చందమామ కథలు - అంగరక్షకుడు కోతి

Chandamama Telugu Story about a king who foolishly appoints a monkey as his body guard despite his minister warning him. Best Telugu Chandamama Story.

పూర్వకాలమందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపులబొమ్మే కాని, పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే, సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలయినా లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని, బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకోని మూర్ఖుడు. ఇటువంటివానితో ఎలా వేగడం? ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్లేసరికి, ఆడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషంత ఎత్తున ఉన్నది. సరీగా మనిషిలాగానే నిలుచున్నది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకొంటూ, అటూ యిటూ నడుస్తూవుంటే, రాజు దానివేపు చోద్యంగా చూడసాగాడు. అలా చూచిన కొద్దీ ఆయనకు దానిపయిన మక్కువ ఎక్కువై, చివరకు "ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడమేమిటి ?" అని కూడా అనిపించింది. "వెంటనే దానిని పట్టుకొనం"డని భటులకు ఆజ్ఞాపించాడు. 'ఇదేమిటి, రాజుకి మతి పోయిందా ఏమిటి! పౌరుషానికైతే పులిని పట్టాలి. విందుకయితే లేడినో ఆడవి పందినో కొట్టాలి. అంతేకాని, కోతిని పట్టుకోవడమేమిటి విడ్డూరం, ఎక్కడా కనలేదు, వినలేదు" అని వేటగాళ్లందరూ చాటున అనుకున్నారు. కాని, అనుకొని లాభమేమున్నది ! రాజు ఆజ్ఞ దాటడానికి వీలులేదాయె. ఆయన ఇష్టప్రకారం ఆ కోతినిపట్టి, కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, "ఓయి మంత్రీ! ఇతను ఎవరనుకొంటున్నావు ? నరుడిని మించిన వానరుడు, అ కాళ్ల పొంకం చూడు కండపుష్టి చూడు. మనిషికీ అతనికీ తేడా యేమున్నది ? మనిషికి ఉన్నంత నేర్పూ అతనికీ ఉన్నట్టే  కనపడుతున్నాడు. కనుక, ఇతనిని మన తాలింఖానాకు పంపించి, కుస్తీ, కత్తిసాము కసరత్తు మొదలయిన సమస్త విద్యలలోనూ తరిఫీదు ఇప్పించినట్టయితే గొప్ప వస్తాదు అవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంతో కీర్తి వస్తుంది" అంటూ ఉత్సాహంతో చెప్పాడు.

రాజు చెప్పినది విన్న తరవాత మంత్రి "మహాప్రభూ! తమరు సెలవిచ్చినదంతా బాగానే వున్నది. అయితే, కుక్క బుద్ధీ కోతి బుద్ధీ నిలకడగా ఉండవంటారు పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి, కత్తులూ కటార్లూ చేతికి ఇస్తే మరేమయినా వున్నదా? అదంతా చాలా ప్రమాదం; కనుక, మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో వుంచితే అందరూ చూచి ఆనందిస్తారు. కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం" అని మనవి చేశాడు. మూర్ఖుడయిన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనేలేదు. తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్లీ నొక్కి చెప్పాడు. చేసేది లేక మంత్రి, ద్రోణుడిని మించిన ఒక ప్రవీణుడిని నియమించి, కోతికి సమస్త విద్యలూ నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా, వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చేయాలని ఒకరోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమయిన ఏర్పాటులన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతున్నది. "అయ్యా, ఆచార్యులవారూ ! మీ శిష్యుని విద్యాకౌశలము ప్రదర్శించమనండి, చూదాం" అన్నారు రాజుగారు.

అప్పుడు గురువుగారు ఒక చెట్టుమీది పిట్టను కోతికి చూపించి, దానిని కొట్టి రమ్మని సంజ్ఞ చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరసావహించి, సభలో వానరుడు అందరకూ ఆశ్చర్యం కలిగేటట్టుగా ఒరలో నించి చర్రున కత్తి దూసి, చెట్టుపైకంటా పరుగెత్తి పోయి, పక్షి తల నరికి పారవేశాడు. పక్షి తలకు తల, మొండెముకు మొండెమూ కిందపడిపోయేసరికి, వానరుని చాకచక్యానికి అందరూ "భేష్‌! భేష్" మంటూ చప్పట్లు కొట్టారు. ఇక రాజు గారు ఆనందం వట్టనేలేక పోయారు. "గమనించావా మన వానరుని నేర్పు!" అన్నట్టుగా ఆయన మంత్రివేపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పటానికి అది సమయం కాదని, మంతి అప్పటికి ఊరుకొన్నాడు. మరునాడు  మహారాజావారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలచి, విలవయిన దుస్తులతో ముస్తాబు చేయించారు. తమ మెడలోని రత్నహారాన్ని తీసి నిండునభలో, స్వయంగా వానరవీరుని మెడకు అలంకరించారు. ఆఖరున ఆయన లేచి, "ఈ వీరాగ్రేసరుణ్ణి మా 'అంగరక్షకుని' గా ఏర్పరిచి గౌరవిసున్నాము" అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బారులో అందరూ ముక్కుమీద వేలేసుకొన్నారు. ప్రభువు విననీ, వినకపోనీ, తన విధి తను నెరవేర్చుకోవాలనే నిశ్చయంతో మళ్లీ మంత్రి వెళ్లి "మహారాజా! 'అంగరక్షకు' డనగా అదెంతటి గొప్ప పదవి! ఎల్లప్పుడూ, కూడా వుండి, ఎట్టి ఆపదలూ రాకుండా యజమానిని రక్షించాలి కదా! ఏలినవారి దర్శనానికి వచ్చేవారిలో ఎవళ్లు మంచివాళ్లో ఎవళ్లు దుర్మార్గులో తెలుసుకొనే తెలివితేటలుండవద్దా? అంత జ్ఞానం కోతికి ఎక్కడినించి వస్తుంది? కనుక, మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కాని, వానికి అంగరక్షకుని పదవి ఈయటం ఎంతయినా హానికరము" అని రాజుతో తన మనస్సు వెల్లడించాడు.

ఇంత చెప్పినా, ఈ సలహాలు ఏమీ రాజు తలకు ఎక్కలేదు, 'సరే, మనకేమి!' అని చెప్పి మంత్రి వెళ్లిపోయాడు. నలుగురు కాదన్నకొద్దీ రాజుకి కోతిపయిన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా తమ ఆస్థానపు వానరవీరునిచేత కసరత్తు చేయించి, కత్తిసాము చేయించి, ఎంతో గొప్పగా అతనిని పొగడుతూ వుండేవాడు. ఇటువంటి 'అంగరక్షకుని' నియమించుకున్నందుకు, రాజును అందరూ మెచ్చుకొనేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టిన రోజు పండగ వచ్చింది. ఆ పండగకు అందరూ అపరూపమయిన కానుకలు, సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడు ఒకడు బహుమానంగా తెచ్చిన పూలమాలిక చాలా అందముగా వుండటమే గాక, పరిమళంతో సభంతా గుమగుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలోనించి బయటకు తీయనేలేదు. ఆ పండగరోజున జరిగిన ఉత్సవాలతోను, వేడుకలతోను రాజుగారికి అలసట కలిగి, పెందరాళే నిద్ర వచ్చేసింది. అందుచేత 'కాస్సేపు పడుకొంటాను. నువు గుమ్మం దగ్గిర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానీయకు' అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి, ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికాతల్పం పయిన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు వేయి కన్నులతో కాపలా కాస్తున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలకు రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడినించో ఒక తుమ్మెదమాత్రం 'ఝం ఝం'మ్మని రొద చేసుకొంటూ అక్కడికి వచ్చింది.

అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాల అటకాయించాడు. కాని అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలోవున్న పూలదండమీద వాలింది. పౌరుషవంతుడయిన వానర వీరునికి తుమ్మెదపైన చాలా కోపం వచ్చేసింది. 'హాత్తేరీ! నేనిక్కడ కాపలా ఉండగా, నువు గదిలో ప్రవేశించటానికి ఎన్ని గుండెలుండాలె? రాజాజ్ఞ అంటే ఏమిటి అనుకొన్నావు!' అంటూ, వాయువేగంతో వెళ్లి, పూలదండమీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో రెండు ముక్కలుగా నరికివేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి రెండు ముక్కలయింది!! హంసతూలికాతల్పమంతా రక్తమయ మైపోయింది !!! రాజాజ్ఞ ప్రకారము మన వానరుడు గది గుమ్మం వద్ద కావలా కాస్తున్నాననే సంతోషిస్తున్నాడు కాని, తన బుద్ధితక్కువవల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా, రాజుకి ప్రాణం పోయిందాయె. ఇక ఇప్పుడు ఎవరుమాత్రం ఏమి చేయగలరు? చేస్తేమాత్రం, చచ్చినరాజు తిరిగివస్తాడా ! అందుకనే, ఎవ్వరయినా నలుగురు చెప్పినదారిని నడుచుకోవాలి గాని, మూర్ఖత పనికిరాదు. 'అలా కాదు, నా యిష్టం వచ్చినట్టే చేస్తాను, ఒకళ్లు నాకు చెప్పేదేమిటి ?" అని గర్విస్తే, రాజుకి ఐనట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుకి మల్లే మూర్ఖంగా పట్టు పట్టకండేం.

Comments