చందమామ కథలు - సక్తుప్రస్థుడు

 

Telugu Chandamama story of Yudhishtara getting humbled by a mongoose by listening to the story of a great donor. Best Telugu Chandamama Stories.

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు 'అశ్వమేధయాగం' అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలూ, ఋషులూ, మునులూ, సాధులూ, సన్యాసులూ, భిక్షువులూ వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో భోంచేసి వెళ్లేవారు. ధర్మరాజు వాళ్లందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి, వాళ్లు వెళ్లేటప్పుడు ఆ పాత్రలనుకూడా బహుమానంకింద పట్టుకుపొమ్మనేవాడు. ఆయన అన్నదానానికీ దాతృత్వానికీ, వచ్చినవాళ్ళంతా అనేక విధాల మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవిని పడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తర్వాత అతిథులతో ఒక్కొక్కడికీ రెండేసీ మూడేసీ బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టేడు. దగ్గిర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి, "ఏమిటి చెప్మా, ధర్మరాజు యిలా వొళ్లు తెలియకుండా ఖర్చుపెడుతున్నాడు?" అనిపించింది. "ఏమిటి బావా, చాలా జోరుగా దానాలిచ్చేస్తున్నావ్?" అని అడిగేశాడు కూడాను. అప్పుడు ధర్మరాజు దర్జాగా, "జోరుగాక మనకేమిటోయ్? వచ్చినవాళ్లు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టంలేదూ? 'ధర్మరాజువంటి అన్నదాత ఇదివరలో లేడు; ఇక ముందు పుట్టబోడు!' అనుకుంటున్నారు." అన్నాడు. శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు గాని ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? 'మహాన్నదాతనైపోయాను!' అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది. 

శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కాని వాళ్ళలో ఏ మాత్రం గర్వం బయల్దేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరుస్తేగాని ఆయనకు నిద్రపట్టదు. మహాన్నదాత ననుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చెయ్యాలని ఆలోచించి, అతణ్ణి భోజనశాల కవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్లేడు. కోట్లకొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటూండడం వల్ల, ఆ నీరంతా ఓ నదిలా ప్రవహించటం మొదలెట్టింది.  ధర్మరాజు శ్రీకృష్ణుడితో, "బావా చూశావా, ఈ నదిని?" అన్నాడు. అందుకు కృష్ణుడు, "నదికేంగాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగిస ఉంది చూశావా?" అన్నాడు. "ఆ చూశాను. బురదలోంచి ఇవతలకొచ్చి నిలబడి, తన ఎడంవైపు చూసుకుంటోంది. అదిగో మళ్లీ బురదలోకెళ్లి దొర్లుతోంది చూడు." అన్నాడు ధర్మరాజు. ఆ ముంగిస మళ్లీ బయటకొచ్చేసింది. ఇది చూచి ధర్మరాజు, "ఇందాకట్లాగే తన ఎడంవైపు చూసుకుంటోంది. ఎందుకు చెప్మా. బురదలో దొర్లి వచ్చి అలా చూసుకుంటోంది?" అని కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగిస ధర్మరాజు ఎదటికివచ్చి మనిషికి మల్లే మాట్లాడడం మొదలెట్టింది. "మహారాజా, విను. కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్థుడనే పేద బ్రాహ్మడొకడుండేవాడు. ఆయన పూరి గుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్నచోట బురదలో దొర్లుతే నా కుడిపక్క బంగారమైంది. నా ఎడంపక్క గూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లపోతే అక్కడ చాలినంత బురదలేక, ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది" అన్నది ముంగిస.

ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. "బురదలో దొర్లుతే వొళ్లు బంగారమౌతుందా ఎక్కడన్నా?" అన్నాడు. "మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా" అంటూ ముంగిస ఆ నీళ్ళల్లోకి పరుగెత్తి వెళ్లి తన వంటి బురద కడిగేసుకొచ్చి, ధర్మరాజుకి తన కుడివైపు చూపించింది. "నిజమే. ఈ వైపు అంతా బంగారమే! ఇదెలా సాధ్యమైంది?" అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. "సక్తుప్రస్థుడు మహాన్నదాత. అందువల్లనే ఆయన గుడిసెవద్ద అతిథి చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది." అన్నది ముంగిస. "నాకంటే ఎక్కువ అన్నదాతా, ఆ పేద బ్రాహ్మడు? ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరైపారుతోంది. సక్తుప్రస్థుడి పర్ణశాల పక్క బురద నీ కుడి పక్కకు మాత్రమే సరిపోయి, ఎడమ పక్కకు లేకపోయిందన్నావు!" అన్నాడు ధర్మరాజు. "నిజమే; కాని ఆ కాస్త బురదా అంటితేనే నాకు ఒకపక్క బంగారమైంది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటినుంచీ ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కాని ఒక్క పెసరగింజంత మేర ఐనా నా ఎడం పక్కని బంగారమవలేదు. సక్తుప్రస్థుడు పూటకు ఠికాణాలేని పేదవాడేగాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకీ రాదనీ తేలిపోయింది" అన్నది ముంగిస.

ఆ ముంగిస ఇలా ధర్మరాజుతో చెప్పేసి తనదారిని వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ యెరగనట్లు దిక్కులు చూడడం మొదలెట్టేడు. ధర్మరాజాయనతో, "బావా, ఈ సక్తుప్రస్థుడు ఎవరు?" అని అడిగేడు. అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్థుని గురించి యిలా చెప్పసాగాడు. "ఆ ముంగిస చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మడని? పేదవాళ్ళల్లో కల్లా పేదవాడతను. ఐతేం? అతనూ, అతని కుటుంబం కూడా 'దేహీ' అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపేరు. అతనూ, అతని భార్యా, కొడుకూ, కోడలూ ఈ నలుగురూ కూడా పొలాలలో రాలి పడ్డ ధాన్యం యేరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి, ఆ బియ్యంతో పొట్టపోసుకునేవారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. "ఇలా రోజులు గడిచిపోతుంటే ఉన్నట్టుండి కరువొచ్చింది. పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై, పొలాలలో రాలిన గింజలు యెరుకుపోయేవాళ్ళు యెక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్థుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురూ వెళ్ళి వరుసగా నాలుగురోజులు ఏరితెస్తే తప్ప ఒకపూటకు సరిపడే గింజలు దొరికేవి గావు. అంచేత నాలుగేసి రోజులకోమాటు భోజనంచేసి, తక్కిన రోజులలో పస్తులుండేవారు. "ఇలా ఓమాటు నాలుగురోజులూ ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి, ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకుని విస్తళ్ళలో వడ్డించుకుని తిందామనుకుంటూంటే ఎక్కడనుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు. మరెవరైనా ఔతే ఆ సందర్భంలో, "అయ్యా, నాలుగు రోజులనుంచి మాకు తిండిలేదు. ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు. కనుక మరోచోట చూసుకోండి" అని నిర్మొగమాటంగా చెప్పేద్దురు.

కాని సక్తుప్రస్థుడలా చెయ్యలేదు. విస్తరి ముందు కూచున్నవాడు దభీమని లేచి, ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకుని, ఆయనను తన విస్తరిముందు కూచోబెట్టి 'ఆరగించండి బాబూ' అని అన్నాడు. ఆ అతిథి. 'ఈ కాస్తా నేను తినేస్తే నీ మాట యేమిటి?' అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా 'నాకేం కడుపు నిండలేదు' అన్నాడు. అతిథి అర్ధాకలితో లేవకూడదు అని సక్తుప్రస్థుడు బాధపడ్డాడు. 'ఎందుకూ, నా వాటా వడ్డిస్తాను' అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, 'అయ్యో, నీకు నేను తెచ్చిపెట్టవలసినది బదులు నీ వాటా నేను పుచ్చేసుకోవడమా? ఏ భర్తా తన భార్యకిలాంటి అన్యాయం చెయ్యడు' అని వాపోయాడు. అందుకామె, 'అబ్బే, ఇందులో అన్యాయమేముంది? అతిథికి ఆకలి తీర్చడంలో నాకూ బాధ్యత ఉంది.' అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునికి వడ్డించేసింది. ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తిని వెయ్యటానికి, వడ్డించినంతసేపైనా పట్టలేదు. తినేసి 'ఇంకా కావాలి' అన్నాడు. 'మహాత్మా, ఇదిగో సిద్ధంగా వుంది. ఆరగించండి' అంటూ సక్తుప్రస్థుని కుమారుడు తనవాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు. అతిథి అది కూడా తినేసి, 'నా ఆకలి తీరలేదు. ఇంకలేదా?' అన్నాడు.

ఆ మాట విని సక్తుప్రస్థుని కోడలు మహదానందంతో, 'మహాత్మా, నా అత్తమామలూ, నా భర్తా ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలినవటానికి అవకాశం వచ్చింది. ఇదిగో, ఈ అన్నం కూడా భుజించండి.' అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి, వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, 'నా కడుపు నిండింది.' అంటూ లేచి, అవతలకి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతని చేతినుంచి నీళ్ళతోబాటు పడ్డ మెతుకులకు ఆశపడి వచ్చి ఆ ముంగిస తన కుడిపక్క బంగారం చేసుకుంది. "అంతవరకూ ముసిలిబ్రాహ్మడికి మల్లే ఉన్న ఆ అతిథి ఓ దివ్యపురుషునికి మల్లే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్థుడూ వాళ్ళూ ఆశ్చర్యపోయి, 'మహాత్మా, మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథిరూపంలో వేంచేసిన శ్రీ మహావిష్ణువే మీరు!' అని స్తోత్రం చేశారు. అందుకాయన 'నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. నాలుగు రోజులనుంచి తిండిలేక, తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనస్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం ఇచ్చాను' అని చెప్పి, అంతర్థానమయాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి, ఆ నలుగుర్నీ కైలాసం తీసుకుపోయింది." ఈ కథ విన్న ధర్మరాజు, పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం పెట్టి, బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చినా తన అన్నదానం సక్తుప్రస్థుని అన్నదానం ముందు ఎందుకూ పనికిమాలిన దైనదని తెలుసుకుని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు.   


Comments