చందమామ కథలు - అకాల మృత్యువు

 

Telugu Chandamama Story on how no one can escape their own fate despite trying hard. Best Chandamama telugu stories to read.

అనగనగా ఒక వూరిలో వీరన్న అనే దొంగ ఉండేవాడు. ఒక రోజున వాడొక ఇంటికి కన్నము వేసి, లోపలికి  ప్రవేశించబోయేసరికి, వాని పక్కనుంచే ఒక త్రాచు పాము జరాజరా ప్రాకి లోపలికి వెళ్లింది. వీరన్న ఉలిక్కిపడి ఆ పామువంక చూస్తూ, అలాగే నిలబడిపోయాడు. ఆ త్రాచుపాము తిన్నగా గదిలోకి పోయి, అక్కడ వున్న నీళ్ళబిందెలో విషం కక్కి, వచ్చిన దారిని వెళ్లిపోతున్నది. ఇంతలో వీరన్న తన వద్ద నుండే చిన్న కర్ర తీసుకొని పామును కొట్టబోయేసరికి, అది ఒక చక్కటి స్త్రీరూపంతో ప్రత్యక్షమైంది. ఆమె వీరన్నతో, "నువు మాటాడక నా వెంట రావోయి" అని అనేసరికి, ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడి పోసాగాడు. ఆమె వూరి బయటకు వచ్చి, అక్కడ నూతిపైన వుండే కర్రను విరగగొట్టి, మళ్లీ యధాప్రకారం మామూలు చోట ఉంచి వేసింది. వీరన్న ఉండబట్టలేక, ఆమె చేయి గట్టిగా పట్టుకొని, "ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగగొట్టేశావు? మళ్లీ ఎందుకు ఏమీ ఎరగనట్టు ఆ కర్రను ఎప్పటిలాగా పెట్టివేశావు? ఇంతకూ నీ వెవరవు?" అని అడిగాడు. అందుకు ఆమె "నా పేరు 'అకాల మృత్యువు' బ్రహ్మ పోసిన ఆయువు పూర్తి కాకమునుపే కొందరి ప్రాణం తీసివేస్తూ వుంటాను. ఇదే నా పని" అని చెప్పింది. "బ్రతికివున్నవాళ్ళ ప్రాణాలు తీయటం బాగానే వున్నది. మరయితే ప్రాణంలేని ఆ కర్రను ఎందుకు విరగగొట్టావు?" అని వీరన్న అడిగేసరికి, "ఆ సంగతి ఇప్పుడు చెప్పను. రేపు ఉదయం వరకు ఇక్కడనే వుండి, ఏమి జరుగుతుందో చూడు. నీకు తెలుస్తుంది." అని ఆమె అన్నది. 

"అయితే నా మరణం కూడా నీ చేతిలోని పనేనా? లేక, నేను ఆయువు పూర్తి అయేవరకూ జీవిస్తానా? చెప్పు" అని వీరన్న ఆత్రంతో అడిగాడు. దానికి ఆమె "అదీ నా చేతిలో పనే అయినా, నువు అడిగావు గనక ముందుగా చెబుతున్నాను: కొంతకాలానికి రాజుగారి సొత్తు అపహరించిన నేరం నీ మీద పడుతుంది. అప్పుడు నా శక్తివలన నీ ప్రాణాలు తీస్తాను. ఇది నా విధి. తప్పటానికి వీలు లేదు. అయితే, ఈ సంగతి వెల్లడించినావంటే, తక్షణమే నీ తల నూరు వ్రక్కలవుతుందిసుమా జాగర్త" అని చెప్పి అదృశ్యమయిపోయింది. ఆ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది. 'దొంగతనంవల్లకదా ప్రాణాలు పోవటం! కనుక, ఈ క్షణంనించీ ఈ వృత్తి మానివేస్తున్నాను' అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారం నూతివద్ద ఏమి జరుగుతుందో చూడాలని కనిపెట్టుకు కూర్చున్నాడు. తెల్లవారగానే ఆవూరి స్త్రీలు బిందెలు పట్టుకొని నీళ్ళకోసం వస్తున్నారు. వారితో వీరన్న అమ్మా! 'కర్ర విరిగిపోయింది. నీళ్లు తోడుకునేటప్పుడు జాగర్త సుమండీ!' అని చెబుదామనుకొన్నాడు. కాని, ఇంతలో అతని వెనుకనుంచి "బాబోయ్, రక్షించు బాబోయ్" అని వేడుకొంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరో స్త్రీ పాపం, కష్టదశలో ఉన్నదనుకొని, ఆమెను రక్షించడం కోసం ఆ ధ్వని వచ్చినవేపు కంగారుగా పరుగెత్తాడు వీరన్న. కాని, ఎంత దూరం పోయినా, ఎవ్వరూ కనపడలేదు. తిరిగి ఆ కేక కూడా వినిపించలేదు. ఇంతలో, మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి, అతను మళ్లీ నూతి వద్దకు తిరిగివచ్చేసరి కల్లా, ఆ నూతిలో ఒకామె పడిపోవడం, ఆమెను తీయబోయే లోపలనే, శవం నీటిపయిన తేలడం, జరిగింది. ఇదంతా చూచి, వీరన్న విచారం మరింత ఎక్కువయింది. 

వీరన్న ప్రమాణం చేసి, దొంగతనం మానుకొన్న తరవాత ఒక రైతువద్ద కొలువుకు కుదురుకొని, మర్యాదగా జీవనం చేస్తున్నాడు. తలలో నాలుకవలె మెలగటంచేత, రైతుకు అతనిమీద మంచి నమ్మకమూ అభిమానమూ కలిగి, వీరన్నను ఒక ఇంటి వానిని చేశాడు. ఇప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కూడాను. పురిటికి ఆమెను పుట్టింట దిగబెడదామనే వుద్దేశంతో, యజమానివద్ద సెలవు తీసుకొని వీరన్న బయలుదేరాడు. అయితే, ప్రయాణమై వెళుతూవుండగా, మధ్య దారిలోనే ఒక వూరిలో అతని భార్య ప్రసవించి, పిల్లవాడిని కన్నది. "సరే, దేవుని దయవల్ల ఇంత వరకు బాగానే వున్నది. మీరు వెంటనే దగ్గిరగా వుండే పట్నం పోయి, 'కాయపు' దినుసులూ, ఇంగువ పట్టుకురండి' అని ఆమె చెప్పగానే, అవి తీసుకువద్దామని వీరన్న పట్నానికి బయలుదేరాడు. ఇది ఇలా వుండగా, ఆ వూరి రాజుగారి కోటలో రెండు పందెపు కోళ్లు కనపడలేదు. ఆ కోడిపుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి. అందుచేత, ఎలాగైనా సరే వాటిని వెతికిపట్టమని భటులను వాడవాడలా పంపించారు. రెండు రోజులలో తీసుకురాలేకపొతే, వాళ్ల తలలు తీయించివేస్తామన్నారు. ఎంత వెతికినా కోడిపుంజులు దొరకలేదు. అప్పుడు రాజభటులంతా చేరి ఒక ఆలోచన చేశారు. 

మసాలాదినుసులు కావాలని ఎవళ్లు వచ్చినా సరే, వెంటనే పట్టి ఇవ్వవలిసిందని దుకాణదారులందరకూ తెలియజేసారు. కోడి పుంజులను దొంగలించినవాళ్లు వాటిని వండుకు తింటారు కదా, వాటి వంటకు తప్పక మసాలా దినుసులు కావాలిగదా అని రాజభటులు వుద్దేశం. మన వీరన్న ఆ పట్నంలోవున్న ఒక దుకాణానికి వచ్చి, "ఇంగువ, కాయపు దినుసులు" అని భార్య చెప్పిన మాటలు మరిచిపోయి 'మసాలాదినుసులున్నాయా?' అని సాహుకారిని అడిగాడు. "ఉన్నాయి కాని, అవి ఎందుకో చెబితే కాని ఇవ్వను" అని సాహుకారన్నాడు. "ఎందుకేమిటయ్యా, వింతగా అడుగుతున్నావు. ఊరిబయట నా భార్య ప్రసవించింది. ఆమె ఏవో దినుసులు తెమ్మని చెప్పింది. పేరు గుర్తు రావటం లేదు. ఇవయినా పట్టుకవెళ్లితే కొంత పని జరుగుతుందేమోనని ఇమ్మన్నాను" అనేసరికల్లా సాహుకారు వీరన్నను పట్టి రాజభటులకు వప్పగించాడు. రాజభటులు అతనిని పట్టుకొని "నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు. నిజమైతే వెంటనే విడిచి పెడతాం, అబద్ధమయితే ఖైదుచేస్తాం" అని వీరన్నను వెంటబెట్టుకు వెళ్ళారు. తీరా, ఆమెను విడిచివచ్చిన చోటికి పోయేసరికి, అక్కడ వీరన్న భార్యా లేదు, పిల్లవాడూ లేడు. పైగా, ఒక పొయ్యి మీద కుండలో మాంసం కుతకుత ఉడుకుతున్నది. ఆ పక్కనే కోడిబొచ్చు వగైరాలు కనిపించాయి. ఇంక సందేహమేమిటి? భటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి, రాజు ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టారు.  

"మహాప్రభో! వీడు కోడిపుంజులను వండుకోవటం మేము కళ్లారా చూచి తీసుకువచ్చామండి!" అని చెప్పేసరికి, "అయితే, ఈ దుర్మార్గుణ్ణి ఏనుగులచేత తొక్కించి చంపండి" అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంతలో మరి ఒక వేపు వెళ్లిన భటులు కోడిపుంజులు దొరికినవని చెప్పి ఉత్సాహంతో రాజుకి చూపించారు. రాజుకి సంతోషమూ ఆశ్చర్యమూ కూడ కలిగినై. వీరన్నను చంపక, మళ్లీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇంక తొక్కించివేద్దామని అప్పటికప్పుడే ఏనుగుకింద పడుకోబెట్టిన వీరన్నను లేవదీసి, తిరిగి  దర్బారుకు తీసుకుపోయారు. రాజుగారు అప్పుడు దర్భారుచేసి, పండితులను పిలిపించి, 'అనవసరంగా మరణ దండన విధించినందుకు పరిహారము ఏమిటి?' అని ప్రశ్నించారు. దానికి పండితులు వీరన్నకు ఒక బంగారపు యేనుగును, అతను మోయగలిగినంత దానిని బహుమాన మీయవలసిందని సలహా చెప్పారు. ఆ ప్రకారం బంగారు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపైన పెట్టేసరికి, దాని బరువు భరించ లేక, "అబ్బా! అకాల మృత్యువా? ఇదంతా నీ పనే కదా, ఎన్నెన్ని చిత్రాలు చేశావు దేవీ?" అని అనుకొంటూ ముక్కుల వెంట నెత్తురు గక్కుకొని వీరన్న ప్రాణాలు విడిచాడు. తరవాత, వీరన్న చెప్పిన చివరిమాటలలో నిజానిజాలు తెలుసుకొని, రాజుగారు ఆశ్చర్యపడ్డారు. అయితే, ఇప్పుడు ఎవరైనా చేయగలదేమున్నది? అతని జ్ఞాపకార్థం ప్రత్యేకం ఒక ఊరు కట్టించి, రాజుగారు దానికి 'వీరవాసరం' అని పేరు పెట్టారు.


Comments