చందమామ కథలు - కామరాజు గేదెలు - భీమరాజు పాదులు

 

Telugu Chandamama fun story of a lazy husband and son. Best Chandamama telugu stories to read.

కాతేరు గ్రామంలో కామరాజు అనే కరణాల పిల్లవాడొకడు ఉండేవాడు. చిన్నప్పుడే తండ్రిపోయినందువల్ల చదువు సంధ్యలు ఏమీ అబ్బలేదు. వాడి తల్లి గవరమ్మ "చదువుకోరా నాయనా, చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందిరా" అని బతిమాలేది. "ఉద్యోగమా అమ్మా? ఏం ఉద్యోగం వస్తుందే?" అని అడిగాడు కామరాజు. కామరాజు అలా అడిగేటప్పటికి ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్న ఐన హనుమాన్లు చేస్తూవున్న ఉద్యోగం జ్ఞాపకం వచ్చిందావిడకు. ఆ ఉద్యోగం పేరేమిటో ఆవిడకు తెలియదుగాని, అదేదో చాలా గొప్ప ఉద్యోగమనే ఆవిడ అనుకుంది. ఏమీ అంటే, హనుమాన్లుగారింటికి ఆయన ఉద్యోగం ధర్మమా అంటూ కాయకూరలూ, కందులూ, పెసలూ, మినుగులూ, ఇంకా ఏవేవో సరుకులూ ఊరికేనే వచ్చి పడుతోండేవి. చుట్టుపక్క రైతులంతా బళ్ళమీద గడ్డిబొద్దులు తెచ్చిపడేసి పెరట్లో మేట్లు వేసిపోతూండేవారు. అంత గడ్డి ఊరికే వచ్చిపడుతోంది గనుకనే అయన ఐదు పాడిగేదెలను కొన్నాడు. అవన్నీ జ్ఞాపకం వచ్చి గవరమ్మ కొడుకుతో, "హనుమాన్లు మామయ్య చేసే ఐతంపూడి ఉద్యోగంలాంటి ఉద్యోగం నీక్కూడా వస్తుందిరా నాయనా. మామయ్య ఐదు గౌడగేదెలను కొన్నాడు. వాళ్ళింట్లో రోజూ మూడుపూట్లా గడ్డ పెరుగు వేసుకు జుఱ్ఱుతారు తెలుసా? నువ్వు కూడా మామయ్యకు మల్లే చదువుకుని అలాంటి ఉద్యోగం చేస్తివా, అతనికి మల్లేనే ఐదు గేదెలనూ కొనుక్కుని మేపుకోవచ్చు. రోజూ కమ్మటి గడ్డపెరుగు వేసుకుని జుర్రవచ్చు!" అంది.

'గడ్డ పెరుగు' అనటంతోనే కామరాజుకి నోరు ఊరింది! "అటైతే నేను తప్పకుండా చదువుకుని ఐతంపూడి ఉద్యోగం చేస్తానే అమ్మా. ఐదు గేదెలనూ కొంటానే!" అంటూ వాడు ఆ రోజునుంచీ బళ్ళోకి వెళ్ళటం మొదలెట్టేడు. బళ్ళోకి వెళ్ళేవాడుగాని, వాడి ధ్యానం మాత్రం మేష్టరు చెప్పే పాఠం మీద ఉండక, ఐతంపూడి ఉద్యోగమయాక తానూ కొనబోయే గౌడగేదెల గడ్డపెరుగు మీదనే ఉండేది. ధ్యానం మరోచోట ఉండటంచేత ఎన్నేళ్ళు బళ్ళోకి వెళ్ళినా కామరాజుకి చదువురాలేదు. ఐతంపూడి ఉద్యోగం చేసేటంత చదువు కాదు కదా చేవ్రాలు చేసేపాటి చదువైనా అబ్బలేదు. తన కొడుకు ఇలా బడుద్ధాయి ఐపోయాడని గవరమ్మ విచారించి, "వీణ్ణి దారికి తీసుకురావటం ఎలాగా?" అని శతవిధాల ఆలోచించింది. 'వీడికి పెళ్లి చేసేస్తే సరి! అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత నెత్తిమీద పడి, సంపాదించుకోవాలన్న యావ ఒక్కమారుగా పుట్టుకువస్తుంది" అని తోచింది. ఈ ఆలోచన తట్టటంతోనే గవరమ్మగారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకసాగింది. తిరిగి తిరిగి ఆఖరికి తామరాడ కరణంగారి కూతురు 'అమ్మన్న' అనే పిల్లను నిశ్చయించేసుకు చక్కా వచ్చింది. "కామరాజుకి మరెవరూ పిల్లనివ్వనప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడూ?" అని మీరు అడగవచ్చు. అమ్మన్న ఉత్తి వెఱ్ఱిమాలోకం. దానికెక్కడా పెళ్లి సంబంధాలు రాకనే కరణంగారు, కామరాజు సంబంధం వచ్చీ రావటంతో పెళ్ళి నిశ్చయం చేసేశాడు. నిశ్చయమైన వారానికే ముహూర్తం పెట్టించి పెళ్ళి చేసేశాడు. 

పెళ్ళాం కాపరానికొస్తే, కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి, సంపాదన మొదలెడతాడని కదా గవరమ్మ కామరాజుకి పెళ్ళి చేస్త? కామరాజుకి సంపాదన లేదు సరికదా, "పెళ్ళి ఐ ఒక యింటివాణ్ణి అయాను గనక నేనూ గొప్పవాణ్ణే" అనుకుని ఇంట్లో కర్రపెత్తనం మొదలెట్టేడు. తల్లి మీద సాముచేయటం ఉండనేవున్నది. ఇప్పుడు కొత్తగా పెళ్ళాం మీద కూడా అధికారం చెలాయించటం మొదలెట్టేడు. మొగుడు కేకలు వేస్తూన్నప్పుడు, తెలివైన పెళ్ళాం అవుతే మాటకు మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది. కాని అమ్మన్న కుండ బద్దలు గొట్టినట్లు, తనకు తోచినదేదో నిర్మొగమాటంగా చెప్పేసేది. "హాత్తెరీ, నాకు బదులు చెపుతావా?' అంటూ, ఆ మూర్ఖశిరోమణి ఆమె శిగ పట్టుకుని బాదుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఐతంపూడి నుంచి గవరమ్మగారింటికి ఒక శుభలేఖ వచ్చింది. హనుమాన్లు గారు రాసిన శుభలేఖ అది. ఆయన కొడుకు వీరభద్రుడికి పెళ్ళిట! చెల్లెలు విని సంతోషిస్తుందని హనుమాన్లుగారు ఆ పసుపుబొట్ల కార్డులో కట్నం కానుకల వివరాలు కూడా రాశాడు. వీరభద్రుడికి రెండువేల రూపాయిలు కట్నంట! కట్నం సంగతి తెలిసి గవరమ్మగారు సంతోషించింది గాని క్రమంగా ఆ సంతోషమంతా అసూయగా మారింది. కామరాజును చూసి ఆవిడ, "ఎందుకూ వాజమ్మవు! ఒక్క దమ్మిడీ ఐనా కట్నం సంపాదించలేక పోయావుకదా నువు? ఎలా సంపాదిస్తావ్? చదువు ఉంటేగా? వీరభద్రుడంటే చదువూ సంధ్యా ఉన్నవాడు. వాళ్ల నాన్నకు మల్లేనే వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తాడు! కట్నం ఇచ్చారంటే అబ్బురం ఏముంది?" అని తన బాధ వెళ్లబోసుకుంది.  

కామరాజుకు అలాటి అసూయా, బాధా లేదు గాని ఆ శుభలేఖలో ఒక్క మాటు ఐతంపూడి ఉద్యోగం, ఐదు గేదెల పాడీ, కమ్మటి గడ్డపెరుగూ జ్ఞాపకానికొచ్చాయి. ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి, గేదెల్ని కొని, పెరుగు జుఱ్ఱుకోవాలన్న కోరిక మళ్ళీ ఒకమాటు కలిగిందతనికి. అదే సమయానికి ఎండపెడదామని అమ్మన్న పట్టుకువెడుతూ ఉన్న పెద్ద ఊరగాయ బాన, అతని కంట బడింది. తాను గేదెల్ని కొంటె, ఆ పాలన్నీ కాచటానికి ఆ మాత్రం కుండ ఐనా ఉండాలె అనిపించింది కామరాజుకి. దానికి సరిపడ్డ పెద్ద దాలివేసి, అంత కుండతోటీ తన భార్య పాలుకాస్తుంది అనుకున్నాడతను. వెంటనే మరొక్క ఆలోచన వచ్చిందతనికి. ఐదు గేదెల పాడీ తన పెళ్ళాం చేతి మీద కదా నడుస్తుంది! తన భార్యకు పుట్టింటి వాళ్ళంటే తగని అభిమానం, మక్కువా కదా! అంచేత, అది వెన్న అంతా కూడబెట్టి నెయ్యికాచి, ఆ నెయ్యి అంతా తామరాడ పంపించెయ్యదుకద? ఇదీ అతనికి పట్టుకున్న బాధ. ఆ సంగతేమిటో అప్పుడే తేల్చుకోవాలని తోచి కామరాజు అమ్మన్నని నిలుచున్న పటాన్న రమ్మన్నాడు. ఆ అమ్మాయి వచ్చి, "ఎందుకు?" అని అడిగింది. "నాకు ఐతంపూడి ఉద్యోగం ఐతే గియితే, నువ్వు ఐదు గేదెల పాడీ చేస్తే గీస్తే, మా వాళ్ళకి పోస్తావా మీ వాళ్ళకి పోస్తావా?" అని అడిగాడు కామరాజు. "మీ వాళ్ళకెందుకు పోస్తాను? మా వాళ్ళకే పోస్తాను!" అన్నది అమ్మన్న. ఆ మాట వినేటప్పటికి కామరాజుకి వొళ్ళు మండిపోయింది. ఉవ్వెత్తుగా లేచి వెళ్ళి, "మీ వాళ్ళకే పోస్తావేం? మీ వాళ్ళకే పోస్తావేం?" అని పళ్లు కొరుకుతూ, అమ్మన్నను తెగ బాదడం మొదలెట్టేడు. 

అమ్మన్న చేతిలో ఉన్న ఊరగాయకుండ క్రిందపడి భడీలుమని ముక్క ముక్కలై పోయి ఊరగాయంతా నేలపాలైపోయింది. అదే సమయానికి వాళ్ళ వీధి తలుపు కూడా భళ్లుమని చప్పుడై తెరుచుకుని చెయ్యెత్తు మనిషి ఒకడు లోపల ప్రవేశించి, పెళ్లాన్ని బాత్తోన్న కామరాజును జుట్టు పట్టుకుని కిందపడేసి, గొడ్డును మోదినట్లు మోదటం మొదలెట్టేడు. ఆ దెబ్బలతో కామరాజు 'చచ్చిపోయానర్రోయ్' అని గోల చేయసాగాడు. ఆ గలాభా విని లోపల్నుంచి గవరమ్మ గారూ, ప్రక్కింటినుంచి పేరమ్మగారూ, వీధిలోంచి వీరమ్మగారూ పరిగెత్తుకొచ్చి, కామరాజును ఆ వచ్చిన భీమరాజు చేతుల్లోంచి తప్పించారు. ఆ వచ్చిన భీమరాజు మరెవరోకాదు; అమ్మన్న అన్నగారు. చెల్లెల్ని పండగకు పుట్టింటికి తీసుకువెడదామని తామరాడ నుంచి వచ్చిన కామరాజు బావమరిది. అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతేమిటో తెలియక విస్తుపోయి చూస్తోంటే గవరమ్మే ఆఖరికి భీమరాజు నడిగింది "ఏం భీమరాజూ, కామరాజును అలా బాదేశావ్?" అని. "వీడు మా చెల్లెల్ని ఎందుకు బాత్తున్నాడో కనుక్కోండిముందు" అన్నాడు భీమరాజు. "ఏమిరా నాయనా, ఏమొచ్చిందిరా?" అన్నది తల్లి. "ఇంతకంటే ఏం రావాలే అమ్మా? గేదెల పాడి అంతా తన వాళ్ళకే గాని మనవాళ్ళకి పొయ్యదుట! ఇలా అన్నదాన్ని కొట్టాలా చీల్చెయ్యలా?" అన్నాడు కామరాజు పళ్లు కొరుకుతూ. ఆ మాట వినగానే పేరమ్మగారు, "గేదెల పాడి అంటావేమిటి కామరాజూ? మీకు గేదెలెక్కడివి?" అని అడిగింది. 

"ఎక్కడివేమిటమ్మా, కొంటాను." అన్నాడు కామరాజు తడుముకోకుండా. "ఎలా కొంటావ్? కొని ఎలా భరిస్తావ్?" అని అడిగింది పేరమ్మ. "ఎలాగేమిటి? ఐతంపూడి ఉద్యోగం వస్తే కావలసినంత డబ్బూ, కావలసినంత గడ్డీని. ఆ డబ్బుతో గేదెలను కొని ఆ గడ్డితో మేపుకుంటాము" అన్నాడు కామరాజు. "ఎడిసినట్లే ఉంది నీ తెలివి?" అంటూ పేరమ్మగారు బుగ్గని వేలెట్టుకుంది. తల్లి ప్రాణం గనక గవరమ్మగారికి ఉక్రోషం వచ్చి, "తెలివితక్కువ వాజమ్మ గనుకనే బావమరిదిచేత చావుదెబ్బలు తిన్నాడు. మొగుళ్లు పెళ్ళాలని కొట్టుకోడం ఉందిగాని, బావమరుదులొచ్చి బావలను కొట్టడం ఎక్కడైనా ఉందా?" అంది. అప్పుడు భీమరాజు నవ్వుతూ, "ఏవమ్మోయ్ గవరమత్తా, నేను మా బావని కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టేడని కాదు. మా బచ్చలిపాదులు ధ్వంసం అయిపోయాయన్న కోపంకొద్దీ కొట్టేను!" అన్నాడు. "మీ బచ్చలి పాదులా? మీ పాదులు ధ్వంసమైపోతే మావాణ్ణి కొట్టడం ఎందుకు? ఇంతకూ, మీ యింట బచ్చలి పాదులు ఎక్కడున్నాయి?" అని నిలదీసి అడిగింది. "మా యింట్లో కాదు కదా, మా వూళ్ళోనే లేవు బచ్చలిపాదులు. ఆ నేలమీద బచ్చలి ఎదగదనే ఆ గ్రామం నుంచి మీ ఊరికి మకాం ఎత్తేస్తున్నాను. నేను ఇక్కడ కాపరం పెట్టి, దొడ్డి అంతా పందిళ్లువేసి, నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చలి పాకిస్తాను. ఆ పెట్టబోయే బచ్చలి పాదులను, నీ కొడుకు కొనబోయే గేదెలు వచ్చి మేసిపోతాయనే వుద్దేశంతో నేను వానిని కొట్టాను" అన్నాడు భీమరాజు యుక్తిగా. భీమరాజు మాట విని అందరూ పకపకా నవ్వటం మొదలెట్టేరు!


Comments