అనగనగనగా ఒక వర్తకుడు. అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకు. ఆ వర్తకునికి రెండు పెద్ద ఓడలున్నయి. వాటితో వర్తకం చేసి, అతను లక్షలు గడించాడు. ఒకప్పుడు, కోస్తాకు పోయిన ఓడలు తిరిగి రాలేదు. ఏమా అని వర్తకుడు ఆత్రంతో ఎదురుచూస్తూ వుండగా, అవి సముద్రంలో మునిగిపోయినట్టు వార్త వచ్చింది. ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు. అంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి, వర్తకుని వేపు వికటంగా నవ్వుతూ "ఏమయ్యా వర్తకుడా! ఎందుకలా విచారిస్తావు ? పోయినదానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది? ఐనా నేనొక ఉపాయం చెబుతాను, విను. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్లగానే మొట్టమొదట నీకు ఏది కంటబడుతుందో దానిని నాకు ఇచ్చినట్టయితే, నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది. అదీ నాకిప్పుడే ఇవ్వనక్కరలేదు. పన్నెండేండ్ల లోగా ఎప్పుడిచ్చినా సరే" అన్నాడు. ఇది విని, వర్తకునికి ఒక యుక్తి తోచింది. 'ఇంటికి పోగానే ముందు కుక్క గదా ఎదురు రాబోయేది! మరుగుజ్జు వానికి కుక్కని ఇచ్చేస్తే తీరిపోతుంది' అనుకొని మరుగుజ్జుతో "సరే" నన్నాడు. "సరే" అనగానే మరుగుజ్జు మాయమయిపోయాడు. తీరా వర్తకుడు ఇంటికి చేరుకుని, గుమ్మంలో అడుగు పెట్టేసరికల్లా, అతను అనుకొన్నట్టు కుక్క ఎదురురాలేదు సరి కదా, తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందుగా కంటపడ్డాడు. ఇప్పుడు చేసేదేముంది? వాగ్దానం ప్రకారం మరుగుజ్జువానికి తన కుమారుడినే ఇచ్చి వేయాలె.
"సరే, పన్నెండేళ్లవరకూ గడువున్నది కదా, అప్పటిమాట చూచుకొనవచ్చు" అని అనుకొని, వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు. ఒకరోజున అతను పొలము దున్నుతూ వుండగా నాగలికొర్రుకు ఏదో బండ తగిలింది. అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి, ఒక బిందె నిండా బంగారు నాణెములు కనపడినయి. ఈ విధంగా నిధి దొరకటం మరుగుజ్జువాని మహిమే అయి వుంటుందని వర్తకుడు తెలుసుకొన్నాడు. అప్పటి నించీ అతను మళ్లీ లక్షాధికారి అయి ఎప్పటివలె సుఖంగా ఉంటూ వున్నాడు. ఇలా వుండగా రత్నాకరుడికి పన్నెండేళ్ళూ నిండాయి. మరుగుజ్జువాని కిచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది. ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథ అంతా చెప్పాడు. దానికి రత్నాకరుడు "ఏడిశాడులే, మరుగుజ్జు వెధవ, మనలనేం చేయగలడు? రానీ, వాడి పని చెబుతా" నంటూ, ఒక గిరి గీసి ఆ గిరి లోపల తను కూర్చొని, తనతోపాటు తండ్రిని కూడా కూర్చోబెట్టుకొన్నాడు. కొంచెం సేపటిలో మరుగుజ్జువాడు వచ్చి "ఓయి వర్తకుడా! దైవసాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా?" అని అడిగాడు. "చూడబోతే వామనమూర్తి లాగ నలుసంత ఉన్నాడు, రెండు తగలనిస్తే వాడే పోతాడు, వీడి బతుక్కి వాగ్దానమొకటా?" అని అనుకొంటూ రత్నాకరుడు వాని పైన కలియబడ్డాడు. పోట్లాటలో చివరకు రత్నాకరుడే చిత్తు అయిపోయాడు. కనుక శిక్షగా, వానిని ఒక ఓటి పడవలో ఎక్కించి, నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు. రత్నాకరుడు ఏటిలో కొట్టుకుపోయి, ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ఒడ్డున నడుస్తూ పోగా పోగా, రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ, దానిపైన బంగారపు కోట కనిపించాయి.
రత్నాకరుడు ఆ కోట ప్రవేశించి, గదులన్నీ ఒక్కొక్కటే గాలించాడు. చివరి గదికి వచ్చేసరికి, ఒక నాగుపాము కనపడింది. ఆ నాగుపాము అతనితో "నన్ను చూచి భయపడబోకు. నిజానికి నేనొక దేవకన్యను. రాక్షసులు నన్ను ఎత్తుకువచ్చి ఇలా మార్చివేశారు. మారుప్రశ్న వేయకుండా, నేను చెప్పినట్టు చేశావంటే నాకు శాపవిముక్తి అవుతుంది. శాపం పోగానే మామూలు రూపందాల్చి, నిన్ను బతికించుకుని నీకు పాదదాసినై ఋణం తీర్చుకుంటాను అన్నది. అందుకు రత్నాకరుడు అంగీకరించగానే ఆమె "ఓయి రత్నాకరుడా! అర్థరాత్రి వేళ, భయంకరులైన నల్లటి మరుగుజ్జు వాళ్లు నిన్ను వెతుక్కుంటూ వచ్చి, 'ఇక్కడెందుకున్నావు?' అంటారు. 'నా దేవకన్య కోసం నేను వచ్చా' నని ధైర్యంతో చెప్పు. 'మరయితే, ప్రాణానికి ప్రాణం ఇస్తావా?' అని అడుగుతారు. 'అలాగే' అని చెప్పి, నిబ్బరంగా ఉంటివంటే వాళ్లు నీ ప్రాణం తీసుకుంటారు. అంతటితో వాళ్ళ మంత్ర బలిమి పోయి, నాకు అసలు రూపం వచ్చేస్తుంది" అని చెప్పింది. ఆ రాత్రి ఆమె చెప్పినట్టే జరిగింది. దేవకన్యకు శాపం వదిలిపోగానే, మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బతికించుకుంది. అంతటినించీ వాళ్ళకు మరుగుజ్జు వాళ్ళ పీడ వదిలిపోయింది. రత్నాకరుడు దేవకన్యను పెళ్ళాడి, బంగారపు కొండపయిన ఆ బంగారు కోటలోనే హాయిగా ఉంటూ వుండగా, వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు.
కొంత కాలానికి రత్నాకరుడు దేవకన్యతో నేను ఒకసారి పోయి నా తలిదండ్రులను చూచి వస్తాను అన్నాడు. అందుకు ఆమె వప్పుకోలేదు. ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి, "సరే, నేనేం చేసేది. పోయిరా, ఇదుగో ఈ ఉంగరం వేలికి పెట్టుకుని, ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. కాని, మీ తండ్రి ఎదుటమాత్రం ఎన్నడూ తలవవద్దు సుమా. ఈ మాట జ్ఞాపకం ఉంచుకో" అని చెబుతూ, భర్త వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది. ఆమట్టున రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు. కళ్లుమూసి తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుటనే నిలబడి ఉన్నాడు! అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలాకాలం కావటం చేత, తలిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు. కొన్ని ఆనవాళ్లు చూచిన మీదట అతను తమ కుమారుడే అయివుంటాడని వారు నిశ్చయించారు. అయినా, తన తలిదండ్రులే తనను గురించి సంశయవడటం రత్నాకరునికి కష్టమనిపించింది. వారికి నమ్మకం కలగాలనే వుద్దేశంతో తనకు పెళ్లి కావడం, పిల్లవాడు పుట్టడం ఇవన్నీ పూసగుచ్చినట్టు వారితో చెప్పాడు. ఈ మాటలు వినేవరకు, వారికి ఇది వరకున్న నమ్మకం కాస్తా తొలగిపోయింది. ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకొన్నారు. రత్నాకరునికి పౌరుషం రేగి తన భార్యనూ, కొడుకునూ వారికి రుజువు చూపాలని, వాళ్లను తలచాడు. మరునిమిషంలో వాళ్లు ప్రత్యక్షమయారు. అప్పుడు ఆ వృద్ధులు, కొడుకు చెప్పినదంతా నమ్మి, కోడలినీ మనవడినీ చూచుకు మురిసిపోయారు. అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలయి, తగిన శాస్తి చేయాలనుకుంది. ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డుకు, షికారు కెళ్లారు.
అలసట చేత రత్నాకరుడికి అక్కడనే నిద్ర పట్టటం కనిపెట్టి, దేవకన్య అతని వేలి ఉంగరం మెల్లిగా ఊడదీసింది. తరువాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా అమె బంగారుకోట చేరుకుంది. కొంత సేపటికి రత్నాకరుడు మెలకువ వచ్చి లేచి, జరిగిన మోసం తెలుసుకొన్నాడు. కాని, ఉంగరం లేక, చేసేదేమున్నది? తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్లీ మరొక కొండ వద్దకు వచ్చాడు. ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు వారి ఆస్తి పంపకం తెగక పోట్లాడుకొంటున్నారు. అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే, వాళ్ళు బతిమలాడి అతనిని తీసుకువెళ్లి, తీర్పు చెప్పమన్నారు. "అయ్యా! ఇవిగో పావుకోళ్ళు. ఇవి తొడుక్కుని తలచుకున్న చోటికిపోవచ్చు. ఈ ముత్యాలహారం ధరిస్తే, మనస్సులో తలచుకున్న పని నెరవేరుతుంది. మూడవది ఖడ్గం. ఇది ఎవరిని నరికి రమ్మంటే వారిని సంహరిస్తుంది. ఈ మూడు వస్తువులూ మా ముగ్గురిలో ఎవరికి ఏది చెందవలెనో, మధ్యవర్తిగా ఉండి మీరు పంచి పెట్టండి" అని కోరారు. అప్పుడు రత్నాకరుడు "సరే బాగానే వుంది. మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేవో నిజం తెలియనిదే తీర్పుచెప్పడ మెల్లాగ? కనుక ముందు నేను స్వయంగా పరీక్షచేసి చూడాలి" అన్నాడు. వాళ్లు అందుకు వప్పుకున్నారు. రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేత పుచ్చుకొని, పావుకోళ్లు తొడుక్కున్నాడు. తలుచుకున్నంతలో అతను బంగారు కొండపైన బంగారు కోట చేరుకున్నాడు. అక్కడ అతనికి బాజా భజంత్రీల సందడి వినపడింది. ఇదేమిటా విడ్డూరమని చూచేవరకు, దేశదేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్టు తెలియవచ్చింది.
రత్నాకరుడు అదృశ్యరూపంలో దేవకన్య పక్కనే చేరి, ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి, రాక్షసి మాయలు మళ్లీ తనమీద ప్రయోగమవుతున్నయని కంగారుపడి ఆమె ఆమట్టునే పడకగదికి పోయి, భయంతో ఏడుస్తూ పడిపోయింది. అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో అమెకు కనపడి "నామీది ప్రేమ చేత నా తండ్రి మరుగుజ్జు వానికిచ్చిన వాగ్దానం తప్పిపోయాడు. నన్ను మరచిన నా తలిదండ్రులకు ఆనవాలు చూపించటం కోసం నీకిచ్చిన వాగ్దానం నేను తప్పిపోయాను. కాని, నా ప్రాణం అడ్డువేసి రాక్షసి మాయల ను౦చి నిన్ను తప్పించినప్పుడు చేసిన వాగ్దానం నువు ఎందుకు తప్పి పోయావో బోధపడటం లేదు" అని అన్నాడు. దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని భర్తను ప్రార్థించింది. ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది. అప్పటినించీ రత్నాకరుడూ, దేవకన్యా వారి ముద్దుల కుమారుడూ బంగారు కొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటున్నారు. నోటి మాట గాలికి పోయేది కదా, తప్పిపోతే రాబోయే కష్టమేమిటి అనుకొంటారు చాలామంది. కాని మానవుని జీవితమంతా మాట మీదనే ఆధారపడి వుంది. మాట తప్పిపోవటం వల్ల ఇక్కడ వర్తకునికీ రత్నాకరునికి, దేవకన్యకూ కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో, చూడండి.
Comments
Post a Comment