విదిశాపట్టణం ఆనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుఱ్ఱవాడు చనిపోయాడు. ఆ పిలవాడి తల్లిదండ్రులూ, బంధువులూ ఆ శవాన్ని తీసుకుని ఊరు అవతల ఉన్న శ్మశానానికి చేర్చి, దాన్ని ఒకచోట దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం, మరి కాస్సేపటికి ప్రొద్దు గుంకి చీకటి పడుతుంది. అప్పుడు శ్మశానంలో ఉన్న రాంబందు ఒకటి వారి దగ్గిర వాలి, ఆ శవాన్ని చూసి కంట తడి పెట్టుకుంది. "అయ్యో, రత్నం లాంటి కుఱ్ఱవాడు! ఇలాంటి కుఱ్ఱవాడు చనిపోయాడూ అంటే నాకే ఏడుపు వస్తోంది. పైదానినైన నాకే ఇంత దుఃఖం వస్తోంటే కడుపున కన్న వాళ్ళూ పెంచిన వాళ్ళూ ఐన మీకు దుఃఖం రాదా? వస్తుంది. కాని యేడ్చి యేమి లాభం? ఎంత యేడ్చినా, గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికిరాడు కదా? అంచేత గుండె రాయిచేసుకుని శవాన్నిక్కడ వదిలేసి మీ దారిని మీరు వెళ్లిపొ౦డి. ఏమంటే ప్రొద్దు గ్రుంకుతోంది. ఇది వల్లకాడు గాని ఊరు కాదు గదా? చీకటిపడితే ఇక్కడికి దయ్యాలూ, భూతాలూ వచ్చి, బ్రతికి ఉన్నవాళ్ళని కూడా పీక్కు తింటాయి అంది. ఈ మాటలు వినేటప్పటికి వాళ్ళకి నిజమే అని తోచి, శవాన్నక్కడ వదిలేసి వెడదామని బయల్దేరారు. వాళ్ళు తిరుగుమొహాలు పెట్టేటప్పటికి నక్క ఒకటి ఒక బొరియలోనుంచి వచ్చి, వాళ్ళకెదురై, "ఇదేమిటి ? వచ్చి ఒక ఘడియ ఐనా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి? పున్నమ చంద్రుడిలాంటి పిల్లవాణ్ణి వదిలేసి వెళ్ళటానికి మీకు కాళ్ళెలా వచ్చాయి ? "చచ్చిపోయినాడుగదా అని వదిలేసి పోతున్నారేగాని, మీ అదృష్టం బాగుండి, కుఱ్ఱవాడు మళ్లీ బ్రతక్కూడదా? ఇంతకూ ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి ? అక్కడైనా ఏడుపేగా? ఆ యేడుపేదో ఇక్కడే ఏడవండి" అంది.
కుఱ్ఱవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికి వాళ్ళందరికీ ఆశ కలిగి, వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్లు అలాగ ఆగిపోవడం చూచి రాంబందు "ఎంత చోద్యంగా మాటాడుతోందీ, ఈ నక్క ? అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది. అలాంటిదింకా ఈ పిల్ల వాడు బ్రతకటం ఏమిటి ? చచ్చినవాళ్ళు తిరిగి బ్రతికిరావటం ఎన్నడైనా విన్నామా? నేను శతవృద్ధుని. నా మాట వినాలి కాని, నిన్నగాక మొన్న పుట్టిన యీ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూచుంటే ఏమి లాభం ? వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి ; వెళ్ళండి ; ఇక్కడ కూచోడమెందుకు?" అని తొందర పెట్టింది. ఈ మాటలూ ఔననిపించి వాళ్ళు లేచి పోబోయారు కాని మళ్లీ నక్క ఎదురువచ్చి " ఏళ్ళు వచ్చినంత మాత్రాన్ని రాంబందు బుద్ధిశాలి అనటానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధమన్నమాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. "చచ్చినవాళ్ళు బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా?" అని కదూ అంది? పూర్వకాలంలో సావిత్రి భర్తయైన సత్యవంతుడు బ్రతికి రాలేదా ? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాముకరిచి చనిపోయిన వాడే మళ్ళీ జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు. కనుక మీరు కాస్సేపు ఉండండి.
దయ్యాలూ, భూతాలూ మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాంబందు మిమ్మల్ని భయపెడుతోందేగాని, ధైర్యవంతుల్ని దయ్యాలేమీ చెయ్యలేవు. భూతనాధుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చెయ్యండి. ఆ ప్రార్థన వల్ల భూతాలేమీ మీదగ్గరకు రావు సరికదా, శివునికి మీ మీద దయపుట్టి మీ కుఱ్ఱవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను?" అంది. మామూలుగా ఉన్నవాళ్ళకి బుద్ధి పనిచేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పనిచెయ్యదు. రాంబందు వెళ్ళమంటే లేచీ, నక్క వద్దంటే ఆగిపోయారే గాని, ఆ శవం యొక్క బంధువులు ఏమాటలు నిజమో ఆలోచించుకో లేకపోయారు. ఆ రాంబందూ నక్కా ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెప్పుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఆ రాంబందుకు గాని ఈ నక్కకి గాని పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు. అవి రెండూ కూడా అలా కల్లబొల్లి దుఃఖాన్ని వొలకబోస్తూ మాట్లాడాయేకాని, మనస్సులలో ఆ రెంటికీ కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది. ఏమంటే రాంబందూ, నక్కాకూడా శవాన్ని పీక్కుతిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఆ రాంబందూ నక్కా కూడా అక్కడికి చేరినై. ఎటోచ్చీ ఆ శవం నక్కకి దొరక్కుండా తనే తినెయ్యాలని రాంబందు ఆలోచించింది. తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసిపోవాలి. రాంబందు అన్ని పక్షులకు మల్లేనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకి తన గూటికి చేరుకుంటుంది. ఆ లోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి, వాళ్ళని పంపించి వేయటం కోసం, గోదానమనీ, భూదానమనీ, స్వర్గలోకమనీ పెద్ద కబుర్లన్నీ చెప్పింది.
అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క. రాంబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది. నక్కకు పట్టుకున్న యావ యేమిటంటే, చీకటిపడితేనే గాని ఆ శవం దానికి దక్కదు. ఆలోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాంబందు దాన్ని కొంచెం గూడా మిగలకుండా పీక్కు తినేస్తుంది. అ౦చేత చీకటిపడేవరకూ ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాంబందు పొద్దుకూకింది గదా అని ప్రాణం విసిగి, చక్కాపోతుంది. అప్పుడు బంధువులకు మెల్లిగా నచ్చజెప్పి పంపివేసి, పిల్లవాని శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాంబందూ, నక్కా తమతమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతోంటే ప్రొద్దుగ్రుంకింది. బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాటు ప్రార్థన చేసి చూద్దామని, "వందే శంభు, ఉమాపతిం, సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం..." అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం మొదలెట్టేరు. ఇంక రాంబందు వాళ్ళెలాగా చీకటి పడ్డాక గాని వెళ్ళరనీ, ఆ శవం తనకెలాగా తక్కదనీ నిశ్చయం చేసుకుని, తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనస్సులో శాపనార్థాలు పెడుతో ఎగిరిపోవడానికి సిద్ధపడింది. ఇంతలో చీకటిపడ్డంతోనే శ్మశానం గనక, అక్కడ విహరించటం కోసం ఈశ్వరుడు శాకినీ ఢాకినీ భూత పిశాచాలతో చక్కావచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించి, ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై, "ఏంకావాలి మీకు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు?" అన్నాడు.
అప్పుడు వారందరూ బ్రహ్మానందభరితులై "స్వామీ, ఈ పిల్లవాణ్ణి బ్రతికించు" మని ప్రార్థించారు. శివుడు, "సరే" అని, ఆ కుఱ్ఱవాడిని బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచినవాడికి మల్లే ఆవులిస్తో "ఏమర్రా, ఇక్కడి కొచ్చారేమిటి?" అన్నాడు. గూటికి ఎగిరిపోదా మనుకుంటూన్న రాబందు జరిగినదంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకూ "ఇంక శవం నాకే దక్కింది" అని సంతోషిస్తో కూచున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుఱ్ఱవాడు లేచి కూచోటంతోనే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి, "ఇదేమిటి? నీసలహా ప్రకారం మేం ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాణ్ణి మళ్లీ బ్రతికించాడు. ఆయన్ని తిడుతున్నావేమిటి?" అని అశ్చర్యంగా నక్కను ఆడిగారు. అప్పుడు నక్క "ఆ పిల్లవాణ్ణి బ్రతికించమని నేనేడిశానా ? ఈ శవాన్ని పీక్కు తినొచ్చు ఎంచక్క" అని నేను కనిపెట్టుకుంటే మధ్య ఈయన ప్రత్యక్షమై వీణ్ణి బ్రతికించి, నా నోట్లో బెడ్డకొట్టేశాడు" అని యేడవటం మొదలెట్టింది. రాంబందు దిగివచ్చి సంగతంతా చెప్పి, "స్వామీ, నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది. దీని ఆహారాన్ని నువ్వుపడగొట్టేశావు! ఇది న్యాయమే" అంది. "కడుపు కోసమే కదా, యివి ఇంత కక్కుర్తి పడ్డాయని శివుడు జాలిదలచి, నక్కకీ, రాంబందుకీ కూడా అప్పట్నించీ ఆకలీ దప్పే ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు. బంధువులు బాలుడితో యింటికి చేరుకుని, శ్మశానంలో జరిగినదంతా పదేపదే ఆశ్చర్యంగా చెప్పుకుంటో రాత్రి గడిపారు.
Comments
Post a Comment