ఒక రైతుకు ముగ్గురు కుమార్తె లుండేవారు. అందులో చిన్నది అందమైనది. ఆమె పేరు సుందరి. రూపంలోనే గాక గుణాలకు కూడా ఆమె సుందరే. పెద్దవాళ్లు యిద్దరి మనస్సూ మంచిది కాదు. వాళ్లు పనిపాటలన్నీ సుందరి మీదికే తోసివేసి, పైగా ఆమె చేసేదానిలో లోపాలు ఎంచుతూ వుండేవాళ్లు. అంతేకాదు, అమాయకురాలైన సుందరిని పిచ్చిపిల్ల అని పిలిచేవాళ్లు. ఏమన్నప్పటికీ, సుందరి ఓర్చుకుని వుండేది. ఒక రోజున తండ్రి సంతకుపోతూ, కూతుళ్ళను పిలిచి, ఎవరికేం తెచ్చిపెట్టమంటారని పేరు పేరునా అడిగాడు. పెద్ద కూతురు విలువయిన మణిహారం కావాలన్నది. రెండవ కూతురు చక్కటి జరీచీర కావాలన్నది. "వీలునుబట్టి నాకు వెండి పళ్లెమూ, గాజురేగుపండూ తెచ్చి పెట్టండి" అని సుందరి అన్నది. తండ్రి వెళ్లింది మొదలుకుని ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడి పోయారు. సుందరి మామూలుగా యింటి పనులు చూసుకొంటూ, తల్లిని కనిపెట్టుకొని వున్నది. ఒక వారం రోజులకల్లా తండ్రి తిరిగి వచ్చాడు. అతను వచ్చినట్టు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు. సుందరి మాత్రం తండ్రి దుస్తులు అందుకొని, మంచినీళ్లిచ్చి అతని క్షేమసమాచారాలు కనుక్కొన్నది. "తల్లీ! నీవుకోరిన వస్తువులకోసం చాలా తిరగవలసి వచ్చింది. ఐతే ఏమిలే, దొరికాయి. అదే సంతోషం" అని సుందరితో తండ్రి చెప్పాడు. "అయ్యో! నాన్నకు శ్రమ యిచ్చాను కదా" అని ఆమె విచారించింది. "అయితే, వీటితో యేం చేస్తావమ్మా?" అని తండ్రి అడిగాడు. "రేగుపండును పళ్లెంలో నూరతాను" అని సుందరి చెప్పేసరికి "పిచ్చిపిల్లా! ఇదేమి ఆట!!" అని అతను నవ్వాడు.
పెద్దామె మణిహారం వేసుకొన్నది. రెండవ ఆమె జరీచీర కట్టుకొన్నది. అవి చూచుకొని వాళ్లు మురిసిపోయారు. సుందరి వెండిపళ్లెంలో గాజురేగుపండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతున్నది. కొంతసేపటికి సుందరికి పళ్లెంలో ప్రపంచమంతా కళ్ళకు కట్టినట్టు కనపడింది! సింహాసనం మీద కూర్చున్న రాజు, సముద్రం మీద పోయే ఓడలు, పట్టణంలో మేడలు, ఒకటేమిటి, అన్నీ స్పష్టంగా అగుపడుతున్నాయి. వీటిని చూడటం ఒక ఆటగా పెట్టుకొని, సుందరి ఆశ్చర్యపోయి, ఆనందించేది. సుందరి యిలా సరదాగా ఉండటం చూచి, అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు. ఆ పళ్లెమూ, పండూ ఎలాగయినా కాజేదామని వాళ్లకి దుర్బుద్ధి పుట్టింది. పెద్దక్క తన మణిహారానికి బదులు వాటినిమ్మని అడిగింది. చిన్నక్క తన జరీచీరకు బదులు వాటినిమ్మని అడిగింది. సుందరి ఇద్దరికీ ఇవ్వనన్నది. అసూయకు తోడు అక్కలిద్దరకూ ఇప్పుడు సుందరి మీద కోపం కూడా రేగింది. "ఇక మెల్లిగా అడిగి లాభంలేదు. ఆమెను చంపివేసినట్టయితే ఆ వస్తువులు మనం సులువుగా చిక్కించుకోవచ్చు" అని అక్కలిద్దరూ ఆలోచించుకొని కుట్ర పన్నారు. మరునాడు వాళ్లు సుందరిని పిలిచి "చెల్లీ! మేం పళ్ళు కోసుకురావటానికి తోటకు పోతున్నాము. అన్నీ మోయటం యిద్దరివల్ల కాదు కదా! నువ్వూ రా" అని పిలిచారు. సరేనని, ముగ్గురితట్టలూ తనే చేతపట్టుకుని, సుందరి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు, ఆమె తన ఆటవస్తువులు రెండూ దాచమని తండ్రికిచ్చింది.
పోయి పోయి వాళ్ళు ఒక అడవి చేరుకున్నారు. కొంచెంసేపు పళ్ళు ఏరినట్టేరి, అక్కలిద్దరూ సుందరిని తన ఆటవస్తువులు రెండూ ఇమ్మన్నారు. ఆమె తన దగ్గిర లేవంది. ఈ మాట నమ్మక, సుందరి అబద్ధమాడుతున్నదని చెప్పి, వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక తెగవేశారు. కాని వాళ్లకు పళ్ళెమూ పండూ దొరకనే లేదు. ఇక చేసేదేమున్నది! దుఃఖం నటిస్తూ యింటికి చేరుకొని, "అడివిలో తోడేళ్ళు కూశాయి. చెల్లిని అవి తీసుకుపోయినాయో యేమో. యెంత వెతికినా మాకు కనపడలేదు" అని చెప్పేసరికి, తల్లి దండ్రులు వల వల ఏడిచారు. కొంతకాలానికి ఒక గొల్లపిల్లవాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. ఒక పొదలో వాడి కొక చిత్రమయిన చెట్టుకనపడింది. చూపుకి అది బోలుగొట్టంలాగ వుంది. ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు, ఎర్రటి కాయలూ కాసి వున్నాయి. గొల్లపిల్లవాడు దానిని కోసి, గొట్టానికి పీపీ పెట్టి, వూదుదామనుకొంటున్నాడు. అది అతని పెదవులకు తగిలేసరికి ఇలా పాడటం మొదలెట్టింది:
వూదూ బూరా, వూదూ బూరా,
తల్లికి తండ్రికి జయం, జయం!
పెద్దక్కా చిన్నక్కా కలిసీ
పండ్లు కోసుకుందామని పిలిచీ
పళ్లెం పండూ కాజేదామని
నరికారయ్యా, నట్టడివిలో!
ఈ వింతబూరా పట్టుకొని గొల్లపిల్లవాడు ఊళ్లోకి పరుగెత్తాడు. అందరూ గుమిగూడి ఆశ్చర్యంతో పాట వింటున్నారు. విన్నవాళ్ళంతా కూడా "అయ్యోపాపం! ఎవళ్ళమ్మా ఆ చంపేసిన దుర్మార్గులు!!" అని జాలిపడ్డారు. చివరకు ఈ వార్త రైతుకు తెలిసింది. అతను పాట విని, కళ్ల వెంట బొట బొట నీళ్లు రాల్చాడు. ఈ గొట్టం దొరికిన స్థలానికి తీసుకు వెళ్ళమని గొల్లపిల్లవాడిని బ్రతిమాలాడు. ఇద్దరూ కలిసి అడివిలోకి వెళ్లేసరికి, అక్కడ గొల్లవాడు గొట్టంకోసిన చెట్టుమొదలు యింకా పాడుతూనే వుంది! రైతు ఆ మోడు తవ్వి చూచేసరికి, తన మూడవకూతురు సుందరి నిద్రపోతున్నట్టుగా పడుకొని వున్నది. అతను వెక్కి వెక్కి ఏడిచాడు. చెట్టు మొదలు ఈ సారి పాట మార్చి, ఇలా పాడింది:
పెద్దక్కా చిన్నక్కా కలిసీ
పళ్లు కోసుకుందామని పిలిచీ
పళ్లెం పండూ కాజేదామని
నరికారయ్యా నట్టడవిలో
నాన్నా నాన్నా నాన్నా నాన్నా
రాజుగారి బావిలో జలమూ
పట్టుకువచ్చి చల్లితివంటే
నేలేస్తానూ, తెలివొస్తుందీ!
ఈ పాట వినేసరికి, లోకమంతా అక్కలిద్దరనూ తిట్టిపోశారు. గొల్లపిల్లవాడిని అక్కడే కాపలావుంచి, తండ్రి తక్షణమే రాజుగారి దగ్గరకు వెళ్లి, సంగతి సందర్భాలన్నీ వారికి విన్నవించాడు. దానికి రాజుగారు "సరే, మా బావిలో నీళ్లు పట్టుకువెళ్లు, నీ కూతురు బతికి లేవగానే మాకు చూపించు" మని ఆజ్ఞాపించారు. సంతోషంతో నీళ్లు తీసుకొని, అతను అడివిలోకి పోయి, కూతురు శరీరంపైన చల్లాడు. ఆమట్టున సుందరి, నిద్రనించి లేచినట్టుగా కన్నులు నులుముకుంటూ, లేచి కూర్చున్నది. తండ్రిని చూడగానే ఒక్కసారి బావురుమని, అతని మెడ చుట్టేసుకొన్నది. గొల్లపిల్లవానికి కూడా ఆనందబాష్పాలు రాలినయి. వెంటనే సుందరిని వెంటబెట్టుకొని తండ్రి రాజు దర్శనానికి వెళ్లాడు. రైతునీ, ముగ్గురు కూతుళ్లనూ రాజు చూచాడు. "ఇటువంటి దుర్మార్గులు మళ్లీ సూర్యోదయం చూడడానికి వీలులేదు. ఇవాళనే సూర్యుడు అస్తమించేలోపల వీళ్లిద్దరి తలలు తీయించ" మని శిక్ష విధించారు. తరువాత సుందరిని పిలిచి "నీవు ఆడుకొనే వెండి పళ్ళెమూ, గాజురేగుపండూ చూపించు" మన్నారు. తండ్రి వద్దనే ఉన్న ఆటవస్తువులు రెండూ పెట్టెలోనుంచి తీసి కూతురి కియ్యగా, ఆమె వాటిని రాజుగారికి బహుమతి చేసింది. రాజుకు ఆ పళ్లెంలో కని విని ఎరుగని వింత లెన్నో కనపడ్డాయి. అంతట, కూతుళ్ళతోసహా రైతు ఇక యింటికి వెళదామని రాజుగారి వద్ద సెలవు తీసుకొనబోయాడు. అప్పుడు రాజుగారు సుందరితో "నువు ఆడుకొనే వెండిపళ్ళెమూ, గాజురేగుపండూ రాజులవద్ద ఉండవలసిన వస్తువులు. నీవు కోటలో రాణిగా ఉండవలసినదానివి" అని అనేసరికి, సుందరి సిగ్గుతో తలవంచుకొన్నది. "అయితే, నాకొక్క కోరికవున్నది. మా అక్కలిద్దరకూ శిక్ష తప్పించండి. వాళ్ళుపోతే నేను బతికిన సార్థకమేమిటి" అని ఆమె అన్నది. ఆమె ఔదార్యానికి మెచ్చుకొని, రాజు శిక్ష రద్దుచేయించాడు. మంచి ముహూర్తాన రాజుకీ సుందరికీ అతి వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ సంతోషించారు. నాటినించీ రైతు, అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటున్నారు. వీరందరూ హాయిగా వుండడం గొల్లపిల్లవాని సాయంవల్ల కదా! అందుచేత సుందరి ఆ గొల్లవానిని జన్మలో ఎప్పుడూ మరిచిపోలేదు. అతనికి అనేకమైన కానుకలిచ్చి, తన ఋణం తీర్చుకొన్నది.
Comments
Post a Comment