ఒక ఊరిలో ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు. పెద్దవాడు సూర్యవర్థనుడు, రెండవవాడు చంద్రవర్థనుడు, కడసారి వాడు బాలవర్థనుడు. తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడిచెట్టు మాత్రమే. అయితే, ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైంది. ఇప్పుడూ అప్పుడూ అనకుండా మున్నూట అరవైరోజులూ అది కాస్తూనే వుంటుంది. ముగ్గురు అన్నాదమ్ములలోనూ ఒక యిద్దరు ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుపోయి, ఊళ్ళో అమ్ముకు రావడం, మూడవవాడు చెట్టుకి కాపలా కాస్తూ పుండటం, ఇదీ వాళ్ళ ఏర్పాటు. ఒక రోజున చెట్టు కాపలా కాయడం బాలవర్థనుడి వంతు వచ్చింది. సూర్యవర్థనుడూ, చంద్రవర్థనుడూ కాయలు పట్టుకొని ఊళ్లోకి వెళ్లారు. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి, "నాయనా ! నాకు ఆకలీ దాహమూ అవుతున్నది. ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా?" అని అడిగాడు. అందుకు బాలవర్థనుడు, "తాతా! నాకు ఇద్దరు అన్నలున్నారు. వాళ్లిద్దరూ ఈ రోజున పళ్లు పంచుకొని వెళ్లిపోయారు. అందుచేత వాళ్ల కొమ్మలు తాకడానికి నాకు అధికారం లేదు. నా వాటాలో కొమ్మలు అవిగో. వాటిలో నీకు ఇష్టమొచ్చినన్ని పళ్లు తీసుకోవచ్చు అనే వరకు సన్యాసి, "సరే, అలాగే చేయ"మన్నాడు. అప్పుడు బాలవర్థనుడు చెట్టెక్కి నాలుగు పళ్లు కోసి, సన్యాసికి ఇచ్చాడు. అవి పుచ్చుకొని, సన్యాసి సంతోషంతో వెళ్లిపోయాడు. మరునాడు చెట్టు కాపలా కాయడం నూర్యవర్థనుడి వంతు. వృద్ధ సన్యాసి నూర్యవర్థనుడి వద్దకు వచ్చి, బాలవర్థనుణ్ణి అడిగినట్టే అడిగాడు.
సూర్యవర్థనుడు తన వంతు కాయలలో నాలుగు ఎంచి తీసి, నన్యాసికి భక్తితో సమర్పించాడు. సన్యాసి సంతోషించి వెళ్లిపోయాడు. మూడవరోజున చంద్రవర్థనుడు చెట్టు కాపలా కాయడానికి నిలిచిపోయాడు. వృద్ధ సన్యాసి ఇతని వద్దకు కూడా వచ్చి కాయ అడిగేవరకు చంద్రవర్థనుడు తన వంతు కాయలలో నాలుగు మంచి కాయలిచ్చి, సన్యాసిని సంతోషపెట్టాడు. కొంతకాలమైన తరవాత ఆ వృద్ధ సన్యాసి మళ్లీ అన్నదమ్ములు ముగ్గురనూ కలుసుకుని, "అబ్బాయిలూ ! నాతో రండి. చిత్రాలు చూపిస్తాను" అని చెప్పి, వెంటపెట్టుకు పోయాడు. కొంచెము దూరం పోయేవరకు, వారికి సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు సన్యాసి నూర్యవర్థనుడి వేపు తిరిగి, "నాయనా! ఈ సముద్రం నీ అధీనంలో ఉంచుతున్నాను. నీవు ఏమి కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది" అన్నాడు. "ఐతే, ఈ సముద్రంలో వుండే ఉప్పునీళ్లన్నీ తియ్యటి తెల్లటి క్షీరములుగా మారిపోవాలి" అని కోరుకునే వరకు, వెంటనే ఆ సముద్రం క్షీరసముద్రంగా మారిపోయింది. సూర్యవర్థనుడు ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నేయి తీసి, వ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ధనవంతుడై అక్కడనే నివాసం ఏర్పరుచుకున్నాడు. తరువాత సన్యాసి, తక్కిన ఇద్దరినీ వెంట బెట్టుకొని మళ్లీ బయల్దేరాడు. కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనబడింది. అందులో కొన్ని లక్షల పావురాల పిట్టలు గింజలు ఏరుకొని తింటున్నయి. సన్యాసి ఈసారి చంద్రవర్థనుడి వేపు తిరిగి, "నాయనా! ఈ మైదానము, పావురాలు నీ అధీనం చేస్తున్నాను. నీ మనస్సులో కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను" అన్నాడు. "అయితే, ఈ పావురాపిట్టలన్నీ గొఱ్ఱెలుగా మారిపోవాలి" అని కోరాడు చంద్రవర్థనుడు.
వెంటనే మైదానమంతా గొఱ్ఱెలతో నిండిపోయింది. చంద్రవర్థనుడు అక్కడనే స్థిరపడి, ఆ గొఱ్ఱెల ఉన్నితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి, ధనవంతుడయినాడు. పోతే, వృద్ధ సన్యాసి బాలవర్థనుణ్నితీసుకుని ముందుకు సాగిపోయాడు. పోగా పోగా ఒక చిన్న ఆలయమూ, అందులో దేవీ విగ్రహమూ కనబడినై. అక్కడ ఆగి, వృద్ధ సన్యాసి బాలవర్థనుడితో "అబ్బాయీ! ఈ గుడిలో ఉండే దేవిని తలుచుకుని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది" అని అనేవరకు, బాలవర్థనుడు "ఐతే స్వామీ! దాపరిక మెందుకు? నాకు ఒక్క ఈ కోరిక ఉన్నది. ఈ ఊరి పట్టపురాజు కూతురును పెళ్ళాడాలి" అన్నాడు. బాలవర్థనుడి కోరికకు సన్యాసి చిరునవ్వు నవ్వుకొని, "బలే ఘట్టివాడవేనోయి నాయనా!" అని ప్రేమతో వీపు తట్టి అతనిని తన వెంట రాజుగారి కోటకు తీసుకుపోయాడు. వృద్ధ సన్యాసీ, బాలవర్థనుడూ కలిసి వెళ్లేసరికే అక్కడ ఇద్దరు రాజకుమారులు తయారుగా కూర్చుని వున్నారు. అప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్థనుడు మూడవ వాడన్న మాట. రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు యువకులు పోటీగా కూర్చునే వరకు, రాజుకి ఆలోచన పాలుపోలేదు. ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి "మహానుభావా! మీరు సర్వజ్ఞులు, మా క్షేమం కోరినవారు. కనుక, వివాహ విషయంలో మీకు తోచినట్టు నిశ్చయించండి" అన్నారు.
అప్పుడు వృద్ధ సన్యాసి "మూడు గులాబీ మొక్కలు తెప్పించి, ముగ్గురు యువకుల పేర్లూ వాటి పైన రాయించి, రాజకుమారిని స్వయంగా అందరి ఎదుటా నాటమనండి. అందులో ఏ మొక్క, రేపు ఉదయానికల్లా పూస్తుందో, ఆ యువకుణ్ని ఆమె వరించినట్టే నిశ్చయం" అని చెప్పాడు. అందరూ ఈ ఏర్పాటు బాగున్నదన్నారు. అందరి ఎదటా రాజకుమారి మూడు మొక్కలూ నాటింది. సన్యాసి మహిమ వల్ల బాలవర్థనుడి పేరు రాసిన మొక్క మాత్రం మరునాటికల్లా చక్కటి పువ్వు పూసింది. తక్కిన రెండు మొక్కలు నాటినవి నాటినట్టే ఉన్నయి. కనుక, రాజుకుమారికీ బాలవర్థనుడికీ అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ దేశాచార ప్రకారం అడవిలో ఒక కుటిరం నిర్మించుకొని, నూతన దంపతులు ఐదేళ్లపాటు అందులో కాలక్షేపం చేయాలి. ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్థనుడు, రాజుకుమారీ నివసిస్తూ వున్నారు. ఇలా ఉండగా, ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్థనుడి వద్దకు సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్లి, "చాలా దాహంగా వున్నది. మీకు దేవుడు కోకొల్లలుగా పాడి అనుగ్రహించాడు కదా. కొంచెం మజ్జిగతేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్థించాడు. దానికి సూర్యవర్థనుడు "పోవోయి పక్షి! మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చలివేంద్రం కాదు. వర్తకానికీ ధర్మానికీ చాలా దూరముంది. వెళ్లు వెళ్లు" అంటూ కసరికొట్టాడు. అప్పుడు సన్యాసికి కోపంవచ్చి "అప్పుడే నీకింత కళ్లు నెత్తి మీదికి వచ్చాయా? నిన్ను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు" అని చెప్పి సముద్రం పైన మంత్రజలం చల్లే వరకు, చూస్తూ వుండగానే తెల్లటి క్షీరసముద్రం మారిపోయి, అందులో మళ్లీ మామూలుగా ఉప్పు నీళ్లు సిద్ధమైనై.
సూర్యవర్థనుడితో సన్యాసి "మేలు మరచిన కృతఘ్నుడా ! నీవు ఎప్పటిలాగా మామిడి చెట్టు వద్దకు పోయి, కాపలా కాసుకొంటూ వుండు పో!" అని చెప్పి అదృశ్యమైనాడు. ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మారువేషంతో చంద్రవర్థనుడి వద్దకు పోయి "నాయనా! చలితో వణకిపోతున్నాను. ముసలి ముండా వాడిని. మీకు దేవుడు ఇన్ని గొఱ్ఱెలను ఇచ్చాడు కదా, మీకు పనికిరానిది ఒక చింకి కంబళి ముక్క నాకు పారవేయండి, మీ పేరు చెప్పుకొని కప్పుకొంటాను" అని కోరేసరికి, చంద్రవర్థనుడు "సరిసరి, మేము నేసిన కంబళీలు నాలుగూ నీలాంటి సన్యాసులికి పంచి పెట్టి వేస్తే, మేము ఎక్కడికి పోవాలె? మా వర్తకం ఏమి కావాలె? వెళ్ళువెళ్ళు.." అంటూ కసరికొట్టాడు. "ఓహో, నీ పని ఇంతవరకూ వచ్చిందా? "నీవు ఎక్కడికి పోవాలో చెబుతానుండు" అంటూ మంత్ర జలం తీసి అభిషేకించే వరకు, అతని కళ్లముందరనే గొఱ్ఱెలన్నీ పావురాలుగా మారిపోయి, గాలిలోకి ఎగురనారంభించినై. సన్యాసి అతనివేపు తిరిగి "పిచ్చి నాయనా! ఇక అంతటి నించీ నీవు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కానుకుంటూ వుండు" అని చెప్పి, అంతర్థానమైనాడు. అన్నలు ఇద్దరి సంగతి ఈ విధంగా పరీక్షించిన తరువాత, చిన్నవాడైన బాలవర్థనుడిలో కూడ ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలెనని సన్యాసికి బుద్ధి పుట్టి, అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్ళాడు.
సన్యాసి ఒక ముష్టివాని వేషంతో సరీగా భోజనాల వేళకు కుటీరంలో తయారై, అకలిగా ఉన్నదన్నాడు. ఇక భోజనం చేద్దామని సిద్ధంగా వున్న దంపతులు ఇద్దరూ ఆ ముప్టివానిని ఎంతో ఆనందంతో లోపలకు తీసుకుపోయి, తమ కోసం తయారు చేసుకొన్న అడవి తేనె, ఫలములు, వెదురు బియ్యపు అన్నము మొదలయిన పదార్థాలు అతనికి వడ్డించి, కడుపు నిండుగా భోజనం పెట్టారు. "అబ్బాయీ! మేము చూడబోతే అయిదేళ్ల అరణ్యవాస దీక్షలో ఉన్నాము, కనుక, ఇంతకంటె ఎక్కువగా ఆదరించలేకపోయాము," అని సానుభూతి తెల్పారు. వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందముతో ఆరగించి, సాధువు చిరునవ్వు నవ్వాడు. "నాయనా! మామిడి చెట్టు కాపలా కాసేనాటి నీ మంచితనం మార్పు లేకుండా ఇప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను. నీవు మంచివాడవు గనుకనే నీకు తగిన భార్య దొరికింది. దేశాచారం ప్రకారం మీరు ఇంకా దీక్షలో ఉండవలసి నప్పటికీ, అరణ్యవాసం చేస్తున్నామే అనే బాధ మీకు ఇంతటి నించీ కలుగబోదు. మీరు ఎక్కడ వుంటే అక్కడే రాజభోగంగా వుంటుం" దని చెప్పి, ఆ కుటీరం పైన మంత్రజలం చల్లాడు. తక్షణమే ఆ కుటీరం ఒక రాజభవనంగా మారిపోయింది. అందులో, రాజుగారి కోటలో వున్నట్టే అన్ని హంగులూ అమరి వున్నాయి. బాలవర్థనుడు భార్యా మారువేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగపడ్డారు. సాధువు వారిని దీవిస్తూ, అంతర్థానమైనాడు వారికి తెలియకుండానే. అంతటినుంచీ, బాలవర్థనుడూ రాణీ హాయిగా వుంటున్నారు.
Comments
Post a Comment