చందమామ కథలు - రహస్యమందిరం

 

Telugu Chandamama story of a wicked minister who falls in his own trap and meets his fate. Best Chandamama telugu stories to read.

అనగనగా ఒక రాజు. అయన ప్రజలను కన్నబిడ్డలవలె పాలిస్తూ ఉండేవాడు. అందుచేత, రాజుపైన అందరకూ భక్తీ, గౌరవమూ ఎంతగానో ఉండేవి. ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండటంచేత, ప్రజలెంతో సుఖంగా ఉండేవారు. దేశాలు తిరిగివచ్చే సాధువులనూ, యాత్రలు సేవించుకువచ్చే పుణ్యాత్ములనూ ఆదరించటమంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి. అటువంటివారెవరైనా వచ్చినట్టయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ, చర్చలు జరుపుతూ, లోక చరిత్ర తెలుసుకునేవాడు. దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకొని, వాటినన్నిటినీ తన రాజ్యంలో అమలుచేసేవాడు. అందుచేత, ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా వుంది, ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకొంటున్నది. అయితే, ఆ రాజ్యానికి చీడపురుగులాగ, రాజువద్ద కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు అంటే కిట్టదు. అందులోనూ సాధువులంటే అసలే మంట. సాధువులనగా దేశదిమ్మరులైన సోమరిపోతులనీ, వాళ్ళను ఆదరించటం మహాపాపమనీ అతని వుద్దేశం. ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఈ రాజ్యానికి వచ్చాడు. రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయనవల్ల లోకజ్ఞానాన్ని ఇచ్చే విషయాలు ఎన్నో విన్నాడు. పది రోజులు, పదిహేను రోజులైనా, ఆ స్వామి చెప్పే క్రొత్త విషయాలకు అంతూ పొంతూ లేకుండా వుంది. అప్పుడు రాజు "స్వామీ! మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి, తరుణోపాయం చూప" మని కోరాడు. అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు. 


ఈ స్వామి వచ్చినప్పటినుంచీ రాజుకు పరమార్థచింత ఎక్కువైపోతున్నది. ఇది చూచి, మంత్రికి స్వామిపైన చెప్పలేని ద్వేషం కలిగింది. తన బుద్ధిబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి, స్వామికి ఆస్థానంలోనించి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో, రాజు ఒంటిపాటుగా ఉన్నప్పుడల్లా అదను చూచి, స్వామిని గురించి విరుగుడు మాటలు చెప్పనారంభించాడు. "సాధువుల సంగతి నీకు తెలియదు. వారు భూలోకంలో సంచారం చేసే దైవస్వరూపులు. వారి జ్ఞానబోధ వల్లనే మానవ జాతికి ముక్తిమార్గం తెలుస్తుంది," అని రాజు మంత్రిని మందలించేవాడు. కానీ, మంత్రి పట్టు విడువక, స్వామినిగురించి ప్రతికూలంగా రాజుకు నూరిపోస్తూనే వున్నాడు. మంత్రి ఎంత చెప్పినా, అంతకంతకు రాజుకు స్వామిపైన గౌరవం హెచ్చుతున్నదేగాని, కొంచెమైనా తగ్గలేదు. చివరకు ఒకనాడు, స్వామి ఒంటరిగా ఉండటం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి, ఆయనను తన ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు. స్వామి అంగీకరించి, మంత్రి ఇంటికి వెళ్ళాడు. భోజన సమయమైంది. వడ్డన అంతా జరిగిన తరువాత మంత్రి, "స్వామీ! పదార్థాలలో వెల్లుల్లి వేసుకోవటం మా దేశాచారం. గురువులకూ, పెద్దలకూ విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి. తమకేమీ అభ్యంతరం ఉండదనుకొంటాను," అనేవరకు, "అభ్యంతరం లే" దన్నాడు స్వామి. మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి, స్వామి వారి బంతిన భోజనానికి కూర్చోవటం తప్పించుకున్నాడు. స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకు వెళ్లి, "రాజా! సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతిరి. ఇప్పుడు మహానుభావుడని భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ, వానికి నీతీ నియమం లేదు, జిహ్వ కట్టిపెట్టుకోలేడు. నానా గడ్డి తింటాడు. కూడని ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే లోకం నవ్విపోతున్నది. ఎందుకులెండి. నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుంది" అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. 

ఇంతలో స్వామి భోజనమైంది. ఆయనతో మంత్రి "స్వామీ! ఒక్క సంగతి చెప్ప మరిచాను. ఇవాళ రాజుగారి జన్మదినం. ఆయనకు ఉల్లివాసన కిట్టదు. వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూచుకోండి" అని సలహా చెప్పాడు. ఆ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగా కోటకు వెళ్లాడు. కానీ, వెల్లుల్లి వాసన ఇంకా ఉన్నదేమో అనే అనుమానం తీరక, స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు. రాజు పలకరించగా, ఉల్లివాసన కొడుతున్నదేమోనని జంకుతో అటువైపు తిరిగిచూడసాగాడు. రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక, దూరదూరంగా తప్పుకొనే సరికి, రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగి, స్వామి పరమదుర్మార్గుడేనని తలచాడు. ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిశ్చయించాడు. ఈ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది. అదే రహస్యమందిరం. రాజు స్వయంగా చీటీ వ్రాసి, ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది. చీటీలో చూచేవారికి 'బహుమతి ఇంత ఈయవలసింది' అనే మాటలు కనబడి, ఆశ కలుగుతుంది. తీరా మందిరంలోకి పోయేవరకు జరగవలసిన పని జరుగుతుంది. ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు. 

రాజు స్వామిని పిలిచి "మహాత్మా! తమరు వచ్చి చిరకాలమైంది. మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్టయితే, మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్యకోటికి అన్యాయం చేసినట్టవుతుంది. కనుక భక్తి పూర్వకంగా సమర్పించుకొంటున్న ఈ వేయివరహాలూ స్వీకరించండి" అంటూ పత్రం చేతికిచ్చి 'రహస్యమందిరానికి వెళ్ళి సొమ్ము తీసుకోండి!' అన్నాడు. ఈ సంగతులన్నీ గమనిస్తూ వున్న మంత్రి, ఆ బహుమానము తానే కాజేదామన్న దురుద్దేశంతో, స్వామిని దర్శించి, "మహానుభావా! తమరేమిటి, మందిరానికి వెళ్లడమేమిటి? మీరు శ్రమపడటం భావ్యం కాదు. తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి, నేను ఇప్పుడేపోయి బహుమానపు సొమ్ము పట్టుకువచ్చి సమర్పించుకుంటాను" అంటూ స్వామిని తన ఇంటిలో కూర్చుండబెట్టి, మంత్రి ఆ చీటి తీసుకొని మందిరానికి చేరుకొన్నాడు. రహస్య మందిరంలోని ఉద్యోగులు ఈ చీటి చూచుకొంటూనే, మంత్రిని మటుమాయం చేసివేశారు. సాయంత్రమైనా మంత్రి రాకపోయేవరకు, స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్ళాడు. "మాకు తెలియదు, రాజుగారిని కనుక్కోండి" అన్నారు అక్కడి ఉద్యోగస్థులు. స్వామి మళ్ళీ ప్రత్యక్షమయేవరకు, రాజు ఆశ్చర్యపోయాడు. తరువాత స్వామి, జరిగిన కథ చెప్పగా, మంత్రి ఆడిన కపటనాటకమంతా రాజుకి బోధపడి నిజానిజాలు తెలిసిపోయినై. అతను తగినట్టుగా పాపఫలం అనుభవించటంతో రాజుకు స్వామి బోధలయందు విశ్వాసం ఎక్కువై, నాటి నించి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకొన్నాడు.

Comments