చందమామ కథలు - మంత్రి పదవి

 

Telugu Chandamama story of a king who put test to two persons competing for post of minister. Best Chandamama Telugu Stories to read.

అనగననగా ఒక దేశాన్ని ఒక ఫాదుషా పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివయిన మంత్రి కావలసి వచ్చాడు. రాజ్యమంతటా చాటింపు వేయించగా, ఎంతోమంది వచ్చారు. వచ్చినవాళ్లనందరనీ ఫాదుషా పరీక్షకు పెట్టాడు. కాని ఒక్కళ్లూ పరీక్షలో నెగ్గలేకపోయారు. చివరకు ఒక ముల్లా, ఒక మార్వాడీ మిగిలారు. "సరే, మీ ఇద్దరనూ పరీక్షకు పెడతాము, ఎవరు నెగ్గితే వాళ్ళకు మా రాజ్యంలో మంత్రిపదవి ఇస్తాము" అని వారితో ఫాదుషా చెప్పాడు. మరునాడు ఫాదుషా రెండు బుట్టలు తెప్పించి, ఒక్కొక్క బుట్టలో యాభైయ్యేసి చొప్పున చక్కిలాలు సర్దించి, వాటిని పక్క ఊరిలో వున్న తన కూతుళ్లకు ఇచ్చిరమ్మని ముల్లానూ మార్వాడీనీ పంపించాడు. ఫాదుషా ఆజ్ఞ ప్రకారం, చక్కిలాల బుట్టలను పొరుగూరిలో ఇచ్చేసి, సాయంత్రానికి ఇద్దరూ తిరిగివచ్చారు. ముల్లా తీసుకువచ్చిన రశీదులో నలభై అయిదు చక్కిలాలు మాత్రమే చేరినట్లు వ్రాయబడి ఉన్నది. 'తక్కిన ఐదూ ఏమైనవయ్యా?' అని ఫాదుషా ప్రశ్నించాడు. అందుకు, ముల్లా "మహప్రభూ! క్షమించాలి. మధ్య దారిలో ఆకలి వేసింది. అందుకని అయిదు చక్కిలాలు నేను తిని వేసినమాట నిజమే" అని తను చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. అప్పుడు ఫాదుషా ముల్లా అవివేకానికి, అమాయకత్వానికి లోపల నవ్వుకొని, "యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు ?" అనుకొన్నాడు.

తరువాత మార్వాడీవేపు తిరిగి, "మరి, నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా? దూరపు ప్రయాణంకద ?" అని అడిగాడు. అందుకు మార్వాడీ, "వేయకేమి దేవరా! మానవజన్మ ఎత్తిన ప్రతివాళ్లకూ ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చి రమ్మనిన చక్కిలాలలో నేనూ కొన్నితిని ఆకలి తీర్చుకొన్నాను. అయితే, ఒక్కొకదానికి జాగ్రత్తగా అంచులు చిదిపి తినటంచేత, స్వరూపాలు చిన్నవయినవి గాని లెక్కకు తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకొనరని తలుస్తాను" అంటూ, తను చేసిన తప్పును ఎంతో యుక్తిగానూ, వినయంగానూ చెప్పి సమర్థించుకొన్నాడు. ఇది వినగానే ఫాదుషా మనస్సులో చాలా సంతోషించాడు. ఇద్దరిలోనూ వుండే తెలివితేటలు ఇప్పుడు ఫాదుషాకు తెలిసివచ్చినయి. ఈసారి వాళ్ళను మరివక పరీక్షకు పెట్టి చూస్తామన్నాడు. వాళ్ళకు తెలియకుండా రెండు సంచీలలో బూడిద వేయించి, వాటిని పొరుగు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరనూ పంపించాడు. "ఇది ఒక అర్థ౦లేని పనిగా పైకి కనబడుతున్నది, కాని బుద్ధి బలం కలవానికీ, ఆలోచన లేనివానికీ ఉండే తేడాను కనిపెట్టటానికి ఇది తగిన పరీక్ష" అని నిశ్చయించాడు. ముల్లా వెళ్లి ఫాదుషాయిచ్చిన సంచిని నవాబుగారికి సమర్ఫించాడు. ఆయన విప్పిచూచి, "ఏమయ్యా, ఇదేమిటి బూడిద తీసుకువచ్చావు, అర్థంలేకుండా? నీకేమయినా పిచ్చెత్తిందా?" అని కోపగించాడు.

ముల్లా హడలిపోతూ, "మహరాజా! ఫాదుషావారు ఇచ్చి రమ్మన్నారు, తీసుకు వచ్చాను. అంతేకాని, సంచీలో ఏమున్నదో నాకేమి తెలుసునండి?" అని అన్నాడు. అప్పుడు రాజుగారు, "ఇందులో ఏదో విలవయిన వస్తువు పెట్టి ఫాదుషా పంపి వుంటాడు, వీడు దానిని కాజేసి ఈ బూడిద పోసుకొని వచ్చాడు" అని అనుమానపడి, ముల్లాను అవమానించి, పరాభవించి పొమ్మన్నారు. మార్వాడీ కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబుగారికి సమర్పించాడు. అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు. సంచీ విప్పగానే ఈ నవాబుగారు కూడా అతనివేపు మిర్రిచూచి, "ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావ్‌? ఇదేనా మీ ఫాదుషాగారు నాకు పంపిన కానుక?" అన్నారు. యుక్తిపరుడయిన మార్వాడి పరిస్థితులు ఆలోచించి "ప్రభూ! మా ఫాదుషావారు ఈ మధ్యనే మక్కాయాత్ర సేవించుకు వచ్చారండి. అక్కడినించి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలినవారికి ప్రసాదంగా పంపించారండి," అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు అపరిమితంగా సంతోషించి, ఫాదుషా తరఫున మార్వాడీని ఎన్నో విధాల గౌరవించి, కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. ముల్లా, మార్వాడీ తిరిగివచ్చారు. నవాబు పంపిన కానుకలను మార్వాడీ ఫాదుషా వారికి సంతోషంతో అందజేశాడు. ముల్లా తెల్లముఖం వేసికొని, విచారంగా నిలబడ్డాడు. మరి, ఫాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసికొన్నాడో మీరే ఆలోచించి చెప్పండి !

Comments