ఒక వూళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. కనుకనే, తనకు తండ్రి విడిచిపోయిన ఆరు ఎకరాల పొలాన్ని కొద్దికాలంలోనే అరవై ఎకరాలు చేయగలిగాడు. అంతేకాదు. తను నివసించటానికి అన్ని సదుపాయాలూ కల ఒక మేడకూడా కట్టించుకున్నాడు. అన్నీ బాగానే వున్నాయిగాని, అతనికి ఒక్కటే లోటు! సంతానం లేకపోవటం. "తిండిగుడ్డలకు లోపంలేకుండా భగవంతుడు ఏదో ఇంత కలుగజేశాడు. తల దాచుకునేందుకు వసతికూడా వున్నది. కాని ఏం లాభం! అనుభవించటానికి ఒక్క నలుసయినా లేకపోయె" అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు. కొంతకాలానికి సింహాచలం దేముడి దయవల్ల ఒక కుమారుడు కలిగాడు. సింహాద్రి దయవల్ల పుట్టినపిల్లవాడు కాబట్టి వానికి నరిసిమ్మ అని పేరుపెట్టారు. నరసిమ్మకు పుట్టుకతోనే లోభగుణం పుట్టింది. అతను చూడగా ఒకళ్లకు పెట్టనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఎవళ్లకయినా దానం ధర్మం చేసుకోబోతే పెద్ద గోల చేసేవాడు. "ఆ చిన్నప్పటి గుణాలు పెద్దయిన తరువాత ఉంటయ్యా, బుద్ధి మారకపోతుందా!" అని వెంకయ్యా భార్యా అనుకునేవాళ్లు. కాని, నరసిమ్మ పెద్దవాడయినా, ఈ దుర్గుణం మారలేదు. "ఇక ఇది పని కాదు. అబ్బాయికి పెళ్లి చేస్తే, కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది, ఇంటికోడలువల్లనేకదా కుటుంబ గౌరవం నిలబడేది" అని ముసలివాళ్లు ఆశించి, ఒక చక్కటిచుక్కను చూసి నరసిమ్మకు ముడిపెట్టారు. అయితే, ఇదివరకల్లా ఇతరులవిషయంలోనే కొడుకు లోభగుణం కనపడేది కాని, కోడలు వచ్చాక పాపం, ముసలివాళ్ల బతుకుకే మోసం వచ్చింది.
ఎక్కువ ఖర్చు కాకుండా వుండాలనే ఉద్దేశంతో నరసిమ్మ ఎటువంటి దుర్మార్గపు పనిచేశాడో తెలుసా? తల్లినీ తండ్రినీ పశువుల పాకలో ఉండమన్నాడు. ఆ రొచ్చులోనే ఇద్దరకూ చెరి వక కుక్కిమంచము వేయించాడు. పక్కకూ, కప్పుకోటానికీ రెండేసి చింకి బొంతలు ఇచ్చాడు. ఇవన్నీ అటుంచి, వారికి మూకుడు ఒకటి కొనియిచ్చాడు. భోజనాల వేళ నరిసిమ్మ వంటవాడిని వెంటబెట్టుకు వెళ్లి, వాళ్ళకు ఆ మూకుడులో చాలీ చాలని మెతుకులూ, ఇంతగంజీ పోయిస్తుండేవాడు. ముసలికాలములో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడిపైన కొండంత ఆశపెట్టుకొని వున్నారు. కానైతే, వారు తలచింది ఒకటీ, ఇప్పుడు జరుగుతున్నది వేరొకటీ. ఈ దురవస్థకు వారు విచారపడ్డారు. "కానీలే, ఎప్పటికయినా వీడికీ కొడుకు పుట్టకపోతాడా, బుద్ధి చెప్పకపోతాడా," అని ముసిలి దంపతులు వాళ్లలో వాళ్లు అనుకోని తృప్తిపడేవారు. వాళ్ళ నోటివాక్యం ఫలించి, మరి కొద్ది కాలానికే నరిసిమ్మకు ఒక కుమారుడు పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు అంటారు. నరిసిమ్మకు కుమారుడు కలగగానే, పిల్లవాడు తాతను పోలినాడనీ, ధర్మబుద్ధి కలవాడనీ అందరూ అనుకున్నారు. గుణాలనుబట్టి పిల్లవానిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు. అయితే, లోకులు చెప్పుకోగా విని ఆనందించడమేగాని, ముద్దుల మనమడిని కంటారా చూడటానికీ, ముచ్చటతీరా ఎత్తుకోటానికీ వెంకయ్య దంపతులు నోచుకోలేదు! ఏమి అంటే, తాత అవ్వల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరిసిమ్మ తగిన కట్టుదిట్టంచేశాడు.
అయినా, ధర్మన్నకు ఊహ రాగానే పశువులపాకలో జరిగేసంగతులన్నీ తెలుసుకొన్నాడు. తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంతపెట్టినా, పశువుల పాకలోనే ఉండి, తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసిలేవాడు. ఎంతచేసినా నరిసిమ్మ కొడుకును మందలించలేక పోయాడు. ప్రతిరోజునా నరసిమ్మ దగ్గర వుండి ముసిలివాళ్ళకు మూకుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్నకూడా తండ్రి పక్కనే వుండి ఏదో ఆలోచిస్తూవుండేవాడు. ఇలా వుండగా, ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకొన్నాడు. నరిసిమ్మ గంజి పోయించాడు. కాని, పెద్ద వయస్సు కావటం చేతనో చాలిన తిండి లేక, నీరసం చేతనో, వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి, పుటుక్కున బద్దలై పోయింది. తండ్రి పక్కనేవున్న ధర్మన్న గభాలున తాతచెయ్యి పట్టుకొన్నాడు. "ఏమిటి తాతా, మూకుడు పగులగొట్టేశావే. ఇప్పుడెలాగనుకున్నావు? మా బాబూ, అమ్మా ముసిలివాళ్ళయిన తరువాత మరి, వాళ్లకు నేను కూడా ఇందులో గంజి పోయించవద్దా? అప్పుడు మళ్లీ ఇంకొక మూకుడు కొనమంటావా? తాత కిచ్చిన మూకుడు తరతరాలా ఉండాలి గాని, యిలా పగలకొట్టుకుంటారా ఎవళ్ళయినా? బాగా చేశావులే!!" అని కోపగించినట్టు కసిరాడు.
చిన్నవాడయినా, ధర్మన్న చెప్పిన మాటలవల్ల నరిసిమ్మ తన పొరబాటును వెంటనే గ్రహించాడు. ఇంతవరకు తలిదండ్రులపట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు. ఉత్తపుణ్యానికి ముసిలివాళ్ళను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకూ ఇదే గతికదా అని తెలుసుకుని భయపడ్డాడు కూడాను. మరుక్షణమే తలిదండ్రుల పాదాల మీద పడి, కంటికి కుంచెడు నీళ్లుగా యేడిచి, క్షమాపణ వేడుకొన్నాడు. కుమారునికి పశ్చాత్తాపం కలిగి, యిటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాత, అవ్వలు ముద్దులాడారు. ఈ సంతోషంలో వాళ్లు మధ్యవచ్చిన కష్టాలను మరిచేపోయారు. వెంకయ్య దంపతులను కొడుకూ, మానమడూ ఆమట్టునే మేడలోకి తీసుకుపోయారు. పెద్దవాళ్ళకే పెత్తనం ఒప్పగించారు. అప్పటినుంచీ ఆ కుటుంబం అందరూ హాయిగా వుంటున్నారు. అయితే, చిన్నవాడయినప్పటికీ "తాత మూకుడు తరతరాలా ఉండవద్దా?" అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోటా ఈ నోటా దేశమంతటా అల్లుకొని, మనకు సామెతగా నిలిచిపోయింది.
Comments
Post a Comment