విజయపురి అనే గ్రామంలో ఓ ముసలవ్వ ఆమె మనుమరాలు రాణి నివసిస్తూ ఉండేవారు. రాణి బొమ్మలు చేయడంలో నేర్పరి. గ్రామంలో చాలామందికి రాణిని చూస్తే భయం. ఎవరైనా ఆమెకు ద్రోహం చేస్తే, ఎలాగో కక్షను తీర్చుకుంటుందని. ఆ గ్రామంలో రామయ్య అనే సరుకులు అమ్మేవాడు ఉండేవాడు. వాడు పచ్చి మోసకారి. గ్రామంలోని జనాన్ని మోసగించి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు రామయ్య కొట్లో రాణి అవ్వ సరుకులు కొనడానికి వెళ్లింది. ముసలవ్వ అరువుగా కొన్ని సరుకుల్ని ఇవ్వమంది. కోపంతో ఉన్న రామయ్య ముసలవ్వను వీధిలోకి తోసి, నలుగురి ఎదుట, "ఏమే, ముసలి పీనుగా! ఇది సత్రమనుకున్నావా? నీ యిష్టం వచ్చినప్పుడు సరుకులు ఇవ్వడానికి. ఇంతవరకు తీసికొన్న సరుకుల డబ్బులు ఇవ్వలేదు. ఇంతలోనే తిరిగి అప్పా? ఈ రోజు సాయంలోగా బాకీపైకం నాకు చేరాలి; లేదా నీ అంతు చూస్తాను" అంటూ పెద్దగా అరిచి అంగడిలోకి వెళ్లిపోయాడు. పాపం! ముసలవ్వ నలుగురెదుట అవమానపడి, ఇంటికి వెళ్లి జరిగినదంతా మానమరాలికి చెప్పి, పెద్దగా ఏడ్చింది. దాంతో రాణికి కోపం వచ్చింది. తన అవ్వను అవమానించినందుకు రామయ్యకు తగిన శాస్తి జరపాలనుకొంది. తన అవ్వను ఓదార్చి, పడుకోబెట్టి, రామయ్య లాటి బొమ్మను తయారుచెయ్యడం మొదలుబెట్టింది. మరునాడు ఉదయం రాణి రామయ్య బొమ్మతో వూరి వెలుపల వున్న వంతెన మీదనుంచి పోతూవుండగా, ఆమె స్నేహితురాలు చూసి, ఎక్కడికెళ్తున్నావని అడిగింది. రాణి సమాధానమీయకుండా, చేతిలోని రామయ్య బొమ్మను వంతెన మీదనుంచి నీటిలోకి విసిరింది. ఆ బొమ్మ నీటిలోపడి తేలుతూ, కొంత దూరం వెళ్లి మునిగిపోయింది. "ఇంక వారం రోజులలో రామయ్య గతి ఇంతే అవుతుంది" అని స్నేహితురాలితో రాణి చెప్పి అక్కడనుంచి వెళ్లిపోయింది.
మూడు రోజుల తరువాత రామయ్య కొన్ని సరుకులు తీసుకొని, వంతెన దాటుతూ వుంటే, వంతెన కూలిపోయి, రామయ్య సరుకులతో సహా నీళ్లలోపడి చనిపోయాడు. వంతెన కూలిపోయే శబ్దం విని, ప్రజలంతా అక్కడికి వచ్చి, రామయ్య శవాన్ని బయటకి లాగారు. రాణి స్నేహితురాలు రామయ్య శవాన్ని చూసి, "అరె! విచిత్రంగా వుందే! రాణి చెప్పినట్లు రామయ్య మరణించాడు. అతడు చనిపోతాడని ముందుగా రాణికి ఎలా తెలుసు?" అని మనసులో అనుకొంది. రాణి స్నేహితురాలి ద్వారా గ్రామంలోని వారికి ఈ విషయం తెలిసిపోయింది. అప్పటి నుంచి అందరికీ రాణి అంటే మర్యాద ఏర్పడింది. ఆమె జోలికి ఎవ్వరూ పోయేవారు కాదు. ఒక రోజు రాణి కొన్ని బొమ్మలతో ఆ గ్రామాధికారి యింటిముందు కూర్చుని ఆడుకొంటూ వుండగా, ఇంట్లో నుంచి గ్రామాధికారి బయటకి వచ్చి, రాణిని బాగా తిట్టాడు. రాణి బొమ్మలను తీసుకొని కోపంతో ఇంటికి వెళ్లిపోయింది. సాయంత్రం రాణి గ్రామాధికారి బొమ్మ మెడకు దారం కట్టి వీధుల గుండా తిరగసాగింది. అందరూ మనస్సులో గ్రామాధికారికి సానుభూతులు తెలుపుకున్నారు. మరునాడు గ్రామాధికారి యింట్లో ఉరి వేసికొని చనిపోయి వున్నాడు. ప్రజలు కొందరు అతని యింటిని పరిశోధించి, అతను ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను డబ్బులు ఖర్చు పెట్టేసి, తిరిగి ప్రభుత్వానికి డబ్బు యివ్వడానికి తన దగ్గర లేనందున, తనంత తానుగా ఉరివేసికొని చనిపోయాడని తెలుసుకొన్నారు. ప్రజలందరికీ రాణి అంటే యింకా భయం ఎక్కువైంది. నిజానికి గ్రామాధికారి తనంత తానుగా ఉరివేసుకొని చనిపోయాడా, లేక రాణి చేసిన మంత్రపు బొమ్మ ద్వారా చనిపోయాడా? అన్నదే వారి ప్రశ్న! ఒకరోజు రాణి అవ్వకు జబ్బు చేసింది. వైద్యుడు ఆమెను పరిశీలించి, ఇంక ఆమె కొన్ని వారాలు మాత్రం బ్రతకగలదని చెప్పి వెళ్లిపోయాడు. ముసలవ్వ రాణిని పిలిచి, "అమ్మాయీ! ఈ బాధతో నేను కొన్ని వారాలు ఎలా వుండగలను? దయచేసి నన్ను చంపేయి. అప్పుడైనా నాకు ఈ బాధ తప్పుతుంది" అని ఏడుస్తూ చెప్పింది.
"ఏడవకు అవ్వా! నిన్ను ఈ బాధనుండి విముక్తురాల్ని గావిస్తాను. నా చేతనైన సహాయం చేస్తా" నంటూ రాణి అక్కడనుంచి వెళ్లిపోయింది. మరునాడు రాణి చేతిలో ముసలవ్వ బొమ్మవుండడం చూసి, గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కొందరు ఆమెను వెంబడించారు. రాణి శ్మశానంలోకి వెళ్లి, ఒక చోట మన్నును తవ్వి, అందులో ముసలవ్వ బొమ్మ నుంచి పైన మన్నుపోసి తిరిగి వచ్చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు ముసలవ్వ చనిపోయింది. దాంతో ప్రజలందరికీ రాణి మీద కోపం వచ్చింది. రాణి బొమ్మలు చేసి, ప్రజల్ని చంపడం చూసి, ఆమెలో ఏదో దయ్యం ఆవరించి వుంటుందని అనుమానపడ్డారు. ఎలాగైనా రాణిని చంపేయాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరు ముసలవ్వలు ప్రజల ముందుకు వచ్చి, "మేం ఎలాగైనా, రాణిని అంతం చేయగలం. అప్పుడు మనకు రాణి భయం ఉండదు" అన్నారు. "మా వల్ల సాధ్యంకాని పనిని మీరు చేయగలరా?" అని ప్రశ్నించారు. "రాణి చేతిలో బొమ్మలు చేసే శక్తి వుంది. దాని ద్వారానే రాణి ప్రజల్ని బొమ్మల ద్వారా చంపుతూ వుంది. ఆ శక్తిని నాశనం చేసామంటే, మనకు రాణి బాధ తప్పుతుంది" అంటూ దగ్గరలో వున్న అంగడిలో బొమ్మను చేయటానికి కావలసిన సామానులు తీసుకొని రాణి యింటికి వెళ్ళారు. రాణి యింట్లో బొమ్మలు చేస్తూ వుంది. ముసలవ్వలు రాణిని చూసి, "అమ్మాయీ! నీవు బొమ్మలు చేయడంలో నేర్పరివి కదా! నీవు, ఎప్పుడూ అందరి బొమ్మలు చేస్తూ వుంటావు గదా! నీ బొమ్మను ఇంతవరకు నీవు చేయలేదే అది నీ వల్ల వీలు కాదా?" అని అడిగారు. "ఎందుకు వీలుకాదు? నా బొమ్మను చేయడం నాకు చాలా తేలిక" అని చెప్పింది.
ముసలవ్వలు సామానులు రాణికిచ్చి, అయితే నీ బొమ్మను మా ఎదురుగా చేయి, చూస్తాము" అని అన్నారు. రాణి తన బొమ్మను చేయడం మొదలు పెట్టింది. వాళ్ళిద్దరూ చూస్తున్నంతలోనే బొమ్మను తయారుచేసింది. ముసలవ్వలు ఆ బొమ్మను చేతిలోకి తీసుకుంటూ, "రాణీ! నీ బొమ్మ ఎంత బాగుంది? నీవు యింతకు మునుపు చేసిన బొమ్మలు తీసుకురా! అన్ని బొమ్మలు కలిపి చూస్తాం!" అని అన్నారు. రాణి మిగతా బొమ్మలు తీసుకు రావడానికి లోపలి వెళ్లింది. అదే సమయమని ముసలవ్వలిద్దరూ రాణి బొమ్మను తీసుకొని బయటికి పరిగెత్తారు. రాణి బొమ్మలతో తిరిగి వచ్చి ముసలవ్వలు లేకపోవడంతో వీధిలోకి వచ్చి చూసింది. దూరంలో ముసలవ్వలు పరిగెత్తడం కనిపించింది. "మోసం జరిగిపోయింది! వాళ్లు నా బొమ్మతో పారిపోతున్నారు. వాళ్లని వదలకూడదు" అని వారిని వెంబడించింది. ముసలవ్వలు యిద్దరూ రాణి బొమ్మతో దగ్గరలో వున్న కొండ ఎక్కేసారు. ఒక బండరాతిపై రాణి బొమ్మను పడుకోబెట్టి, రాళ్లను తీసుకొని ఆ బొమ్మను కొట్టసాగారు. కొంతసేపటికి ఆ బొమ్మ కొన్ని రాళ్ల మధ్య నలిగిపోయింది. అప్పటికి రాణి కొండ క్రిందికి వచ్చింది. ఉన్నట్టుండి కొండ క్రింద భాగం పగిలి, పెద్ద పెద్ద బండ రాళ్లు ఎగిరి రాణి మీద పడినవి. రాళ్లు పడడంతో రాణి అక్కడికక్కడే ప్రాణం వదిలింది. తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ చేరి రాణి శవాన్ని స్మశానంలో పూడ్చారు. అయినా, అప్పుడప్పుడూ రాణి ఆవిరి రూపంలో ప్రజలకు కనబడుతూ ఉంటుంది. తనకు మోసం గలిగించిన ఆ ముసలవ్వల్ని పట్టి పీడించి చంపివేసింది.
Comments
Post a Comment