చందమామ కథలు - దివ్యగానం

 

Chandamama telugu story of a fairy who marries a common man. Best Telugu Chandamama stories to read.
పూర్వకాలమందు ధనుంజయుడు అనే వేటకాడు ఒకడు ఉండేవాడు. అతను యువకుడు, మంచి బలిష్టుడు. భయమనేది ఎరుగని వాడు. ఎటువంటి కటిక చీకటి అయినా అతను కీకారణ్యాలలో ఒంటరిగా సంచరించగలడు. ఎంతటి లోతైన సముద్రాలనైనా ధైర్యంగా దాటివేయగలడు. ధనుంజయుడు ఒక రోజున బయల్దేరి వెళ్లి ఒక కొత్త ప్రదేశం చేరుకొన్నాడు. అది ఒక మైదానము. ఆ మైదానమంతటా కంబళి పరచినట్టు అందమైన పచ్చటిగడ్డి ఆవరించి వున్నది. అక్కడక్కడ అందాల పూలమొక్కలు రకరకాల పరిమళాలను విరజిమ్ముతూ వున్నయి. అతను ఆ మైదానంలో కొంతదూరం పోయి, గతుక్కున ఆగిపోయాడు. అతని ముందర పళ్లెము కట్టినట్టు గుండ్రపాటి మండపము, అందులో అపురూపములైన పూల మొక్కలూ ఉన్నయి. అవి చూడడానికి మెట్లవలె పేర్చబడి, అదంతా దేవతలు విహరించే దివ్యస్థలమా అనిపిస్తూ వున్నది! అ మండపంలోకి వెళదామంటే, ఎటువైపు చూచినా దారి కనబడదు. అక్కడ ఒక్క గడ్డిపరక నలిగిన ఆనవాలుగాని, ఒక పువ్వురేక తుంచిన ఆనవాలుకాని కనపడలేదు. ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ, అలానే కనిపెట్టుకొని ఉండేవరకు, ఆకాశం పైనుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులకు చల్లగా సోకింది. ఇదేమిటా అని మెడ ఎత్తి పైకి చూచేవరకు, ఒక గుండ్రటి ఆకారం భూమి మీదకు దిగబోతున్నట్టు కనబడింది. అతనికి ఇంతకుముందు వినపడిన గానము ఈ ఆకారము నుంచే బయల్దేరినట్టు ధనుంజయుడు గ్రహించాడు.

ఆ ఆకారము అంతకంతకు పెద్దది అయ్యి అందులోనించి బయల్దేరిన గానము అంతకంతకు హెచ్చుస్థాయీలోనూ, మరింత స్పష్టంగానూ వినపడజొచ్చింది. మరి కొంచెంసేపటికి, తను చూచిన ఆ స్వరూపము ఒక గుండ్రటి తట్ట అనీ, అందులో ఎవరో ఉన్నారనీ అతను కనిపెట్టాడు. ఆ జనాన్ని పరీక్షించి చూడగా ధగధగ మెరిసిపోతున్న నక్షత్రకన్యలు పన్నెండుమంది కనపడ్డారు. వారిలో అక్క ఎవరో, చెల్లెవరో పోల్చి పట్టడానికి వీలు లేకుండా, అందరూ ఒక్క మూసలో పోసిన ప్రతిమలలాగా వున్నారు. ఆ కన్యలు, మోకాలి వరకు వేలాడుతూవున్న బంగారు కేశములతో బిలబిలమంటూ ఇవతలకు పచ్చి, గుండ్రటి మండపంలో ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని, నాట్యంచేయ నారంభించారు. వారు నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరగిర తిరుగుతూవుంటే, ఒక వెండితీగ రివ్వున చుట్టుకొంటూ వున్నట్టు కనిపించింది. అతనికి ఇంతకుముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారంలోనించే. ఆ కన్యల అందచందాలను అతను గమనించాడు. వారందరూ ఒకే మోస్తరుగా అగపడుతూ వున్నా అందులో ఒకామె మాత్రం తక్కిన పదకొండుమంది కంటే మించిన సౌందర్యంతో వెలిగి పోతున్నది. ఈమె అక్కా చెల్లెళ్ళందరిలో కడసారిది అయిన తారాకన్య అని ధనుంజయుడు తెలుసుకొన్నాడు. అతని మనసు అమె పైకి పోయింది. ఇప్పటివరకు వాళ్ళ నాట్యం చూస్తూ వున్న ధనుంజయుడు తారాకన్య అందం చూచి నిలవలేక, గభాలున పైకివచ్చేశాడు. నరుడు కంట పడగానే నక్షత్రకన్యలు తట్టలోకి దూకి, ఎగిరిపోయారు. 

అప్పుడు ధనుంజయుడు, తన తొందరపాటుకి పశ్చాత్తాపపడి, విచారంతో కుటీరానికి మరలిపోయాడు. ధనంజయుడికి చిత్రమైన మంత్రవిద్య తెలుసు. ఆ విద్యవల్ల అతను, తన ఇష్టము వచ్చిన రెండు జంతువుల స్వరూపాలు పొందవచ్చు. అంతటితో ఆ మంత్ర మహిమ అంతరించిపోతుంది. అందుచేత, అతను ఆ నక్షత్రకన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో, ఒక అడవిపిల్లి రూపం ధరించి, మండపానికి సమీపాన గడ్డిలో పొంచివుండి, నిద్రపోతున్నట్టు నటించాడు. మామూలువేళకు నక్షత్రకన్యలు భూలోకానికి దిగివచ్చి, మండపంలో నృత్యం చేస్తున్నారు. అంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారి దగ్గరగా పోయేవరకు, ధనుంజయుడు అనుకొన్నట్టుగా దానిని చూచి వారు అకర్షింపబడలేదు సరికదా ఆ అలజడికి వారు జడుసుకొని తట్టలో దూరి మళ్ళి ఎగిరిపోయారు. ఈ విధంగా, అతని ప్రయత్నం రెండవసారి కూడా ఫలించింది కాదు. ఇక ఇది పనికాదని, ధనుంజయుడు మళ్ళీ బాగా ఆలోచించాడు. చూడబోతే, తన మంత్ర మహిమవల్ల ఇంక ఒక్క అవతారం మాత్రమే అతను ఎత్తటానికి అవకాశమున్నది. ఈసారి ఒక అడవి ఎలుకల కుటుంబముగా మారిపోయి, మండపము దగ్గర ఉండే ఒక చెట్టుతొఱ్ఱలో నివాసం ఏర్పరచుకున్నాడు. మరునాడు, మళ్ళీ మామూలు వేళకు నక్షత్రకన్యలు దిగివచ్చి, నాట్యం ప్రారంభించారు. ఇంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటు యిటు పాకులాడుతూ వుండగా చూచి, వారు ఆ ఎలుకలనూ ఎలుక పిల్లలనూ పట్టుకొబోయారు. 

ఇది చూచి "భేష్! నా పన్నాగం ఈసారి ఫలించింది" అనుకొని అతను సంతోషించాడు. తండ్రి ఎలుక రూపం దాల్చిన ధనుంజయుడు, కావాలనిపోయి, కడసారిదైన తారాకన్య చేతిలో చిక్కుకొన్నాడు. అమె తనను తాకగానే అతను నిజస్వరూపం పొంది, తారాకన్య చేయి పట్టుకొనే వరకు, తక్కిన పదకొండుగురూ వెనక్కు తిరిగి చూడకుండా ఒక్క లిప్తలో ఆకాశానికి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు, తారాకన్యను అనేక విధాల లాలించి, అమెకు జంకు లేకుండా ధైర్యం చెప్పి, వేటను గురించిన వింతలూ, అరణ్యాలను గురించిన చిత్రాలూ చెబుతూ మెల్లగా ఆమెను తస కుటీరానికి తీసుకుపోయాడు. ఎలా అయితేనేమి, చివరకు అమె జంకు తీరి అతనిని మనసారా ప్రేమించింది. ఇద్దరకూ వైభవంగా వివాహం జరిగింది. నాటి నుంచి వారు హాయిగానే వుంటున్నారు. కాని, తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడోనని తారాకన్యాకు మనసులో భయంగానే వుంది. తారాకన్య, నక్షత్రరాజులలో ఒకరాజు కూతురు. ఆమెకు కొన్నాళ్ళయిన తరువాత, నక్షత్రమండలానికి పోయి, తనవాళ్లనూ తల్లిదండ్రులనూ చూడాలని బుద్దిపుట్టింది. ఒక తట్ట అల్లి మంత్రగానం చేసినట్టయితే, ఆ గానమహిమ వలన విమానం మోస్తరుగా తట్ట పైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసు. భర్తతో తన ఉద్దేశం వెల్లడిస్తే, తను వెళ్ళకుండా ఆటంక పరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఈ సంగతి అతనికి తెలియనీయలేదు.

అనుకొన్నట్టుగానే కొన్నాళ్ళు శ్రమపడి, ఆమె ఒక తట్ట అల్లింది. దానిని రెండవ కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకొనిపోయి, అందులో అమె కూర్చుని, తన చిన్నారి కొడుకును తనతో పాటు తట్టలో ఎక్కించుకొని, దివ్యగానం చేసేవరకు, విమానంలాగా ఆ తట్ట ఆకాశమార్గాన ఎగిరిపోయింది. దూరానవున్న ధనుంజయుని చెవులకు ఆ దివ్యగానం వినిపించింది. "ఇదేమిటి, వేళగానివేళ ఇప్పుడు దివ్యగానం వినబడుతోందే!" అని అనుకొంటూ, అతను నక్షత్రకన్యలు నృత్యంచేసే మండపం వద్దకు పరుగెత్తాడు. అతను వెళ్ళి చూచేవారకు, కొడుకును ఎత్తుకొనివున్న తన భార్య, తట్టలో ఎగిరిపోతూ ఉండటం కంటబడింది. ఎగిరిపోతూ వున్నా తారాకన్యను అనేకవిధాల బతిమాలి, "నన్ను వదిలిపోవటం న్యాయమా? నేనేం పొరపాటు చేశాను?" అంటూ అతను ప్రాధేయపడ్డాడు. తట్ట అంతకంతకు పైకి ఎగిరిపోయింది కాని, మరి కిందకి దిగలేదు. ఇప్పుడు ధనుంజయుని బ్రతుకు ఒంటిపాటు బ్రతుకయింది. దేవుడా అంటూ అతను విచారంతో తన కుటీరానికి పోయి, ఎప్పటికైనా మళ్ళీ దివ్యగానం వినపడకపోతుందా అనే ఆశతో కనిపెట్టుకొని ఆరు నెలలు గడిపాడు. కాని అతని అసలు ఫలించలేదు. కడసారి కూతురు తారాకన్య, ఆమెకు పుట్టిన పిల్లవాడూ, అనగా తన మానమడూ, కలసి మళ్ళీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్ర రాజు ఎంతో ఆనందించాడు. తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్టు నటించింది. కాని, ఆ పిల్లవాడు మాత్రం అస్తమానం తండ్రి కోసం బెంగపెట్టుకొనేవరకు, మంచి చెడ్డలూ కష్ట సుఖాలూ తెలిసిన నక్షత్రరాజు ఒకరోజున తారాకన్యను పిలిచి, "అమ్మాయీ! పిల్లవాడు తండ్రికోసం బెంగపెట్టుకొన్నాడు. కనుక, నీవు భూలోకానికి పోయి, నీ భర్తను ఇక్కడికి తీసుకువచ్చేయి. అతను కూడా మనతోపాటు మనలోకంలోనే ఉండిపోవచ్చు" అని అన్నాడు. 

ఈ కోరిక తారకన్యకు ఇంతకుముందే ఉన్నప్పటికీ, భూలోకానికి పోయి మానవుణ్ణి పెళ్ళాడినందుకు తండ్రి ఏమనిపోతాడో అనే జంకుతో చెప్పటానికి ఇంతవరకు సాహసించలేకపోయింది. కాని, తండ్రే తనంతట తను ఇప్పుడు అనుమతి తెలిపేసరికి, తారాకన్య, కుమారుణ్ణి వెంటబెట్టుకొని గభాలున భూలోకానికి దిగివచ్చింది. ఆరునెలల తరువాత ఇప్పుడు మళ్లీ దివ్యగానం వినపడగానే, నృత్య మండపానికి చేరువనే ఉంటూ వున్న ధనుంజయుడు ఆకాశంవంక చూచాడు. ఒక చిన్న చుక్క వంటి ఆకారం అతనికి కనపడింది. అది పెద్దదై గుండ్రముగా కనపడింది. కొంతసేపటికి కిందికి దిగ గానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమయింది. ఆ తట్టలో తన భార్యా, కొడుకూ కనపడేవరకు ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు. కొన్నాళ్లు భార్యా, కొడుకూ అతని కుటీరంలో కులాసాగా నివసించిన తరువాత ముగ్గురూ కలసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ ధనుంజయుణ్ణి మామగారు ఎక్కువగా ఆదరించటం చేత అతను ఆ లోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ రెండు డేగపిట్టల రూపంలో భూలోకానికి దిగివచ్చి, ఇష్టం వచ్చినంత సేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి తిరిగి, మళ్లీ నక్షత్రలోకానికి వెళ్లిపోతూ వుంటారు.

Comments