చందమామ కథలు - పొన్న చెట్టు పుట్టుక

 

Telugu Chandamama Story of Sun god and the daughter of river god. Best Chandamama Telugu Stories to read.

ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది. అది భూలోకమంతా కలియచుట్టి, దయా దాక్షిణ్యమూ లేకుండా ప్రజలనూ పశువులనూ పొట్టను పెట్టుకుంటూ వుండేది. ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవాళ్లు. ఆ భయం చేత వాళ్లు ఊరిలో మసలటమే మానుకుని, తలుపులు బిగించి ఇళ్లల్లో కూచునేవాళ్లు. అలా వాళ్లు ఎంతకాలమని ఉండిపోగలరు? మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతయి? ప్రపంచం ఎలా నడుస్తుంది? నిజానికి ఇప్పుడు, బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలందున్నటం లేదు. తోటమాలి మొక్కలు తడపడం లేదు. అందుచేత, ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినయి. ఈ విధంగా, భూలోకంలో ప్రజలు నానా బాధలూ పడటం చూచి, సూర్య మహారాజుకి జాలివేసింది. ఏడు గుర్రాల రథం పైన అయన రోజూ వచ్చేటప్పుడూ వెళ్లేటప్పుడూ ప్రజల కష్టాలు కళ్లారా చూచి, "అయ్యో పాపం!" అనుకుంటూ ఉండేవాడు. ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి, వాళ్ళకు ఉపకారం చేయాలని సూర్య మహారాజుకి మనస్సులో గట్టి నిశ్చయం కలిగింది. మరునాడు మహారాజు, వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తళతళ మెరిసేటట్టుగా దానికి సానబెట్టాడు. తన బాణమూ, అమ్ములపొదీ చేత పట్టాడు. "ఈ వేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి, భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి" అని తను చేసికొన్న నిశ్చయం ప్రకారం ఆచరించటానికి పూనుకొన్నాడు. 

సూర్యమహారాజు తన ఏడుగుర్రాల రథంపయిన భూలోకానికి దిగి వచ్చి, ఆ రాక్షసికి గురి పెట్టి  ఒక్క బాణం వదిలాడు. ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా? మహారాజు మీదకు రంకెలు వేసికొంటూ 'మింగేస్తా' నని వచ్చింది. మహారాజుకూ బ్రహ్మరాక్షసికి చాలసేపు గొప్ప యుద్ధం జరిగింది. తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి, ఆయనకు చాలా కష్టం కలిగించింది. బాణాలతో కొట్టికొట్టి, లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు. ఒక్క వేటు వేసేసరికల్లా, బ్రహ్మరాక్షసి తలా, మొండెమూ దేనికది విడిపోయి, నేలపైన దొరలటం ప్రారంభించాయి! మహారాజుకి ఈ యుద్ధంవల్ల చాలా అలసట కలిగింది. కాని, అయన దయవల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది. అప్పుడు సూర్యమహారాజు, రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోటానికని, భూలోకంలో ఒక నది గట్టున షికారుగా నడిచి వెళుతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి, ఆయనకు అపురూపమైన అందముగల ఒక కన్య కంటపడింది. "ఆహా! ఈ పిల్ల ఎంత సుందరముగా వున్నది! ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండునుకదా!!" అని అనుకొని మనస్సులో ఉబలాటపడ్డాడు. ఈ ఉత్సాహంతో, రెప్ప వాల్పకుండా ఆమెవేపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు. ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ, దగ్గరగా చేరి, "చిన్నదానా! నేనెవరినో తెలుసునా? ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజుని. నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది. ఆ ప్రత్యేకలోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది. కోట తలుపులు తీయటానికీ మూయడానికీ దేవకన్యలున్నారు. రోజూ నేను స్వారీచేయటానికి ఏడు గుర్రాల రథమున్నది. మరి, నాతో వచ్చేసి, నాకు రాణిగా ఉన్నావంటే నువు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు. వస్తావా మరి?" అని అడిగాడు. 

ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు. ఇంతవరకూ ఆమె పర పురుషునితో మాటాడి ఎరుగదు. పైగా, తల్లిదండ్రులను కానీ, తనుండే ఇల్లుగానీ వదిలి ఎక్కడకూ వెళ్లి ఉండలేదు. ఆమెకు తండ్రే దైవం. నది గట్టున గుహలో వుండే ఆ ఇల్లే ఇంద్రలోకం. ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు, కుందేళ్లు, పక్షులూ ఉన్నాయి. దండలు గుచ్చుకోడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి. అందుచేత, మహారాజు వేసిన ప్రశ్నకు అవుననీ, కాదనీ సమాధానం చెప్పక, ఊరుకొన్నది. సూర్యమహారాజు "నన్ను పెళ్లాడవలసింది. నాకు రాణిగా ఉండవలసింది." అని ఆ కన్యను ఎన్నో విధాలా బతిమాలాడు. కాని, ఆమె బదులు చెప్పలేక పారిపోయింది. మహారాజు పెద్దవాడూ, బలమయినవాడూ గనక, వెంబడించి ఆమెను కలుసుకున్నాడు. "చిన్నదానా! ఎందుకు పారిపోతావు? నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను ప్రాణసమానంగా చూచుకొంటాను. నువు కోరినవన్నీ ఇస్తాను. నాతో వచ్చేసి, నాకు రాణిగా ఉండు," అంటూ మళ్లీ ఆమెను బుజ్జగించి చెప్పాడు. ఎన్నిచెప్పినా లొంగక, సిగ్గుచేత ఆమె మళ్లీ తప్పించుకు పారిపోయింది. ఏమైనా సరేనని, మహారాజూ పట్టు వదలలేదు. ఈసారి అయన మరింత వడిగా వెంబడించి, పట్టుకో బోయేసరికి, ఆమె భయపడిపోయి "నాన్నా! నాన్నా!!" అని పెద్దగా కేకవేసింది.

దూరాన వున్న ఆమె తండ్రి నదిరాజుకి ఈ కేక వినపడటంతోనే కూతురుకు ఏదో ప్రమాదం సంభవించి వుంటుందనుకొని, అనుమానపడ్డాడు. మానవరూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు. అందులోనూ, రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే వుంటారు, అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్నచెట్టుగా మార్చివేశాడు. ఆమె నిలబడ్డపాటున పొన్నచెట్టుగా మారిపోవటం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య, చూస్తూవుండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది. "సరే, గడచినదానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది? నీవు నాకు రాణివయి, నన్ను సంతోషపెట్టుతావని ఆశించాను. కాని కర్మవశంచేత నువు చెట్టువయిపోయినావు. అయినా, నీపయిన నాకు ప్రేమ ఎంతమాత్రమూ తగ్గలేదు. నేను ఆకాశం మీద ఉన్నంతకాలమూ నువు భూమిపయిన జీవించి ఉండవలిసిందే. నా వరం చేత నీ ఆకులు వాడిపోక, ఎల్లప్పుడూ పచ్చగా వుంటాయి. మొదట రాణిగా చేసుకొని నిన్ను కోటలో పెట్టుకుందామనుకొన్నాను. ఇప్పుడు చెట్టుగా వున్న నిన్ను, మక్కువతో నా నెత్తిమీదనే పెట్టుకుంటాను," అని సూర్యమహారాజు ఆ క్షణంనించీ పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూవున్నాడు!


Comments