృతఙ్ఞతలు. నీకు ఎలాంటి సహాయం కావలసినా చేస్తాను. కోరుకో!" అన్నాడు మణిభూషణుడు. తన తండ్రి ఔషధం గురించి అడగాలని నోటి చివర వరకు వచ్చింది ప్రతాపసేనుడికి. కాని, తాను స్వశక్తితో సాధించాలి గాని యాచించి కాదు అని అనుకొని అతను మణిభూషణుడితో, "నాకే కోరికలు లేవు స్వామీ! మీరు మీ నిజరూపం పొందారు. అదే చాలు! నా వలన ఈ కార్యం జరగటం నాకు ఆనందదాయకంగా ఉంది" అన్నాడు. "ఈ మంత్రదండం చాలా మహిమ కలది. దీన్ని మీతో తీసుకు వెళ్ళండి. నా సహాయం కావలసినప్పుడు నన్ను స్మరించండి. వస్తాను" అన్నాడు మణిభూషణుడు. ఇంతలో ప్రతాపసేనుడికి జయంతుడి విషయం గుర్తొచ్చింది. అతనికో దారి చూపించాల్సిన బాధ్యత మరిచిపోయేడు. 

ప్రతాపసేనుడు మణిభూషణుణ్ణి చూసి, "మహాత్మా! నా స్నేహితుడు ప్రస్తుతం తన దేశం వదిలివచ్చాడు సహధర్మచారిణితో! ఇతనికి స్థిర నివాసం ఏర్పాటు చేయండి" అన్నాడు. జయంతుడు వారించి, "మిత్రమా! నీతోనే మేమూ వస్తాము. నిన్ను వదిలి మా స్వార్థం చూసుకోలేము. నువ్వెక్కడుంటే అక్కడే మా నివాసమూను" అన్నాడు. ప్రతాపసేనుడి ఔదార్యం జయంతుడ్ని కళ్ళు చెమర్చేలా చేసింది. ప్రతాపసేనుడు మిత్రుడి భుజం చరిచి, "నువ్వయితే అలాగే తీసుకు పోయేవాడిని. సుకుమారి మా చెల్లెలు కష్టపడుతుంటే నేచూడలేను" అన్నాడు ఆప్యాయంగా. మణిభూషణుడికి వారి అన్యోన్య స్నేహం చూసి ముచ్చట వేసింది. "ఈ మంత్రదండం మీకేది కావలిసినా ఇస్తుంది. ఇప్పుడే ఋజువు చేస్తాను, చూడండి!" అని మణిభూషణుడు మంత్రదండాన్ని ముమ్మారు గాలిలో ఊపాడు ఏదో స్మరించి. క్షణంలో ఆ కీకారణ్యం జనవాసంగల రాజ్యంగా మారిపోయింది. వారున్న ప్రదేశం ఆకాశ హర్మ్యాలతో అలరారింది. దాసదాసీ జనం బారులుతీరి నిలిచారు. వారున్న చోట రాజభవనం వెలిసింది. చెట్లు పుట్టలు అందమైన ఉద్యానవనాలుగా మారిపోయాయి. క్షణకాలంలో ఇదంతా జరిగిపోయింది. మణిభూషణుడు వారివంక చూసి, "చూశారా! ఈ మంత్రదండం ఇవ్వలేనిది లేదు. దీన్ని మీ దగ్గరుంచుకోండి! ఇంతటితో మన సంబంధం తెగిపోదు. ఎప్పుడు అవసరమైనా నన్ను స్మరిస్తే వచ్చి వాలతాను" అన్నాడు మణిభూషణుడు. జయంతుడు ప్రతాపసేనుడి వంక తిరిగి, "మిత్రమా! ఈ రాజ్యం సర్వస్వము నీ అధీనము. నీవు తిరిగొచ్చేవరకు నేను ఈ రాచకార్యాలు చక్కబెడతాను. రాగానే నీకు వప్పగిస్తాను" అన్నాడు. "పిచ్చివాడా! ఇదంతా నీకోసమే. మగధ సామ్రాజ్యానికి ఏకైక వారసుణ్ణి. నాకింకా రాజ్యాలు, భోగాలు వేరే ఎందుకు? దీని యథేచ్ఛగా ఏలుకుని సుఖంగా వుండు" అన్నాడు ప్రతాపసేనుడు. తర్వాత మణిభూషణుడి వంక తిరిగి, "మహానుభావా! ఈ మంత్రదండంతో మాకు పనిలేదు. మా కోరిక తీర్చారు. ఇక మా స్వశక్తితో కార్యాలన్నీ చక్కబెట్టుకుంటాము. ఎన్నడయినా తమ అవసరం వస్తే మిమ్ము స్మరిస్తాము" అన్నాడు.

మణిభూషణుడు అతని నిరాడంబరతకు సంతోషించి మంత్రదండంతో అదృశ్యుడయ్యాడు. ప్రతాపసేనుడు స్వయంగా జయంతుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ని చేశాడు. జయంతుడు ఎంతగా బ్రతిమలాడినా నవ్వుతూ తిరస్కరించి, తిరుగు ప్రయాణంలో తప్పకుండా వారిని కలుసుకుని ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చి, వారినుంచి సెలవు తీసుకున్నాడు. ఆ సరికే ప్రతాపసేనుడి పంచకల్యాణి గుర్రాన్ని తన గుర్రపుశాలలో కట్టించాడు జయంతుడు. ప్రతాపసేనుడు గుర్రాన్ని రప్పించి, స్నేహితుడి వద్ద వీడ్కోలు తీసుకు బయలుదేరాడు. పగలు అంతా ప్రయాణం చేసి, రాత్రి ఏదో గ్రామంలో బస చేస్తూ,తన ప్రయాణం అకుంఠిత కార్యదీక్షతో సాగిస్తున్నాడు ప్రతాపసేనుడు. తెలిసిన వారినుండి వింధ్యారణ్యానికి మార్గాన్ని, గుర్తులను అడిగి ఆ ప్రకారం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంతలో అతనికి దూరంగా కోట బురుజు, ప్రాకారాలు కనిపించాయి. తన గుర్రాన్ని అటు పరిగెత్తించాడు. అదొక స్వతంత్ర రాజ్యం. పేరు కాశీ రాజ్యం. ముందుగా ప్రతాపసేనుడు ఓ సత్రంలో బస చేశాడు. భోజనం చేసి కాసేపు విశ్రమించాలని మేను వాల్చాడు. ఇంతలో కొంతమంది వ్యక్తుల సంభాషణ అతని చెవిన పడింది. అందులో 'వింధ్యారణ్యం' అన్న మాట కూడా దొర్లటంతో ఆశక్తిగా వినసాగాడు. "మన రాజుగారి కెంత కష్టమొచ్చి పడిందిరా, పాపం! ఆయనకి నిద్రాహారాలు కూడా లేవట. దిక్కుమాలినవాడెవడో రాజుగారికి తీరని గర్భశోకం కలిగించాడు. రత్నంలాంటి పిల్ల! ఆమె నెత్తుకు పోవటానికి వాడికి చేతులెలావచ్చాయో?" "భలేవాడివిరా! మన రాకుమారి లావణ్య పేరుకు తగ్గ సౌందర్యరాశి. కుందనపు బొమ్మ. సుగుణాల ప్రోవు. అందులో ఆమెకి సాటిలేదు. అలాంటి పిల్లని చూస్తే ఎవడికి ఆశ పుట్టదూ?" 

"అంతేలే! అదృష్టవంతుడెవరా అని ఆలోచిస్తే ఆమెని పెళ్ళిచేసుకున్న వాడే! ఎన్ననుకుని ఏం లాభం చేజారిపోయాక? దుఃఖించి ప్రయోజనమేమిటి?" "రాజకుమారి నెత్తుకుపోయిన వాడెవడో రాక్షసుడనీ, వింధ్యారణ్యంలో వుంటాడని ఎవరో అనటం విన్నాను." "ఆఁ ఎవరికీ పూర్తిగా తెలీదు నిజానిజాలు ఔనంటే ఔననటం తప్ప!" "మొన్న రాజుగారు వేయించిన దండోరా విన్నావా? ఎంతగా విసిగి వేసారకపోతే ఆయనలా చాటిస్తారు?" "ఏమిటీ, దండోరా వేయించారా? నేను ఊళ్ళో లేను కాని, ఏమని వేయించారు?" "రాకుమార్తెను వెతికి తెచ్చిన వారికి అర్థరాజ్యంతో పాటు రాకుమార్తెనిచ్చి వివాహం చేయిస్తానని చాటించారు." "ఇప్పటికే ఎవరెవరో ప్రయతించారటగా?" "అయితే మాత్రం, ప్రయోజనం లేదే!" "అయినా, ఎత్తుకుపోయినవాడు అంత తేలికగా వదులుతాడా? వెళ్ళిన వాళ్ళు తిరిగిరావటమనేది నాకు ఇంతవరకూ తెలీదు." "మన శూరసేన మహారాజుకి పుత్రసంతానం లేకపోవటంవల్ల చూశావా, ఎంత క్లిష్టపరిస్థితి ఎదురైందో?" "అవునవును. మహారాజుగారి తదుపరి గద్దె నెక్కే వాళ్ళేరి? రాజ్యం అరాచకమే!" ఆ తర్వాత మరి మాటలు వినిపించలేదు. ప్రతాపసేనుడు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి క్కావలసిన మంత్ర పుష్పం వింధ్యారణ్యంలోనే దొరుకుతుంది. ఈ రాకుమారి కూడా వింధ్యారణ్యంలోనే బంధింపబడిందంటున్నారు. ఒకేసారి రెండు పనులు పూర్తవుతాయి. తనెలాగయినా ప్రయత్నించి రాకుమారిని విడిపించి తీసుకురావాలి. 

ఈ ఆలోచన రాగానే, ఇక అతనక్కడ ఒక్క క్షణం కూడా నిలిచి ఉండలేకపోయాడు. వెంటనే రాజభవనానికి బయలుదేరాడు. ద్వారపాలకుడితో తాను వచ్చిన విషయం కబురుపెట్టాడు. ఆ భటుడు వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత తిరిగొచ్చి ప్రతాపసేనుణ్ణి వెంట బెట్టుకుని లోనికి వెళ్ళాడు. సరాసరి శూరసింహ మహారాజు సమాలోచనా మందిరానికి తీసుకుపోయాడు. మహారాజు ప్రతాపసేనుణ్ణి నఖశిఖ పర్యంతం చూసి, తనకెంతో పరిచయమున్న ముఖకవళికలు, పోలికలు అతనిలో గమనించాడు. సాదరంగా కూర్చుండచేసి, "ఎవరు నాయనా నీవు?" అనడిగాడు సౌమ్యంగా. "మహారాజా! నేను మగధ రాజ్యాధీశుడైన చంద్రసేన మహారాజు కుమారుణ్ణి. నన్ను ప్రతాపసేనుడంటారు" అని ప్రతాపసేనుడు చెపుతూండగానే, శూరసింహ మహారాజు లేచి ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. "నాయనా! చంద్రసేనుడు, నేను బాల్యస్నేహితులం. ఒకే గురువు వద్ద విద్య నభ్యసించాము. మా ఇరువురి మధ్య అరమరికలు లేవు. ఆయన నాకెంతో కావలసినవాడు. ఎప్పుడో నీ బాల్యంలో ఒకసారి కల్సుకున్నాము. తర్వాత రాచకార్యాల మధ్య నలిగిపోయి ఒకరినొకరు చూసుకోవటమే పడలేదు. ఈ మధ్య మగధ విషయాలు కూడా నాకు తెలియవు. తండ్రిగారు కుశలమే కదా?" అనడిగాడు శూరసింహుడు. ప్రతాపసేనుడి వదనంలో విచారమేఘాలు కమ్ముకున్నాయి. తండ్రి విషయము చెప్పి, తను బయల్దేరిన కార్య కారణము వివరించాడు. తను లావణ్యని వెదికి తీసుకురావాలనుకుంటున్న సంగతి కూడా చెప్పాడు. శూరసింహుడు తొట్రుపడి, "వద్దు నాయనా! అంత సాహసం వద్దు. అందునా నా బాల్య స్నేహితుడి కొడుకును ఓ రాక్షసుడి పాల పడనివ్వను. నా కూతురెలాగూ దక్కలేదు. నా స్వార్థానికి నిన్ను బలి చెయ్యలేను. నా అదృష్టం, లావణ్య అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నాడు. 

"క్షమించండి మహారాజా! నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఔషధం గురించి ఎటూ నేను వింధ్యారణ్యం వెళ్ళక తప్పదు. మీ అమ్మాయి గురించి ప్రత్యేకం వెళ్ళటం లేదు కదా! కష్టాలు చెప్పి రావు. వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నిలవాలి. దయచేసి, రాకుమార్తె చిత్రపటాన్ని ఇప్పించండి. నా శాయశక్తుల ప్రయత్నిస్తాను" అన్నాడు ప్రతాపసేనుడు స్థిర కంఠంతో. ఇక ఎంత చెప్పినా, అతను వినిపించుకోడని మహారాజు గ్రహించాడు. లావణ్య చిత్రపటాన్ని తెప్పించి అతనికిచ్చాడు. ఆ జగన్మోహినీ రూపం చూడగానే ప్రతాపసేనుడు కొంతసేపు ఆశ్చర్యపోయాడు. ఆమె అసమాన సౌందర్యరాశి! ప్రయత్న పూర్వకంగా దృష్టి మరల్చుకొని, మహారాజు వద్ద సెలవు తీసుకుని బయటకి నడిచాడు. శూరసింహుడు అతన్ని వదలలేక వదిలాడు. ప్రతాపసేనుడు సరాసరి తను బసచేసిన సత్రం చేరి, తన పంచకల్యాణి నెక్కి ఒక్కసారిగా ముందుకు పరుగెత్తించాడు. అది ఘోరారణ్యం. వాతావరణం భీకరంగా వుంది. దట్టంగా వున్న చెట్లు విరబోసుకున్న దయ్యాల్లా, అటు ఇటు వూగుతున్నాయి. అది వింధ్యారణ్యం. అక్కడి ఓ గుహనుండి వికటాట్టహాసం విన్పిస్తోంది. ఆ గుహ భూతపతి అనే రాక్షసుడి నివాసం. వివిధ దేశాల నుండి రాజకుమార్తెలను, సౌందర్య రాశుల్ని తీసుకువచ్చి, తన్ను వివాహమాడవలసిందిగా నిర్బంధిస్తుంటాడు. కాదన్న వాళ్ళని కఠిన పాషాణాలుగా మార్చివేస్తాడు. భూతపతి చూపు కాశీ రాజ్యం మీద పడింది. కాశీ రాజైన శూరసింహ మహారాజు కుమార్తె అందగత్తె అనీ, సౌందర్య ఖనీ అని చూచాయగా విన్నాడు. వెంటనే బయల్దేరి కాశీ రాజ్యం చేరాడు. ఆనాడు లావణ్య తన ఉద్యానవనంలో చెలులతో విహరిస్తుండగా, ఎక్కడినుంచో ఓ పంచవన్నెల రామచిలుక అక్కడికెగిరి వచ్చింది. లావణ్య అపురూపమైన ఆ  చిలుక లావణ్యానికి మురిసి, మక్కువపడి దాన్నందుకోబోయింది. అది ఆమె చేతికందకుండా తప్పించుకుని నెమ్మదిగా ఎగరసాగింది. లావణ్య పట్టుదలతో దాన్ని వెంబడించింది. ఆ చిలక చేతికందినట్టే అంది, నెమ్మదిగా చాలా దూరం తీసుకుపోయింది. చిలుకని వెంబడిస్తూ లావణ్య పరిసరాలనే మరిచిపోయింది. ఆమెని నిర్జన ప్రదేశానికి తీసుకుపోయిన చిలుక, అకస్మాత్తుగా భయంకరాకారుడైన రాక్షసుడిగా మారిపోయింది. లావణ్య కెవ్వున కేక పెట్టి మూర్ఛిల్లింది. ఆ రాక్షసుడు భూతపతి. ఆమెను గగన మార్గాన తన గుహకు తీసుకుపోయాడు. అప్పుడు రాజభవనంలో అలజడి చెలరేగింది. చెలికత్తెలు రాకుమారి కోసం ఉద్యానవనమంతా వెతికి, ఆమె లేకపోయేసరికి బెంబేలెత్తిపోయారు. మహారాజు కఠినంగా శిక్షిస్తారని భయపడిపోయారు. గత్యంతరం లేక యీ వార్త మహారాజుకి చెప్పేశారు. తన ఆరోప్రాణమైన కుమార్తె కనిపించలేదని వినగానే ఆయన గుండె గుభేలుమంది.  

విచార సముద్రంలో మునిగిపోయాడు. భటులు రాజ్యమంతా వెతికారు. శత్రు రాజులెవరైనా అపహరించుకుపోయారేమో తెల్సుకోవటానికి వేగులవాళ్ళు వెళ్ళారు. కాని, ఫలితం శూన్యం! మహారాజు విసిగిపోయి, తన కుమార్తెని అప్పగించిన వాళ్ళకి అర్థరాజ్యం యిస్తానని ప్రకటించాడు. అనేకమంది సాహసవంతులు ప్రయత్నించారు. కాని ప్రయోజనం లేకపోయింది. అర్థరాజ్యంతో పాటు తన కుమార్తెను కూడా యిచ్చి కళ్యాణం జరిపిస్తానని ప్రకటించాడు. రాజ్యంకన్న రాకుమారిమీది ప్రేమతో చాలమంది యువకులు పూనుకున్నారు. కాని వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. భూతపతి కాశీ యువరాణి లావణ్యని తన గుహకు తీసుకుపోయి నిర్బంధించసాగాడు. తన్ను వరించవలసినదిగా వేధించసాగాడు. రాకుమారి కోడె త్రాచులా బుస కొట్టింది. "ఛీ, దుర్మార్గుడా! నన్ను నా వారి నుండి దూరం చేసినది కాక వివాహమాడ మంటావా? ద్రోహీ, పాపీ, ఛండాలుడా!" అని దుర్భాషలాడింది. "ఎందుకే నా మీద అంత కోపం?" అనునయించబోయాడు భూతపతి. "ఛీ! పాపాత్ముడా! నా తల్లిదండ్రులు నా వియోగంతో ఎంత కుమిలిపోతున్నారో! నన్ను ఒక్క క్షణం కూడా వదిలి వుండలేని నా తండ్రి హృదయం ఎంత దెబ్బ తిన్నదో? నీ వంటి కర్కశ పాషాణ హృదయుడికి యీ విషయాలేం తెలుస్తాయి, అమాయక కన్యల నపహరించటం తప్ప?" "బాలా! ఎందుకే అలా బేలలా మాట్లాడుతావు? నాకన్నా పౌరుషవంతుడు, అందగాడు, వీరుడు ఈ భూమండలంలోనే కాదు త్రిభువనాల్లోను ఎక్కడా నీకు లభించడే! ఈ సదవకాశాన్ని విడుచుకోకు. నేను.." "చాలు, నీ అధిక ప్రసంగం!" అరిచింది లావణ్య. "బాలామణీ! నేనెవరినని భావిస్తున్నావే? నీకు కాబోయే వరుణ్ణే! రా! నా హృదయ పీఠా న్నలంకరించు. స్వర్గ సౌఖ్యాలు చవిచూద్దాం. ఆలస్యం చేయక రావే!" అంటూ భూతపతి వికృతంగా నవ్వుతూ, మీది మీదికి రాసాగాడు. 

"ఆగు, దుర్మార్గుడా! రోజూ నా వంటి నిస్సహాయ అబలలు ఎంతమంది నీ పశు ప్రవృత్తికి బలౌతున్నారో? నేనందరిలాంటి దాన్నని భావిస్తున్నావేమో! అడుగు ముందుకు వేశావంటే, నా ప్రాణమైనా తీసుకుంటాను గాని, నీకు దక్కను." భూతపతి ఒక్క అడుగు వెనక్కువేశాడు. "నీకు రెండు రోజులు గడువిస్తున్నాను. ఆలోచించుకో! ఈ లోగా హృదయరాణిగా అంగీకరిస్తే సరి! లేకుంటే నీకు పట్టబోయే గతి కన్నులారా నువ్వే చూస్తావు. జాగ్రత్త!" అని హుంకరించి విసురుగా వెళ్ళిపోయాడు. లావణ్య విచార వదనంతో దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ నిర్జనమైన మైదానం గుండా దూసుకుపోతోంది ప్రతాపసేనుడి పంచకల్యాణి. ఎన్నో గుట్టలు, మెట్టలు దాటి సమతలమైన మైదానం మీదికి వచ్చాడు. ఎక్కడా నర సంచారమే కన్పించడం లేదు. అయినా విసుగు చెందక ముందుకే వుత్సాహంగా ప్రయాణం సాగిస్తున్నాడు. అతడా విధంగా చాలా దూరం ప్రయాణించాక, కొంత దూరంలో ఒక ఆశ్రమం కనిపించిందతనికి. ప్రతాపసేనుడు ఆశ్రమం సమీపించి, గుర్రం దిగాడు. లోపల శాంత వదనంతో చక్కటి వర్చస్సు తేజరిల్లుతుండగా, తపస్సమాధిలో వున్న ముని కనిపించాడు. ఆయన తపస్సుకి భంగం రాకుండా ఓ ప్రక్కన నిలుచున్నాడు. కొంతసేపటికి ముని తపస్సు చాలించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ప్రతాపసేనుడు కనిపించాడు. ఆయన శాంత గంభీర స్వరాన, "ఎవరు నాయనా నీవు? ఇక్కడ ఏం పని?" అనడిగాడు. "మహాత్మా! నేను కార్యార్థినై బయలుదేరి వెళ్ళుతున్నాను. దారిలో తమ ఆశ్రమం చూసి, వింధ్యారణ్యానికి మార్గం చెపుతారేమోనని ఆగాను. దయచేసి మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి! మీకు జన్మాంతం ఋణపడి వుంటాను" అన్నాడు ప్రతాపసేనుడు చేతులు జోడించి. 

మునీశ్వరుడి పెదవుల మీద దరహాస చంద్రిక మెరిసింది. "నాయనా! నువ్వు కార్యదీక్షాపరుడవని నాకు తెలుసు. నీవే కార్యార్థివై పోతున్నదీ కూడా తెలుసు. భూతపతి నివాసం నాకు తెలుసు. వింధ్యారణ్యానికి మార్గం చెబుతాను. అయితే వాడు కడు దుర్మార్గుడు. వాడి గర్భాన నా వేదశాస్త్రాలు, ఎన్నో గ్రంథాలు వున్నాయి. నీవు వింధ్యారణ్యంలో నీ తండ్రికి కావలసిన ఔషధాలు తెచుకోవచ్చును. కాని, నీవు నాకొక సహాయం చేసిపెట్టాలి" అన్నాడు ముని. "సెలవివ్వండి స్వామీ!" ఆత్రంగా అడిగాడు ప్రతాపసేనుడు. ఇన్నాళ్ళకి తనకి వింధ్యారణ్యం గురించి సరిగా చెప్పగల వ్యక్తి  దొరికాడని అతనికి చాలా ఆనందంగా  వుంది. "వాగ్దానం చేస్తావా?" అడిగాడు ముని. "సందేహించకండి స్వామీ! అదెంతటి కష్టమైనా నెరవేరుస్తాను" నిశ్చల స్వరాన అన్నాడు ప్రతాపసేనుడు. "భూతపతి గర్భాన నా వేదశాస్త్రాలున్నాయని చెప్పాను కదా! నీవు వాణ్ణి మట్టు పెట్టి, వాటిని నాకు అప్ప చెప్పాలి. అయితే భూతపతి ప్రాణం వదిలే లోపల వాటిని స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే వాడితోపాటే అవీ నశిస్తాయి. ఇది మాత్రం మర్చిపోకు!" అన్నాడు ముని. "అలాగే స్వామీ! మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మీ గ్రంథాలు ఆ దుర్మార్గుడికెలా దొరికాయి?" అడిగాడు ప్రతాపసేనుడు. ముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. "ఇది జరిగి యిప్పటికి రమారమి వంద సంవత్సరాలయి వుంటుంది. నేనొకనాడు దీర్ఘతపస్సులో ఉండగా ఈ భూతపతి వచ్చాడు. నన్ను పిలిచాడు గాని, తపస్సమాధిలో వున్న నేను బదులివ్వలేదు. భూతపతి ఆగ్రహంతో, నన్ను భంగపరచటానికి జంతు నెత్తురు నా పై చిందించాడు. కనులు తెరిచి జరిగింది తెలుసుకున్నాను.  నాకు వళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. కాని ఆగ్రహంతో శపించటం నా మతం కాదు. కోపాన్ని నిగ్రహించుకుని అతని దెస చూశాను. 

'ఈ మార్గాన ఓ యువతి వచ్చింది. కనిపించిందా?' అనడిగాడు దర్పంగా. 'నాకు తెలీదు. అయినా మానవకాంతతో ఏం పని నీకు?' అనడిగాను శాంతంగానే. అతను వెకిలిగా నవ్వాడు. 'పెళ్ళాడటానికి ఏ స్త్రీ అయితేనేం?' అన్నాడు నిర్లక్ష్యంగా, వికృతంగా మూతి పెట్టి. అతని ఉద్దేశ్యం నాకర్థమైంది. ఎవరో స్త్రీని చెరబట్టకపోతే తప్పించుకుని పోయుంటుంది. ఆమెని తరుముకుంటూ యిటు వచ్చి వుంటాడు అని వూహించాను. నేను సమాధానం చెప్పకపోవటంతో ఆశ్రమమంతా తనే వెతుక్కుని, ఎవరూ కనిపించక వెళ్ళిపోయాడు. భూతపతి వెళ్లిపోయిన కొన్ని క్షణాలకి ఎక్కడో దాక్కుని వున్న ఓ నిండు జవ్వని నా దగ్గరికొచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. 'స్వామీ! నా ఉనికి గమనిస్తే ఆ రాక్షసుడు బ్రతకనీయడు. దయచేసి నన్ను మీ ఆశ్రమంలో ఉండనివ్వండి. నేను మీకు సేవలు చేస్తాను. ఆశ్రమాన్ని శుభ్రం చేస్తుంటాను. మీ సేవలో నా జీవితం గడిపేస్తాను. కాదనకండి!' అని ప్రాధేయపడింది. నేను బ్రహ్మచారిని. నా బ్రహ్మచర్యానికి ఆమె ఉనికి అడ్డు రాకూడదు. అందుకని నేనంగీకరించలేదు. ఆమె నేను కాదంటే ఆత్మత్యాగం చేస్తానంది. ఆమెను తన దేశం పంపే ఏర్పాట్లు చేస్తానన్నాను గాని అంగీకరించలేదు. అది కూడా నా వ్రతానికి, నియమానికి భంగం కలగని షరతు మీద అంగీకరించాను. ఆమె అంగీకరించింది. ఏ నాడూ తన పరిధి దాటి రాలేదు. నాకు శుశ్రూషలు చేస్తూ కాలం గడిపేది. ఒకనాటి తెల్లవారు ఝామున నేను నదీ తీరానికి స్నానానికి పోయాను. ఆ సమయంలో భూతపతి ఆమెను నా ఆశ్రమంలో ప్రవేశించి బలాత్కరించబోయాడు. ఆత్మాభిమానం గల ఆమె వెంటనే ప్రాణత్యాగం చేసింది. భూతపతి ఆగ్రహంతో, ఉక్రోషంతో చిందులు తొక్కి, అక్కడున్న నా వేదవేదాంగశాస్త్ర పురాణాది గ్రంథాలన్నింటినీ గుటుక్కున మ్రింగి, అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన నేను అంతా గ్రహించాను. సర్వసంగ పరిత్యాగినైన నన్ను, ఆమె మరణం కలచివేసింది. నేను తలచుకుంటే, నా తపశ్శక్తి నంతా వినియోగించి అయినా ఆ దుర్మార్గుణ్ణి మట్టుపెట్టి, ఆ గ్రంథాల్ని నా కైవశం చేసుకోగలను. కాని, ఒక తుచ్చుణ్ణి నాశనం చెయ్యటం కోసం నా తపశ్శక్తిని వ్యర్థపరుచుకోవటానికి నా మనస్సు అంగీకరించలేదు. ఆ నాటినుండి నా గ్రంథాల్ని నాకు అప్పగించగల వీరుడు రాకపోతాడా అని నిరీక్షిస్తున్నాను. ఇంతకాలానికి నీవు కనిపించావు. నీకు వింధ్యారణ్యానికి మార్గం చెబుతా, విను. అదిగో ఆ కనబడే రెండు వట వృక్షాల మధ్యగా పోతున్న బాట చూడు! అదే తిన్నగా వింధ్యారణ్యానికి దారి తీస్తుంది. నీవా మార్గం పట్టి వెళ్ళు. ఆ రాక్షసుడు మరణించక మునుపే అతని పొట్ట చీల్చి గ్రంథాల్ని చేజిక్కించుకోవాలి. మరచిపోకు. ఇక వెళ్ళు. నీకు శుభమవుతుంది!' అంటూ ముగించాడు ముని. 

ప్రతాపసేను డాయన వద్ద సెలవు తీసుకుని వింధ్యారణ్య మార్గాన తన గుర్రం పరుగెత్తించాడు. ఆ మార్గం గాఢాంధకారమై, చెట్ల గుట్టలతో నిండిపోయి, నిర్జనమై ప్రయాణానికి అనుకూలంగా లేదు. క్రూరమృగాల గర్జింపులు, గాండ్రింపులు ఘోరంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్య ప్రతాపసేనుడు వాటితో గంటల తరబడి పోరాడవలసి వచ్చేది. అలా చీకటి పడేవరకు ప్రయాణించాడు. అతడి గుర్రం ముందుకు అడుగు వెయ్యలేకపోతోంది. అతను కూడా బాగా అలసిపోయాడు. ఆ రాత్రి ఎక్కడైనా విశ్రమించి, ఉదయం ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వట వృక్షం క్రింద మేను వాల్చాడు. పక్షుల కిలకిలారావాలతో మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. అతనికి తెలియని ఉత్సాహం, కార్య దీక్ష పెల్లుబుకుతున్నాయి. తూర్పున వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. అతని మనస్సులో ఆనంద రేఖలు పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతున్నాయి. ప్రక్కనే గల గల పారుతున్న సెలయేరులో మనసారా స్నానమాడి, పంచకల్యాణి నెక్కి అదిలించాడు. కొంతదూరం వెళ్ళేసరికి మార్గం మూడు భాగాలుగా చీలిపోయింది. మునీశ్వరుడు ఈ కూడలి గురించి చెప్పలేదు. ఏ మార్గం గుండా పోవాలి అనే సందేహం కలిగింది. చివరికి భగవంతుణ్ణి స్మరించుకొని, ఓ మార్గాన్ని తనే ఎన్నుకుని అటువైపు గుర్రాన్ని పరుగెత్తించాడు. కొండలవాగు గుండా నీరు గలగల ప్రవహిస్తూంది. ఆ నీటిని కాలువల ద్వారా పంట పొలాల మీదికి మళ్ళించి, సాగుచేసుకొని, కాయో పండో తిని జీవిస్తున్నారు అడవిజాతి కోయలు. తాము ముందుగా పండించే పంట ముందుగా శక్తి మాతకు అర్పించుకొని, ఆ మాత తృప్తికోసం నరబలులిచ్చి, ఆ తర్వాత వాటి నానుభవించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ శక్తి దయ వల్లనే తాము సుఖంగా వున్నామని వాళ్ళ ధృఢ నమ్మకం.

అది ఎన్నాళ్ళుగానో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆచారం. అయితే, ఆ సంవత్సరం నరబలి నిచ్చేందుకు కష్టపడాల్సివచ్చింది. ఇదివరలో మనుష్యుల్ని సమీప గ్రామాలనించి సమయం చూసి ఎత్తుకు వచ్చి బలిచ్చేవారు. అది గమనించి గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందుచేత కోయలు దారి పక్కన పొంచి, అటుగా పోయే మనుషుల్ని ఎత్తుకుపోయి బలిచ్చేవారు. ప్రజలు దరిదాపులకే రావటం మానేశారు. ఆ ఛాయలకు పోవటమే పూర్తిగా మానేశారు. అందుచేత ఆ సంవత్సరం వారికెవరూ లభించలేదు. ఎన్నో విధాల ప్రయత్నించారు. కాని ప్రయోజనం లేకపోయింది. నిలువచేసిన ఆహార పదార్థాలన్నీ ఖర్చయిపోయాయి. కొత్త పంట చేతికొచ్చి చాలా రోజులయింది. కాని నరబలి ఇవ్వనిదే అనుభవించటానికి వీల్లేదు. మాతకు ఆగ్రహమొస్తే తమ గూడేన్ని సర్వనాశనం చేస్తుంది. అందరూ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతాపసేనుడు వారి గూడెం మీదుగా ప్రయాణిస్తూ కనిపించాడు వారికి. ఎడారిలో ఉన్నవాడికి నీటిచుక్కలు లభించినట్టు, పేదవాడికి పెన్నిధి దొరికినట్టు, ఆకలితో ఉన్నవాడికి పంచభక్ష్య పరమాన్నాలు నోటి కందినట్లు కోయలంతా పరమానంద భరితులయ్యారు. వాళ్ళు చెట్ల చాటు నుండి ఒక్కుమ్మడిగా అతణ్ణి చుట్టుముట్టారు. హఠాత్సంఘటనకు ప్రతాపసేనుడు కొద్దిగా చలించాడు. వెంటనే కత్తి దూసి కిందికి ఉరికాడు. ప్రతాపసేనుడు ఒంటరివాడైనా, బలవంతుడు. అసంఖ్యాకులైన ఆ కోయలతో తలపడి, తన కరవాలాన్ని వేగంగా ఝుళిపిస్తూ, చక్రాకారంగా తిరుగుతూ వాళ్ళతో యుద్ధం చేయసాగాడు. అతని ధాటికాగలేక కోయలు ఒకరొకరు నేల కూలుతున్నారు. ప్రతాపసేనుడు కసుగందలేదు, విసుగొందలేదు. అతనితో పోరాటం అసంభవంగా తోచింది కోయలకి. వారిలో ఒకడు పరుగున పోయి తమ నాయకుడితో జరిగిన విషయం సవిస్తరంగా వివరించాడు. "దేవరా! ఆ కుర్రో డెవడో కొదమ సింహంలా పోరాడుతున్నాడు. వాడిని ఎదిరించి పోరాట్టం సాలా కట్టంగా ఉంది. ఆ సంగతి తమరు వచ్చి సూడాలి" అన్నాడు.

ఆ వార్త వింటూనే కోయరాజు తన అనుచరులతో ప్రతాపసేనుడు పోరాడుతున్న ప్రదేశానికి హుటాహుటి బయలుదేరి వెళ్ళాడు. ప్రతాపసేనుడి పరాక్రమం, రాచ ఠీవి చూసి, 'మంచి జాతిరత్నమే దొరికింది. ఎలాగయినా పట్టుకోండి, అవకాశం విడువద్దు' అని హెచ్చరించాడు. కోయలు తమ నాయకుణ్ని చూసి రెట్టించిన ఉత్సాహంతో ప్రతాపసేనుణ్ణి ఎదురించి పోరాడసాగారు. ఎంత వీరుడైనా ఒక్కసారిగా అనేక మందితో విరామం లేకుండా పోరాడటం ఎంత కష్టం? ఓ ప్రక్క ఒంటిమీద బట్టలు చీలిక పేలికలై, దేహం రక్తసిక్తమయినా, ప్రతాపసేనుడు లెక్కచేయకుండా కరవాలానికి ఎడతెరిపి లేకుండా పని కల్పిస్తున్నాడు. అకస్మాత్తుగా కరవాలం విరిగి ముక్కలయింది. నిరాయుధుడైన ప్రతాపసేనుణ్ణి బంధించి వేశారు కోయలు. జయ జయనాదాలు చేశారు. ఆ మర్నాడే అతడ్ని బలివ్వటానికి నిర్ణయమైపోయింది. ప్రతాపసేనుణ్ణి గాలి, వెలుతురు లేని ఓ గుహలాంటి గదిలో బంధించారు. అతని మోము పీక్కుపోయింది. అంత విచారంలోను ఉద్రేకం, ఆవేశం పెల్లుబుకుతున్నాయి. అనేక ఆలోచనలు మనసునిండా జోరీగల్లా ముసురుతున్నాయి. 'ఈ మూర్ఖులెవరో? తనని బంధించటంలో వీళ్ళ ఉద్దేశ్యమేమిటి? వీళ్ళ భూభాగంలో ప్రవేశించడమా? తాను వీళ్ళకేం అపకారం చేశాడు? తన మానాన పోతుంటే వాళ్ళే మీద పడి యుద్ధానికి తలపడ్డారు. తనూ కత్తి దూశాడు. అసలు అకారణంగా తననెందుకు ముట్టడించారు? చూడగా ఈ అనాగరికుల అజ్ఞానం, అహంకారం తప్ప మరో కారణం కనిపించదు. అకుంఠిత కార్యదీక్షతో కష్టనష్టాలకోర్చి మంత్రపుష్పం సాధించాలని బయలుదేరిన తనకు, ఇక కొద్ది రోజులలో విజయం సాధించబోతున్న తనకు అనుకోని విఘాతం, ఆటంకం కలిగాయి. అక్కడ తన తండ్రి పరిస్థితి ఎలాగుందో? ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో పాపం? ఓ ప్రక్క శారీరక బాధ, మరో ప్రక్క తనేమైపోయానోనన్న మనోక్షోభ ఆయనకు తీరని అశాంతి కలిగించి వుంటాయి.

తనిలా బయల్దేరినట్టు ఆయనకు తెలిసే అవకాశం లేదు. తను చూడబోతే ఈ అనాగరికుల మధ్య చిక్కుకు పోయాడు. వీళ్ళు చూడగా అసంఖ్యాకంగా వున్నారు. తప్పించుకుని బయటపడ్డ మెలా? కర్తవ్యం తోచకుండా వుంది' అని ఆలోచిస్తూనే అలసి సొలసిన ప్రతాపసేనుడు నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. తననెవరో తట్టి పిలుస్తున్నట్టనిపించి, చటుక్కున నిద్రనుండి మేల్కొన్నాడు ప్రతాపసేనుడు. కళ్ళు తెరిచిన అతనికి ఎదుట అద్భుత రూప లావణ్యాలతో, పరిపూర్ణ యవ్వనంలో విరబూసిన అడవి మల్లెలా వున్న కన్య కనిపించింది. ఆమె ధరించిన ఆచ్ఛాదనలు ఆమె యవ్వనాన్ని పూర్తిగా దాచిపెట్టలేకపోతున్నాయి. ప్రస్ఫుటమైన అవయవ సౌందర్యంతో దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించిందతనికి. కాసేపు సంభ్రమంతో మాట్లాడలేకపోయాడు ప్రతాపసేనుడు సృష్టిలో ఇంతటి సౌందర్యరాశి ఉంటుందా? అని. ఆమె వదనంలో కోయ నాయకుడి పోలికలు స్పష్టంగా కనిపించాయి. 'ఐతే ఈమె కోయరాజు కూతురా? ఇక్కడికి ఈ రాత్రి సమయాన ఈమె కేమి పని?' ఆమె మూసి మూసి నవ్వులు నవ్వుతూ, "ఓ కోడెకాడా! తొరగా రా! నువ్వీడనించి ఎంత వేగిరం బయటపడితే అంత బాగుంటది. తెల్లవారిందంటే ఆపద పొంచుకునుంది. నీ గుర్రం బయట సిద్ధం సేసినాను. రా, పోదాం!" అంది. కోయిల కంఠాన్ని ధిక్కరించే ఆమె కంఠ స్వరంలోని మాధుర్యానికి ఆచ్చెరువొందాడు ప్రతాపసేనుడు. కాని ఒక ఆడదాని సాయంతో దొంగతనంగా తప్పించుకు పోవటానికి అతని మనస్సంగీకరించలేదు. ఆమె తొందర చేయసాగింది. ప్రతాపసేనుడు ఓ నిర్ణయానికొచ్చాడు. ఆపదలో వున్నప్పుడు ఆడదనీ, అన్యులనీ వ్యర్థంగా ఆలోచించటం అనవసరం. తను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే ముందక్కడి నుంచి బయటపడాలి. లేచి, ఆమె ననుసరించాడు. ఇద్దరూ బయటకి అడుగు పెట్టారు. వెన్నెల పుచ్చ పువ్వులా విరగ్గాస్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది. బయట తన గుర్రం ప్రక్కనే మరో గుర్రం జీను వేసి సిద్ధంగా వుంది. అంటే రెండో గుర్రం ఎవరికి? ప్రశ్నార్థకంగా చూసిన ప్రతాపసేనుడికి కళ్ళతోనే సమాధానమిచ్చిందా రూపసి. ప్రతాపసేనుడు ఒక్కసారిగా తన గుర్రమెక్కి కూర్చున్నాడు. ఆ వెనుకనే రెండో గుర్రాన్ని ఆమె అధిరోహించింది. చప్పుడు చెయ్యకుండా గూడెం నుంచి బయటపడ్డారు. ఆమె తననెంత దాకా అనుసరిస్తున్నదీ తెలుసుకో గోరి అడిగాడు. ఆమె సమాధానంగా నవ్వి, "వీరుడా! నువ్వెవరి చిన్నవాడివి? ఇలా ఎక్కడికి పోతున్నావు? నాతో సెప్పవా?" అనడిగింది. తనకు సాయం చేసిన ఆ కన్యకు చెప్పటంలో అనౌచిత్యం లేదనిపించి తను వచ్చిన పని చెప్పాడు. "అబ్బో, రాచబిడ్డవా నువ్వు? నీ హొయలు చూసి అనుకున్నాలే. నిన్న పొద్దుకూకుటేల నీ కోడెతనం సూసినాను. మంచి పోరగాడివే. మా గూడెపోళ్ళని సెదరగొట్టినావు, అదరగొట్టినావు!" అందామె ప్రశంసా పూర్వకంగా.

"నా సంగతి చెప్పా కదా! నన్ను వీడు. నేనిక వెళ్ళగలను" అన్నాడు ప్రతాపసేనుడు ముక్తసరిగా. ఆమె తన విశాల నేత్రాల్ని విప్పార్చి, అతని వదనంలోకి సూటిగా చూసింది. తర్వాత సిగ్గుతో కళ్ళు వాల్చుకుని, "నా గురించి ఏమీ అడగవేం? అయినా సెబుతా విను. నా పేరు బాలచెంచి. నా తండ్రి యీ గూడేనికి రాజు. నా తల్లి సిన్నప్పుడే పోయింది. అప్పటి నించీ మా నాయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. ప్రతి ఏటా క్రొత్త పంట తినే దానికి ముందు అమ్మోరికి నరబలిత్తాం. ఈ ఏడు ఎవరూ దొరక్క అంతా పస్తులుంటున్నాం. మా గూడెపోల్లు అన్ని చోట్లా వెతికినారు మడిసికోసం. ఎవరూ దొరకలే. ఇంతలో నువ్వు సిక్కినావు దొరా! అందుకనే నిన్ను పట్టినారు" అని రెండు క్షణాలాగి మళ్ళీ చెప్పసాగింది. "నా తండ్రి నాకు మనువు సెయ్యాలనుకుంటున్నాడు. నాకు మా గూడెపోళ్ళంటే ఇట్టంలేదు. ఎవరైనా కంటి కింపుగున్న కుర్రాడ్ని మనువాడాలనుంది. నరబలి కోసం తెచ్చుకునే పోరగాళ్ళలో మంచి గుంటడు దొరకతాడేమో నని చూస్తున్న. ఇప్పటి దాకా నా కంటికి, మనసుకి నచ్చిన సిన్నోడు దొరకలే. ఇన్నాళ్ళకి కోడెగాడివి నువు దొరికినవు. ఇక నేను నీ దాన్ని. నీ మీద మరులుగొన్న సిన్నదాన్ని. నా బతుకు పండించు దొరా!" అంది సిగ్గుతో. ప్రతాపసేనుడు నిర్ఘాంతపోయాడు. తన మీద మనసుతో ఆమె తనకీ సాయం చేయటానికి సిద్ధపడిందన్న మాట! తనకీ బెడద వచ్చి పడిందే! ఇపుడేమిటి దారి? అతని చెవుల్లో ఆమె మాటలు గింగురు మంటున్నాయి. గుర్రాలు సాగిపోతూనే వున్నాయి. ప్రతాపసేనుడి మనసు అల్లకల్లోలమయిపోయింది. ఆమె తన గుర్రాన్ని అతని కత్యంత సమీపంగా నడిపిస్తోంది. భుజం భుజం రాచుకునేంత దగ్గరగా. అతని శరీరం జలదరించింది. ఏ నాడూ స్త్రీ స్పర్శ నెరుగని శరీరం పిచ్చి గంతులు వేసింది. ఈ లోపల బాలచెంచి తన గుర్రం మీది నుంచి మెల్లగా అతని గుర్రం మీదికి చేరింది. అతని మీద ఒరిగి పోయి "దాహం!" అంది. ప్రతాపసేనుడు గుర్రాన్ని నిలిపి, "ఇక్కడే ఉండు. నీళ్లు తెస్తాను" అని గుర్రం దిగబోయేంతలో ఆమె కోకిలలా నవ్వి అతని కళ్ళలోకి చూసింది. 

ప్రతాపసేనుడి కర్థమైపోయింది. చల్లని వాతావరణం, పున్నమి వెన్నెల, ఏకాంతం, యవ్వన భారంతో తనపై ఒరిగిపోయిన నిండు జవ్వని, అతణ్ణి క్షణకాలం నిగ్రహాన్ని కోల్పోయేలా చేశాయి. కాని ఇంతలో కర్తవ్య నిర్వహణ వెన్ను చరిచిందతణ్ణి. తనెంతటి మోహావేశుడయినాడో అర్థమైంది. లావణ్య సుందర వదనం ఓ సారి మనో వీధిన మెరిసి మాయమైంది. తన తండ్రి వేదన మనసులో ములుకులా తాకింది. ఒక్కసారిగా ఆమెను విడిచి కిందికి దిగిపోయాడు. బాలచెంచి బిత్తరపోయింది. అతనెందుకలా ప్రవర్తించాడో అర్థం కాలేదు. "రాచకుర్రాడా! నేను నీకు నచ్చలేదా? నా మీద మనసు లేదా? నాపై అలిగినావ? చెప్పు. నీ సేత్తో నా పీక నులిమినా నాకు సంతోషమే! కాని నన్ను కాదని తోసెయ్యమాక. నాకు నువ్వు కావాలి. నీతో తీసుకుపో. ఎక్కడికైనా సరే! నేను నువు లేక బతకలేను" అని దీనాతి దీనంగా వేడుకుంది. ప్రతాపసేనుడు అనునయంగానే అయినా, ధృడంగా చెప్పాడు, "అది అసంభవం చెంచితా! ఈ జన్మలో నీ కోరిక తీరదు. నాకు నీపై మనసు లేదు. నా మీద లేని పోని ఆశలు పెట్టుకోకు. నీ గూడేనికి తిరిగి వెళ్ళిపో. నా దారిన నన్ను పోనీ! మీ వాళ్ళ కబంధ హస్తాల నించి నన్ను రక్షించినందుకు ఆ జన్మాంతం కృతజ్ఞుడినై వుంటాను. మీ గూడెంలో నీకు నచ్చిన వాణ్ణి పెళ్ళి చేసుకుని సుఖంగా వుండు." "నువు లేకపోయాక మరొకడిని మనువాడతాననుకున్నావా? నా దంత తేలిక బుద్ధనుకున్నావా పోరగాడా! ఆడదాని మనసు నీకు అర్థం కాదులే. తనకి నచ్చినోడ్ని ఒక్కడ్నే ఎన్నుకుంటది  ఆడ మనసు. నువు నా మనసుకి నచ్చిన సిన్నోడివి. నువు నాకు దక్కకపోయాక నేనింకొకడికి దక్కను" అని రెప్పపాటు కాలంలో తన వద్ద దాచుకున్న ఛురికతో గుండెల్లో పొడుచుకుంది బాలచెంచి. వెచ్చటి ఎర్రటి రక్తం ఒక్కసారిగా చివ్వున చిందింది. "ఈ జనమలో వొద్దంటివి కదా, వచ్చే జనమలో నీకు ఆలినవుతానులే!" అంది అతనికి చేతులెత్తి నమస్కరించి. 

ప్రతాపసేనుడు ఎదురుచూడని యీ హఠాత్సంఘటనకు మ్రాన్పడిపోయాడు. అతనిలా జరుగుతుందని కనీసం వూహించలేదు కూడా. ఒక్కసారిగా ఆమెని చేతుల్లోకి తీసుకుని, "ఎంత పని చేశావు చెంచితా! నా వంటి దౌర్భాగ్యుణ్ణి కోరి, నీ ప్రాణం తీసుకున్నావా? నేను దుర్మార్గుణ్ణి, నికృష్టుణ్ణి. నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదు." అని వాపోయాడు. బాలచెంచి అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, "దొరా! నీ సేతుల్లోకి తీసుకున్నావు. మనసారా నన్ను పిలిచినావు. నా గురించి కంట నీరెట్టుకున్నావు. ఇదంతా సూత్తంటే నీకు నా మీద మనసయినట్టు నాకు తెలుస్తాందిలే! ఆ సంతోషం చాలు నాకు. నీ సేతుల్లో నా పేనం పోటం నాకూ యిట్టమే! నేను యిలా పోతున్నందుకు బాధ లేదు. ఇందులో నీ తప్పు లేదు. బాధపడమాక. నీకు భగవంతుడు మేలు సెయ్యాలని మొక్కుకుంటున్నాను" అంటూ ప్రాణాలు విడిచింది బాలచెంచి. ప్రతాపసేనుడి కళ్ళ నుండి అవిరాళ ధారగా కన్నీరు స్రవిస్తోంది. తన ప్రాణదాతకు తనిచ్చిన బహుమానమా యిది? తనెంత నిరంకుశుడు! తన్ను కోరిన అబలకు తనిచ్చిన ప్రతిఫలం చావు. చాలాసేపటి వరకు అతడు దుఃఖం నుంచి తేరుకోలేకపోయాడు. ఆ వెంటనే ఓ నిర్ణయాని కొచ్చాడు. ఎండు చిదుకుల్ని పోగుచేసి నిప్పు రాజేసి, అంటించాడు. చితిపై బాలచెంచిని పడుకోబెట్టి, ఆమె దహనమయ్యేవరకు అక్కడే నిల్చుండిపోయాడు. దుఃఖంతో, భారమయిన మనసుతో. అప్పటికే కోయగూడెం దాటి ఎన్నో మైళ్ళు వచ్చేసాడు కాబట్టి, వారి నుండి ప్రమాదం రాదిక. బాలచెంచి దేహం బూడిదయ్యే సరికి తెల్లగా తెల్లవారిపోయింది. పరిసరాలను పరికించి చూసిన ప్రతాపసేనుడి ఆశ్చర్యానికి అంతులేదు. తాను చుట్టు తిరిగి మళ్ళీ మూడు బాటల కూడలికే వచ్చాడు. ఇప్పుడు తక్కిన రెండు బాటల్లో ఏది ఎన్నుకునేటట్టు? ఏది వింధ్యారణ్యానికి మార్గం? నిర్జనమైన యీ అడవిలో తనకు దారి చూపే దెవరు? చివరికి ఓ బాట నెన్నుకొని గుర్రాన్ని పరుగెత్తించాడు.

ఆ విధంగా ప్రతాపసేనుడు చాలా దూరం ప్రయాణించాడు. వెళ్ళే కొద్దీ మార్గం మరీ దుర్భరమవుతోందే తప్ప, ఒక్క చెట్టుగాని మిట్టగాని కనిపించడం లేదు. చుట్టూ విశాలమైన మైదానం! ప్రతాపసేనుడు చాలా అలసిపోయాడు. అప్పటికే రాత్రిలో చాలా భాగం గడిచిపోయింది. అతను గుర్రాన్ని నిలిపాడు. చుట్టు పట్ల ఎక్కడా జలాశయమేదీ ఉన్న జాడ కనిపించలేదు. కొన్ని ఫలాలు కోసి భుజించి, చెట్లక్రింద మేను వాల్చాడు. ఆ ప్రదేశం గాంధార రాజ్యానికి చెందినది. దానికి ప్రస్తుత రాజు వీరనాయకుడు. తండ్రి మరణానంతరం వీరనాయకుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతడి కంతవరకు వివాహం కాలేదు. తన కొక అందమైన రాకుమార్తె వధువుగా కావాలని తన గూఢచారుల్ని అన్ని రాజ్యాలకు పంపి సమాచారం సేకరించుకు రమ్మన్నాడు. అనేకమంది రాజులు తమ కుమార్తెల చిత్రపటాల్ని వీరనాయకుడికి పంపించారు. అయితే, వారెవరూ అతనికి నచ్చలేదు. అందంగా వున్న కన్య ఏ రాజ్యంలో వున్నా సరే, రహస్య సమాచారం అందజెయ్యమని తన వేగులవాళ్ళ కాజ్ఞాపించాడు. అయితే ఆ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఎంతటి సుందరాంగి కూడా అతనికి నచ్చటం లేదు. గూఢచారులు తిరుగుతూనే వున్నారు. చిత్రపటాలు వస్తూనే వున్నాయి. ప్రయోజనం మాత్రం శూన్యం! గూఢచారుల వేటలో ప్రతాపసేనుడు వారి కంటపడ్డాడు. చెట్టుక్రింద నిద్రా పరవశుడై వున్నాడు ప్రతాపసేనుడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. తొలి వెలుగు రేఖలు నల్దిక్కులా వ్యాపిస్తున్నాయి. గూఢచారులు తమ గుర్రాల్ని నిలిపి, అతను తమకు మిత్రుడో, శత్రువో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు గుర్రాలు దిగి, అతని నిద్ర భంగం కలగకుండా లాఘవంగా అతని దుస్తులు తడిమారు ఏదయినా సమాచారం లభిస్తుందేమోనని! వారి ప్రయత్నం వ్యర్థం కాలేదు. జగన్మోహనాకారమైన స్త్రీమూర్తి చిత్రపటం లభించింది. అది లావణ్యది. కాశీరాజు శూరసింహుడి కుమార్తె చిత్రపటం! ఆ చిత్రాన్ని చూడగానే వాళ్ళ కళ్ళు జిగేలు మన్నాయి. ముఖాల్లో ఆనంద రేఖలు పొడ చూసాయి.

అంత అందమైన లావణ్యవతిని అదివర కెన్నడూ వారు చూసి వుండలేదు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని ఆనందంతో పొంగిపోయారు. అయితే ఆమెది ఏ దేశమో, యీ చిత్రపటం యీ యువకుడి వద్ద వుండటానికి కారణమేమిటో ముందు తెల్సుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలో చటుక్కున మెలకువ వచ్చింది ప్రతాపసేనుడికి. తన మీదికి వంగి వున్న వ్యక్తుల్ని చూడగానే చర్రున ఒరనుండి కత్తి దూయబోయాడు. అయితే అతనికా అవకాశమివ్వకుండా వేగులవాళ్ళు అతన్ని ఒక్కసారిగా బంధించి వేశారు. తమకైతే అతడు నిజం చెప్పడని ప్రతాపసేనుణ్ణి సరాసరి తమ రాజు వీరనాయకుడి వద్దకు తీసుకుపోయారు. గూఢచారు లిచ్చిన లావణ్య చిత్రపటాన్ని చూసిన వీరనాయకుడికి  మూర్ఛపోయినంత పనయింది. ప్రపంచంలో యింత అందమైన స్త్రీ వుంటుందా అని ఆశ్చర్యపోయాడు. తనక్కావలసిన సౌందర్యరాశి గురించి యిన్నాళ్ళకు తెల్సుకోగలిగినందుకు మురిసి పోయాడు. తదేక ధ్యానంతో ఆ పటాన్నే చూస్తూ, పరిసరాల్ని మరిచిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, "ఆ వ్యక్తిని ప్రవేశపెట్టనుంది. నేను అవశ్యం యీమె గురించి తెలుసుకోవాలి!" అని ఆజ్ఞాపించాడు వేగులవాళ్ళని. మరుక్షణం ప్రతాపసేనుడు ప్రవేశపెట్టబడ్డాడు. "ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీదే దేశం?" ప్రశ్నల వర్షం కురిపించాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు ఏదో చెప్పబోయేంతలో లావణ్య చిత్రపటాన్ని చూపి, "ఈమె ఎవరు? ఈ చిత్రపటం నీకెలా వచ్చింది?" అనడిగాడు వీరనాయకుడు. ప్రతాపసేనుడు తన దుస్తులు తడుముకున్నాడు. తన దగ్గర్నుంచి, తను నిద్రలో ఉండగా ఆ పటం కాజేశారని గ్రహించాడు. అతనికి వాళ్ళ దౌర్జన్యం చూసి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. కోపంతో వెంటనే నోట మాట రాలేదు. వారికి నిజం చెప్పటం అనవసరం! వాళ్ళు తనకు శత్రువులో, మిత్రులో తెలీదు. తను నిజం చెప్పినా అది వాళ్ళు నమ్ముతారనేముంది? వున్న విషయం కప్పిపుచ్చటమే మేలని, ఓ చిన్న కట్టు కథ కల్పించి చెప్పాడు. 

"అయ్యా! నేనొక రాకుమారుణ్ణి. నన్ను విజయుడంటారు. చిన్నతనం నుంచీ నాకు వీరోచిత కార్యాల మీద మనసు పోయి కత్తిసాము, గుర్రపుస్వారి వంటి విద్యలన్నీ నేర్చుకున్నాను. నేను తరచు వేటకు వెళ్తుంటాను. నిన్నటి దినం వేటాడబోయి దారి తప్పాను. చీకటి పడటం మూలాన రాత్రి విశ్రమించి మర్నాడుదయం నా వూరికి తిరిగిపోదామని చెట్టుక్రింద నిద్రపోయాను. నేను నిద్రలేచేసరికి తమ భటులు నన్ను బంధించి, నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా యిక్కడికి తీసుకొచ్చారు. నన్నెందుకు తీసుకొచ్చారో దయచేసి చెపుతారా?" అన్నాడు. "ఓయీ! అసలు విషయం విడిచిపెట్టి నీ సోదంతా చెపుతావేం? ఈ చిత్రపటంలోని సౌందర్యరాశి ఎవరు? ఏ రాజ్యానికి చెందినది? అది తెలుసుకోవటానికే నిన్ను యిక్కడికి తీసుకు వచ్చినది! ఇది గాంధార రాజ్యం. నేను దీని పాలకుణ్ణి! నన్ను వీరనాయకుడంటారు. అవివాహితుణ్ణి. ఈమె మీద మరులుగొన్నాను. కాబట్టి యీమె ఎవరో సత్వరం తెలియపర్చు" అన్నాడు వీరనాయకుడు ఆలస్యం భరించలేనట్టు. ప్రతాపసేనుడు రెండు క్షణా లాలోచించాడు. ఏమైనా అసత్యం చెప్పటమే అన్ని విధాలా మేలనిపించింది. తను సాధ్యమైనంతవరకూ లావణ్య గురించిన విషయం కప్పిపుచ్చటమే మంచిదనుకొని వీరనాయకుడితో యిలా అన్నాడు. "రాజా! ఈమె ఎవరో నాకు తెలియదు. మా తండ్రిగారు దేశాంతరం వెళ్ళినప్పుడు ఆయనగారి స్నేహితుడెవరో యీ చిత్రపటాన్ని బహూకరించాడట. దాన్ని నేను చూడటం తటస్థించింది. నేను యీ పటాన్ని నా వద్ద పదిలపరిచాను. అప్పట్నుంచీ నా వద్దనే వుండిపోయింది. మా తండ్రిగారిని యీమె గురించి ఎవరని అడిగాను. కాని ఆయన తనకు తెలియదని చెప్పారు." వీరనాయకుడీ మాటలని ఏ మాత్రం విశ్వసించలేదు.

ప్రతాపసేనుడు నిజం చెప్పటం లేదని అనుమానించాడు. అతనికి అసహనంతో కూడిన క్రోధం ప్రజ్వరిల్లింది. "నువ్వు చెప్పేది ఏ మాత్రం నిజం కాదని నాకు తెలుసు. అనవసరమైన కల్ల బొల్లి కబుర్ల వల్ల ప్రయోజనం లేదని గ్రహించుకో! నువ్వు నిజం చెపితే నీకేమాత్రం హాని కలక్కుండా వదిలేస్తాం. రేపటివరకు గడువిస్తున్నాను. అంతవరకు కారాగారంలో మా ఆతిథ్యం స్వీకరించు. నిజం చెప్పకుండా ప్రాణాలతో బయట పడలేవు" అని అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు వీరనాయకుడు. భటులు ప్రతాపసేనుణ్ణి కారాగారంలో బంధించారు. ప్రతాపసేనుడు చెరసాలలో చింతాక్రాంతుడై ఆలోచిస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా తనకన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. తన కర్తవ్యానికన్నీ అడ్డంకులే! తనకా పుష్పం లభించే దెప్పుడు? తన తండ్రి బాధ మాపేదెప్పుడు? ముందిక్కడి నుంచి బయట పడే దారేది? అతడి కంతా అగమ్యగోచరంగా వుంది. పోనీ, తను నిజం చెప్పేస్తే? తనకేమీ హాని చెయ్యనన్నాడు కదా! అయినా తను చెప్పేది వాళ్ళు నమ్ముతారా? మరో అబద్ధం చెపుతున్నా ననుకోరా! ఆలోచనల్లో సతమతమవుతున్న ప్రతాపసేనుడికి తనకోసం భోజనం తీసుకువచ్చిన దాసీని చూడగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఖైదీలందరికి ఆమె భోజనం అందిస్తుంది. ఖైదు తాళాలెక్కడుంటాయో ఆమెకు తెలీకపోదు. దాసి ఊచల్లోనుండి భోజనం అందిస్తుండగా ప్రతాపసేనుడు ఆమెను మెల్లిగా మాటల్లోకి దింపాడు. "నా దగ్గరున్న యీ రత్నాభరణాలన్నీ చాలా అమూల్యమైనవి. రేపటి రోజున నన్నెలాగూ బతకనియ్యరు గాబట్టి, వాటిని నీవంటి పేదవాళ్ళకు దానం చెయ్యాలని నాకు బుద్ధి పుట్టింది. నేను నా ఆభరణాలిస్తా, తీసుకో!" అన్నాడు. దాసి ఆశతో ఆత్రంగా చెయ్యి చాపింది. "అలా కాదు. నీకది యిచ్చేటప్పు డెవరయినా చూస్తే రభస అవుతుంది. అలా కాక, నువ్వే తలుపు తెరిచి లోపలికి  వచ్చి వాటిని తీసుకో!" అన్నాడు ప్రతాపసేనుడు.

దాసి కొన్నిక్షణాలాలోచించింది. విలువైన ఆభరణాల్ని విడుచుకోవటాని కామెకి మనస్కరించలేదు. ఎక్కడికో పోయి, రెండు క్షణాల్లో ఓ తాళపు చెవుల గుత్తితో తిరిగి వచ్చింది. తాళం తీసి లోనికి వెళ్ళింది. అంతే! ప్రతాపసేనుడి ఉక్కు హస్తాలు ఆమె నోటినదిమేశాయి. ప్రతాపసేను డామె వస్త్రాలతో ఆమె కాళ్ళు చేతులు బంధించి, నోటిలో గుడ్డలు కుక్కి, నెమ్మదిగా చెరసాల నుండి బయటపడ్డాడు. అప్పటికే అర్థరాత్రి దాటిపోయింది. కావలివాళ్ళు మత్తులో జోగాడుతున్నారు. పహారావాళ్ళు తిరుగుతున్నారు. ప్రతాపసేనుడు వాళ్ళ కళ్ళు గప్పి బయటకి నడిచాడు. ఎదురుగా ఎత్తయిన ప్రహరీ గోడ కనిపించింది. దాని మీదికి లంఘించాడు. క్రిందుగా లోతైన కందకం! అతడు ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుణ్ణి స్మరించి దానిని కూడా లంఘించాడు. ఇసుకలో పోయి పడ్డాడు. చుట్టుపట్ల ఎవరూ తనని గమనించడం లేదని గ్రహించి, భగవంతుడికి కృతఙ్ఞతలు మనసులోనే అర్పించుకుని, ఉత్సాహంగా ముందుకి అడుగులు వేశాడు. గూఢచారులు తనని బంధించి తెచ్చిన దారి వెతుక్కుని ముందుకి సాగిపోయాడు. తన గుర్రం దూరంగా పచ్చిక మేస్తూ కనిపించింది. యజమానిని చూడగానే సంతోషంతో ముందు కాళ్ళెత్తి సకిలించింది. ప్రతాపసేనుడు ఆప్యాయంగా గుర్రం మేను నిమిరాడు. తెలతెలవారబోతోంది. వెంటనే గుర్రాన్నధిరోహించి, దారులు చీలిపోయిన కూడలి చేరాడు. మిగిలిన మూడవ మార్గమే వింధ్యారణ్యానికి మార్గమని నిర్ణయానికొచ్చాడు. ఏమయినా యీసారి తను దారి తప్పకూడదని ధృఢ నిశ్చయంతో, మూడవ మార్గం వెంట వాయువేగంతో పరుగెత్తించాడు. అదో దుర్గమారణ్యం. అది దారి దోపిడీదార్లకు నివాసం. ఆ దోపిడీదార్లు దారి పక్కన పొంచి, వచ్చే పోయే బాటసారులని దోచుకొంటూ ఉంటారు. ప్రజలకి ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి అటు ప్రయాణం మానేశారు. ఎవరో తెలియనివారు తప్ప అటు జనసంచారమే తగ్గిపోయింది. 

దోపిడీదార్లకు భుక్తికి లోటు ఏర్పడటంతో తెగించి ఊళ్ళమీద పడి దోచుకోవటం మొదలెట్టారు. తిరిగి దోపిడీదార్ల భుక్తికి కరువేర్పడింది. అక్కడినుండి మకాము మార్చివేద్దామనే నిర్ణయానికొచ్చారు. అయితే తమ మకాము మార్చటానికి ఇంకా పూర్తిగా ఏర్పాట్లు చేసుకోలేదు. ఈ లోపల చెట్టు మీద కూచుని వున్న ఓ దొంగ ప్రతాపసేనుడు ఆ దారిన రావడం చూసి, వెంటనే తక్కిన దొంగలకు ఆ సంగతి సంకేతాలద్వారా తెలియజేశాడు. ప్రతాపసేనుడు ఆ ప్రాంతం చేరేసరికి దొంగలంతా ఒక్కుమ్మడిగా దాడి చెయ్యటానికి సిద్ధమయ్యారు. ప్రతాపసేనుడు ధరించిన విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొన్నాళ్ళపాటు తమకు భుక్తికి లోటు లేకుండా ఆదుకోగలవు. బిలబిలమంటూ దోపిడీ దొంగలందరూ ప్రతాపసేనుణ్ణి చుట్టుముట్టారు. ప్రతాపసేనుడికి వెంటనే పరిస్థితి అర్థం కాలేదు. రానున్న అపాయాన్ని గ్రహించిన వెంటనే ప్రతాపసేనుడు కత్తి దూసి, గుర్రం మీద కూచుని వుండే అందరితోనూ పోరాడసాగాడు. వ్రేటు కొక్కడి చొప్పున నేల కూలుస్తూ, అసహాయశూరుడిలా విజృంభిస్తూన్న అతడి ధాటి కాగలేక దొంగలంతా చెల్లాచెదురైపోయారు. దోపిడీ దొంగలనాయకుడు ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాడు. ధర్మంగా అతణ్ని ఎదిరించి పోరాడి నెగ్గుకు రాలేమని నిశ్చయించుకున్నాడు.  ఆయాసం తీర్చుకుంటున్న ప్రతాపసేనుడి మీద దొంగ దెబ్బ తీశాడు. నెలకొరిగిపోతూ వెనుతిరిగి చూశాడు ప్రతాపసేనుడు. తనని అన్యాయంగా దెబ్బ తీసిన దొంగల నాయకుడికి గురి చూసి ఛురిక విసిరాడు. విజయగర్వంతో అట్టహాసం చేస్తున్న దొంగల నాయకుడి గుండెల్లో సూటిగా నాటుకుందా ఛురిక! మరుక్షణం దొంగల నాయకుడు నేలకూలి ప్రాణం వదిలాడు. ప్రతాపసేనుడు నిస్త్రాణగా నేలమీదికి ఒరిగిపోయాడు. ఎవరిదో అమృతహస్తం తన కళ్ళపై నిమరటం లీలగా తోచి కనులు తెరిచాడు ప్రతాపసేనుడు. ఎవరో ముని ఆత్రంగా తన మీదికి ఒరిగి చూస్తున్నాడు. 

ప్రతాపసేనుడు పూర్తిగా స్పృహలోకి వచ్చి లేచి కూర్చోబోయాడు. "లేవకు నాయనా! అలాగే పడుకో విశ్రాంతిగా!" అని వారించాడు ముని. ప్రతాపసేనుడు దాహంగా ఉందని సైగ చేశాడు. మునీశ్వరుడు మంచి తీర్థం తెచ్చి ఇచ్చి ప్రక్కనే తనూ కూర్చున్నాడు. అదొక ఆశ్రమంగా గుర్తించాడు ప్రతాపసేనుడు. తనకు స్పృహ తప్పిపోవటానికి ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తనకు తగిలిన గాయం చూసుకున్నాడు. గాయం తగిలిన ఆనవాలు తప్ప ఏ విధమైన నొప్పీ అనిపించటం లేదు. మునీశ్వరుడివంక కృతజ్ఞతగా చూసి, "మహానుభావా! తమ దయవలన నాకు మళ్ళీ కొత్త జీవితం లభించింది. నాకు సెలవిస్తే, నా పని మీద పోతాను" అన్నాడు లేచి. "నువ్వు కొంతకాలం విశ్రమించి ఆ తదుపరి వెళ్ళవచ్చును. నీకు వింధ్యారణ్యానికి మార్గం నే చూపుతాను" అన్నాడు ముని నవ్వుతూ. ప్రతాపసేనుడు ఆయనకు నమస్కరించి "మహానుభావా! నేనే పని మీద వచ్చినదీ తమకు తెలుసన్న మాట! నాకు సెలవిప్పించండి. నా తండ్రి బాధ నివారించగల అవకాశం కల్పించండి!" అన్నాడు. మునీశ్వరుడు అతని కార్యదీక్షకు సంతసించి, "నాయనా! ఇదే దారిన తిన్నగా వెళ్ళావంటే తెల్లవారేసరికి వింధ్యారణ్యం చేరుకొంటావు. నేను మంత్రించిన విభూతి ఇస్తాను. కష్టాల్లో నన్ను తలచుకొని విభూతినుపయోగించు. నీకు శుభం కలుగుతుంది!" అని విభూతినిచ్చి ఆశీర్వదించాడు. ప్రతాపసేనుడు మునీశ్వరుడికి భక్తితో నమస్కరించి అక్కడినుంచి బయలుదేరాడు. ప్రతాపసేనుడు రాత్రి సమయంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేసి తెల్లవారే సరికి ఆకాశాన్నంటే వృక్ష సముదాయంతో దుర్గమంగా వున్న ఓ మహారణ్యం చేరుకున్నాడు. మునీశ్వరుడు చెప్పిన గుర్తులని బట్టి అదే వింధ్యారణ్యమని గుర్తించాడు. తను పడ్డ శ్రమంతా పూర్తిగా మరచిపోయాడు. ఆనందంతో అతని మనసు ఉరకలు వేసింది.

గుర్రం రెండు సార్లు సకిలించి ఆగిపోయింది. ప్రతాపసేనుడు గుర్రం దిగి చుట్టూ పరికించి చూశాడు. ఆ అరణ్యంలో ఏ ప్రక్క నుండి కూడా లోనికి మార్గం కనిపించలేదు. మునీశ్వరుని తలచుకొని విభూతి కొంత చల్లాడు. ఎదురుగా మార్గం కనిపించింది అరణ్యంలోనికి. గుర్రం ఎక్కి సరాసరి లోనికి దూసుకుపోయాడు. కొంత దూరం పోయేసరికి వాలుగా వున్న కొండ చరియలు కనిపించాయి. గుర్రాన్ని పచ్చికపై వదిలి చరియలు సమీపించి, ఓ కొండ చరియప్రక్క గుహలాంటి మార్గం కనిపించి అటు వెళ్ళాడు. అక్కడ ఓ బండరాయి గుహను మూసుకుని వుంది. ప్రతాపసేనుడు అతి కష్టం మీద దాన్ని తొలగించాడు. లోనికి దారి కనిపించింది. చప్పుడు కాకుండా లోనికి ప్రవేశించాడు. లోపలంతా చీకటిగా వుంది. ఎక్కడి నుండో మాటల సవ్వడి వినిపిస్తోంది. ప్రతాపసేనుడు ఆ దెసకు చకచక వెళ్ళాడు. "బాలామణీ! ఇప్పటికైనా నన్నంగీకరిస్తావా? నీ సౌందర్యానికి దాసుడనై నీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశతో తపిస్తున్నాను. నన్ను నీ హృదయేశ్వరుడిగా అంగీకరించు. నిన్ను బలాత్కరించటం చేతకాక యిన్నాళ్ళు ఉపేక్షించాననుకోకు. నీ యిష్ట పూర్వకంగా నా దానివి అవుతావని యిన్నాళ్ళు ఎదురు చూశాను. నన్ను కాదన్నవాళ్ళు పాషాణాలుగా మారిపోయారు చూశావు కదా! నీకూ అదే గతి పడుతుంది" అని హుంకరిస్తూన్న తాటి ప్రమాణాన వున్న రాక్షసుడు కంటబడ్డాడు ప్రతాపసేనుడికి. అతనే భూతపతి అని గ్రహించటానికెంతో సేపు పట్టలేదు ప్రతాపసేనుడికి. కారణం, ఎదురుగా ఖిన్న వదనంతో నిల్చుని వున్న యువతిలో లావణ్య పోలికలు స్పష్టంగా కనిపించటమే! అతనికి చాలా ఆనందం కలిగింది. ఎలాగైనా ఆమెకీ చెర తప్పించాలి! వాడసలే మంత్రం తంత్రాల్లో ఆరితేరినవాడు. తను తొందరపడి వాడి ముందు పడితే తన అంతు చూస్తాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా యింతలో ఓ వికృతాకారుడొకడు అక్కడి కొచ్చి, "పూజకు వేళయింది!" అని గుర్తు చేశాడు. భూతపతి ఓసారి లావణ్యను గుచ్చిచూసి, "ఈ రోజు ఆఖరి రోజు. నువ్వు నా హృదయ రాణివి కావటమో, పాషాణంగా మారటమో నేటితో తేలిపోతుంది!" అని హెచ్చరించి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. లావణ్య చేతుల్లో ముఖాన్ని దాచుకుని రోదించసాగింది. 

ఇంతలో మృదువైన స్వరాన, "లావణ్యా!" అన్న పిలుపు వినిపించి దిగ్గున తలెత్తింది, ఏడుపునాపి. ఎదురుగా వున్న యువకుణ్ణి చూసి తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. మనిషనే వాడు ప్రవేశించలేని ఆ గుహలో ఓ మానవుణ్ణి చూడగానే ఆమె ఆశ్చర్యంతో అవాక్కయింది. "నేను మగధ యువరాజు ప్రతాపసేనుణ్ణి! మీ తండ్రి శూరసింహుల వారు నీ గురించి అంతా చెప్పారు. నేను నిన్ను విడిపించ వచ్చాను" అన్న ప్రతాపసేనుడి మాటలు ఆమె చెవిన అమృత ధారలయ్యాయి. "నేనెంత అదృష్టవంతురాల్ని! ఈనాటితో ప్రాణత్యాగం చేయాలనుకుంటున్న నాకు మీ ఆగమనం ప్రాణం పోసింది. నేనిక్కడ దిన దిన గండంగా బ్రతుకుతున్నాను. మీరు మా రాజ్యం నుండి వస్తున్నామన్నారు. నా తల్లిదండ్రులు క్షేమమే కదా! నా గురించి విలపిస్తూ తల్లడిల్లిపోతున్నారా?" అంది లావణ్య ఆత్రంగా. ప్రతాపసేనుడు ఆమెకు కుశల సమాచారాలు తెలియచేసి ఇలా అన్నాడు. "నీకిక భయం లేదు. నిశ్చింతగా వుండు. ఈ రాక్షసుణ్ణి మట్టుపెట్టే మార్గం నీకు తెలుసా?" అనడిగాడు. లావణ్య రెండు క్షణాలాలోచించి, "అతని ప్రాణం అతని బొందిలో లేదని నా అనుమానం. ఓసారి కోపంలో అతనే నోరు జారాడు. అయితే వివరాలు తెలీవు. మీరెలా చెపితే అలా చేస్తాను. ఏం చెయ్యమన్నారు?" అంది. "అతను మళ్ళీ వస్తాడు కదా! అతని మీద ప్రేమ నటించు. ప్రాణ రహస్యం కనుక్కో. వాడికనుమానం కలగని విధంగా ప్రవర్తించు" అన్నాడు ప్రతాపసేనుడు. లావణ్య సిగ్గుతో తల ఊపింది. మొదటి చూపులోనే ఆమెకు ప్రతాపసేనుడిపై మక్కువ, ప్రేమ, ఆరాధన కలిగాయి. ప్రతాపసేనుడు కర్తవ్యాన్ని తలుచుకుని వెనుతీశాడే గాని లావణ్య సౌందర్యాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేక పోయాడు. ఆమె తన జీవిత భాగస్వామిగా తలుచుకుంటేనే మనసు పులకరించింది. 

ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి విని, ప్రతాపసేనుడు ప్రక్కకు తొలగి దాక్కున్నాడు. ఆ వచ్చినది భూతపతి. "ఏమే బాలామణీ! ఏమి నిర్ణయించుకున్నావు?" అని హుంకరించాడు. లావణ్య అతన్ని చూసి సిగ్గు నటించింది. చిరునవ్వులు చిందించింది. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు భూతపతికి. "ఓయి! జాణవేనే! నీ చూపులకర్థం మాకు తెలియకపోలేదు. ఇప్పటికైనా నా గొప్పతనం గ్రహించావన్నమాట!" అంటూ సమీపించాడు లావణ్యను. "మీ గొప్పతనం తెలీక కాదు. నిజంగా మీకు నా ఒక్కదాని మీద మనసుందో, అందరి లాగానే నన్ను భావిస్తున్నారో తెలుసుకోవటానికి ఇన్నాళ్ళు ఉపేక్షించాను. నా నిర్లక్ష్యాన్ని మన్నించండి. నాదో చిన్న కోరిక!" గోముగా అంది. "అడగవే చిన్నారీ! ఒక్కటేమిటి, వందయినా తీరుస్తా చిటికెలో!" అన్నాడు దర్పంగా భూతపతి. "మరేమీ లేదు. మీకు ఎంతో మంది శత్రువులు ఉంటారు కదా! ఎప్పుడెవరు మీకు హాని కలిగిస్తారో? మనం ఇద్దరం హాయిగా మరో చోట ఎక్కడైనా మంచి భవనం కట్టుకు జీవిద్దాం!" అంది లావణ్య. భూతపతి గుహ దద్దరిల్లేలా నవ్వి, "పిచ్చిదానా! ఇక్కడికి మనుష్యమాత్రుడు అడుగు పెట్టగలడనే అనుకొంటున్నావా? అయినా నా ప్రాణం నా బొందిలో ఉంటేగా?" అన్నాడు. "ఆశ్చర్యంగా వుందే! మీ ప్రాణం మీ దగ్గిర కాక ఇంకెక్కడుంది?" యధాలాపంగా అన్నట్టుగా అంది లావణ్య. "మన గుహకి ఈశాన్య దిశగా నున్న మర్రిచెట్టు తొమ్మిదో వూడలో నా ప్రాణాన్ని పదిల పరిచాను. ఈ విషయం నాకు, డింభుడికి తప్ప ఎవరికీ తెలీదు." "డింభుడా? వాడెవడు?" "ఇప్పుడు చూశావుగా, నా అనుచరుడు. రోజూ పూజవేళకు నాకు గుర్తుచేస్తుంటాడే వాడు!"

"హమ్మయ్య! ఇప్పటికి నాకు భయం తీరింది." "ఇంకా నీకు అధైర్యమేల? రా! నన్ను నీ ప్రాణనాధుడిగా అంగీకరించు. నన్నాదరింపచెయ్యి. నాకున్న అష్టయిశ్వర్యాలకి, నా హృదయానికి నీవే అధికారిణివి" అని ముందుకు రాబోతున్న భూతపతిని వారించి, "నాకు మనకున్న సకల సంపదలూ చూడాలని ఆశగా వుంది. ఎంతైనా ఆడదాన్ని కదా! ఆభరణాలంటే మా ఆడజాతికి ప్రాణం!" అంది లాలనగా లావణ్య. భూతపతి రెండు క్షణాలాలోచించి "సరే నాతో రా! ఇప్పుడే చూపిస్తాను" అంటూ ముందుకి దారి తీశాడు. లావణ్య వెళుతూ ఆగి వెనుతిరిగి చూసింది. ప్రతాపసేనుడు అంతా విన్నానని సైగచేశాడు. ప్రతాపసేనుడు వడివడిగా గుహ బయటకి వచ్చి ఈశాన్య దిక్కుగా పోయి ఊడల మర్రిని చేరుకున్నాడు. లెక్కపెట్టి తొమ్మిదో ఊడని నరకబోయాడు. అయితే అంతలోనే ఇంకో విషయం గుర్తు వచ్చింది. ఊడ నరకగానే రాక్షసుడు మరణిస్తాడు. వాటితోపాటు వాడి కడుపున వున్న మునీశ్వరుడి గ్రంథాలు కూడా సమసిపోతాయి. తను వాటిని సురక్షితంగా అప్పచెపుతానని మునికి మాటిచ్చి ఉన్నాడు. ఓ క్షణం అలోచించి ఊడను శాఖతో పాటు నరికి పట్టుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. లావణ్యకి ధనరాశులు చూపిస్తున్న భూతపతి ఎడమ కన్ను అదిరింది. దుశ్శకునాలు కనిపించాయి. ఒక్క ఉదుటున గుహ బయటకొచ్చాడు. ప్రతాపసేనుడు జాగు చెయ్యకుండా ఊడని ఛిన్నాభిన్నంగా నరికేశాడు కత్తితో. రాక్షసుడు పక్కటెముకలు పెళపెళలాడుతూండగా నేలకొరిగాడు. ఉత్తర క్షణంలో భూతపతి గర్భం చీల్చి, వాడి కడుపులో సంక్షిప్తమై వున్న వేదవేదాంగ గ్రంథాలన్నీ వశపరచుకొన్నాడు ప్రతాపసేనుడు. మరుక్షణమే భూతపతి విలవిల తన్నుకుని మరణించాడు. అంతకాలం వాడి మాయవల్ల శిలాకృతి దాల్చిన అనేకమంది రాకుమార్తెలు నిజరూపం పొందారు. 

తన గురువు మరణించాడని తెలిసి డింభుడు ప్రతాపసేనుణ్ణి ఎదుర్కొని చంపాలనుకున్నాడు. అయితే వాడి తల ఒక్క వేటుతో నరికిపారేశాడు ప్రతాపసేనుడు. శత్రుశేషం మిగల్లేదు. అయితే తన చుట్టు చేరిన రాకుమార్తెలని చూడగానే తక్షణ కర్తవ్యం తోచలేదు ప్రతాపసేనుడికి. వారంతా తామే రాజ్యాలనుండి అపహరించబడినదీ చెప్పారు. వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చట మెలాగో అతనికి బోధపడ లేదు. అటువంటి విపత్కర పరిస్థితిలో అతనికి మెరుపులా మణిభూషణుడు గుర్తుకొచ్చాడు. మనసులో స్మరించుకోగానే మణిభూషణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతాపసేనుణ్ణి సాదరంగా చూసి, "వీర కిశోరా! ఇన్నాళ్ళ తర్వాత నిన్ను చూశాను. ఇన్నాళ్ళకయినా నా సహాయం కోరుకున్నందుకు సంతోషం!" అన్నాడు. ప్రతాపసేనుడు ఆ రాకుమార్తెలను వారి వారి రాజ్యాలకు చేర్చమని కోరాడు. మణిభూషణుడు కుడి చేయి చాచి ఏదో స్మరించాడు. మరు క్షణం రాజకుమార్తెలందరూ అదృశ్యులయ్యారు. "సురక్షితంగా వారి వారి రాజభవనాల్లో ఉన్నారు" అన్నాడు మణిభూషణుడు చిరునవ్వుతో చూస్తూ. ప్రతాపసేనుడు లావణ్యవంక తిరిగి, "నేను కార్యభారం మీద వేసుకుని వున్నాను. నిన్ను కూడా కాశీ రాజ్యం పంపిస్తాను. సరేనా?" అన్నాడు. లావణ్య సిగ్గుతో మోము దించుకుని, "నేను మీతోనే వస్తాను. అనుగ్రహించండి!" అంది. ప్రతాపసేనుడు నచ్చ చెప్పగా, యిష్టం లేకుండానే అంగీకరించింది. ప్రతాపసేనుడి కోరిక మీద ఆమెను కూడా సురక్షితంగా ఆమె రాజ్యం చేరేలా అనుగ్రహించాడు మణిభూషణుడు. ఆ తర్వాత ప్రతాపసేనుణ్ణి చూసి, "పరోపకారమే నీ మతంగా పాటిస్తున్న వీరుడా! నీ గురించి ఏమీ కోరుకోవా?" అన్నాడు. "మహానుభావా! మీకిదివరలోనే చెప్పాను. నా తండ్రిగారి పని నేనే స్వయంగా నెరవేర్చాలనుకుంటున్నానని! అందుకే, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని సహాయం కోరలేదు" అన్నాడు ప్రతాపసేనుడు. 

మణిభూషణుడు ప్రతాపసేనుణ్ణి ఆప్యాయంగా చూస్తూ, "మిత్రుడా! నీకు మేలు జరుగుతుంది. నీకు కావలసిన మంత్రపుష్పం యిక్కడికి దగ్గర్లోనే దొరుకుతుంది. వెళ్లి సాధించు. ఆ పుష్పం ఉనికి తెల్సుకోవటం చాలా తేలిక. ఆ పుష్పం దివ్యకాంతుల్ని వెదజల్లుతుంది. ఆ చెట్టుకు ఒకే ఒక పుష్పముంటుంది" అని వివరాలు చెప్పి అదృశ్యుడయ్యాడు. ప్రతాపసేనుడు పుష్పాన్వేషణలో ఆ అరణ్యమంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్ళాడు. అతని ప్రయత్నం ఫలించింది. దూరంగా చీకట్లు పారదోలుతూ దివ్యకాంతితో ఆ ప్రాంతాన్ని దేదీప్యమానం చేస్తూన్న ఓ వెలుగు కనిపించింది. అప్పటికి చీకటిపడి చాలాసేపయింది. ప్రతాపసేనుడు ఆ వెలుగు కన్పించిన దిక్కుగా సాగిపోయాడు. అక్కడ ఓ చెట్టు కనిపించింది. దాని శిఖరాగ్రాన ఒకే ఒక పుష్పం ఉంది. దాని కాంతి కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. తనకి కనిపించిన వెలుగు ఆ పుష్పం నుంచి విరజిమ్మిన కాంతిగా అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళు ఆనందంతో వింతగా మెరిశాయి. చెట్టు కొమ్మ వొంచి పుష్పాన్ని త్రుంచబోయాడు. ఇంతలో "ఆగు!" అన్న శబ్దం వినిపించి, చటుక్కున తన ప్రయత్నం మాని, ఆశ్చర్యంతో పుష్పం వంక చూడసాగాడు. "ముందు నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి, ఆ తరువాత దానిమీద చెయ్యి వెయ్యి. ఏం చెబుతావు?" వినిపించింది తిరిగి. "నా సాధ్యమైనంత వరకు చెప్పటానికి ప్రయత్నిస్తాను. అడగండి!" అన్నాడు ప్రతాపసేనుడు. "బాగా ఆలోచించుకో! నేను మూడు ప్రశ్నలు అడుగుతాను. అందులో ఏ ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయినా, నువ్వు జీవించి వుండవు. ఒక్కో ప్రశ్నకి జవాబివ్వటానికి ఒక్క క్షణం మాత్రమే గడువు. ఏం, యిష్టమేనా? లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్ళు!"  

"వెనక్కి మళ్లేంతటి భీరువుని కాదు. పరమేశ్వరుడి కృప నాపై వున్నంతవరకు నాకేమీ భయంలేదు. అడగండి!" ధృడ నిశ్చయంతో అన్నాడు ప్రతాపసేనుడు. "అయితే నా మొదటి ప్రశ్న విను, మానవుడి మనుగడకు మూలాధారమేమిటి?" "ఆశ!" తడుముకోకుండా సమాధానమిచ్చాడు. "సరిగ్గా చెప్పావు. నా రెండో ప్రశ్న, ఈ లోకంలో అన్నిటికన్న కష్టసాధ్యమైన కార్యమేమిటి!" "స్త్రీ హృదయం తెల్సుకోవటం!" సమాధానమిచ్చాడు. "చాలా బాగా చెప్పావు. నా మూడోదీ, ఆఖరిదీ అయిన ప్రశ్న, మానవుడు దానవుడిగా మారేదెప్పుడు?" "తాను చెయ్యాలనుకున్న పని చెయ్యలేక పోయినప్పుడు!" తక్షణమే సమాధానం చెప్పాడు ప్రతాపసేనుడు. ఆ వెంటనే కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద మెరుపు మెరిసింది. ప్రతాపసేనుడి కళ్ళు రెండు క్షణాలు మూత పడ్డాయి. అతను కళ్ళు తెరిచి చూసే సరికి ఓ దివ్యపురుషుడు చేత దివ్య పుష్పాన్ని ధరించి నిల్చుని వున్నాడు. ప్రతాపసేనుడు అప్రయత్నంగా అతనికి నమస్కరించాడు. ఆ దివ్యపురుషుడు చిరునవ్వుతో, "వీర పురుషా! నీ బుద్ధి కుశలతకి, కార్య దీక్షకి మిక్కిలి సంతోషించాను. నేను దేవ భటుణ్ణి. లోక కల్యాణార్థం శుభాల్నీ, సుఖాల్నీ అనుగ్రహించే యీ కుసుమానికి దేవదేవుడు నన్ను కావలివానిగా నియోగించాడు. ఇప్పుడు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన వారికి దివ్యపుష్పాన్నిమ్మని, చెప్పలేని వాళ్ళని మట్టుబెట్టమని ఆజ్ఞాపించాడు. ఈ నాటి వరకు ఎంతో మందిని మారణహోమం చేశాను. నేటికి నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి, నన్నీ హత్యాపాతకం నించి రక్షించటమేకాక ఈ దివ్య పుష్పాన్ని సంపాదించుకోగలిగావు.  ఇది చాలా మహిమ గల పుష్పం. ఎంతటి మహా వ్యాధినైనా చిటికెలో నయం చేస్తుంది. ఇది వున్న కరువు కాట కాదులు గాని, ఇంకే విధమైన అరిష్టాలు గాని కలగవు. ఈ పుష్పమెన్నడు వాడదు, కాంతి తగ్గదు. ఇది నీలాంటి వాని దగ్గరుంటేనే  రాణిస్తుంది. తీసుకో!" అని ప్రతాపసేనుడికి పుష్పం అనుగ్రహించి అంతర్థానమైపోయాడు.

ప్రతాపసేనుడు భగవంతునికి మనస్సులోనే కృతజ్ఞతాంజలి ఘటించి పుష్పము లభించిన ఆనందంతో ద్రిగుణీకృతోత్సాహంతో తన పంచకల్యాణి గుర్రం సమీపించి అధిరోహించి తిరుగుప్రయాణం మొదలెట్టాడు. మొదటగా తనను ప్రమాదం నుండి రక్షించిన మునీశ్వరుని కల్సుకుని ఆయనకు ధన్యవాదాలర్పించుకుని, ప్రయాణాన్ని కొనసాగించాడు. భూతపతి తన గర్భాన దాచి వుంచిన గ్రంథాల్ని, వాటి స్వంతదారుడైన మునీశ్వరుడికి అందచేసి, ఆయన ఆశీస్సులు పొంది, తిరిగి అక్కడి నుండి  ప్రయాణమయ్యాడు ప్రతాపసేనుడు. ప్రతాపసేనుడు కాశీ రాజ్యం చేరి శూరసింహ మహారాజుని కలుసుకున్నాడు. ఆయన అతణ్ణి ప్రేమగా అక్కున చేర్చుకుని, "నాయనా! అన్న మాట నిలబెట్టుకున్నావు. అమ్మాయి అంతా చెప్పింది. నీ ధైర్యసాహసాలు, కార్యదీక్ష అనన్య సామాన్యం. నా కుమార్తెకే కాక నాక్కూడా పునర్జన్మ ప్రసాదించావు" అన్నాడు. లావణ్య ప్రతాపసేనుణ్ణి ఆరాధనగా చూసింది. నాలుగు కళ్ళు కలుసుకున్నాయి. శూరసింహ మహారాజు యిరువుర్నీ తనివి తీరా చూస్తూ, "నాయనా! వివాహానికి ముహూర్తాలు నిర్ణయించి, అతి శీఘ్రముగా మగధ రాజ్యానికి కబురు చేస్తాను. మీ తండ్రిగారికి మా మాటగా చెప్పు. ఆయనకు మా నమస్కారాలు అంద చేశామని చెప్పు" అన్నాడు ప్రతాపసేనుడు తిరిగి వెళ్ళబోయే ముందు. ప్రతాపసేనుడు తన ప్రయాణం కొనసాగించి జయంతుడి రాజ్యం చేరుకున్నాడు. మిత్రులిద్దరూ గాఢాలింగనం చేసుకున్నారు. 

ప్రతాపసేనుడి వలన జరిగిన విషయాలన్నీ విని చాలా సంతోషించారు జయంతుడు, వీణావతి. తన వివాహ శుభకార్యానికి వారిరువురు తప్పక రావలసినదిగా ఆహ్వానించి, వారి వద్ద సెలవు తీసుకుని వాయు వేగ మనో వేగాలతో మగధ రాజ్యం చేరుకున్నాడు ప్రతాపసేనుడు. ఎన్నో రోజుల అనంతరం తమ అనుంగుపుత్రుని చూసిన రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. ముందుగా మంత్రపుష్పాన్ని తాకించి తండ్రి వక్షస్థలం మీది వ్రణాన్ని ఆనవాలు లేకుండా నయం చేశాడు. చంద్రసేన మహారాజు కుమారుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుని, "తండ్రి ఋణం తీర్చుకున్నావు ప్రతాపా! నీ కోసం బెంగపడి పోయాం మీ తల్లీ, నేనూ. కనీసం మాకు మాట మాత్రంగా చెప్పినా యింత మనో క్షోభ లేకపోయేది. అయినా కడుపు తీపితో మేము నిన్ను వెళ్ళనివ్వలేదని స్వయంగా నువ్వే నిర్ణయించుకుని కార్యాన్ని సాధించుకు వచ్చావు. చాలా సంతోషం నాయనా!" అన్నాడు ఆనందభాష్పాలు రాలుస్తూ. ఓ శుభ ముహూర్తాన ప్రతాపసేనుడికి లావణ్యతో మహా వైభవంగా వివాహం జరిగింది. చంద్రసేన మహారాజు కుమారుడికి పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించాడు. 

Comments