చందమామ కథలు - వంచకమహాపట్టణం

 

Chandamama Telugu Story of a trader who reaches an island where everyone is a cheat. Best Telugu Chandamama Stories to read.

పూర్వకాలమందు సింహళదేశంలో ఒక ఓడ వర్తకుడు ఉండేవాడు, అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు. ఆ వర్తకునికి అవసానకాలం రావటంచేత కొడుకును చేరబిలిచి, "నాయనా! నా తరవాత నీవు కూడా మనకు తరతరాల నించి వస్తూ వున్న ఓడ వర్తకం సాగించి, గొప్పవాడవయి, పేరుప్రతిష్టలు నిలుపుకో వలిసింది. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒక్కటే ఉన్నది; ఎన్నిదేశాలు తిరిగినా ఫరవాలేదు కాని, వంచకమహాపట్టణం మాత్రం పోబోకు సుమా" అని హెచ్చరించాడు. తండ్రిని సంతోషపెట్టటానికని జయపాలుడు "సరే" నని తల వూచాడు. మరి కొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జయపాలుడు న్వతంత్రుడయినాడు. ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదుగా? కనుక జయపాలుడు తన ఇష్టము వచ్చిన చోటికి వెళ్లవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికయితే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో, ఆ వంచకమహాపట్టణానికే పోయి చూడాలని జయపాలునికి బుద్ధి పుట్టింది. ఈ వుద్దేశంతో, నాలుగు ఓడలనిండా విలువయిన సరకు వేసుకొని, అతను వ్యాపారం నిమిత్తం బయలుదేరాడు. తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రిళ్లు, సముద్రం మీద ప్రయాణంచేసి, జయపాలుడు వంచకమహాపట్టణ౦ చేరుకొన్నాడు. ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పట్టుతూ వున్నాడు. ఆ చేరువనే ఒక నీటికొంగ సముద్రంలో మునుగుతూ, తేలుతూ చేపలను పట్టి తింటూవున్నది. విలువిద్యలో నేర్పరి అయిన జయపాలుడు తన బాణంతో ఆ నీటికొంగను కొట్టివేశాడు.

నీటికొంగ చచ్చి నీళ్లమీద తేలుతూ వుండేసరికి, పల్లెవాడు పరిగెత్తుకువచ్చాడు. "ఏమిటయ్యా అబ్బాయీ, ఈ అన్యాయం! చచ్చిపోయిన నా తండ్రి నీటికొంగ రూపం దాల్చి, నాకు చేపలను పట్టడం నేర్పుతూ వుంటే, నువు వచ్చి అకారణంగా అతనిని చంపి, నాకు ఆపకారం చెశావు. రాజుగారి వద్దకు పద. నీ పయిన ఫిర్యాదుచేయాలి" అన్నాడు. రాజుగారు నేరం విచారణ చేసి, పల్లెవానికి జయపాలుడు ఒక ఓడను నష్టపరిహారంగా ఇవ్వవలెనని తీర్పు చెప్పారు. జయపాలుని నాలుగు ఓడలలోనూ ఒక ఓడ పోయింది. ఈ పట్టణపు రాజుగారి తీర్పు తమాషాగా వున్నదని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి ఇవతలకు వస్తూండగా ఒక చెవి లేనివాడు ఎదురై, "ఓహో, ఎన్నాళ్లకు కనపడినావయ్యా అబ్బాయీ! నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి వున్నాను. ఆ పద్దు ఈ రోజుకు వడ్డీతో సహా నాలుగు వేల రూపాయలు అయంది. ఇదుగో, నీ సొమ్ము నువు తీసుకొని, నా చెవి నాకు ఇచ్చివేయు" మని చెప్పి కూర్చున్నాడు. దీనికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు. ఇది చూచి, చెవి లేనివాడు, జయపాలుని లోకువకట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు. రాజు విచారణ చేసి, ఈసారి కూడా జయపాలుడే నేరన్థుడని నిర్ణయించి, ఒక ఓడ చెవిలేనివానికి ఇచ్చుకొనవలిసిందని తీర్పు చెప్పాడు. ఈ విధంగా జయపాలుని ఓడలు నాలుగింటిలో రెండు పోయినయి.

జయపాలుడు ఎంత మాత్రము విచారించక ఈ విడ్డూరాలకు వినోదిస్తూ తన దారిని తను వెళుతూ వుండగా ఒక స్త్రీ ఎదురై, "ఏమయ్యా అబ్బాయీ! ఎంత కాలానికి కనపడినావు ! బాగానే వుందిలే, నేనెవరననుకొన్నావు? పదిహేనేళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసికొని, నా వంక చూడకుండా వదిలేశాడు, నేను మనవర్తి కోసం తగాయిదా చేసేసరికి "మా అబ్బాయి చేత వదివేల రూపాయలు పంపిస్తా"నని చెప్పాడు. ఆందుచేత, ఆ సొమ్ము ఇచ్చి మరీ కదలవయ్యా" అని ఆమె అతనిని నిర్బంధించింది. "నువు ఎవరివో, నీ సొమ్ము ఏమిటో నాకేమీ తెలియదు పో" అని జయపాలుడు నిరాకరించేసరికి, ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చెసింది. 
ఈసారి మళ్లీ రాజు విచారణ చేసి, జయపాలుని నేరన్థునిగా నిశ్చయించి, ఆ స్త్రీకి ఒక ఓడ ఇచ్చివేయుమని తీర్పు చెప్పాడు. ఇప్పుడు జయపాలుని ఓడలలో మూడు పోయినై, ఇంక ఒక్కటే మిగిలి వున్నది. తండ్రి చెప్పిన మాట విననందుకు తగిన శాస్తి ఐంది కదా అని ఒకసారి జయపాలుడు అనుకొన్నాడు. ఇంతలో ఒక మంగలి ఆ దారిని పోతూవుండేసరికి,"ఐనదేమో ఐంది. శుభ్రంగా క్షౌరమయినా చేయించుకుందా" మని అతను మంగలిని పిలిచాడు. అయ్యా, ఏమిస్తారేమిటి"? అని మంగలి అడిగాడు. "నీకు అనుమానమెందుకురా అబ్బాయీ నిన్ను సంతోషపెట్టితే సరిగదా?" అని జయపాలుడు వానికి నచ్చజెప్పి, పని చేయించుకొన్నాడు.

క్షవురం పూర్తికాగానే జయపాలుడు అతనికి అయిదు రూపాయలు ఇవ్వబోగా మంగలి పుచ్చుకోలేదు. మరి అయిదు రూపాయలు ఇచ్చాడు. మంగలి మళ్లీ వద్దు అన్నాడు. అలా ఎంత సొమ్ము ఇచ్చినా చాలదు అని చెప్పి మంగలి తీసుకొనటం లేదు, పైగా, రాజువద్ధకు పోయి, "నన్ను సంతోషపెడతానని చెప్పి ఈయన పని చేయించుకొన్నాడు. కాని సంతోషపెట్టలేకపోయాడు" అని ఫిర్యాదు చేశాడు. ఈ నేరము కూడా విచారణ చేసి, జయపాలునిదే తప్పు అని రాజు తీర్పు చెప్పి, మంగలికి ఒక ఓడ పరిహారము ఇవ్వమన్నారు. చేసేది లేక, జయపాలుడు తన వద్ద మిగిలి వున్న నాలుగవ ఓడను కూడ వదులుకొన్నాడు. ఇలా తను తెచ్చుకొన్న నాలుగు ఓడలూ వంచకమహాపట్టణంలో ఫిర్యాదీలకు సమర్పించుకుని జయపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక, సముద్రతీరాన విచారంగా కూర్చున్నాడు. అక్కడ ఒక సన్యాసి కనబడి, "జయపాలా! నీ విచారానికి కారణం నాతో చెప్పు, నేను చేయగల సాయముంటే చేస్తాను" అన్నాడు. అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి, తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేవరకు సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి, చేతికి ఒక రత్నాలహారం ఇచ్చి "పో, నాయనా!" ఇక నీకంతా జయమే కలుగుతుంది" అని దీవించాడు. సంతోషంతో జయపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్లి, ఆడుకొంటూ వున్న రాజుగారి పాపాయి మెడలో తన వద్దనున్న రత్నాలహారం అలంకరించాడు. అందమయిన ఇటువంటి హారం బహుమతి చేసిన జయపాలుని ఎంతో మెచ్చుకొని, రాజుగారు "అబ్బాయీ! మాకు చాలా సంతోషమయింది, నీకు ఏమి కావాలో కోరుకో" మన్నారు.

అప్పుడు అతను వినయముతో చేతులు రెండూ జోడించి, "మహారాజా! తమరు ధర్మ ప్రభువులు, కాని, నా రోజులు బాగా లేక నా పయిన అన్యాయంగా నాలుగు నేరాలు మోపబడి, నేను వర్తకం కోసం తెచ్చుకొన్న నాలుగు ఓడలూ మీ రాజ్యంలో ఫిర్యాదీలకు పరిహారం కింద ఇచ్చుకొనవలసివచ్చింది. ఈ నేరాలను ఏలినవారు మళ్లీ విచారణ చేసి, న్యాయం అనుగ్రహించమని ప్రార్థన" అని కోరాడు. రాజుగారు ఇందుకు వొప్పుకొని, నాలుగు నేరాలకు సంబంధించిన ఫిర్యాదీలను హాజరు పెట్టించి, జయపాలుడు చెప్పుకోగలిగినదేమయినా వుంటే చెప్పుకోమన్నారు.  అప్పుడు జయపాలుడు నాలుగు నేరాలను గురించిన వివరాలూ రాజుగారితో ఇలా విన్నవించాడు: "అయ్యా! నా తండ్రి చేప రూపముతో వుండి సముద్రం మీద నాకు ఓడలు నడపటం నేర్పుతూ వుండగా, ఆ పల్లెవాని తండ్రి నీటి కొంగ రూపంతో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి, అందుకని నేను నీటి కొంగను కొట్టవలసి వచ్చింది" అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకొన్నాడు. రాజు సంతోషించి, పల్లెవాని చేత జయపాలునికి ఓడను తిరిగి ఇప్పించి వేశాడు. తరువాత ఒక చెవి లేనివాడు వచ్చాడు. "దేవరా! నా తండ్రి ఎన్నో వేల చెవులను తాకట్టు పట్టినాడండి. అందులో ఇతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టమండి. ఆ రెండవ చెవి నాకిచ్చినట్టయితే పద్దులలో అతని చెవి ఎక్కడ వున్నదో వెతికి ఇస్తానండి" అని జయపాలుడు చెప్పేవరకు, చెవి లేని వాడు రెండో చెవి ఈయడానికి భయపడ్డాడు. ఆందుచేత, తప్పు వానిదేనని ఒప్పుకుని వాని చేత రాజుగారు ఓడను తిరిగి జయపాలునికి ఇప్పించి వేశారు.

విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది. అప్పుడు జయపాలుడు "ఏలికా! ఈమెకు పది వేల రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి. అయితే, మా కులాచార ప్రకారం భర్తతో కూడా భార్య సహగమనం చేయాలి. ఇప్పుడయినా సరే, ఈమె ఆ పని చేసిన పక్షమందు, మనవర్తి సొమ్ము ఆమె వారసులకు ఈయటానికి అభ్యంతరం లేదండి!" అన్నాడు. ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు. కనక ఆమె చేత మూడవ ఓడను జయపాలునికి ఇప్పించి వేశారు రాజుగారు. ఇంక, చివరకు మంగలి వచ్చాడు. ఇక్కడ జయపాలుడు అన్నిటినీ మించిన చిత్రం చేశాడు. నిండు దర్బారులో రాజుగారి పాపాయిని ఎత్తుకుని ముద్దాడుతూ, "మన పాపాయి ఈ రత్నాలహారము వేసుకోవడం మీకు సంతోషంగానే వుందా?" అని జయపాలుడు దర్బారులో ఒక్కొక్కళ్లనే వరసగా పేరు పేరునా అడిగాడు. అందరూ "సంతోషంగా వున్న" దన్నారు. చివరకు తనకు పని చేసిన మంగలిని కూడా అడిగేసరికి వాడు కూడా "సంతోషమే బాబయ్యా!" అన్నాడు. "మహరాజా! ఇప్పుడు నేనుచేసిన పని సంతోషమేనని మంగలి తనకు తనే వప్పుకొన్నాడు, విన్నారు కద" అని అనేసరికి, రాజు సంతోషించి మంగలి తీసుకున్న ఓడను మళ్లీ జయపాలునికి ఇప్పించి వేశాడు. ఈ విధంగా ఎన్ని కష్ట నష్టాలు పడినప్పటికీ జయపాలుడు యుక్తివల్ల, సన్యాసి దీవెన వల్లా తన నాలుగు ఓడలనూ తిరిగి సంపాయించుకొని, వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకొన్నాడు.


Comments