- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, "రాజా, నీవు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరక ప్రాప్తి కలుగుతుందేమో అలోచించి చూసుకున్నావా? మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా! అది నిరూపించటానికొక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: ఒకప్పుడు సింహళ ద్వీపంలో సింహవిక్రముడనే గజదొంగ ఉండేవాడు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచీ ఇతరుల సొత్తు దోచి, ధనికుడై సుఖ జీవనం గడిపాడు. అటువంటి వాడికి వార్ధక్యం సమీపించింది. అప్పుడు వాడికొక చింత పట్టుకున్నది.
వాడిలాగ అనుకున్నాడు : "ఈ లోకంలో తప్పించుకున్నాను. కానీ చచ్చాక నాకు నరకం తప్పదు. ఈ జన్మలో కొంచమైనా పుణ్యం చెయ్యని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు? దేవుళ్ళకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు. అందుచేత శివుడుగాని, విష్ణువుగాని దేవతలను కాదని నా మొర ఆలకించరు. భూలోక వాసులందరి పాప పుణ్యాల లెక్కలు వేసే చిత్రగుప్తుడే నాకేదైనా సహాయం చెయ్యాలి." ఈ విధంగా అనుకుని సింహవిక్రముడు నిత్యమూ భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుణ్ణి అర్చించ సాగాడు; చిత్రగుప్తుడి ప్రీత్యర్థం బ్రాహ్మణ సంతర్పణలు చేయనారంభించాడు. భోజనం చేసిన బ్రాహ్మణులను, "చిత్రగుప్తుడి అనుగ్రహం కలుగుగాక!" అని తనను దీవించమనేవాడు. ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహవిక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దొంగవాడు ఆయనకు చక్కగా అతిథి సత్కారాలు జరిపి, భోజనం పెట్టి, గొప్పగా దక్షిణ యిచ్చి, "నన్ను చిత్రగుప్తుడనుగ్రహించాలని ఆశీర్వదించండి," అని కోరాడు. చిత్రగుప్తుడు వాడితో, "ఇదేమి ఆశీర్వచనం? శివకేశవులను కూడా విడిచి చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తున్నావేమిటి?" అన్నాడు. "అదంతా మీకెందుకు? నాకు చిత్రగుప్తుడి అనుగ్రహం తప్ప మరే దేవత అనుగ్రహమూ అవసరం లేదు," అన్నాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు సంతోషించి, తన నిజ రూపంతో దొంగవాడికి ప్రత్యక్షమై, "నీ భక్తికి మెచ్చాను. నీకేం కావాలో చెప్పు," అన్నాడు. సింహవిక్రముడు పరమానంద భరితుడై, "స్వామీ, నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి," అన్నాడు.
"అది అసాధ్యమైన సంగతి. అయినా నీకొక ఉపాయం చెబుతాను. ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికి యముడు రాగా శివుడాగ్రహించి, యముణ్ణి కాల్చి భస్మం చేశాడు. శివుడు తరువాత యముణ్ణి తిరిగి బతికిస్తూ, శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణినీ అంట వద్దని ఆజ్ఞాపించాడు. సముద్రం అవతల తరంగిణీ నది అవతలి ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. ఆ తపోవనంలోకి యముడు గాని, యమకింకరులు గాని రారు. నిన్నక్కడ దిగవిడుస్తాను. నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి ఇవతలి ఒడ్డుకు రాకు," అని చెప్పి, చిత్రగుప్తుడు సింహవిక్రముణ్ణి తరంగిణీ నది అవతలి ఒడ్డున, శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృశయుడయ్యాడు. కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణాలు తీసుకుపోవటానికి తరంగిణీ నది ఇవతలి ఒడ్డుకు చేరాడు. తాను నది దాటి అవతలి ఒడ్డుకు పోవటానికి లేదు గనక, యముడు మాయా ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి, శ్వేతముని ఆశ్రమానికి పంపాడు. ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై ఆమెతో కొంత కాలం సుఖించాడు.
ఆ తరవాత ఆమె తన వాళ్ళను చూడటానికి నది దాటి వెళ్ళి మళ్ళీ వస్తానని బయలుదేరింది. దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటటం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకు పోతున్నట్టు నటిస్తూ, "అయ్యో! మునిగిపోతున్నాను. కాపాడు! అలా చూస్తూ నిలబడిపోతావేం? రక్షించు!" అని కేకలు పెట్టింది. ఆ కేక వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఈద నారంభించాడు. అతను ఆమెను చేరుకునే సరికి ఆమె అవతలి ఒడ్డు చేరనే చేరింది. దొంగ అవతలి ఒడ్డున కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాశం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ విధంగా సింహవిక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు. అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు: "యముడు నిన్ను, ముందు స్వర్గమనుభవిస్తావా, నరకమనుభవిస్తావా? అని అడుగుతాడు. స్వర్గమే అనుభవిస్తానని చెప్పు. నిన్ను స్వర్గానికి పంపుతారు. అక్కడ నీవు స్వర్గసుఖాలనుభవిస్తూ కూర్చోక, నీ పాపమంతా పరిహార మయేదాకా తపస్సు చెయ్యి." సింహవిక్రముడలాగే చేస్తానన్నాడు. తరవాత యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి పిలిచి, "ఈ దొంగకు పుణ్యఫలమేమైనా ఉన్నదా?" అని అడిగాడు. "ఉన్నది, దేవా. ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దేవతాదినం పాటు స్వర్గ వాసం చేసేపాటి పుణ్యం సంపాదించాడు," అన్నాడు చిత్రగుప్తుడు. "ఏమోయ్, నీకు ముందు స్వర్గం కావాలా, నరకం కావాలా?" అని యముడు దొంగనడిగాడు.
"దేవా, నేను ముందు స్వర్గానికే పోతాను," అన్నాడు దొంగ. సింహవిక్రముణ్ణి స్వర్గానికి పంపారు. వాడక్కడ సుఖాలనుభవించే ఉద్దేశం పెట్టుకోక, శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి, తన పాపాలన్నిటినీ భస్మం చేసేసుకున్నాడు. అతడి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవటానికి వచ్చిన యమకింకరులు, అతన్ని తేరి చూడటానికి కూడా శక్తి చాలక, వచ్చిన దారే తిరిగి వెళ్లారు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా యముడు పంపిన మాయా స్త్రీ వ్యామోహంలో పడనట్టయితే చావును జయించి ఉండేవాడూ, ఘోర తపస్సు చేయవలిసిన అవసరం ఉండేది కాదు గద. క్షుద్రమైన స్త్రీ సుఖం కోసం ఒక దేవతాదినం పాటు స్వర్గభోగాలు లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "సుఖభ్రాంతే నరక భయానికి మూలకారణం. ఈ విషయంలో హీన సుఖాలూ, ఉత్తమ సుఖాలూ అన్న వ్యత్యాసం ఏమీ లేదు. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయా స్త్రీ భ్రాంతితో ప్రాణం మీదికి తెచ్చుకుని, నరకానికి దగ్గిరపడ్డాడు. అలాటి భ్రాంతే అతనికి స్వర్గ సుఖాల మీద కూడా ఉండినట్టయితే తప్పక నరక ప్రాప్తి పొంది ఉండేవాడే. సుఖభ్రాంతి పోయిన క్షణంలో అతనికి నరకభయం కూడా పోయింది," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment