భగవానుడు మొట్ట మొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఇప్పుడు మనం చూచే పక్షులూ, చెట్లూ, ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు. చెట్లూ చేమలూ సృష్టి ప్రారంభంలో పొడవుగా, మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండడం వల్ల మనుషులూ, జంతువులూ మసలాడానికి ఇబ్బందిగా వుండేది. మరి, మనుషులూ, జంతువులూ అటు యిటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా? పోతే చెట్లెక్కి కాయలూ, పండ్లూ కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటంచేత, అసలే వీలులేకపోయేది. ఆకాశమంత ఎత్తున వుండే పండ్లు ఎవరు అందుకోగలరు? ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ వున్న భగవానుడు యోచించి, బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. "బ్రహ్మా! ఈ చెట్లు పొడవుగా ఉండటం చేత, వాటి ఫలాలను కోసుకొని అనుభవించటానికి మనుషులకూ జంతువులకూ వీలు కాకుండా వుంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయటానికి తగిన సాధనం ఏదైనా నీవు యోచించి వెంటనే సృష్టించవలసింది" అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలినీ తరువాత ఒక కొంగనీ సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యని అసూయ బయల్దేరింది. కొంగ సరాసరి భగవానుని వద్దకు వెళ్లి "స్వామీ! నెమలి ఎంతో చక్కగానూ, సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాల మెచ్చుకొంటున్నది. లోకులు మెచ్చుకొంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి, తన అందానికి తనే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిగా, భూమికి బెత్తెడు ఎత్తున పొట్టిగా కనబడుతున్నాను. అందుచేత నన్ను ఎవళ్లూ మెచ్చుకోలేదు సరికదా, నా వేపైనా కన్నెత్తి చూడటంలేదు. బ్రహ్మకు నాపైన ద్వేషం, ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి" అని ప్రార్థించే వరకు, భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు.
"ఏమయ్యా బ్రహ్మా! నువు సృష్టించిన కొంగ ఇలా గోలపెడుతున్న దేమిటి? నెమలి లాగా దానిని కూడా ఎందుకు అందంగా చేశావు కావు?" అని అడిగాడు. అప్పుడు బ్రహ్మా, "స్వామీ! కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏమి మించిపోయింది?" అంటూ, కొంగను రెండు చేతులలోకి తీసుకొని, ఒక చేతితో దాని మెడ, రెండవచేతితో కాళ్ళూ పట్టుకొని బాగా సాగదీయ నారంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక, కొంచెం సేపటికే కొంగ "బాబోయ్! చాలు బాబోయ్!" అని గోలపెట్టింది. అప్పటినించీ కొంగ కాళ్ళూ, మెడా పొడవై, లోకులందరకూ స్పష్టంగా కనబడేటట్టు తయారుచేయబడింది. తన పొడవాటి మెడ చూచుకొని, నెమిలికంటె ఎత్తుగా ఉన్నానుగదా అని తృప్తిపడి, కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి, నెమలిని పక్షులకు రాజుగానూ, నెమిలిరాజు కింద కొంగ మంత్రిగానూ ఉండాలని నియమించాడు. ఆ తరువాత రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించ నారంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకొంటూ చెట్లపైకి ఎగిరి, వాటికి ఉండే పండ్లను భూమి మీద పడవేయడం ప్రారంభించాయి. అప్పటినించీ, ఈ ఎగిరే పక్షుల సాయంవల్ల మానవులకూ, జంతువులకూ తిండి సమస్య కొంతవరకు తీరింది.
Comments
Post a Comment