పూర్వకాలమందు ఒకానొక కీకారణ్యంలో కొండ మీద ఒక మహానుభావుడు తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. ఆయన ముక్కుమూసుకుని కేవలము తన మోక్షంకోసమే దేముణ్ణి ధ్యానించే స్వార్థపరుడు కాడు. లోకంలో సమస్త ప్రాణులూ సుఖంగా ఉండటంకోసం ఆయన రాత్రింబవళ్ళు తపస్సు చేసేవాడు. ఇంత గాఢమైన తపస్సులో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు వెళ్లి ఆశ్రయించినా జ్ఞానబోధ చేయటమే ఆయనకు ఆనందం. ఆ అరణ్యం చుట్టుపక్కల సుమారు నూరు గ్రామాల జనులు తపస్వి వద్దకు పోయి, వాళ్ళ కష్టసుఖాలు వలపోసుకుని, తరుణోపాయం తెలుసుకునేవాళ్లు. అపుడు పుట్టిన శిశువు మొదలుకొని ఆరమొగ్గిన వయోవృద్ధు వరకూ, ఎవరికి తగిన సలహాలు వారికి చెప్పి పంపేవాడు తపస్వి. అందుచేతనే అందరూకూడా ఆయనపైన అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడినై. తను నివసించే కొండదిగువను, నలుగురూ నడిచే దారి ప్రక్కన ఆయన నాలుగు చిత్రమైన సంజ్ఞలు నెలకొల్పాడు. భగవంతుడు ధరించే శంఖు, చక్రం, గదా, పద్మం ఇవే ఆ నాలుగు సంజ్ఞలున్ను. వీటిని గురించి తపస్వి ఎంతలేసో అంతరార్థాలు చెప్పి రోజులకొద్దీ బోధించేవాడు. వీటిని జనానికి చూపించి, తపస్వి "బిడ్డలారా! ఎల్లప్పుడూ మంచిపనులు చేయండి. నమ్రతతో నడుచుకోండి. సత్యమే పలకండి!" అని చిన్నపిల్లలకు బోధించేవాడు. "ఎవరినీ ద్వేషించకండి. ద్వేషం వల్ల క్రౌర్యం పుట్టుకువస్తుంది. కనుక చాలా జాగర్తగా మసులుకోవాలె" అంటూ యుక్తవయసులో ఉండేవారికి హితవు చెప్పేవాడు.
"అన్నలారా! మానవులు ప్రశాంతంగా జీవితం గడపటమే పరమేశ్వరుని ఉద్దేశం. ఇందుకు తగిన దోహదం చేయండి. కయ్యానికి కాలు దువ్వటం శ్రేయస్కరం కాదని చేతనైనంతవరకూ ప్రచారం చేయండి" అంటూ వయసు ముదిరిన పెద్దలకు ఉపదేశించేవాడు. తపస్వి చెప్పినట్టుగా అడుగుతప్పక నడుచుకోవటంవల్ల ఆ నూరు గ్రామాల ప్రజలూ ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నారు. ఈ ప్రజలూ అందరి లాగానే తప్పులు చేసేవారు. కానీ, తాపస్వి ఎప్పటికప్పుడు కనిపెట్టి తప్పులను సవరించటంవల్లా, తప్పు చేసిన వాళ్ళను మందలించటంవల్లా ప్రజలలో శాంతి ఏర్పడేది. మరొక చిత్రమేమిటంటే, ఎవరైనా పొరపాటు చేసినప్పుడు వాళ్లు తపస్వి ఎదట కనబడగానే, దేముని ఎదుట చెప్పుకొన్నట్టుగా లెంపలువేసుకొని, "నేను ఫలానా తప్పు చేశాను" అని వాళ్ళంతట వాళ్ళే చెప్పుకుని పశ్చాత్తాపపడేవారు. ఇలా ఉండగా ఒకప్పుడు ఒక బాలిక సిగ్గుతో తల వంచుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ, ఏడుస్తూ తపస్వి ఎదటికి వచ్చి నిలబడింది. "మీ పవిత్రమైన నాలుగు సంజ్ఞలలోనూ చక్రాన్ని నేను మలినపరిచాను. అపరాధం క్షమించండి," అని దీనంగా వేడుకున్నది. "ఎలా మలినపరిచావు?" అని చిరునవ్వుతో ప్రశ్నించాడు తపస్వి. "మహానుభావా! మా ఇంటిపక్కనే నాకు నేస్తంగా ఉండే ఒక పిల్ల కొత్తగా ఒక పగడపు దండ తెచ్చుకుని మేడలో వేసుకున్నది. నా దండ కంటే ఆ పిల్ల వేసుకున్న దండ అందంగా ఉండటంచేత ఆమె పైన నాకు అసూయ కలిగింది. అందుకని ఆ అమ్మాయి గురించి నేను లేనిపోని చాడీలు చెప్పాను. ఆ మాటలు ఊరంతటా పాకిపోయి, అందరూ ఆక్షేపించటంవల్ల ఆ పిల్ల పాపం, పైకి రావటానికి సిగ్గుపడిపోతున్నది." అని జరిగిన సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్పివేసింది.
తపస్వి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని, "అయ్యో, ఎంతపని చేశావు తల్లీ! ఒక్క చక్రమే కాదు నీవు మలినపరిచింది. పవిత్రములైన తక్కిన సంజ్ఞలు కూడా మైలపడిపోయినై," అని చెప్పి ఆమెను కొండదిగువకు వెంటబెట్టుకుపోయి ఆ సంజ్ఞలు చూపాడు. అవన్నీ మకిలిపట్టి ఉండటం చూచి ఆ బాలిక దుఃఖించి, క్షమించమని ఆయన కాళ్లపైన పడింది. "సరే, నీవు ఇంటికి వెళ్లి రేపు ఉదయమే కొండ మీదికి రావలసింది" అని చెప్పి, తపస్వి తన నివాసస్థలానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయానే కొండ మీద తపస్వి ఎదట బాలిక చేతులు కట్టుకొని నిలబడి వున్నది. ఆయన ఆజ్ఞప్రకారం నూరు గ్రామాల జనమూ కూడా కొండ దిగువను సమావేశమైనారు. అప్పుడు తపస్వి బాలికను వెంటబెట్టుకుని కొండదిగువకు వచ్చి, ఆ పిల్ల చేసిన తప్పు అందరకూ విప్పి చెప్పాడు. అక్కడనే పక్షి ఈకలు గల కట్ట ఒకటి ఉన్నది. అందులోని ఓకే ఈక తీసి బాలికను ఎగరవేయమన్నాడు. ఆమె ఎగరవేసేవరకు, అది విమానంవలె గాలిలో ఎగిరి, మరి కనపడకుండాపోయింది. అదే మోస్తరుగా ఆ కట్టలోని ఈకలన్నిటినీ ఎగురవేయించాడు. ఈకలన్నీ ఒక్కటీ కనపడకుండా మాయమైపోయినై. తర్వాత, అక్కడ మూగిన అందరితోనూ, "ఆ అమ్మాయి ఎగురవేసిన ఈకలను ఎలా అయినా శ్రమపడి పోగుచేసి తీసుకుర" మ్మని ఆజ్ఞాపించాడు. ఒక్కొక్క ఈకకు ఇంత చొప్పున బహుమతి కూడ ఇస్తానన్నాడు.
అందరూ బహుమతి పొందాలనే ఆశతో ఈకలు వెతుకబోయారు. ఎంత దూరం తిరిగినా ఎగిరిపోయిన ఈకలన్నీ దొరకనే లేదు. వెళ్ళిన వేలాదిజనంలో ఒక్క నలుగురు మాత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకు రాగలిగారు. వాటిని ఆ తపస్వి తీసుకుని కట్టకట్టి, బాలిక చేతికి ఇచ్చి "అమ్మాయీ! ఏ బాలికమీదనైతే నీవు చాడీలు చెప్పావో, ఆ బాలికకు ఈ కట్ట ఇచ్చి. 'చెల్లీ! మన్నించు. నీలోని నాలుగు మంచి గుణాలను నేను దొంగిలించాను. ఇప్పుడు మళ్ళీ వాటిని నీకు ఇచ్చివేస్తున్నాను. పుచ్చుకో!' అను. ఆమె ఏమంటుందో మళ్ళీ వచ్చి నాతొ చెప్పు" అన్నాడు. తపస్వి చెప్పినట్టే చేసి, ఆ బాలిక తిరిగి వచ్చి "మహానుభావా! నా నేస్తం ఆ కట్ట తీసుకొని ఏమీ బదులు చెప్పలేదు. నవ్వి ఊరుకున్నది" అని చెప్పేవరకు, "ఈసారి సంజ్ఞలు చూడు" అన్నాడు తపస్వి. ఆ బాలిక, ఆమెతో పాటు నూరుగ్రామాల ప్రజలు చూస్తూ ఉండగా, అందరకూ ఆశ్చర్యం కలిగేటట్టు ఆ నాలుగు సంజ్ఞలపైనున్న మకిలి వదిలిపోయి, తిరుగా అవి తళతళ మెరవజొచ్చాయి. అప్పుడు అందరకూ తపస్వి చేసిన పనిలోని అంతరార్థం బోధపడింది. అబద్ధాలు చెప్పటం ఎంత సులువో, అవి పక్షి ఈకలవలె ఎంత త్వరగా గాలిలో వ్యాపిస్తాయో, ఎగిరిపోయి అలా వ్యాపించిన వాటిని మళ్ళీ కూడగట్టుకువచ్చి తుదముట్టించాలెనంటే అది ఎంత కష్టసాధ్యమైన కార్యమో, అందరకూ తెలిసివచ్చింది.
Comments
Post a Comment