పూర్వకాలమందు కళ్యాణపురమనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక కొండపైన కట్టబడింది. కొండదిగువను అందమైన కొలను ఉన్నది. ఆ కొలను దగ్గర రేబాలుడనే పిల్లవాడూ, అతని తల్లీ నివసిస్తూ ఉండేవారు. వీళ్లు తప్ప, ఆ కొలను దగ్గర మరెవరూ ఉండేవారు కారు. రేబాలుడు కళ్యాణపురంలో ఉండే గ్రామస్థుల పశువులను కొలను వద్దకు తీసుకవచ్చి, మేపుతూ ఉండేవాడు. ఒక రోజున రేబాలునికి ఒక చిత్రం కంటపడింది. రాక్షసరూపాలతో కొన్ని ఎద్దులు కొండపైన మైదానంలోకి ఎక్కిపోతున్నయి. ఆ వింత ఎద్దులను ఒక హంస తోలుతున్నది. అతను అలా చూస్తూ ఉండగానే ఆ హంస ఒక చక్కని కన్యగా మారిపోయింది! ఆమె రేబాలునివద్దకు వచ్చి, అతని చేతిలో ఒక రొట్టెముక్క పెట్టి, "దీనిని తీసుకొని తినవలసింది" అని చెప్పి, అదృశ్యమైపోయింది. మరుక్షణంలో ఆ వింత ఎద్దులు కూడా మాయమైపోయినయి. ఇంటికిపోయి, ఈ చిత్రాలన్నీ రేబాలుడు తల్లితో పూసగుచ్చినట్టు చెప్పి, ఎలాగైనా ఆ కన్యను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇది చూచి అతని తల్లి, "అబ్బీ, ఆ కన్య ఎవరో కూడా మనకు తెలియదాయె. అయినా, యిలాంటి వింతలు చెయ్యగల ఆ పిల్ల ఎవరో దేవకన్య అయివుంటుంది కాని మానవకన్య కాదు. ఆ పిల్లకూ నీకూ పెళ్లి ఎలా కుదురుతుంది? నా మాట విని ఆ ఆలోచన మానుకో" అని నచ్చజెప్పింది. తల్లి ఎంత బోధించినా, రేబాలునికి ఆమె మాటలు రుచించలేదు. అతను అదే పనిగా ఆమె కోసం నిరీక్షిస్తూ వున్నాడు. ఇలా వుండగా, ఒక పున్నమి రోజున కొండ ఒడ్డునించి కొలనులో ఏదో తన వేపు కొట్టుకు వస్తూ వున్నట్టు రేబాలునికి కనపడింది.
చేరువకు రాగానే అది ఒక రొట్టెముక్క అని రేబాలుడు గ్రహించాడు. దానిని చూడగానే అతనికి ఆ కన్య గుర్తుకి వచ్చి, ఆ రొట్టెముక్కను తినివేశాడు. రేబాలుడు రొట్టెముక్క తిన్నవెంటనే, కొలనులో శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏమిటా అని చూచేవరకు అవి మునుపు అతను చూచిన వింత ఎద్దులు! ఎద్దుల వెనుక ఒక బంగారపు చిన్ని పడవ కనపడింది. పడవ ఒడ్డుకి రాగానే, అందులోనించి తాను ప్రేమించిన సరోవరకన్య దిగివచ్చింది. అప్పుడు రేబాలుడు తన మనసులో కోరిక ఆమెతో చెప్పేవరకు, ఆమె "రేబాలుడా! నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు సమ్మతమే. ఐతే, నీవు మానవుడవు, నేను దేవకన్యను. కాని, ఒక షరతుకు ఒప్పుకొన్నట్టయితే నీ కోరిక నెరవేరుస్తాను" అన్నది. రేబాలుడు "సుందరీ! నీవు ఎటువంటి కఠినమైన షరతు పెట్టినాసరే నాకు అంగీకారమే. అదేమిటో చెప్పు" అన్నాడు. "పెళ్లి అయిన తరువాత కూడా నీవు నాపైన ఇంతటి మక్కువతోనూ ఉండాలి సుమా. ఎప్పుడైనా నన్ను ఉదాసీనంతో చూచి కోపగించుకొన్న పక్షమందు, మూడు తడవల వరకూ ఊరుకుంటాను. మూడవసారి నీ కంటికి అగపడకుండా పోతాను. ఇదే షరతు" అని సరోవరకన్య అన్నది. "అలా ఎన్నడూ జరగదు" అని రేబాలుడు ఆమె పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు. తన షరతుకు రేబాలుడు ఒప్పుకోగానే ఆమె మానవరూపం ధరించి గాంధర్వ విధానంతో అతనిని అక్కడే పెళ్లిచేసుకొంది. తర్వాత రేబాలుడు ఆమెతో సహా యింటికి తిరిగివచ్చాడు. రేబాలుని తల్లి కూడా చాల సంతోషించింది.
సరోవరకన్యకు కోకొల్లలుగా పశుధనమున్నది. ఆమెకు ఆ కొండమీద ఎన్నో గోభూములున్నాయి. పెళ్లి కావడంతోనే తన పశువులన్నిటినీ ఆమె భూలోకానికి తోలుకువచ్చింది. వీటిని రేబాలుడు కొండ పైకి తీసుకుపోయి మేపుతూ ఉండేవాడు. కొద్దికాలానికే వారికి లక్షణమైన కొడుకులూ, అందమైన కుమార్తెలూ పుట్టారు. అంతా హాయిగా వుంటున్నారు. ఇలావుండగా ఒకనాడు, వారు దేవదర్శనం కోసమని గుడిలోకి వెళ్ళారు. ఆ రోజు పర్వదినం కావడంచేత జనసమ్మర్దం ఎక్కువగా వున్నది. రేబాలునికి పొలం పని మీద దృష్టిపోయింది. కనుక, "మరొకప్పుడు రావచ్చు, పోదాం" అన్నాడు. "అదేం మాట, దర్శనం చేసికొనకుండా పోవడమా?" అన్నది అతని భార్య. "వస్తేరా, లేకుంటే ఇక్కడనే ఉండిపో" అంటూ అతను కోపగించాడు. అప్పుడు ఆమె, భర్తకు పెళ్లినాటిమాట జ్ఞాపకంచేసి, "షరతు తప్పడం ఇది మొదటిసారి" అని అతనిని హెచ్చరించింది. రేబాలుడు తన పొరపాటు ఒప్పుకొనక తప్పింది కాదు. కొంతకాలం హాయిగా గడచిపోయింది. ఇంతలో రేబాలుని పొరుగున వుండే ఒక స్నేహితుడు చనిపోవడం చేత, ఆ యింటికి వారు పరామర్శకు పోవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన వారందరూ విచారంలో మునిగివుండడం చూచి సరోవరకన్య పకపక నవ్వడం మొదలెట్టింది. తనలో దేవత్వం ఉండటంచేత ఆ చనిపోయినవాని నిజస్థితి ఆమె ఒక్కతెకు మాత్రమే గోచరించింది. ఆ చనిపోయిన వాడు ఇప్పటివరకు ఎన్నో బాధలు పడి, మరణించిన తరువాత స్వర్గానికిపోయి సుఖంగా వున్నాడు.
"సుఖంగా ఉన్న ప్రాణిని చూచి ఈ అమాయకులందరూ ఎందుకు ఇలా దుఃఖిస్తారా" అని ఆమెకు నవ్వు వచ్చింది. ఇది చూచి రేబాలుడు, తన భార్యపెట్టిన షరతు మరచి, "పిల్లవాడు చచ్చి వాళ్లు ఏడుస్తుంటే నీకు నవ్వుగా ఉందా?" అని ఆమెపై కోపగించాడు. అప్పుడు సరోవరకన్య అతనితో "రెండవసారి షరతు తప్పిపోయావు. జ్ఞాపకముంచుకో" అని హెచ్చరించింది. అతను జరిగినదానికి విచారించి, ఇకముందు జాగర్తగా నడుచుకొంటానని తన నిశ్చయాన్ని తెలిపాడు. ఈ మాట అన్నాడే కాని, అతను సంసార సౌఖ్యంలోపడి, ఈ గొడవే మరచిపోయాడు. కొన్నాళ్ళు పోయినతరువాత ఒక రోజున వారు ఒక పెళ్ళికి వెళ్ళవలసివచ్చింది. పెళ్ళికి వచ్చిన అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవతాంశ కలది గనుక, సరోవరకన్యకు మాత్రం ఈ పెళ్లి అవుతున్న వధువూ, వరుడూ త్వరలోనే కష్టాలలో మునిగిపోతారనే రహస్యం తెలుసు. అందుచేత ఆమె వారి దుస్థితిని తలచుకొని, ఎడతెగని విచారంతో ఏడుస్తూ కూర్చుంది. రేబాలుడు వచ్చి ఊరడించబోయాడు. కాని ఆమె దుఃఖం తగ్గలేదు. చివరకు అతనికి విసుగెత్తి "ఛీ! శుభమా అని వాళ్లు పెళ్లిచేసుకొంటూ వుంటే, అర్థంలేని ఈ యేడుపేమిటి?" అని కోపగించుకొన్నాడు. అప్పుడామె భర్తతో, "ఇది మూడోసారి నువ్వు నాపైన కోపగించుకోవడం. నేను పెట్టిన షరతు తప్పావు కనుక నేను వదిలిపోతున్నాను" అని చెప్పి తక్షణమే ఆమె తన పూర్వపు రూపాన్ని పొంది ఒక్కసారిగా మాయమైంది. ఆమెను ఎలాగైనా పట్టవలెననే ఆశతో రేబాలుడు కొలను వద్దకు ఆత్రంతో పరుగెత్తాడు.
ఆమె కనపడలేదు. సూర్యుడు అస్తమించేవరకు అతనలా కనిపెట్టుకొనివున్నా ఆమెజాడ తెలియనేలేదు. నెలలు గడచినై, సంవత్సరాలు గడిచినై. ఎంతకాలమో రేబాలుడూ, అతని కొడుకులూ కూతుళ్లూ ఆ కొలను వద్ద విచారంతో రాత్రింబగళ్లు నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ పిల్లలకు ఒకరాత్రి సరోవరకన్య తన నిజరూపంలో కనిపించింది. ప్రేమతో ఆమె తన బిడ్డలను చేరదీసుకొని, దీవించింది. కుమార్తెలతో "అమ్మలూ! మీరు మన పశువులను కొండమీదికి తోలుకుపోయి మేపుతూ, నాయనగారికి సాయపడండి" అని హితవు చెప్పింది. కుమారులిద్దరనూ పిలిచి "నాయనా! నా కడుపున పుట్టిన మీరు ప్రయోజకులై శాశ్వతమైన కీర్తిని గడించాలి. మీరు మానవుల వ్యాధులను కుదర్చటానికి నడుము కట్టండి. మీరు కొలనువద్దనున్న కొండ ఎక్కి, నన్ను తలచుకొన్నట్టయితే, నేను అదృశ్యరూపంతో మీ వద్దకు వచ్చి, మహిమ గల మూలికలన్నీ ఆనవాలు చూపిస్తాను. నా దీవెన వల్ల మీకు వైద్యశాస్త్రం సహజసిద్ధంగా అబ్బిపోతుంది. ఆ శాస్త్ర ప్రకారం మీరు కనిపెట్టిన మూలికలను ప్రయోగించితే ఎంత ప్రమాదమైన జబ్బు అయినా యిట్టే నయమవుతుంది. పంచభూతములు ఉన్నంతకాలమూ మీ పేరు శాశ్వతంగా నిలిచి పోతుంది" అని చెప్పి అంతర్థానమైపోయింది. వారు ఈ వింతలన్నీ తండ్రికి వినిపించేవరకు, అతను కూడ చాల సంతోషించాడు. మరునాటినించీ పిల్లవాళ్ళు ఇద్దరూ కొండపైకిపోయి, తల్లి చలువవలన అమోఘమైన మూలికలు సేకరించుకు వచ్చి, మానవసేవ చేయడం ప్రారంభించారు.
Comments
Post a Comment