చందమామ కథలు - పాతకోట రహస్యం

 

Telugu Chandamama Story of young man who rescued princess from evil forces. Best Chandamama Telugu Stories to read.

అనగనగా అబ్బాస్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా మంచిపిల్లవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవడం చేత, అబ్బాస్ ను ఒక రైతు చేరదీసి పెంచుతున్నాడు. ఇలా వుండగా, ఆ దేశంలో ఒకప్పుడు కాటకం పట్టింది. తిండి లేక ప్రజలు మలమల మాడిపోతున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవడం ఎలాగా అని రైతు బెంగతో వున్నాడు. అటువంటప్పుడు, ఎంత అభిమానం ఉంటేమాత్రం అబ్బాస్ కు అతనేమి సాయపడగలడు? "నాయనా! కలిగినన్నాళ్లు మాతోపాటు మంచో చెడ్డో కాలక్షేపం చేశావు. ఇప్పుడు కాలమంతా తలక్రిందులయింది. ఏమయినప్పటికీ, ముసిలివాళ్ళం, మేమెక్కడికి కదిలిపోగలము? ఇక్కడ మాతో మగ్గిపోవటంకంటె, కుర్రవాడివి కాన, కాటకం లేని మరోదేశం చేరుకొని బాగుపడటం మంచిదికదా! నా మాట విని నువు వెళ్లు, మేలవుతుంది" అని చెప్పి, దీవించాడు. ఆ ప్రకారం అబ్బాస్ బయలుదేరి, సాగిపోయేసరికి, పాడుపడి అక్కడక్కడ ముక్కా చెక్కలుగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కానివచ్చింది. అలసివున్న అబ్బాస్ కు, ఆ పాడు కోటలోనే పడుకొనేసరికల్లా నిద్రపట్టేసింది. నిద్దట్లో అతని భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికి, కళ్లు విప్పిచూచాడు. ఒక చేయి ఆకారమూ, అందులో ఒక వెలుగుతూవున్న దీపమూ అతనికి కనిపించాయి. కనపడటమే కాదు. ఆ చేయి కదిలింది. ఈ చిత్రం చూచి ఆశ్చర్యపడి, అబ్బాస్ ఆ వెలుగు వెంబడే వెళ్లగా, ఒక గొప్ప భవనము అగపడింది. అతను అందులో ప్రవేశించాడు.

భవనములో లెక్కలేనన్ని గదులున్నాయి. ఒక విశాలమయిన గదిలో వేయిరేకముల పిండివంటలతో సహా భోజనము సిద్ధంగా వున్నది. అబ్బాస్ కడుపునిండా భోంచేసి, మళ్లీ వెలుగును వెంబడించాడు. అంద చందాలతో అమరివున్న మరివొక గదిలో రకరకాల దుస్తులున్నయి. అబ్బాస్ తన పాత గుడ్డలు విడిచేసి, మంచి సిల్కులు తీసి ముస్తాబు చేసి కొన్నాడు. అక్కడనే దగ్గర వున్న హంసతూలికాతల్పం మీద హాయిగా పడుకొని నిద్రపోయాడు. మరునాడు ఉదయాన, ఆ చేయి మళ్లీ కనపడి, "అబ్బాస్! నువు ఓరిమి కలవాడివి, మంచి ధైర్యశాలివిన్ని. ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, వెళ్లారు. కాని, అందులో ఒకడూ నీలాగ వెలుగు వెంబడి రాలేకపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, సహించి, ఈ భవనంలో మూడు రాత్రులు గడిపితివంటే, ఒకానొక రాజకుమారిని బంధమునుండి విడిపించిన వాడవు అవుతావు. అందువల్ల నీకు ఎంతయినా మేలున్నది" అని అతనితో చెప్పింది. రాజకుమారిని విడిపించటం కోసమని అబ్బాస్ ప్రాణాలయినా అర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రికాగానే, భోజనాల గదిలోకి పోయి మామూలుగా భోజనం చేసుకొని, పక్కగదిలో హంసతూలికాతల్పంపయిన హాయిగా పడుకొన్నాడు. అర్థరాత్రిసమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరపడి, వాళ్ల చేతులలోవున్న గదలతో, సున్నంలోకి ఎముక మిగలకుండా అబ్బాస్ ను చితకగొట్టారు. కానైతే, మరునాడు పొద్దున్నే ఆ చేయి మళ్లీ కనపడి, తను తెచ్చిన మందుపసరులు అబ్బాస్ వంటికి రాయడంతోనే, రాత్రి అతను తినిన దెబ్బలన్నీ ఎక్కడివక్కడే మాయమయినాయి.

రెండవ రాత్రికూడా పటాలం వచ్చి చొరబడి, అతనిని మొదటి రోజుకంటే గట్టిగా కొట్టారు. కిక్కురుమనకుండా అబ్బాస్ దెబ్బలన్నీ ఓర్చుకొన్నాడు. మరునాడు ఉదయాన మళ్లీ ఆ చేయి వచ్చి మందు రాసింది. మూడవనాడు మళ్లీ పటాలం వచ్చి, కిందామీదా చూడకుండా అబ్బాస్ ను చావమోదారు. నోరు మెదపక, అతను ఆ బాధలన్నీ సహించాడు. మామూలుగా ఆ చేయి మరునాడు వస్తుందని అబ్బాస్ కనిపెట్టుకొనివున్నాడు. కాని, అతను అనుకున్నట్టు రాలేదు. ఏమిటా అని అతను ఆలోచిస్తూవుండగా, గభాలున తలుపు తెరుచుకుని, ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది. ఆమె తనతో తెచ్చిన మంత్రజలం అతనిపయిన చిలకరించేసరికి, తక్షణమే శరీరంమీద దెబ్బలు పోయి, అబ్బాస్ మామూలు మనిషయాడు. ఆ సుందరి, తన చరిత్ర అంతా అతనికి వినిపించింది: "నేను ఫలానా దేశపు రాజు కూతురును. శత్రురాజులు నన్ను ఇక్కడికి రప్పించి బంధించారు. వాళ్లు ప్రయోగించిన మంత్రాలవల్ల ఎన్నేళ్ళనించో, మైకం కమ్మి నేను పడివున్నాను. నన్ను విడిపించడానికి ఎంతోమంది వచ్చారు. కాని, మొదటిరాత్తిరి దెబ్బలకే తట్టుకోలేక పారిపోయేవారు. నీవు వాళ్ల దెబ్బలన్నిటికీ సహించగలగటంవల్ల, వాళ్ల మంత్ర బలిమి తగ్గిపోయి, నా మైకం మాయమైపోయింది. మనిద్దరం ఇప్పుడు మా తండ్రి భవనానికి వెళ్ళిపోవాలి" అని ఆనవాలు చెప్పి, ఆమె అదృశ్యమయిపోయింది. ఆమె అదృశ్యంకాగానే, అబ్బాస్ పాడుకోటలో, మురికి బట్టలతో ఉండిపోయాడు. 

రాజకుమారి తన తండ్రి భవనము చేరుకొని, అబ్బాస్ కోసం ఎంతోకాలం ఎదురుచూచింది. చివరకు నిరాశతో, పెద్దలు ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి, ప్రధానం చేసుకొన్నారు. పెళ్లిరోజు వచ్చింది. ఊరేగింపుకని ఆమె అంబారీ ఎక్కబోతూవుండగా, తను ఎవరికోసమయితే ఇంతవరకూ తపించిందో ఆ అబ్బాస్, చింకి గుడ్డలతోనూ విచార ముఖంతోనూ కోట గుమ్మానికి ఎదుట కనిపించాడు. అబ్బాస్ ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవ్వరికి తెలుసు? వెంటనే రాజకుమారి, అబ్బాస్ ను చేయిపట్టుకు తీసుకువచ్చి, అతను ఎవరో, ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి పెళ్లికొడుకుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్ళికొడుకు కూడా ఆమె కథ విని చాలా విచారం వ్యక్తపరిచి, అబ్బాస్ నే పెళ్లిచేసుకొనమని చెప్పి, సమ్మతి తెలిపాడు. తెలివితేటలు, వివేకముగల రాజకుమారి తండ్రికి పరిస్థితులు విప్పిచెప్పి, అయన అనుమతిపొంది, అబ్బాస్ ను పెళ్లి చేసుకొని హాయిగా వున్నది.


Comments