విక్రమ బేతాళ కథలు - ఫలించని యత్నం

Vikramarka answers betal about the true nature of king who can do anything to protect his throne. Best Vikram Betal Telugu story to read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, "రాజా, మానవులు దూరాలోచన లేకపోవటం చేత నిష్కారణంగా తాము యాతన పడి ఇతరులను యాతన పెడతారు. పూర్వం శతకేతుడి ప్రయాస లాగే నీది కూడా వ్యర్థ ప్రయాస అయిపోతుందేమో ఆలోచించావా? శ్రమ తెలియకుండా నీకు శతకేతుడి కథ చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: ఒకప్పుడు శూరమాగధ దేశపు రాజుకు శతకేతుడూ, వీరకేతుడూ అని ఇద్దరు కొడుకులుండేవారు. పెద్దరాజు పోయాక శతకేతుడు రాజయ్యాడు. నిజానికి వీరకేతుడికి రాజ్యార్హత లేదు. కానీ అతను చాలా పౌరుషవంతుడు; ఒక రాజుకు తల వంచే వాడు కాదు. అందుచేత వీరకేతుడు, తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్దిమంది అనుచరులతో శూరమాగధదేశాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయి, అశ్వకర్ణ మనే చిన్న దేశంలో రాజ్యం నెలకొల్పాడు.

వీరకేతుడి అనుచర వర్గంలో ప్రముఖులని చెప్ప దగినవారు ఆరుగురున్నారు. వారిలో గోవర్ధనాచార్యుడనే వాడొక డుండేవాడు. ఆయన వీరకేతుడికి యుద్ధ విద్యలన్నీ నేర్పిన గురువు. వీరకేతుడూ, అతని ఆరుగురు అనుచరులూ కలిసి అశ్వకర్ణంలో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు. రాజ్యం చిన్నదే అయినా వీరకేతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ, దేశాన్ని సుభిక్షమూ, శక్తివంతమూ చేశాడు. వీరకేతుడికి విజయకేతుడనే కొడుకుండేవాడు. ఆ కుర్రవాడు పసితనం నుంచీ వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ వచ్చాడు. అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యలు నేర్పించాడు. విజయకేతుడా విద్యలలో అసాధారణ కౌశలం కనబరిచి, పధ్నాలుగేళ్ల వయసులోనే ఆరితేరిన యోధులను ఎదుర్కోగల అస్త్రలాఘవం అలవరుచుకుని అందరికీ అద్భుతం కలిగించాడు. విజయకేతుడికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న సమయంలో ఇద్దరు రాక్షసులు అశ్వకర్ణ దేశపు శివార్ల పైన పడి, పంటలు పాడు చేస్తూ, పశువులను ఎత్తుకుపోతూ, అడ్డం వచ్చిన వారిని చంపుతూ, ఇళ్ళూ తోటలూ పాడుచేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది. రాజైన వీరకేతుడు వెంటనే కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని రాక్షసులను చంపటానికి బయలుదేరాడు. కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు రాక్షసులు కంట పడలేదు. వాళ్ళు ఎక్కడో కొండలలో దాక్కున్నారు. చేసేది లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. వెంటనే రాక్షసులు రాజ్యంలో మళ్ళీ ఆగడాలు సాగించారు.

విజయకేతుడి కొక ఆలోచన వచ్చింది. అతను తన గురువుతో, "ఎవరూ వెంట లేకుండా మీరూ నేనూ మాత్రమే బయలుదేరి వెళ్లి వెతికితే ఈ రాక్షసుల జాడ చిక్కకపోదు. వాళ్ళిద్దరినీ మన మిద్దరమూ చంపలేమా?" అన్నాడు. తన శిష్యుడన్న ఈ మాటకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు. ఆయన ఇప్పుడు వృద్ధుడైనప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉన్నది. వాళ్లిద్దరూ చెరొక కత్తీ నడుముకు తగిలించుకుని, చెరొక బల్లెమూ పట్టుకుని రాక్షసులను వెతుక్కుంటూ బయలుదేరారు. ఎంత తిరిగినా వారికి రాక్షసుల జాడ అంతు చిక్కలేదు. వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండల కేసి వెళ్లారు. రాజ్యానికీ కొండలకీ మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడవులూ, అందులో ఆటవికుల గ్రామాలూ ఉన్నాయి. అక్కడ ఉండే ఆటవికులు రాక్షసులకు సహాయం చేసేవారు కారనీ, ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారనీ గోవర్ధనుడు తెలుసుకున్నాడు. ఆటవికులు వాళ్లకు మరొక ఉపకారం చేశారు; విజయకేతుడూ, గోవర్ధనుడూ ధరించిన కత్తులు పరీక్షించి, "ఈ అవిటి కత్తులతో మీరు రాక్షసులను చంపగలరా? రాళ్లను సైతం చీల్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం. వాటితో రాక్షసుల పీడ వదిలించెయ్యండి," అన్నారు. వాళ్ళు తయారుచేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండల కేసి బయలుదేరారు.

ఒక చోట వారికి రాక్షసి అడుగుజాడలు కనిపించాయి. వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది. అందులోనే రాక్షసులు దాగి ఉంటారనుకుని వారు గుహ కేసి పోతుండగా, అందులో నుంచి ఒక రాక్షసుడు పెద్ద రాతి గద తీసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళ మీదికి వచ్చి, తన గదతో గోవర్ధనుడి తల పగలగొట్ట యత్నించాడు. గోవర్ధనుడు ఎంతో చాక చక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు. అదే సమయమనుకుని విజయకేతుడా రాక్షసుణ్ణి తన కత్తితో డొక్కలో పొడవబోతుండగా గుహలో నుంచి ఒక ఆడ రాక్షసి పరుగున వచ్చి, వెనక పాటున అతన్ని తీసుకుని గుహలోకి పారిపోసాగింది. గోవర్ధనుడది గమనించి, రాక్షసుడు తనను కొట్టబోయి నేల కేసి కొట్టిన గద మీద ఒక కాలు పెట్టి పైకి లేచి, తన కత్తితో రాక్షసుడి తల పగలేసి, పరిగెత్తుకుంటూ వెళ్లి, అదే కత్తితో ఆడ రాక్షసి వెన్నులో పొడిచేసాడు. ఈ విధంగా ఇద్దరు రాక్షసులూ ఒక క్షణంలో చచ్చారు. గురు శిష్యులిద్దరూ నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతనూ, ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్నీ ఎంతగానో పొగిడారు. ఇది జరిగిన కొద్ది కాలానికే వీరకేతుడు మరణించాడు. విజయకేతుడు రాజయ్యాడు.  

తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారందరి సహకారమూ పొందుతూ విజయకేతుడు తన చిన్న రాజ్యాన్ని వివేకంగా పాలిస్తూ, నూరామడల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు చేసుకున్నాడు. తన తమ్ముడి కొడుకు తన కన్న గొప్ప ప్రతిష్ఠ సంపాదించటం చూసి శూరమాగధ ప్రభువైన శతకేతుడు అసూయతో కుమిలిపోయాడు. ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో, "మీరు మాకు సామంతులై యుండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు. త్వరలో మీరు మాకు కప్పం చెల్లించనట్టయితే మీ పైన తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని శతకేత మహారాజు గారు మిమ్ములను హెచ్చరించమన్నారు," అని చెప్పాడు. "మేము స్వతంత్రులమనీ, ఎవరికీ సామంతులం కామనీ, ఆయనకు కప్పం కావలసి ఉంటే మా పెత్తండ్రిగారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందనీ చెప్పు," అని విజయకేతుడు దూతను పంపేశాడు. అతని సమాధానానికి మంత్రులందరూ హర్షించారు గానీ, శతకేతుడి అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును.  

అందుచేత శతకేతుడి సైన్యాలను నిరోధించటానికొక యుక్తి పన్నారు. శతకేతుడు తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వస్తూ, ఒక రాత్రి శిబిరాలలో మజిలీ చేసి ఉన్న సమయంలో, సాహసికులైన విజయకేతుడి యోధులు ఒక వంద మంది అర్థరాత్రి వేళ ఆ శిబిరం పై బడి, సేనను చెల్లాచెదురు చేసి, యుద్ధ యత్నాలకు విఘ్నం కలిగించారు. శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది. విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి, అక్కడ నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన ఐదుగురు యోధుల వెంట పంపించాడు. అయితే శతకేతుడి సైనికులు దారిలో మాటు వేసి, హఠాత్తుగా వారి పైబడి ఆ అయిదుగురు యోధులనూ, ధనాన్నీ కూడా పట్టుకున్నారు. దానితో విజయకేతుడి ఆట కట్టయిపోయింది. ఎందుకంటే ఇక అతను తన పెత్తండ్రిని యుక్తితో జయించే ఆశ లేదు. యుద్ధ తంత్రం నడపగల వీరులు అయిదుగురు ముందుగానే శత్రువుకు చిక్కిపోయారు. వారిలో అతని గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు. ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవటం అసంభవం. తాను పౌరుషం కొద్దీ యుద్ధం చేసి వీర మరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ మహావీరులైన తన యోధులు తన పెత్తండ్రి చేత మరణ శిక్ష పొందటం నిశ్చయం. అంతకన్నా తాను అవమానం పొంది అడవులు పట్టి పోవడమే ఎంతో మేలు. ఇలా అలోచించి విజయకేతుడు ఒక దూతను తన పెత్తండ్రి వద్దకు సంధి రాయబారం పంపాడు. 

అతని దూత వెళ్లి శతకేతుడితో, "మహారాజా, మీరు పట్టుకున్న అయిదుగురు యోధులనూ విడిచిపెట్టినట్టయితే అశ్వకర్ణ రాజ్యాన్ని మీ పరం చెయ్యటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు," అని చెప్పాడు. ఇలా సంధి చేసుకోవటానికి శతకేతుడు సమ్మతించాడు. విజయకేతుడు బంధవిముక్తులైన తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు. వారు కూడా అతని వెంట అరణ్యవాసం చెయ్యటానికి సిద్ధమయ్యారు. ఇది జరిగిన ఏడాది లోపల శతకేతువు మరణించాడు. ఆయనకు సంతానం లేని కారణం చేత శూరమాగధ సింహాసనమూ, అశ్వకర్ణ సింహాసనమూ విజయకేతుడికే సంక్రమించాయి. బేతాళుడీ కథ చెప్పి, "రాజా తనకు విజయకేతువు తప్ప మరొక వారసుడు లేడని తెలిసి కూడా శతకేతువు అతని పై ఎందుకు కత్తి కట్టాడు? కప్పం కట్టమని రాయబారం పంపటమూ, దండెత్తి రావడమూ మొదలైన వన్నీ వ్యర్థ ప్రయత్నాలే గదా? ఈ సందేహానికి తెలిసి కూడా సమాధానం చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "రాజరికం అన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించ దగినది, పెంపొందించుకోవలసినది. రాజ్యకాంక్ష బంధుత్వాన్ని లక్ష్యపెట్టదు. తన అనంతరం ఎవరు రాజవుతారన్న ఆలోచన ఏ రాజునూ బాధించదు. తన రాజరికానికి కన్న కొడుకే విఘ్నం తలపెట్టినా రాజు అయిన వాడు సహించడు. ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెత్తండ్రి జీవితాంతం వరకూ ఆయనకు సామంతుడుగా ఉండలేక, తన కన్న బలవంతుడైన వాణ్ణి కయ్యానికి ప్రేరేపించాడు, ఆయన పై దొంగ దెబ్బ కూడా తీశాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments