పేదరాశి పెద్దమ్మ కథలు - మాట్లాడే పక్షి

Telugu Pedarasi peddamma kathalu. Best fantasy adventure telugu grand mother stories.
"ముమ్మాటికీ వీడు ధనాగారం దోచుకోవడానికే రాజాంతఃపురంలో ప్రవేశించాడు. వీడి మాటలు నమ్మకండి మహారాజా!" గుడ్లురుముతూ అన్నాడు సైన్యాధిపతి విక్రముడు. "అదిగో! ఆ మాటే అనొద్దన్నాను! నేను దొంగతనానికి రాలేదు మొర్రో అంటే వినిపించుకోవేం?" అన్నాడు వెర్రిబాగుల ముకుందుడు. మహారాజు అనంతవర్మకు ముకుందుడి ధోరణికి ఒళ్ళు మండినట్టు అయింది. అనంతవర్మ ముకుందుడికేసి కోపంగా చూస్తూ "నువ్వు అర్ధరాత్రి సమయంలో రాజాంతఃపురంలో ప్రవేశించిన మాట నిజమేనా?" అడిగాడు. "నిజమే!" "ధనాగారానికి వెళ్ళే మార్గంలో పూలమొక్కల చాటున నక్కి నక్కి నడుస్తున్న మాట కూడా యదార్థమే కదూ!" "యదార్థమేనండీ! కాని నేను దొంగతనానికి మాత్రం రాలేదు" అన్నాడు ముకుందుడు. "దొంగతనానికి రాలేదా?" "అవును మహారాజా! అసలు ఆ మార్గం ధనాగారానికి పోయేదని నాకు తెలియని తెలియదు!" "మరయితే ఎందుకొచ్చావ్?" మహారాజు గర్జించినట్లు ప్రశ్నించాడు. "మరీ...మరీ..." ముకుందుడు అసలు విషయము చెప్పడానికి భయపడుతున్నట్లు నసిగాడు. "ఊఁ.. చెప్పు!" గుడ్లెర్రజేసాడు అనంతవర్మ. ముకుందుడు నోరు విప్పబోయేంతలో విక్రముడు కలుగజేసుకుని, "వీడితో వాదప్రతివాదనలు అనవసరం ప్రభూ! నా మాట వినండి. వీడు పచ్చి దొంగ కాబట్టే అర్ధరాత్రి కావలివారి కన్నుగప్పి రహస్యంగా రాజమందిరాల్లో ప్రవేశించగలిగాడు. యింతకన్నా సాక్ష్యం దేనికి?" అన్నాడు.

"తొందరపడకు విక్రమా! నిందితుడ్ని మనం నేరం చేస్తుండగా బంధించలేదు గాబట్టి అతడి వాంగ్మూలం కూడా మనం వినాలి. అతడు చెప్పేదాంట్లో ఏ యదార్థం లేదనిపించినా మనం అతడ్ని శిక్షార్హుడిగా నిర్ణయించవచ్చు" అన్నాడు. మహారాజు మాటలు విన్న తరువాత, ముకుందుడిలో కొంచెం ధైర్యం పొడచూపింది. అనంతవర్మ ముకుందుడికేసి చూసి, "ముకుందా! నువ్వు మహారాజ వైద్యుడి కుమారుడివి కనుకనే నీపై ఇంత ఉపేక్షిస్తున్నాం! నువ్వు గనుక నిజం చెప్పకపోయినట్లయితే తీవ్ర దండనకు గురికావలసి వుంటుంది. కాబట్టి అబద్ధం ఆడి మాకు మరింత ఆగ్రహం తెప్పించక నిజం చెప్పు" అని సౌమ్యంగా అడిగాడు మహారాజు. ముకుందుడు వైద్యశాస్త్రంలో అఖండ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఎన్నో బిరుదులు సన్మానాలు పొందిన రాజవైద్యుడు గోవిందశర్మ కొడుకు. ముకుందుడు స్వతహాగా ఒట్టి వెర్రిబాగులవాడు. అతడు చెప్పిన పని సరిగ్గా చేయకపోగా, దానికి తోడుగా చెప్పని పనులూ, అనవసరమైన పనులూ నాలుగు చేసి ఊళ్ళోవాళ్ళతో తగవులుపడి తన్నులు తిని యిల్లు చేరేవాడు. ఒకసారి ఊరి తగవుల్లో తలదూర్చి యింటి మీదికి తెచ్చేవాడు. గోవిందశర్మ కుమారుడికి వైద్యశాస్త్రం బోధించి తనంతటి వాడిని చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే, వెర్రిబాగులవాడూ, మందబుద్ధీ అయిన ముకుందుడికి వైద్యశాస్త్రం సరిగ్గా ఒంటబట్టలేదు. అతడు చిన్న చిన్న రోగాలకు సంబంధించిన ప్రక్రియలు తెలిసీతెలియనట్టు నేర్చుకోగలిగాడు గాని, దీర్ఘవ్యాధులకూ, మొండి రోగాలకూ సంబంధించిన వైద్యశాస్త్ర కీలకాలు, రహస్యాలు అతడికి వంటబట్టలేదు. యిలా వుండగా - ఒకసారి అంతఃపురంలో ఏవో వుత్సవాలు జరుగుతున్న కారణంగా ప్రత్యేకమయిన వినోద ప్రదర్శనలు తిలకించడానికి రావలసిందిగా మహారాజు అనంతవర్మ గోవిందవర్మను ఆహ్వానించాడు.

ఎంతోకాలంగా రాజధానిని, రాజాంతఃపురాన్నీ చూడాలని ముచ్చటపడుతున్న ముకుందుడు తండ్రి వెంట తనూ వస్తానని మారాం చేసాడు. "నువ్వెందుకురా అంతఃపురానికి! అక్కడ నువ్వేదయినా తలతిక్క పని చేసావంటే నేను తలెత్తుకు తిరగలేను" అన్నాడు గోవిందశర్మ కొడుకును వారిస్తూ. "చాన్నాళ్ళనుంచీ అంతఃపురానికి తీసుకువెళతానని చెపుతూ యిప్పుడు అవకాశం వచ్చినా కూడా యిలా సాకులు చెప్పడం నాకు నచ్చలేదు నాన్నగారూ! ఏమయినా సరే, మీతో పాటు నన్నూ తీసుకువెళ్ళి తీరాలి!" పట్టుపట్టాడు ముకుందుడు. ముకుందుడిది ఒట్టి మొండిపట్టుదల అని తెలిసిన గోవిందశర్మ ఇక రాజధానికి అతణ్ణి తీసుకువెళ్ళక తప్పదని నిర్ణయించుకుని, ముకుందుడికేసి చిరునవ్వు ముఖంతో చూస్తూ "సరే ముకుందా! తీసుకువెళతాను!" ఆ మాటకు ముకుందుడు ఎగిరి గంతేసి, "నాన్నగారు..చాలా మంచివారు!" అన్నాడు పసివాడిలా ఎగిరి చప్పట్లు కొడుతూ. ముకుందుడి పసితనపు చేష్టలు చూసి గోవిందశర్మకు ఏడవాలో నవ్వాలో తోచలేదు. అయితే, గోవిందశర్మ మనసులో అప్పటికప్పుడు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే, ముకుందుడిని యిలా తన కూడా నలుగురిలోకి తీసుకువెళ్ళడం ద్వారా అతనిలోనూ, అతని ప్రవర్తనలోనూ ఏదయినా మార్పు తీసుకురావచ్చు. అలా తీసుకువెళ్ళడంవల్ల ఏది ఎలా వున్నా, సభ్యతా సంస్కారమయినా అలవడతాయి అనిపించింది. "బయల్దేరదామా?" అన్నాడు ముకుందుడు. "ఆఁ...ఆఁ... అయితే ఒక్క షరతు!" "ఏమిటది?" "నువ్వు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పెదవి విప్పి మాట్లాడకూడదు." "ఎందుకని..?" "అది అడక్కూడదు" అన్నాడు గోవిందశర్మ. "అది కాదు..మరీ.." "ముందు నేను చెప్పింది యిష్టమేనా..చెప్పు" "సరే మీ యిష్టం..!" "నా వెంట ఉండి, నా వెంటనే తిరిగి, మళ్ళీ నాతోనే వచ్చెయ్యాలి!" అని చెప్పాడు గోవిందశర్మ. "మరి ఎవరయినా పలుకరిస్తే.." "మితంగా మాట్లాడాలి.." "పేరు అడిగితే..." "చెప్పాలి!" "అలాగే!" "అయితే దుస్తులు మార్చుకుని, మంచి దుస్తులు వేసుకురా!" అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజోచితమైన దుస్తులు ధరించి తండ్రితో పాటు రాజధానికి పోయాడు.

రాజమార్గం గుండా వినోదాలు, విచిత్ర వేషధారణలతో పోతున్న వాహనాలను తిలకిస్తూ ఎంతో సంబరపడుతూ నడుస్తున్న ముకుందుడి పాదాలు ఒకచోట టక్కున ఆగిపోయాయి. దానిక్కారణం? అంతఃపుర గవాక్షంనుండి వినోదప్రదర్శనలను గమనిస్తూ అక్కడ పల్చటి పరదాల మాటున నిలుచున్న రాకుమారి మధులత. రాకుమారి మధులత అసమాన సౌందర్యరాశి.. ఆమె అందాన్ని చూస్తూనే ముకుందుడు ముగ్ధుడయిపోయాడు. అతని కాళ్ళు ఉన్న చోటునుండి కదలడం మానేశాయి. అదే సమయంలో, రాకుమారి మధులత కూడా ఆ పరదామాటునుండి ముకుందుడిని చూసింది. ముకుందుడు వెర్రిబాగులవాడే గాని, అతడు మన్మధుణ్ణి తలదన్నే అందగాడు. అతగాడి అందాన్ని చూస్తూనే మధులతకు మూర్ఛపోయినంత పనయింది. యిద్దరి కళ్లూ కలిసాయి. మనసులు ప్రేమ పారవశ్యంతో మునిగి తేలుతున్నాయి. వారిరువురూ వినోదప్రదర్శనలు తిలకించడం లేదు. ఒకరినొకరు తనివితీరా చూసుకోసాగారు. గోవిందశర్మ కొంతదూరం వెళ్ళినవాడు తన వెంట ముకుందుడు రాకపోవడం గమనించి, వెనుదిరిగి వచ్చి, రెప్పలార్చకుండా అంతఃపుర గవాక్షం కేసే చూస్తున్న ముకుందుడి చెయ్యి పట్టుకుని వెంట లాక్కుపోయాడు. రాజబంధులతోపాటు, ఉచితమయిన ఆసనంలో ఠీవిగా కూర్చుని వినోదప్రదర్శనలు తిలకిస్తున్నాడన్నమాటే గాని అతడి మనస్సు మనసులో నిలవడంలేదు. అతడికి రాకుమారి అందమే గుర్తుకువస్తోంది. అయితే అక్కడే మహారాజుగారి సరసన కూర్చున్న మధులత ఒకమారు తల త్రిప్పి గోవిందశర్మ ప్రక్కన కూర్చుని వున్న ముకుందుడికేసి చూసి చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వుతో ముకుందుడు చిత్తయిపోయినట్టయిపోయాడు. వినోదప్రదర్శనలు ముగిసాయి. 

రాకుమారి మధులత మహారాజు అనంతవర్మ వెంట అంతఃపురంలోనికి పోతూ వెనుదిరిగి ముమ్మారు ముకుందుడికేసి చూసి ముచ్చటయిన చిరునవ్వులు చిందిస్తూ, తన కనురెప్పల కదలికలతో తన ప్రేమ సందేశాన్ని అతడికి అందించింది. తండ్రితోపాటు యింటికి తిరిగి వచ్చేసిన ముకుందుడికి మనసులో ఏదో వెలితి ఏర్పడినట్టయింది. అతడికి తిండి సహించలేదు, నిద్రపట్టలేదు. ఎటు చూసినా అతడి కంటికి రాకుమారి మధులత సుందర రూపమే గోచరించసాగింది. ఆమె తనవైపు చూసినప్పుడు నవ్విన చిరునవ్వే అతడికి గుర్తుకురావడం మొదలెట్టింది. అతడు లోలోపల బెంగపడుతూ, మూగవాడిలా గడపసాగాడు అంతుపట్టని ఆలోచనలతో. ఎప్పుడూ ఏదో ఒక అల్లరిపని చేస్తూ, ఆకతాయిలా తిరుగుతూ హుషారుగా వుండే ముకుందుడు అలా మన్నుతిన్న పాములా పడివుండటం గోవిందశర్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడలా ఎందుకుంటున్నాడో అన్న విషయం ఎంతగా ఆలోచించినా గోవిందశర్మ బుద్ధికి అంతుపట్టలేదు. అప్పటికే మూడురోజులుగా అన్నపానీయాలు మాని, బెంగతో నీరసించిపోయాడు ముకుందుడు. అసలు తన కొడుకు మనోవేదనకు కారణమేమిటో తెలుసుకోవాలని గోవిందశర్మ ఒకనాడు, "నాయనా ముకుందా! ఎందుకలా ఉంటున్నావ్? సరిగా భోజనంకూడా చేయడంలేదెందుకని? నువ్వెందుకిలా బెంగపడిపోతున్నావ్? చెప్పు నాయనా! నీకేం కావాలి?" అని బుజ్జగిస్తూ పసిపిల్లవాడ్ని అడిగినట్టుగా అడిగాడు గోవిందశర్మ. తండ్రి అలా ఆప్యాయంగా అడిగేసరికి ముకుందుడికి ఎక్కడలేని దుఃఖము ముంచుకు వచ్చింది. ముకుందుడు కంట తడిపెడుతూ, తను రాజకుమారి మధులతపై మనసుపడ్డ విషయం తన తండ్రి గోవిందశర్మ ఎదుట పెట్టాడు. "నేను రాకుమారిని తప్ప మరో పిల్లను పెళ్ళాడను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎలాగయినా ఆమెతో నా పెళ్ళి జరగాలి. ఆమె నా పెళ్ళాం కావాలి! లేకుంటే యిలా తిండి తిప్పలూ మాని బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటాను!" అని చెప్పాడు ముకుందుడు. ముకుందుడి విడ్డూరమయిన కోరిక వింటూనే తల తిరిగినంత పనయింది గోవిందశర్మకు. కొంపతీసి వీడికి మతి భ్రమించలేదు కదా! అనుకొని ముకుందుడి నాడి పట్టుకొని చూసాడు. ఆ తరువాత అతడి శిరస్సును పరీక్షించాడు మెదడు ఎక్కడన్నా దెబ్బతిన్నదేమోననని. "నాకేం పిచ్చిపట్టి కాదు, ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పండి!" అన్నాడు ముకుందుడు. ముకుందుడికి మతిభ్రమలాంటిదేమీ కలుగలేదని వాడిది నిజమయిన కోరికేనని నిశ్చయించుకున్న తరువాత గోవిందశర్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ "ఒరే ముకుందా! యిదేమి విడ్డూరమయిన కోరికరా నీకు! ఎందరో రాకుమారులు ఆమెను కలవరిస్తూ కోరి వరించి వస్తామన్నా అంగీకరించడంలేదు సరికదా వారి వంక కన్నెత్తయినా చూడని రాకుమారి మధులత నిన్ను పెళ్ళాడుతుందని ఎలా అనుకుంటున్నవ్? అదీగాక రాజాశ్రయంలో బ్రతికే భృత్యులమయిన మనకు యిలాంటి కోరికలు తగనివి. ఆశపడ్డం తప్పు అని నేను అనడం లేదు. దానికి కూడా ఒక అర్హతా, తగిన అంతస్తూ ఉండొద్దూ!" అన్నాడు గోవిందశర్మ.

"అవేమీ నాకు తెలియవు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంతే! నాకు అర్థంగాని అడ్డంకులేవో చెప్పి మభ్యపెట్టవద్దు!" అన్నాడు ముకుందుడు. "నువ్వు ప్రేమిస్తే సరా! రాకుమారి నిన్ను యిష్టపడొద్దూ" చిరాకుపడుతూ అన్నాడు గోవిందశర్మ. "నేనంటే రాకుమారికి యిష్టమే" అన్నాడు ముకుందుడు. "నీకెలా తెలుసు, నువ్వామెతో మాట్లాడావా?" కంగారుపడిపోతూ అడిగాడు గోవిందశర్మ. "నేను మాట్లాడలేదు, అయినా నాకు తెలుసు, నేనంటే ఆమెకు ఎంతో యిష్టం!" "ఎలా చెప్పగలవ్?" "ఆమె నన్ను చూసి నవ్వింది!" "నవ్విందా?" "అవును ఒక్కసారి కాదు, మూడుసార్లు నవ్వింది తెలుసా?" అన్నాడు గొప్పగా ముకుందుడు. "అయితే?" "నన్ను ప్రేమించి ఉండకపోతే..నేనంటే యిష్టంకలుగకపోతే నన్ను చూసి ఎందుకలా నవ్వుతుంది రాకుమారి" అన్నాడు ముకుందుడు. ముకుందుడి కోరికకూ, అతడు రాకుమారి మీద ఆశపడి బెంగపెట్టుకోవడానికి కారణమూ తెలిసిపోయింది గోవిందశర్మకు. ముకుందుడి మాటలు వింటూనే ఫక్కున నవ్వేశాడు గోవిందశర్మ. అతడు కావాలనే రాని నవ్వు తెచ్చిపెట్టుకుని అలా నవ్వేడు. "ఎందుకా నవ్వూ?" అడిగాడు ముకుందుడు. "ఒరే ముకుందా! నువ్వు నిజంగానే గొప్ప వెర్రిబాగులవాడివిరా తండ్రీ!" "ఏం?" "రాకుమారి ఎందుకలా నవ్విందంటావ్?" "ఎందుకు నవ్వింది?" "నువ్వేదో వెకిలిచేష్టచేసి వుంటావు.. అదీగాక ఆ రోజు నీ దుస్తులూ.. నీ అలంకారం అంతా నాకే నవ్వు తెచ్చిపెట్టేదిగా వుంది.. పోనీలెమ్మని నేను అడ్డుచెప్పలేదు నీకు!" అని బొంకాడు గోవిందశర్మ.

"అదేం కాదు! మీరు బొంకుతున్నారు" అన్నాడు ముకుందుడు. "బొంకవలసిన అవసరం నాకేమిటి.. పోనీ ఆ విషయం ఈసారి రాకుమారి కనిపిస్తే నువ్వే అడిగి తెలుసుకో.. నువ్వన్నట్లు రాకుమారి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నీ యిష్టప్రకారమే పెళ్ళి జరిపిస్తాను" అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజకుమారి మధులతను కలుసుకోవడం ఎప్పటికీ వీలుపడని విషయం అనే ఉద్దేశ్యంతో గోవిందశర్మ అంత ధీమాగా మాట యిచ్చాడు కొడుక్కి. అయితే, అదే రాత్రి ముకుందుడు తెగించి అంతఃపురంలో ప్రవేశించి రాకుమారిని కలుసుకుని తనివితీరా ఆమెతో మాట్లాడి ఆమె అంగీకారాన్ని పొందుతాడని ఊహించలేకపోయాడు గోవిందశర్మ. రాకుమారి తనను ప్రేమిస్తున్నదన్న నిజం ఆమె ద్వారానే తెలుసుకుని ఎంతో ఉత్సాహంతో తిరిగివస్తున్న ముకుందుడు రాజభటులకు దొరికిపోయాడు. సైన్యాధిపతి విక్రముడు అతణ్ణి చితకబాదించి తెల్లవారుతూనే మహారాజు ఎదుట హాజరు పరిచాడు. "ఏమిట్రా కూసావ్!" ముకుందుడి మాటలు వింటూనే అనంతవర్మ మహారాజు కోపంతో మండిపడ్డాడు. "అవును మహారాజా! మీరు నిజం చెప్పమని అడిగిన తరువాత అబద్ధం చెపితే ఏం బావుంటుంది చెప్పండి! నేను రాకుమారిని కలుసుకోవడానికి అంతఃపురంలో ప్రవేశించాను" అన్నాడు ముకుందుడు. "మరోసారి ముకుందుడి నోటివెంట ఆ మాటలు వినేసరికి అనంతవర్మ పట్టరాని ఆవేశంతోనూ, ఆగ్రహంతోనూ నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే, "విక్రమా! ఈ బుద్ధిహీనుణ్ణీ పొగరుబోతునూ తక్షణం చెరసాలలో వేయించి చిత్రవధ చేయించు తెల్లవారుతూనే తల తీయించు!" అని ఆజ్ఞాపించి అక్కడ్నించి నిష్క్రమించాడు మహారాజు అనంతవర్మ. అనంతవర్మ ముకుందుడికి మరణదండన విధించిన విషయం తెలియగానే గోవిందశర్మ గోడు గోడు మంటూ మహారాజును ప్రాధేయపడ్డాడు, తన కొడుకుని ప్రాణాలతో విడిచిపెట్టమని. 

అయితే, అంతకుముందే రాకుమారి మధులత మహారాజును కలుసుకుని తను ముకుందుడ్ని ప్రేమిస్తున్న విషయం యదార్థమేనని చెప్పింది. అందుకు అనంతవర్మ ఆగ్రహావేశపరుడై ఎందుకూ కొరగాని ఆ బుద్ధిహీనుణ్ణి వరించి వంశ ప్రతిష్టలకు అపకీర్తి తెచ్చిపెట్టే సాహసానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. మధులత తండ్రి మాటలకు దుఃఖము పొంగుకు రాగా, పొర్లివస్తున్న కన్నీటిని అదుపుచేసుకుంటూ కనీసం ముకుందుడ్ని ప్రాణాలతోనయినా విడిచిపెట్టవలసిందని అర్ధించి వెళ్ళిపోయింది. తరువాత గోవిందశర్మ ప్రార్థన విన్న మహారాజు అతనిపై గల అభిమానంతో విక్రముణ్ణి పిలిపించి, "విక్రమా! గోవిందశర్మ పూర్వుల కాలం నుంచీ ఎంతో భక్తిభావంతో రాజసేవ చేసిన వంశంలోనివాడు. మనకు ఎంతో అవసరమయిన వాడు. అందుకని ఆ ముకుందుడికి మరణశిక్ష రద్దు అయ్యేలాగా ఆ పొగరుబోతు మళ్ళీ అంతఃపురంలో ప్రవేశించకుండా ఉండేలాగా ఏదయినా శిక్ష అలోచించి విధించు" అని శిక్ష విధించే బాధ్యత సైన్యాధిపతి విక్రముడిమీద వదిలాడు. గోవిందశర్మ విక్రముడి వంక దీనంగా చూసాడు. అయితే, విక్రముడు అప్పటికే మధులతను తన మనసులో గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఎలాగయినా ఆమె మనసును తన వైపుకి మరల్చుకుని ఆ రాజ్యానికి రాజు కావాలని ఆశపడుతున్నవాడు కావడం వలన తనకు మరొకడు పోటీగా ఉండడం అతనికి కంటగింపుగా తయారయింది. శిక్షించే అవకాశం తన చేతికి చిక్కడంతో, అతడొక విషపు నవ్వు తన పెదవులపై మెరిపించి, "ప్రభూ! మీరన్నట్టు ఘనవైద్యులయిన గోవిందశర్మగారి ప్రార్థన మన్నించవలసిందే. అందుకే ముకుందుడ్ని ప్రాణాలతో మాత్రమే విడిచిపెడుతూ ఈ రాత్రికి రాత్రి అడివిలోకి పంపించి కాళ్ళు రెండూ మాత్రమే నరికించి విడిచిపెట్టే శిక్ష విధిస్తున్నాను. ఆ సమయంలో మన గోవిందశర్మగారు మన అంతఃపురం విడిచి వెళ్ళకూడదని కూడా మీ తరపున శాసిస్తున్నాను" అన్నాడు విక్రముడు.

విక్రముడి నోటివెంట ఆ మాటలు వెలువడుతూనే గోవిందశర్మ భయంతో నిలువెల్లా వణికిపోతూ తన కన్న కుమారుడికి పట్టబోతున్న దుస్థితిని తలంచుకొని "హా! ముకుందా!" అంటూ మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. "విక్రమా! నీ శిక్ష సమంజసంగానే తోస్తోంది. వెంటనే అమలు జరిపించు" అని చెప్పాడు. ఆ వెంటనే విక్రముడు నలుగురు భటులను పిలిపించి ముకుందుడికి తను విధించిన శిక్ష వివరించి చెప్పి అది అమలుజరిపి రమ్మని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి విక్రముడి ఆజ్ఞ ప్రకారం నలుగురు భటులు ముకుందుడ్ని ఆ రాత్రికి రాత్రి అరణ్యానికి తీసుకుపోయి నట్టడివిలో అతడి పెడరెక్కలు విరిచికట్టి రెండుకాళ్ళూ మోకాళ్ళవరకూ నరికేసి, అతడ్ని అడవిలోనే వదిలేసి వచ్చారు. ఆ బాధకు తట్టుకోలేక ముకుందుడు పెద్దపెట్టున ఆర్తనాదం చేస్తూ మూర్ఛపోయాడు. సూర్యకిరణాలు వేడిగా ముఖానికి శోకడంతో మెలకువ వచ్చింది. కాళ్ళు రెండూ నరికినచోట విపరీతంగా నొప్పెడుతూ ప్రాణాలను తోడేస్తున్నట్టున్నాయి. అవి రక్తం ఓడి, నరికినచోట గడ్డ కట్టుకుపోయింది. విపరీతమైన దాహంతో నాలుక పిడుచకట్టుకుపోయింది. అతడు తన దుస్థితిని తలచుకొని చింతిస్తూ, చేతులు నేలకు ఆనించి శరీరాన్ని ముందుకు యీడుస్తూ ఆ మహారణ్యంలో నీటికోసం వెదకసాగాడు. కొంతసేపటికి అతడు బాగా దట్టంగా చెట్ల గుబురులతో పొదలతో వున్న ప్రదేశం చేరుకున్నాడు. అంతలో, ఎక్కడ్నించి వచ్చిపడిందో ఒక అద్భుతమైన, అందమైన పంచెవన్నెల పక్షి ఒకటి అతడి ముందు పడింది. దాని రెక్కల మధ్య బాణం ఒకటి గుచ్చుకొని వుంది. అది బాధతో విలవిలలాడుతూ తన అందమయిన పొడుగాటి రెక్కలతో టపటప కొట్టుకోసాగింది. 

ముకుందుడు అంత బాధలోనూ అద్భుతమయిన పక్షిని చూసి అబ్బురపడ్డాడు. అటువంటి పక్షిని అతడు యిదివరకెన్నడూ చూసి ఉండలేదు. ఎవరూ చెప్పగా గూడా వినలేదు. అందమయిన పొడుగాటి రెక్కలు. చక్కని వంకె తిరిగిన ముక్కు. నెత్తిన కిరీటంలా అమరి వున్న కుచ్చు. గుజ్జుగా వున్న తోక ఆ పక్షి శరీరాన్ని మించిన పొడుగ్గా వుంది. దాని బాధ చూసి ముకుందుడు తన బాధను మరచిపోయి విలవిలలాడాడు. అంతలో ఆ సమీపంలో ఏదో చప్పుడయింది. ఆ సమయంలో ఆ పక్షి విచిత్రంగా మాట్లాడుతూ "ఆ దుర్మార్గుడు వస్తున్నాడు నన్ను రక్షించు! నన్ను రక్షించు!" అని మాట్లాడింది. ముకుందుడికి ఎక్కడా లేని ఆశ్చర్యం కలిగింది. అతడు తన ఆశ్చర్యాన్ని మనసులోనే అణుచుకొంటూ ఆ పక్షిని తన దుస్తుల మాటుకు చేర్చుకొని గబగబా పొదలమాటుకు తన శరీరాన్ని యీడ్చుకొంటూ పోయి పొదల మాటున దాక్కున్నాడు. అంతలో, యిద్దరు ఆటవిక వేటగాళ్ళు ఆ ప్రక్కగా ఆ పక్షిని వెదుక్కుంటూ వచ్చి అక్కడ పొదలను కదిలించి చూడసాగారు. వారిద్దరూ ముకుందుడు దాగివున్న పొద దగ్గరికి వచ్చేసరికి అటుగా పాకుతున్న పాము నొకదాన్ని చేత్తో పట్టుకొని పొద బయటికి విసిరాడు ముకుందుడు. పొద బయటపడ్డ పాము బుసలుకొడుతూ, చర చరా ప్రాకుతూ ఆ పొదకు మరో దిశగా పోవడం చూసిన వేటగాళ్ళు యిద్దరూ ఆ పాము వచ్చిన పొదను సమీపించడానికి భయపడి.. ఆ చుట్టుప్రక్కల కొంచెంసేపు వెదకి విసుగుదలతో తిరిగి వెళ్ళిపోయారు. హమ్మయ్య అని నిట్టూర్చి తన దుస్తుల మాటున ఉంచిన ఆ మాట్లాడే పక్షిని బయటకు తీసి పొద బయటకి వచ్చాడు ముకుందుడు.

ఆసరికే ఆ మాట్లాడే పక్షి నీరసంతో తల వాల్చేసింది. ముకుందుడు ఆలస్యం చేయకుండా ఆ పొదలోంచి కొన్ని ఆకులను తుంచి అక్కడ ఒత్తుగా పరిచి మాట్లాడే పక్షిని దానిమీద పరుండబెట్టాడు. తన దాహం సంగతి కూడా మరిచిపోయి, దేకుతూనే అక్కడ చిన్న చిన్న నేలబారు మొక్కలకున్న ఆకులను తుంచి వాసన జూస్తూ, స్వల్ప గాయాలను మాన్చటానికి పనికివచ్చే ఔషధ లక్షణాలు గల ఆకులను ఎంచి వాటిని బాగా నలిపి పిండగా వచ్చిన రసాన్ని ఆ మాట్లాడే పక్షికి బాణం దెబ్బవల్ల తగిలిన గాయం మీద వేసి నలిగిన ఆకుల ముద్దను గాయంపై పెట్టి తన అంగీని చింపి కట్టు కట్టాడు. కొంతసేపటికి ఆ మాట్లాడే పక్షి తేరుకుని కృతజ్ఞతగా అతడికేసి జూస్తూ అతని తొడమీద ఆప్యాయంగా తారట్లాడింది. "ఇంత మంచివాడివీ, భూతదయ గలవాడివీ అయిన నీకీ దుస్థితి యెలా వచ్చింది? నిన్ను యిలా చేసిన దుష్టులు ఎవరూ?" అని అడిగింది మాట్లాడే పక్షి. గుప్పెడంత వున్న ఆ పక్షి ఎంతో ముచ్చటగా మాట్లాడుతుంటే ఎంతో ఆనందపడ్డాడు. దాన్ని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తోక నిమురుతూ "నా సంగతంతా తరువాత చెబుతాను గాని, ఆకాశంలో తిరిగేదానివి కదా! నా కిన్ని నీళ్ళు దొరికే చోటు చూపించెదవా? దాహంతో గొంతు ఎండిపోయింది" అన్నాడు. "ఆకుతో దోనె చేసి యివ్వు. నేను పోయి నీళ్ళు తెస్తాను! నువ్వు అంత దూరం రాలేవు" అంది మాట్లాడే పక్షి. ముకుందుడు ఆకులతో దోనె చేసి యిచ్చాడు. మాట్లాడే పక్షి ఆ దోనెను ముక్కుతో కరిచి పట్టుకుని క్షణంలో గాల్లోకి ఎగిరి, రెప్పపాటు కాలములో తిరిగి నీటితో అతని ముందు వాలింది. అంతటి స్వల్ప సమయంలో తిరిగి వచ్చిన ఆ పక్షి వేగానికి ముకుందుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. 

అతడు నీటిని ఆత్రంగా గడ గడా తాగేసి, తన దాహం తీరిన మీదట, తన ఆశ్చర్యాన్ని బయటపెట్టాడు. "అసలే గాయపడి వున్న నువ్వు ఎగరడమే ఆశ్చర్యం! అందులోనూ యింత వేగంగా ఎలా తిరిగి రాగలిగావు?" అని అడిగాడు. "అదే కదా నాలో ప్రత్యేకత! ఎంత దూరమయినా చిటికెలో తిరిగి రాగాలను. ఎంతటి బరువునయినా మోయగల శక్తి నాకుంది. అసలు అందుకోసమే ఆ వేటగాళ్ళు నా వెంటపడింది. నా సంగతి మొత్తం తర్వాత చెబుతానుగాని, నీ విషయం చెప్పు వింటాను" అంది. ముకుందుడు తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఆ పక్షి ముకుందుడి ముఖం వంక తేరిపార చూస్తూ ఎగిరి అతని భుజం మీద వాలి, "ఆ రాజెవడో వెర్రి నాగన్నలాగున్నాడు. నిన్ను తన కూతురికి యిచ్చి చెయ్యడానికి నీ అందమూ, మంచితనమూ చాలు. యింతకంటే అర్హతలు యింకేం కావాలి" అంది పక్షి. "యిప్పుడు నువ్వు అలా అని మాత్రం ఏం ప్రయోజనం. నా మధులత నాకు దక్కకుండా పోయింది. నడిచేందుకు కాళ్ళు లేవు. యింక బ్రతికి ఏం ప్రయోజనం? ఈ అడవిలో ఏ జంతువుకయినా ఆహారమై చచ్చిపోవాలనుంది" అన్నాడు ఏడుస్తూ ముకుందుడు. "బాధపడకు! కష్టాలు వచ్చినప్పుడే నిబ్బరంతో ఉండాలని మా పూర్వులెవరో చెప్పేవారు. నీ కాళ్ళు నేను తిరిగి యివ్వలేను గాని అవి తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను" అంది పక్షి. ఆ మాట వింటూనే ముకుందుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతడు తన కన్నీటిని తుడుచుకుంటూ, "నిజమా పోయిన కాళ్ళు మళ్ళీ అతుక్కునే ఉపాయం నీకు తెలుసా?" ఆశగా అడిగాడు.

 "అవును ముకుందా!" "ఏమిటది?" "ఈ అడవిలో చాలాదూరం పోతే, ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అందులో యవ్వనవతీ, సౌందర్యరాశీ అయిన ఒక మునికన్య కనిపిస్తుంది. ఆమె చాలా జాలి గుణం గలది. ఆమెని ఆశ్రయిస్తే నీ దుస్థితిని తొలగించవచ్చు. అయితే పగటిపూట ఆమె ఎవరి కంటా పడదు. చీకటిపడిన వెంటనే ఆశ్రమం తలుపులు తెరుస్తుంది" అంటూ మునికన్యను గురించి చెప్పింది పక్షి. ముకుందుడిలో కలిగిన సంతోష ఛాయలు అంతలోనే మాయమయ్యాయి. అతనిలో మళ్ళీ విచారం అలుముకుంది. అతడు దిగులుగా ముఖం పెట్టి పక్షికేసి చూస్తూ, "సరే కాళ్ళు లేనివాడిని, తిండీతిప్పలు లేక శుష్కించిపోయిన ఈ శరీరాన్ని అంతదూరం ఎన్ని రోజులకని యీడ్వవగలను. ఈ అడవిలో యీలోగా ఏ పులో, సింహమో నన్ను నోటకరుచుకుపోదని నమ్మకమేమిటి? చావే నా ముఖాన రాసిపెట్టి వుంది. నువ్వు ఉపాయం చెప్పి మాత్రం ఏమిటి లాభం" అని వాపోయాడు ముకుందుడు. "ముకుందా! మీ నాన్నగారూ, మహారాజుగారూ చెప్పినట్టు నువ్వు వెర్రిబాగులవాడివే సుమా!" అంది మాట్లాడే పక్షి. "నువ్వు కూడా అంటున్నావు కాబట్టి ఆ మాట నిజమే కావచ్చు." అన్నాడు. పాపం ఆకలితో నీ బుద్ధి మరింతగా మందగించిపోతున్నది కాబోలు. కాసిన్ని ఫలాలు తెచ్చి పెడతాను అవి తిని బెంగపడ్డం మానెయ్" అంటూ తుర్రుమని ఎగిరి, క్షణంలో రకరకాల పళ్ళను నోట కరుచుకొచ్చి అతని ముందుంచింది. ముకుందుడు ఆ పళ్ళను తిని ఆకలి తీర్చుకున్నాడు.  

 "చక్కగా ఆకులతో బలమైన ఉయ్యాల అల్లుకుని దానిలో కూర్చో! నేను నిన్ను క్షణంలో మోసుకుపోతాను" అంది పక్షి, ఆ చుట్టుప్రక్కల వున్న లతలనూ, తీగెలను తీసుకువచ్చి అతని ముందు కుప్పగా పోస్తూ. "నువ్వా, నా బరువు మొయ్యగలవా?" ఆశ్చర్యంగా అడిగాడు ముకుందుడు. "అయ్యో! అప్పుడే మరిచిపోయావా? యింతకు ముందేకదా చెప్పాను, నేను ఎంతటి బరువునైనా మొయ్యగలననీ, ఎంతటి దూరమైనా క్షణంలో చేరగలననీ!" అంది పక్షి. పక్షి మాటలు వింటూనే ముకుందుడు ఆనందంతో, ఆశ్చర్యంతోనూ తలమునకలవుతూ పక్షి యిచ్చిన లతలతోనూ, తీగెలతో తను కూర్చోగలిగినంత, తన బరువును ఆపగలిగినంత బలంగా ఉయ్యాలను తయారుచేసి దానిలో తను కూర్చున్నాడు ముకుందుడు. ఉయ్యాల రెండు చివర్లూ ముడివేసినచోట పట్టుకుని దూదిపింజను నోటకరుచుకుపోతున్నంత తేలికగా ముకుందుడితో సహా ఉయ్యాలను గాల్లో తేల్చి ఎగరసాగింది అత్యంత వేగంతో పక్షి. ఆ పక్షి ఎంత ఎత్తులో ఎంత వేగంతో ఎగురుతుందో కూడా వూహించడం కష్టమయిపోయింది. ముకుందుడికి మహా వృక్షాలు పిల్ల మొక్కలుగానూ, సెలయేర్లు చిన్న చిన్న నీటి గుంటలుగానూ కనిపించసాగాయి అతని కంటికి. 

 "విక్రమా! మతివుండే ఆ మాట అంటున్నావా? లేక మధుపానం చేసి మా మందిరానికి వచ్చావా?" అని అడిగాడు మహారాజు అనంతవర్మ. విక్రముడు చిరునవ్వు నవ్వి, "ప్రభూలవారి ముందు అంత అమర్యాదగా ప్రవర్తిస్తానా?" అన్నాడు విక్రముడు. మరి నువ్వు మాట్లాడేదేమిటి? సైన్యాధిపతివి అనే సంగతి మరిచిపోయి రాకుమారిని చేపట్టాలనే తలంపు నీకెలా కలిగింది? ఎందరో సామంతులనూ, సాటి రాజులనూ కాదని మా కుమార్తె మధులతను నీకు యిచ్చి కట్టబెడతానని ఎలా అనుకున్నావు? తెగించి మా ముందు యిదే మాట అన్నందుకు ముకుందుడికి పట్టిన గతి నీకు తెలుసుగా" హెచ్చరికగా అన్నాడు మహారాజు. "నా విషయంలో మీరు అంత తొందరపడే అవసరంలేదు మహారాజా! ఒకే ఒక మాట ఖచ్చితంగా సెలవియ్యండి. అవునంటే ఆనందంగా మీకు పాదాభివందనం చేస్తాను..కాదంటే.." "ఊఁ .. కాదంటే..." "యింకా తమరు అనలేదుగా!" "నీచుడా! సైన్యాధిపతివని యింతసేపూ నీతో మాట్లాడాను. ఒక్కనాటికి కూడా నీ కోరిక నెరవేరదు. ముందు బయటకు నడు. యీ రోజు నుంచీ నువ్వు యీ రాజ్యానికి సైన్యాధిపతివి కావు. ఆ అర్హత నీకు లేదు!" అన్నాడు అనంతవర్మ కోపంతో గర్జిస్తూ. "మీ మాటలు అక్షరాలా నిజం మహారాజా! ఈ నాటినుంచీ నాకు సైన్యాధిపతి జాతకం పోయిన మాట నిజమే! నేను రాజును కాబోతున్నాను, మీ కుమార్తె మధులతను వివాహం చేసుకుని" అన్నాడు విక్రముడు మహారాజు కోపాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా. "ఎంత పొగరు నీకు.. నిన్నూ.." "ఆవేశపడవద్దు..ప్రభూ! ఈ మధ్య మీకు ఒట్టినే ఆగ్రహం కలుగుతోంది. మన రాజవైద్యులతో సంప్రదించి మంచి ఔషధం సేవించండి! ఎవర్రా అక్కడ!" అని భటులను పిలిచి "ప్రభువులవారికి మతి భ్రమించింది. తీసుకుపోయి కారాగారంలో విశ్రాంతి తీసుకుంటున్న రాజవైద్యులూ, ఘనవైద్యులూ అయిన గోవిందాశర్మగారి వద్ద వదిలిరండి" అని కన్ను మలిపాడు విక్రముడు భటులకేసి చూస్తూ. మహారాజు విస్తుబోయి ఏదో అనబోయేంతలో నలుగురు భటులు అయన శరీరానికి నాలుగు ప్రక్కల కత్తులు ఆనించి నిలబడగా, మరో నలుగురు ఆయన పెడరెక్కలు విరిచి కట్టేసి కారాగారంలో పడేశారు. అక్కడే చిక్కి శల్యావస్థలో వున్న గోవిందశర్మ కారాగారంలో తనకు తోడుగా అన్నట్టు బందీగా ప్రవేశించిన మహారాజును చూసి నోట మాట రాక అలానే ఉండిపోయాడు.  

"అదిగో ఆ కనిపించేదే మునికన్య సుమావళి ఆశ్రమం. సూర్యుడు అస్తమించేసరికి ఆమె తలుపు తెరుస్తుంది. ఆమెను సౌమ్యంగా పలుకరించి నీ దీనావస్థ నుంచి రక్షించమని చెప్పు. నేను మళ్ళీ రేపు ఉదయం కనిపిస్తాను" అంటూ మాట్లాడే పక్షి అక్కడినుంచి తుర్రుమని మాయమయింది. ముకుందుడు దేకుతూ ఆశ్రమం ముంగిలి చేరుకొని కూర్చున్నాడు. సూర్యుడు అస్తమించాడు. ఆ అడవి ప్రాంతమంతా దట్టమైన చీకటి అలుముకొంది. విచిత్రం, సుమావళి ఉండే ఆశ్రమం ప్రాంతం చుట్టుప్రక్కల మాత్రం ఏదో వింత కాంతి వెలుగును వెదజల్లుతోంది. ఆశ్రమం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి దుస్తులు ధరించిన ఒక యవ్వనవతి అద్భుత సౌందర్యశోభతో వెలిగిపోతూ బయటకు వచ్చింది. ఆమె ఆశ్రమ ముంగిలిని శుభ్రపరిచి చక్కటి ముగ్గులతో తీర్చిదిద్దింది. ఆ తరువాత ఆశ్రమం చుట్టూ సన్నటి గీతలు గీసింది. అంతవరకూ ఆమె ముకుందుడి వంక కన్నెత్తయినా చూడలేదు. ముకుందుడు కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఆమె తన పనులు ముగించుకుని యిటు తిరిగి ముకుందుడికేసి చూస్తూనే కళ్ళు విచిత్రంగా పెద్దవి చేస్తూ, అతడి అందానికి ముగ్ధురాలయినట్టు ముఖం నిండా నవ్వును వెలిగించి, "సుందరా! నువ్వు ఎవరు? నీకు ఈ దుస్థితి ఏమిటి? యిలాంటి అవస్థలో ఉండి కూడా నువ్వు ఈ భయంకరమయిన అడవిలో ఈ ఆశ్రమానికి ఎలా రాగలిగావు?" అని అడిగింది. ముకుందుడు ఆమెకు తన వృత్తాంతం చెప్పి తన దుస్థితిని తొలగించవలసిందిగా వేడుకున్నాడు. అంతలో ఒక పెద్దపులి గాండ్రు! గాండ్రు! మంటూ ఆ పరిసర ప్రాంతాలకి వచ్చి, అవిటివాడయిన ముకుందుడ్నీ, మంచి యవ్వనపుష్టితో నిగనిగలాడుతున్న సుమావళిని చూసి, నాలుక యింతపొడుగు చాచి తన పెదాలకు రాసుకుంటూ ఒక్క దూకులో ముందుకు ఉరికింది. "చచ్చాను బాబోయ్!" అంటూ భయంతో గజగజ వణికిపోతూ కళ్ళు మూసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా ఆ పులి అతని మీద పడి నంజుకుతినలేదు. "భయంలేదు! కళ్ళు తెరు!" అంది సుమావళి నవ్వుతూ. ముకుందుడు కళ్ళుతెరిచి చూచాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. అతిభీకరంగా గాండ్రిస్తూ ముందుకు దూకిన పులి పిల్లిపిల్లలా ఆమె వద్ద వినయంగా కూర్చుని వుంది. ఆమె దాని మెడ నిమురుతూ చిన్నగా నవ్వుతోంది. 

"యిదేమిటి! మీదపడి నంజుకుతినవలసిన పులి యిలా అయిపోయిందేమిటి?" అన్నాడు. అతడలా అంటుండంగా ఒక సింహమూ, దాని వెనుక ఒక ఎలుగుబంటి, చిరుతపులీ మొదలయిన భయంకరమయిన క్రూర జంతువులు అతి భీకరంగా అరుస్తూ ఆ ప్రాంతాన్నంతా దద్దరిల్లచేస్తూ అక్కడికి వచ్చాయి. అలా వచ్చిన క్రూరజంతువులు ఆశ్రమం చుట్టూ సుమావళి గీసిన గీటును దాటుతూనే తమ క్రూరత్వాన్ని వదిలి, అతి సాధు జంతువుల్లా ఆమె చుట్టూ చేరి కూర్చున్నాయి. వింతగా చూస్తున్న ముకుందుడివంక చిరునవ్వులొలకబోస్తూ చూసి, "ఆ గీతలో అంత మహత్తు ఉంది ముకుందా! దానికి అవతల వున్నంతవరకే వాటికి క్రూరత్వం. అది దాటి లోపలకు ప్రవేశిస్తే ఎలాంటి క్రూరస్వభావమైనా యిట్టే మాయమయిపోయి, సాధు స్వభావం ఏర్పడుతుంది" అని చెప్పింది. ఆ తరువాత సుమావళి, ముకుందుడ్ని ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి మంచి రుచికరమయిన ఫలాలు యిచ్చింది. ముకుందుడు వాటిని భుజించి సేదతీరిన పిదప "సుందరా! నీ కథ వింటుంటే నాకు నిజంగానే జాలిగా వుంది. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేయడమే గాదు... నీకు గల వెర్రిబాగులతనమూ, బుద్ధిమాంద్యమూ పోయి సకల విద్యాపారంగతుడిగా, శౌర్యపరాక్రమాలలో సాటిలేనివాడివిగా అయ్యే ఉపాయం చెపుతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నేను చెప్పిన పని ఒకటి చెయ్యాలి!" అంది సుమావళి. "ఏమిటది?" "నన్ను వివాహం చేసుకోవాలి!" కొంచెం సిగ్గుపడుతూ తన కోరిక బయటపెట్టింది సుమావళి.  ముకుందుడు ఆనందంతో అంగీకరిస్తూ "నాకు కాళ్ళు వచ్చి బుద్ధి తెలియాలేకానీ, నీ వంటి అందగత్తెను పెళ్ళాడేందుకు అభ్యంతరమేముంటుంది" అన్నాడు సంతోషంతో. "యిప్పుడు తొందరపడి మాట యివ్వడంతో సరికాదు? రేపు విచక్షణాజ్ఞానం తెలిసిన తరువాత నీ మొదటి ప్రియురాలయిన మధులతను తలుచుకొని నన్ను తిరస్కరించకూడదు. నువ్వు చెప్పిన విషయాలనుబట్టి నీవు ఆమెను గాఢంగా ప్రేమించావని తెలుస్తూనే వుంది" అంది. ముకుందుడి వెర్రిబుర్రలో అంత లోతయిన ఆలోచన తట్టలేదు, తీరా సుమావళి చెప్పేసరికి అతడికి తను మధులతను కలుసుకున్ననాటి రాత్రి ఆమె ప్రేమగా అన్న మాటలు గుర్తుకొచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అయితే తనకు యీ గతి పట్టించిన మహారాజు తన కుమార్తె మధులతకు ఏ దేశపు రాజకుమారుడితోనయినా పెళ్ళి జరిపించకుండా ఎలా వుంటాడు? తను ఎలాగూ దూరమయ్యాడుగాబట్టి మధులత యీపాటికి తనను మరచిపోయే వుంటుంది. యిలా ఆలోచించుకుని వెర్రిబాగుల ముకుందుడు సుమావళి కేసి తిరిగి, "సుందరీ! ఆ రాకుమారిని ప్రేమించడంవల్లనేగదా నాకు ఈ దుస్థితి పట్టింది. నువ్వు నాకు మేలు చేస్తాను అంటుంటే నేను ఆమెనెలా గుర్తుకు తెచ్చుకుంటాను నీ యిష్టప్రకారమే నిన్ను పెళ్ళాడతాను" అన్నాడు. సుమావళి చిరునవ్వు నవ్వి, "సుందరా! నేను నిన్ను పూర్తిగా నీ ప్రియురాలిని మరిచిపొమ్మని అనటంలేదు. ఒక సంవత్సరకాలం నాతో పాటు కాపురం చేసిన పిదప నీవామెను పెళ్ళాడతానంటే నాకు అభ్యంతరముండదు. అదీగాక నీకు యిష్టం అయిన యెడల నేనే నీకు ఆమెతో వివాహం జరిపించి నా సోదరిలా జూసుకుంటాను" అంది సుమావళి. 

"నీ యిష్టం" అన్నాడు. "అయితే యిప్పుడే మన వివాహం, యీ అడవి జంతువులే మన పెళ్ళిపెద్దలు. పంచభూతములు సాక్షిగా యిప్పుడే మన పెళ్ళి జరిగిపోతుంది" అంటూ లోపలినుండి రెండు పూమాలలు తెచ్చి, ఒకటి ముకుందుడి మేడలో వేసి, మరొకటి అతని చేతులమీదుగా తన మేడలో వేయించుకుంది సుమావళి. వారి పెళ్లిని జూసి అడవి జంతువులు ఆనందంతో చిందులువేసాయి. ముకుందుడు అనుకున్నట్టు రాకుమారి మధులత అతడ్ని మరచిపోనూ లేదు, ఏ రాకుమారుడినో పెళ్లాడనూ లేదు. ముకుందుడు దూరమయిన వేదనతో క్రుంగిపోతున్న ఆమెకు గోరుచుట్టుమీద రోకటిపోటు అన్నట్టు సైన్యాధిపతి విక్రముడు తన తండ్రి అనంతవర్మను బంధించి కారాగారంలో వుంచిందే కాకుండా తనను వివాహం చేసుకోమని ప్రతిరోజూ వచ్చి, బ్రతిమలాడ్డం, తరువాత బలవంతంగానయినా తనను చేపడతానని బెదిరించడమూ ఆమెకు భరింపరాని చిత్రవధగా తయారయింది. అంతకు క్రితమే విక్రముడు వచ్చి ఆ రోజు చీకటిపడేలోగా ఏదో ఒక నిర్ణయం తెలియచేయకపోతే మరుసటిరోజు నిర్బంధంగానయినాసరే మధులతను వివాహం చేసుకుంటానని హెచ్చరించి పోవడంతో ఆమె మనసు మరింత వికలమయిపోయింది. జీవితం మీదనే విరక్తి కలిగింది. కన్నతండ్రి కారాగారం పాలయ్యాడు. ప్రేమించిన ముకుందుడు అరణ్యంలో దిక్కులేని అవిటివాడయ్యాడు. అసలు జీవించి వున్నాడో లేడో కూడా తెలియదు. అటువంటి దుర్భరపరిస్థితిలో తను యింకా బ్రతికి ప్రయోజనం ఏమిటి? ఏ సుఖం ఆశించి బ్రతకాలి? ఎవరికోసం యింకా జీవించి వుండాలి? యిలా ఆలోచించుకొంటున్న మధులత ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకొంది. ఆ నిర్ణయం తీసుకొన్న మరుక్షణం ఆమె ఒక పాత్రలోనికి మధురపానీయాన్ని తీసుకుని తన వ్రేలికున్న వజ్రపుటుంగరాన్ని నేలమీద కేసి చితగొట్టి చూర్ణంచేసి ఆ చూర్ణాన్ని మధురపానీయంలో కలుపుకొంది. ఆమెకి ఒక్కసారిగా ఎక్కడలేని దుఃఖమూ ముంచుకు వచ్చింది. 

తండ్రినీ, ప్రియుణ్ణీ తలుచుకుంటూ ఆ మధురపానీయ పాత్రను తన పెదవుల దగ్గరకు తీసుకుంది త్రాగాలని. అంతే, ఎక్కడనుంచి వచ్చిందో మాట్లాడే పక్షి రివ్వున ఎగురుతూ వచ్చి ఆమె పెదవులను సమీపించపోతున్న పాత్రను కాళ్ళతో తన్నేసింది. ఆ మందిరంలో ఎగరసాగింది. "రాకుమారీ! ఏమిటి ఈ అఘాయిత్యం" అంది ఆ అందమైన మాట్లాడే పక్షి. మనుష్య భాషలో ముద్దుముద్దుగా మాట్లాడగలుగుతున్న ఆ అందమయిన పక్షిని చూసి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది మధులతకి. ఆమె క్షణకాలంపాటు తన విచారాన్ని మరిచిపోయి తన చుట్టూ గిరికీలుకొడుతున్న అందమయిన పక్షిని చూసి ముచ్చటపడింది. అలా గాల్లోకి గిరికీలు కొడుతున్న పక్షి మధులత భుజం మీదికొచ్చి వాలింది. "క్షణం ఆలస్యం అయితే ఏమయ్యేదానివి మధులతా!" అంది పక్షి. మధులత భుజం మీద వాలిన మాట్లాడే పక్షిని తన చేతిలోకి తీసుకుంది. మాట్లాడే పక్షి మధులత చేతి వేళ్ళమీద నిలబడింది. ఆమె పక్షివంక దీనంగా, నిస్సహాయంగా నిర్లిప్తమైన చిరునవ్వును తెచ్చి పెట్టుకొని చూస్తూ, "పక్షిరాజమా? నీవెవరో నాకు తెలియదుగాని, నా ప్రాణాలు కాపాడి పుణ్యం సంపాదించుకున్నావని మాత్రం అనుకోవద్దు. నిజానికి నా దైన్యస్థితి దుర్భరమైన శోకపరిస్థితి నీకు తెలియదు. అన్నింటికి దూరమయిన నేను జీవించడం వ్యర్థం అని నిర్ణయించుకున్న మీదటనే ఈ సాహసానికి ఒడిగట్టాను. నిజానికి నా బాధ నీకు తెలియదు" అని వాపోయింది. 

"విచారించకు రాకుమారీ! నీ చరిత్ర అంతా నాకు తెలుసు! ముకుందుడు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పాడు" అంది మాట్లాడే పక్షి రాకుమారి అందాన్ని పరిశీలనగా చూస్తూ. రెక్కలు విప్పార్చి, తన పొడుగాటి కుచ్చు తోకను ఆమె మోచేతివరకు వ్రేలాడ్చి, నిక్కి నిక్కి తన ముఖంలోకి జూస్తూ ఆ మాట్లాడే పక్షి ముకుందుడి పేరు ఉచ్చరించడం వింటూనే మధులత హృదయంపై పన్నీటిజల్లు కురిసినట్టయింది. ఆమె ఆత్రంగా ఆ పక్షి వంక జూస్తూ "ముకుందుడా? యింకా జీవించేవున్నాడా? ఎక్కడ వున్నాడు? ఎలా వున్నాడు? నేను యింకా అతనికి గుర్తు వున్నానా, లేక తన దుస్థితికి కారణమయిన నన్ను తిట్టుకుంటూ ద్వేషిస్తున్నాడా?" ప్రశ్నలవర్షం కురిపించింది మధులత. మధులత ఆత్రుతకు ఆ పక్షి, "ప్యుం...ప్యుం...ప్యుం..." అని నవ్వుతూ "ముకుందుడి పేరు వింటూనే నీ ముఖం పున్నమినాటి చంద్రుడిలో కాంతులను సంతరించుకొని వెలిగిపోతోందే. అతడు ఈ క్షణంలో నీ ఎదురుగా వుండివుంటే నీ బుగ్గలు కెంపులవుతాయన్న విషయంలో సందేహపడనవసరం లేదు సుమా" అంది పక్షి. ఆ మాట్లాడే పక్షి మాటలకు మధులత ముఖంలో కొద్దిపాటి సిగ్గు చోటుచేసుకుంది. "పక్షిరాజమా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పనేలేదు నీవు?" అంది. "అవును కదూ! ముకుందుడు అడవిలో క్షేమంగానే వున్నాడు ప్రస్తుతం" అంది పక్షి. ఆ మాటతో రాకుమారి హృదయంలోనుండి కొండంత భారం దించేసినట్టయింది. ఆమె తన కంటివెంట ఆనందభాష్పాలు రాలుస్తూ "ముకుందుడు క్షేమంగా ఉన్నాడనే తియ్యటి వార్త చెప్పి నా మనసుకి ఎంతో ఊరటనీ, సంతోషాన్నీ కలిగించావు. నీ ఋణం ఎలా తీర్చుకోగలను పక్షిరాజమా! ముకుందుడు యిక్కడికి ఎప్పుడు వస్తాడు" అని అడిగింది. 

"ఆ సంగతే చెప్పబోతున్నాను మధులతా! ముకుందుడు..కోల్పోయిన తన కాళ్ళను పొంది ఒక సంవత్సరకాలంలో నిన్ను చేరుకుంటానని చెప్పి రమ్మన్నాడు. అంతవరకూ తన కోసం ఎదురుచూస్తూ వేచి ఉండమని నాతో చెప్పి పంపించాడు" అంది పక్షి. "ఒక్క సంవత్సరమా?" "అవును రాకుమారి" "పక్షిరాజమా! ముకుందుడి కోసం ఒక్క సంవత్సరమే కాదు.. ఈ జీవితకాలమంతా కన్యగానే ఎదురుచూడ్డానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే మా తండ్రిగారిని కారాగారంపాలుచేసిన మా సైన్యాధిపతి, ఇంకాస్సేపట్లో నా నిర్ణయం చెప్పకపోతే తెల్లవారుతూనే నన్ను బలవంతంగా పెళ్లాడతానని హెచ్చరించి పోయాడు. అతడి భార్య కావడంకంటే చావడమే మేలు కదా" అంటూ వాపోయింది ఆమె. "బాధపడకు మధులతా! అపాయం దాటే ఉపాయము చెప్పడానికి నేనున్నానుగా" అంది మాట్లాడే పక్షి. "ఉపాయమా? ఏమిటి?" "విక్రముడ్ని పెళ్లిచేసుకోవటానికి నీ సమ్మతిని తెలియచేసి, వివాహం జరగటానికి ఒక సంవత్సరం గడువుపెట్టు" "ఎందుకని అడిగితే?" "అదే చెపుతున్నాను విను! జాతకరీత్యా నీకు మరో సంవత్సరం దాటాక కానీ పెళ్ళి జరగరాదనీ, అలా జరిగినట్టయితే నీకు భర్త అయిన వాడికి అంధత్వం ప్రాప్తించి రాజ్యభ్రష్టత్వం కలుగుతుందని అబద్ధం చెప్పు.." అని ఉపాయం చెప్పింది పక్షి. 

రాకుమారి ఆ అందాల పక్షిని ముద్దాడి, "ఎంత చక్కటి ఉపాయం చెప్పావు పక్షిరాజమా! అయితే చిన్న సందేహం. విక్రముడ్ని అంత తెలివితక్కువవాడిగా అంచనా వేసుకోరాదు. ఒకవేళ ఆస్థాన జ్యోతిష్యుడ్ని ఆరాతీసి అడిగినట్లయితే నేను చెప్పింది అబద్ధం అని తెలిసిపోదూ?" అంది మధులత తన సందేహాన్ని బయటపెడుతూ. "అవును సుమా! అది నిజమే!! మరేం ఫరవాలేదు. రేపు తెల్లవారుతూనే ఆస్థాన జ్యోతిష్యుడ్ని బొంకమని నీవు చెప్పినట్లు చెప్పి హెచ్చరిస్తాను. నీ చేవ్రాలుతో ఒక లేఖ రాసి నాకు యివ్వు" అంది పక్షి. మాట్లాడే పక్షి చెప్పిన ఉపాయం నచ్చింది మధులతకి. వెంటనే తన చేవ్రాలుతో ఆస్థాన జ్యోతిష్యునికి ఎలాగయినా ఈ గండం గడిచేటట్టు చెయ్యమని చెప్పి లేఖ రాసి మాట్లాడే పక్షి పొడుగాటి కుచ్చు తోకలో మడిచిపెట్టింది. "పక్షిరాజమా! సమయానికి దేవతలా వచ్చి, నా ఆవేదనను మటుమాయం చేసావు. ముకుందుడికి క్షేమం అందచేసే భారం కూడా నీదే !" అంది కిరీటంలా వున్న దాని తలపైన కుచ్చును నిమురుతూ మధులత. "అలాగే! వెళ్ళివస్తాను రాకుమారీ...మళ్ళీ కలుస్తాను" అని ఆమె చేతిమీంచి తురుమని ఎగిరిపోయింది పక్షి. అది ఎగిరిన దిక్కుకేసి జూస్తూ గాఢంగా నిట్టూర్పు విడిచింది రాకుమారి మధులత. సుమావళిని వివాహం చేసుకున్న ముకుందుడు ఆమె చెప్పిన ప్రకారం ఆ రాత్రి ఆమెతో గడిపి మరునాటి రాత్రి ఆమె వంటి అడివిలో ఒక పాడుబడిన ఆలయం చేరుకున్నాడు. అడివి అంతా చిమ్మచీకటి కమ్ముకొని వున్నా అక్కడ మాత్రం వెలుతురులో ఆ ప్రదేశం పట్టపగలులా వెలిగిపోతోంది. "సుమా! ఈ అర్ధరాత్రివేళ యిక్కడికెందుకు తీసుకొచ్చావ్? ఈ పాడుపడిపోయిన గుడిలో ఏ దేవుడున్నాడు" అని అడిగాడు. "ఇది జ్ఞానాంబికాదేవి ఆలయం! మాసానికొకసారి కొంతమంది దేవతల బృందం ఈ అమావాస్యనాడు ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాంబికాదేవిని  పూజించి ప్రసన్నం చేసుకొని వెళతారు.  ఆమె దర్శనం కలిగితే చాలు, నీకు సకలవిద్యలూ క్షణంలో అబ్బి జ్ఞానవంతుడివి అవుతావు. ఆ తరువాత ఆ దేవతల అనుగ్రహం సంపాదించి, మీ అంగవైకల్యాన్ని పోగొట్టుకోవాలి" అని చెప్పింది.

 "ఎలా?" అన్నాడు. "నేను చెప్పినట్టు చెయ్యండి" అంది. "అలాగే!" సుమావళి ఆ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణం చుట్టూ వున్న పూలమొక్కలలోని పూవులని కోసి గుడి మెట్లమీద కూర్చున్న ముకుందుడి ముందు కుప్పగా పోసింది. అడివి తీగలతో వాటిని మాలలుగా కట్టమని ముకుందుడికి పురమాయించింది. ముకుందుడు ఆమె చెప్పినట్టుగానే తనకు చేతనయిన రీతిలో పూవులను అడివి తీగలను మాలలుగా కట్టనారంభించాడు. ఈలోగా సుమావళి ఆలయప్రాంగణమంతా శుభ్రపరిచి నీళ్ళుజల్లి రకరకాల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని, గర్భగుడిని అందంగా తీర్చిదిద్ది అలంకరించింది. ఆ తరువాత ముకుందుడు తయారుచేసిన పూలమాలలు గుడి అంతా తోరణాలుగా అలంకరించింది సుమావళి. పాడుబడినట్టు దుమ్ముకొట్టుకుపోయి వుండే ఆ ఆలయం నూతన అందాలను సంతరించుకొని, కళకళ లాడసాగింది. అర్థరాత్రి సమయంలో ఆకాశంనుండి కొన్ని నక్షత్రాలు వింత కాంతులను వెదజల్లుతూ, జ్ఞానాంబికా దేవి ఆలయ ప్రాంగణంలో దిగాయి. ఆ నక్షత్రాలు భూమ్మీదకు దిగుతూనే దేవతలుగా మారాయి. అదే బృందం తమ రూపాలను పొందుతూనే పచ్చటి తోరణాలతోనూ, పూమాలలతో, రకరకాల ముగ్గులతో అలంకరించబడి వున్న జ్ఞానాంబికా ఆలయాన్ని జూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆశ్చర్యంనుండి తేరుకోకముందే గర్భగుడిలో ప్రవేశించి జ్ఞానాంబికను స్తోత్రం చేస్తూ పూజించారు. రకరకాలు స్తుతించారు.   

మరుక్షణం జ్ఞానాంబికాదేవి విగ్రహంలో కనులు మిరుమిట్లు గొలిపే విధంగా ఓ మెరుపు మెరిసింది. జ్ఞానాంబికాదేవి ప్రత్యక్షమయింది. దేవతలందరూ ఆమె ముందు సాష్టాంగపడి నమస్కరించారు. ఒక చెట్టుచాటు నుండి జూస్తున్న ముకుందుడికీ, సుమావళికి జ్ఞానాంబికాదేవి దర్శనభాగ్యం లభించింది. జ్ఞానాంబికను దర్శిస్తూనే ముకుందుడు సకలవిద్యాపారంగతునివలె తనకు తెలియకుండానే ఓం శ్లోకం చదువుతూ, జ్ఞానాంబికను స్తుతిస్తూ, దేకుతూ ఆలయ వాకిలి ముంగిటికి చేరుకున్నాడు. విస్తుపోయిన దేవతలు అవిటివాడయిన ముకుందుడి శ్లోకం వింటూనే ముగ్ధులయి అలాగే నిలబడిపోయారు. జ్ఞానాంబిక అందరినీ ఆశీర్వదించి అంతర్ధానం అయింది. మరుక్షణం ఆ దేవతా బృందం అవిటివాడయిన ముకుందుడిని సమీపించారు. "నాయనా! ఎవరు నువ్వు? ఇన్నాళ్ళుగా దేవిని పూజిస్తున్నా ఆ దేవి ప్రత్యర్ధం ఇంత చక్కటి శ్లోకాన్ని మేమెన్నడూ ఆలపించి ఉండలేదు. నీ వాలకాన్ని బట్టి జూస్తే ఉత్తమ గుణాలుగల మానవుడిగా తోస్తున్నావ్" అన్నారు. ముకుందుడు వారి ముందు మోకరిల్లి తన కథంతా చెప్పుకున్నాడు. ఆలయాన్ని అలంకరించింది తనేనని చెప్పాడు. దేవతాబృందం అతన్ని కనికరించి తమ శక్తితో ముకుందుడి కాళ్ళు తిరిగి యివ్వడమేగాక, ఒక అద్భుతమయిన ఖడ్గాన్ని, దివ్య తేజస్సునూ ప్రసాదించి అంతర్ధానమయ్యారు. 

ఆస్థాన జ్యోతిష్యుడు ఉద్ధండశాస్త్రి భుక్తాయాసంతో సతమతమవుతూ కుండలా పెరిగిన గుండ్రటి బొజ్జను చేతులతో సవరించుకొంటూ తూగుటుయ్యాలమీద మేను వాల్చాడు. గతిలేక అతను విక్రముడి దగ్గర ఉండేందుకు అంగీకరించాడు గాని పూర్వపు మహారాజు అయిన అనంతవర్మ మీద అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. అతడు జ్యోతిష్యశాస్త్రాన్ని గుణించుకుంటూ అనంతవర్మ మహారాజు కుటుంబానికి కష్టకాలం ఎప్పుడు అంతరించిపోతోందా అని లెక్కలు వేసుకోసాగాడు. అంతలో, తూగుటుయ్యాల మీద నడుం వాల్చి భుక్తాయాసం తీర్చుకుంటున్న అతని బొజ్జ మీద వచ్చి వాలింది మాట్లాడే పక్షి. అతడు అదిరిపడి లేవబోయాడు. "కంగారుపడకండి ఉద్ధండ పండితులుగారూ! ఈ లేఖ చదవండి" అంటూ తన కుచ్చు తోకను నిక్కబెట్టి జాడించింది పక్షి. అందులోంచి క్రిందపడ్డ లేఖను చదువుతూనే అంతా అర్థంచేసుకుని "రాజకుటుంబం కోసం ఒక్క అబద్ధం ఏం ఖర్మ వెయ్యి అబద్ధాలు కూడా ఆడతాను. వారి క్షేమం కంటే కావాల్సింది యింకేముంది. యువరాణి వ్రాసినట్టు నా లెక్కప్రకారం ఒక సంవత్సరంలో వారి కష్టాలు గట్టెక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. యువరాణివారు చెప్పినట్టే చేస్తానని చెప్పు పలుకులు పక్షీ" అన్నాడు ఉద్ధండశాస్త్రి. "కృతఙ్ఞులం మహాశయా" అంటూ అక్కడి నుండి ఎగిరిపోయింది పక్షి. ఆ వెంటనే ఉద్ధండశాస్త్రి విక్రముడిని జూడబోయాడు. అతడు అడిగినమీదట రాకుమారి మధులత చెప్పమన్న అబద్ధం చెప్పి ఒక సంవత్సరంలోపు మధులతను వివాహం చేసుకున్నవారి కెవరికయినా అంధత్వము, దేశభ్రష్టత్వం కలుగుతుందనీ ప్రస్తుతం మధులత జాతకంలో దుర్యోగం నడుస్తూందని చెప్పాడు. ఆస్థాన జాతకుడయిన ఉద్ధండశాస్త్రి మాటలకు అదిరిపడి ఒక సంవత్సరం వరకూ అసలు వివాహం మాటే తలపెట్టనని మధులతకి మాట యిచ్చాడు విక్రముడు. గండం గడిచినందుకు తేలికపడ్డమనసుతో పక్షికీ, ఉద్ధండశాస్త్రికీ కృతఙ్ఞతలు సమర్పించుకొంది రాకుమారి మధులత.

సకలవిద్యా పారంగతుడయి, నూతన తేజస్సుతో వెలుగొందుతున్న ముకుందుడు సుమావళి ఆశ్రమంలో ఆమెతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. అయితే ఆ ఆశ్రమ జీవితంలో అతనికి ఒక విచిత్రం ఎదురయింది. సుమావళి రాత్రంతా తన సరసనే ఉండి తిలకిస్తుంది. తెల్లవారుతూనే ఆమె జాడ అంతుచిక్కదు. ఆశ్రమంలో ఒంటరిగా గడపవలసి వచ్చేది అతడు. అందుకుగాను అతనిలో ఎంతో విసుగు జనించేది. ఆ సమయంలో అతనికి మధులత గుర్తుకివచ్చి మనసు భారంగా అయిపోయేది. ఆ రోజు రాత్రి, తను రహస్యంగా కలుసుకున్నప్పుడు "సుందరా! నువ్వు కుబేరుడవయినా సామాన్యుడవయినా నీ మీద నా ప్రేమ నిష్కళంకమయినది. నీవు లేకుండా నేను జీవించటమనే మాటే లేదు" ఈ మాటలు తలచుకున్నప్పుడల్లా అతనికి వాయువేగంతో పోయి మధులత సన్నిధిలో వాలుదామని మనసు ఉరకలు వేసేది, కానీ అంతలోనే తాను సుమావళిని వివాహం చేసుకొంటూ ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి తన మనసును తాను నిగ్రహించుకొనేవాడు. అయితే సుమావళి పగలు కనపడకుండా వుండడానికి గల కారణమేమిటో ఆ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి ఆమె రాగానే, "సుమా! నువ్వు పగలంతా ఎక్కడికి వెళుతున్నావో? నాకేమో ఒంటరిగా ఏమీ తోచడం లేదు. ఒట్టినే వుండబుద్ధికావడం లేదు. ఒక్కసారి మా దేశం పోయి మా తండ్రిగారిని జూసివద్దామని వుంది వెళ్ళిరానా?" అని అడిగాడు. 

దానికి సుమావళి నిట్టూర్చి, "విచక్షణాజ్ఞానం తెలిసిన తరువాత మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు తెలుసు. నేను పగలు కనిపించకుండా పోతున్నందుకు కారణం యిప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే చెపుతాను. ప్రస్తుతం నేను గర్భవతిని, యిలాంటి పరిస్థితిలో నన్ను విడిచిపెట్టి మీ దేశం వెళ్ళడం భావ్యమా?" అని అడిగింది. ఆమె గర్భవతి అన్న మాట వింటూనే అతడికి ఎక్కడలేని ఆనందం పొంగుకువచ్చి, తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమెను తన కౌగిట్లోకి తీసుకొని తన హర్షాన్ని ప్రకటించాడు అతడు. విక్రముడు వుత్సాహముగా రాకుమారి మధులత మందిరంలో ప్రవేశించి "మధులతా! నువ్వు పెట్టిన సంవత్సరము గడువు రేపటితో పూర్తి కాబోతోంది. ఎల్లుండే మన వివాహం నీకు సమ్మతమేగా!" అన్నాడు. ఆమెకి ఏం చెప్పాలో తోచలేదు. ఓ క్షణం తరువాత "అలాగే" అని మాత్రం అంది. విక్రముడు వచ్చినంత వుత్సాహంగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మాట్లాడే పక్షి రివ్వున వచ్చి ఆమె భుజంమీద వాలింది. విచారవదనంతో వున్న మధులతను జూసి "రాకుమారీ! ఎందుకలా విచారంగా వున్నావ్? నీకో శుభవార్త చెబుదామని వచ్చాను" అంది మాట్లాడే పక్షి. "నా జన్మకి అంతటి అదృష్టమా పక్షిరాజమా! శుభవార్త వినే యోగం నాకు వుందంటావా?" అంది మధులత.

"నీ యోగము మారబోతోంది రాకుమారీ! ముకుందుడు వస్తున్నాడు" అంది. "ఆ...!" అంది అంతటి ఊహించని శుభవార్త విన్నందుకు ఉక్కిరిబిక్కిరవుతూ. "అవును" అంది పక్షి. "నిజంగానా?" నమ్మలేనట్లుగా అడిగింది మళ్ళీ మధులత. "నిజమే!" "ఎప్పుడు?" "నేటికి మూడో రోజున" అంది పక్షి. "మూడోరోజునా! అయ్యో! ఈ దుర్మార్గుడు ఆ రోజునే నన్ను వివాహం చేసుకొంటానని చెప్పి వేళ్ళాడే, ఆ సరికి ముకుందుడు యిక్కడికి చేరుకుంటాడా? నన్ను ప్రమాదం నుండి రక్షిస్తాడా?" అంది గాభరాపడిపోతూ మధులత. "అంతవరకూ వస్తే ముకుందుడు రావడం ఆలస్యము అయితే అపాయం తప్పించేందుకు నేనున్నానుగా!" అంది పక్షి. "నీ ఋణం తీర్చుకోలేనిది పక్షిరాజమా!" అంది ఆమె. "ఆ సమయమూ వస్తుందిలే!" అంటూ తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోయింది పక్షి. "మీరు మీ దేశం వెళతానన్నారుగా! వెళ్ళిరండి" అంది సుమావళి. ఆమె యిప్పుడు నిండు చూలాలు. ఆమె ముఖంలో ఏదో ఆనందం గోచరిస్తోంది. తను ఏదో గొప్ప విలువయినదాన్ని సాధించబోతున్నానంత సంతోషంతో ఆమె వదనం ప్రకాశిస్తోంది. "యిప్పుడా! యీ పరిస్థితిలోనా?" అన్నాడు ఆమె వంక చూస్తూ ముకుందుడు. "ఏం? యిప్పుడేం అయింది?" "నిన్నీ పరిస్థితిలో వదిలి యెలా వెళ్ళేది? ప్రసవానికి సిద్ధంగా వున్న నీకు ఈ అడవిలో తోడు ఎవరుంటారు?" అడిగాడు ఆశ్చర్యంగా ముకుందుడు. 

"అటువంటి సంకోచలేవీ పెట్టుకోవద్దు! నేను మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఉంటానని అనడం లేదే!" అంది. "అయితే నాతో వస్తావా?" "ఊహూ!" "మరెలా?" "ముందు మీరు బయలుదేరండి. అన్నీ సవ్యంగానే జరుగుతాయి" అంది సుమావళి. "నిన్ను యిలా వదిలి వెళ్ళను" అన్నాడు ముకుందుడు. "రేపటిలోగా మీరు మీ రాజధాని చేరకపోతే జీవితమంతా బాధపడతారు" అంది. "ఎందుకని?" "వివరాలు అడగొద్దు! నేను చెప్పినట్టు విని బయలుదేరండి. నేను మీ వెంట నీడలాగే వుంటాను" అంది. సుమావళి మాటలపై గురి వుంచి, మరేమీ మాట్లాడకుండా ఆ రాత్రివేళ అశ్వం అధిరోహించి బయలుదేరాడు ముకుందుడు. మరుసటిరోజు మధ్యాహ్నం వేళకు రాజధాని చేరాడు ముకుందుడు. రాజధాని అంతా అలంకరించి ఉండడం చూసి ఆశ్చర్యపడి, విక్రముడు మహారాజును బంధించి మధులతను బలవంతాన వివాహం చేసుకుంటున్నాడని తెలిసి, అంతులేని కోపంతో రెచ్చిపోతూ, దేవతలు తనకిచ్చిన ఖడ్గంతో అడ్డువచ్చినవారినల్లా నరుకుతూ రాజకుమారి మధులత మందిరంకేసి సాగిపోసాగాడు. "ఇంతవరకూ వచ్చిన తరువాత యిప్పుడు కాదంటే నిన్ను యిలానే వదిలేస్తానని భ్రమపడకు. బలవంతంగా నయినా నిన్ను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడు విక్రముడు మధులత చెయ్యి పట్టుకోబోతూ. "ప్రాణాలతో నన్ను నువ్వు వివాహం చేసుకోలేవు.." అంది ఖచ్చితంగా చెబుతూ. "అదీ చూస్తాను" అన్నాడు విక్రముడు ముందుకు ఉరుకుతూ. "ఆగు!" అంది మధులత మొలలోంచి ఒక పిడిబాకును తన చేతుల్లోకి తీసుకొని గుండెల్లోకి దించుకోవడానికి సిద్ధపడుతూ. అంతలో, "మధూ!" అంటూ చేతిలోని ఖడ్గంతో అక్కడికి ప్రవేశించాడు ముకుందుడు. ముకుందుడ్ని చూస్తూనే అదిరిపడ్డాడు విక్రముడు. అతడు ముకుందుడి కాళ్ళవంకే చూస్తూ ఆశ్చర్యంలో ములిగిపోయాడు. 

మధులత ఒక్కపరుగున వెళ్ళి ముకుందుడి అక్కున చేరింది. ఆశ్చర్యం నుండి తేరుకున్న విక్రముడు ఈ వెర్రిబాగులవాడ్ని హతమార్చడం ఎంతసేపని అతనితో కత్తియుద్ధం ఆరంభించాడు. చాలాసేపు భీకర పోరాటం సాగింది వారిద్దరి మధ్యా. ముకుందుడు విక్రముడ్ని చిత్తుగా ఓడించి ఒక వ్రేటుతో అతని తల నరికేసాడు. రక్తం చివ్వున చిమ్మింది. విక్రముడు పెద్దపెట్టున ఆర్తనాదం చేస్తుండగా తల తెగిన అతని మొండి కళేబరం నేలమీద పడి గిల గిల కొట్టుకొని కొంతసేపటికి అచేతనమై పోయింది. విక్రముడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ తరువాత ముకుందుడు తన తండ్రినీ, మహారాజునూ చెరసాలనుండి విడిపించాడు. "నాయనా ముకుందా! నీ మంచితనం రాజభక్తి గ్రహించకుండా ఉద్రేకానికీ, చెప్పుడు మాటలకీ లోనై నిన్ను దుస్థితిపాలు చేసాను. నన్ను క్షమించు. నా కుమార్తెను పెళ్ళాడి నా రాజ్యానికి వారసుడివికా! స్వయంకృషితో యింతటివాడివయిన నీకు రాజ్యపాలన కష్టము కాదు" అన్నాడు అనంతవర్మ. "ప్రభూ! యిదంతా నా స్వయంకృషి కాదు. నా యీ మార్పుకి ఒక కారణం ఒక మాట్లాడే పక్షి.. ఇంకొకటి నా భార్య సుమావళీ" అన్నాడు. "మాట్లాడే పక్షా!" అంది మధులత. "అవును మధులతా!" "ఆ పక్షి ఇక్కడే వుంది గాని, భార్య ఏమిటి? మీకు పెళ్ళయిపోయిందా?" అని అడిగింది చిన్నబోతూ. "మాట్లాడే పక్షి యిక్కడుందా... ఏది...?" అడిగాడు ముకుందుడు. "పాపం అది నిండు చూలాలు ప్రసవవేదన పడుతోంది..ఆ ప్రక్క మందిరంలో బంగారు పంజరంలో ప్రక్కవేసి దాన్నందులో ఉంచాను" అంది మధులత ఆ మందిరంలోకి దారితీస్తూ. ముకుందుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రోజు అడివి తీగలతో ఉయ్యాల కట్టించి అందులో తనని కూర్చోబెట్టి సుమావళి ఆశ్రమం ముందు విడిచిన తరువాత ఆ మాట్లాడే పక్షి యింతవరకూ కనబడలేదు. అది మధులత దగ్గరకు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది?? అసలు ఈ మాట్లాడే పక్షి ఎవరు??? తన సందేహాలకు సమాధానం దొరక్కముందే అందరితో పాటు ఆ మందిరంలో అడుగుపెట్టిన ముకుందుడు అక్కడ హంసతూలికాతల్పంమీద ముద్దుగా ఉన్న ఒక పసిపాపడిని పరుండబెట్టుకుని పడుకొని వున్న సుమావళిని చూస్తూ నివ్వెరపోయి నోట మాట రాక అలాగే ఉండిపోయి "సుమా!" అంటూ ఆమె సరసకు చేరాడు.

"ఎవరు నువ్వు? ఈ గదిలోకి ఎలా వచ్చావు? ఆ పంజరంలో వుండాల్సిన మాట్లాడే పక్షి ఏది?" అడిగింది మధులత. "నేనే మాట్లాడే పక్షిని మధులతా!" అంది సుమావళి. అక్కడున్నవారందరూ ఈ విచిత్రమేమిటో అర్థంకాక తెలుసుకోవాలని కుతూహలంగా చూడసాగారు, ముకుందుడితో సహా. "సుమా! నువ్వు మాట్లాడే పక్షివా?" అని అడిగాడు ముకుందుడు. "అవును! నేనొక యక్షకన్యను. నాకు చిన్నతనం నుంచీ కాస్త పొగరెక్కువ. చిన్నతనం నుంచీ ఎంతో అందగత్తెనన్న గర్వమూ ఉండేది. మా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కన్నుమూశారు. నన్ను అందంగా వున్నానని మా అత్తయ్య పెంచుకుంది. మా అత్తయ్యకి కూడా పిల్లల్లేరు. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకి కూడా చాలా గర్వం వుంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమె నన్ను చేరదీయడానికి కారణం నేను కూడా ఆమెలాటి గర్వవతినన్న ఉద్దేశ్యమే. నన్ను పెళ్ళాడాలని ఎందరెందరో వచ్చారు. అలా వచ్చేవాళ్ళను వూరక వదలాలని అన్పించలేదు. నా ఆలోచన మా అత్తయ్యకి కూడా నచ్చింది. అందుకనే ఓ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాము. ఆ స్వయంవరం పద్ధతిప్రకారం దానిలో నేను నన్ను పెళ్లాడవచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటిని చెప్పినవారిని నేను వరిస్తానన్నమాట. అర్థంపర్థం లేని ప్రశ్నలను సృష్టించుకొని స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను. స్వయంవరంలో నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పలేకపోతారో వారి తలలు గొరిగేస్తారు. నిజానికి ఈ తరహా స్వయంవరం నాకూ మా అత్తయ్యకూ ఎంతో ఆనందంగా వుంది. ఎందుచేత అంటే స్వయంవరానికి వస్తున్న ప్రతి యువకుడు బోడిగుండు గీయించుకొని ఏడ్పుముఖాలతో లబోదిబో మంటూ పోతున్నారే తప్ప పాపం పిచ్చి కుర్రాళ్ళు నోరెత్తితే ఒట్టు."

"యిలా స్వయంవరం నానాటికీ కుంటుపడకుండా సాగుతూనే వుంది. పాపం యక్షనగరంలో దాదాపు సగభాగం బోడిగుండులే కన్పిస్తున్నాయి. యిక కొన్నాళ్ళుపోతే యాక్షనగరాన్ని భూలోకంలో వున్న తిరుపతే అనుకోవచ్చు అనుకో.. యిలా వుండగా మేము చేస్తున్న పని మంచి పని కాదని హితులూ, సన్నిహితులూ చెప్పజూశారు. కానీ మేము వినలేదు. యిది యిలా వుండగా ఓ రోజు ఓ అందహీనుడు స్వయంవర ప్రకటన విని నా ఎదుటకు వచ్చాడు. చింపిరి జుత్తుతో అష్టవంకరలు గల శరీరముతో జూడగానే వాంతి వచ్చేటటువంటి ఆకారంతో వున్న ఆ కుర్రాడిని, "ఎందుకొచ్చావని" అడిగాను. "యింకెందుకు నిన్ను పెళ్ళాడడానికి ప్రియా" అన్నాడు వాడు వికారంగా నోరు తెరిచి ఒళ్ళంతాతంపరమెక్కేలా నవ్వుతూ. "చూడు. మహామహులే స్వయంవరంలో నెగ్గలేదు" అని చెప్పజూశాను. అలాటి నికృష్టుడిని గుండు చేయించి నేను పొందే ఆనందం లేదనే ఉద్దేశ్యంతో. కానీ వాడు పట్టువదలని విక్రమార్కుడిలా స్వయంవర ప్రశ్నలు అడగమన్నాడు. పోతావా పోవా.. అని ఆ కుర్రాడిని కసిగా నెట్టాను. పాపం ఆ కుర్రాడు అసలే సన్నగా వున్నాడేమో నేను తోసిన తోపుకు ఆమడదూరాన పడ్డాడు. అలా పడ్డంతో కాళ్ళూ చేతులూ నేలను గీసుకొని రక్తం కూడా వచ్చింది. అది జూసి జాలిపడక పోతావా పోవా నీలాటి అల్పుడికి నాలాటి సుందరి కావాలేం అని చీదరించుకొన్నాను. ఈ మాటలతో అతను ఏమనుకున్నాడో ఏమో తనకు తానుగా పైకిలేచి నా గదిలో గుండ్లు గీసేందుకని పెట్టబడి వున్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. అది జూసి నేను చలించిపోయాను. తనకి నేను దక్కలేదన్న కసితో, తనని నేను హేళన చేశానన్న కోపంతో, తనని నెట్టానన్న రోషంతో నన్ను పొడిచిపారేస్తాడేమో అని భయం వేసింది. అతని వంక భయంగా జూశాను. ఆసరికే నా ఒళ్ళంతా స్వేదబిందువుల మయమైంది."

"ఆ వ్యక్తి నన్ను అదోలా జూశాడు. అతని కళ్ళల్లో ఏదో అనిర్వచనీయమైన భావం వుంది. అలాగే కొంతసేపు నన్నే జూస్తుండిపోయాడు. యిదేదో హత్యాప్రయత్నంలా వుంది. చంపబోయే తనను కడసారిగా బాగా జూసుకుంటున్నాడేమో అన్పించింది నాకు. యిక వూరక వుంటే లాభంలేదనీ గట్టిగా అరిచి అతడి బారినుండి కాపాడబడాలని అరవబోయాను. కానీ అంతలో ఓ పెద్ద అరుపు విన్పించింది. ఆ అరిచింది మరెవరో కాదు. నన్ను పెళ్ళాడాలని వచ్చి, నేను హేళన చేసి నెట్టగా క్రిందపడి ఆపై కత్తి చేపట్టి నా వేపు పదేపదే జూసిన ఆ కుర్రాడే, ఆ దిక్కుమాలినవాడే. అతను తనకు తానుగా చనిపోయాడు. తనకు తానుగా కత్తితో పొడుచుకున్నాడు. యిది చూసి కెవ్వున అరిచాను నేను. మా అత్తయ్య వచ్చింది. భయపడుతున్న నన్ను చూసి పెద్దగా నవ్విందామె. భయపడటం మనలాటి వినోద తత్వులకు ఉండకూడదని చెప్పింది. కానీ ఆ సంఘటనలోంచి కొన్ని రోజులు నేను కోలుకోలేకపోయాను. కానీ త్వరలోనే కోలుకున్నాను. తిరిగి మాములుగా మారాను. ఓసారి భూలోకానికి వచ్చాను. యిదే పొగరుచేత కన్నూమిన్నూ గానక, తపస్సు చేసుకొంటున్న ఒక మునిని, పక్షి ఈకతో అతని తపస్సుకు భంగం కలిగించి అతని శాపానికి గురి అయి యీ పక్షిగా మారాను. అవిటివాడూ, సద్గుణసంపన్నుడూ అయిన మానవుడివల్ల సంతాన ప్రాప్తి పొందితే శాపవిమోచనం అవుతుందని ఆయన చెప్పాడు. ముని శాపంతో పాటు ఆ అనామకుడి చావు కూడా నా పాపానికి శాపమైందని ముని ద్వారా తెలుసుకున్నాను. బాధపడ్డా శాప నివారణ చేసుకోవాలనుకొన్నాను. అందుకే అనుకోకుండా అడవిలో ఆనాడు కనిపించిన మిమ్మల్ని సుమావళి పేరుతో నా ఆశ్రమానికి చేర్చాను. అయితే నాకు పక్షి శాపం పగలు మాత్రమే. రాత్రిళ్ళు నా రూపం నేను పొందుతూ వుంటాను. అందుకే పగలు పక్షి రూపంలో మధులత కష్టసుఖాలను విచారిస్తూ రాత్రిళ్ళు మీ భార్యగా మీతో కాపురం చేసాను.. యిదీ కథ" అంది మాట్లాడే పక్షి రూపం వదిలి సుమావళి. మధులత ముఖం చిన్నబుచ్చుకొని, "అయితే యిక మిగిలిందేముంది నాకు! ఇక నేను జీవించి ప్రయోజనం లేదు" అంది మధులత విచారపడుతూ. ముకుందుడు మాట్లాడలేదు. "విచారించకు చెల్లీ! నేను అంత స్వార్థపరురాలిని కాను. ఆయనకు మాట యిచ్చిన ప్రకారం నిన్ను ఆయనకి భార్యను చేసి నా సోదరిలా చూసుకొంటాను" అంది. ఆ మాటతో అక్కడున్నవారి అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ తరువాత యిద్దరి భార్యలతో సుఖంగా రాజ్యపాలన చేసుకోసాగాడు ముకుందుడు.

Comments