చందమామ కథలు - వల్లకాటిలో రామనాధయ్య

 

Telugu Chandamama comedy story of an innocent women getting scammed by a traveler. Best Chandamama telugu story to read.

వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు. ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది. అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు. లోకజ్ఞానం లేని వెఱ్ఱిబాగుల మనిషి. అమాయకపు అచ్చమ్మకి పిల్లలులేరు. "ఏవమ్మా మీకు పిల్లలులేరా?" అని ఒక నాడు ఎవరో ఆవిణ్ణి అడిగేరు. ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరూ అనుకుంది. ఐనా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది. గ్రామంలో పొలాలన్నీ అజమాయిషీ చేసుకుని, సరిగ్గా మూడు ఝాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు. ఆకలిచేత త్వరగా మడికట్టుకు వచ్చి, "వడ్డన చెయ్యి" అన్నాడు. అప్పుడు అచ్చమ్మ "ఏమండీ మనకి పిల్లలు లేరా?" అని అడిగింది. "లేరు.. వడ్డించు." అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, "ఒక్క ఆడపిల్లైనా లేదంటండీపోనీ?" అంది. "లేదు" అంటే మళ్లీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి, వెంకటప్ప "లేకేం? ఓ ఆడపిల్ల ఉంది! నాకు త్వరగా భోజనం పెట్టు" అన్నాడు. "ఎక్కడున్నదండీ?" "ఎక్కడుంటుంది? అత్తారింట్లో ఉంది!" "పెళ్లి చేసాకకదండీ అత్తారింటికి పంపడం?" "ఔను. పెళ్లిచేసే, పంపాను." "అలాగటండీ? ఐతే మన అల్లుడెవరండీ?" ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతోంటే, వెంకటప్ప, ప్రాణం విసిగి, "ఎవరా? వల్లకాటిలో రామనాధయ్య" అని సమాధానం చెప్పాడు. 

అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటిపేరు వల్లకాటివారనీ, అతగాడి పేరు రామనాధయ్య అనీ అనుకుని సంతోషించింది. అంతే కాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడనీ, తానూ మొగుణ్ణి "ఎవడు? ఎవడు?" అని అడిగి విసిగించేసరికి, అతడు "ఎవడో ఒకడు!" అని చెప్పటానికి మారు, "వల్లకాటిలో రామనాధయ్య!" అన్నాడనీ ఆమెకు తెలీదు. ఎలా తెలుస్తుందీ? ఆవిడకు లోకజ్ఞానం కొంచెమైనా లేదుగా! నాటినుంచీ అచ్చమ్మ తనకొక కూతురుందనీ, తన అల్లుడు వల్లకాటి రామనాధయ్య అనీ సంబరపడుతూ వుండేది. కొన్నాళ్లుపోయాక, కరణంగారు జమాబందీకని పట్టణం వెళ్లేరు. అప్పుడు ఒకనాడు మిట్టమధ్యాహ్నమపుడు దారినిపోయే వాడొకడు, దాహం వేసి కరణంగారి  ఇంటి ముందు ఆగేడు. కరణంగారు ఊళ్లోలేరు గనక అచ్చమ్మ తలుపులేసుకుని లోపల పప్పురుబ్బుతోంది. "ఎవరండోయ్ లోపల? నాలిక ఆర్చుకపోతోంది. తలుపుతీసి కాస్త దాహం ఇప్పిస్తారా?" అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసారి కేకవేశాడు. పట్నం వెళ్లేముందు వెంకటప్ప భార్యతో, "తలుపు వద్ద ఎవరు పిలిచినా, ఎవరో కనుక్కుని గాని తలుపు తీయవ" ద్దని చెప్పి వెళ్లేడు. అంచేత అచ్చమ్మ రుబ్బురోటి దగ్గిర్నుంచి లేవకుండానే, "ఎవరునాయనా, నువు?" అని బాటసారిని అడిగింది. దాహంతో ఓమూల ప్రాణంపోతుంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి. బదులురాకపోవటం వల్ల అచ్చమ్మ "ఎవరునాయనా నువ్వు?" అని మళ్లీ అడిగింది. వాడికి ప్రాణం విసిగి "ఎవరా? వల్లకాటిలో రామనాధయ్యని! త్వరగా తలుపు తీసి కాసిన్ని మంచి నీళ్లియ్యండి. ప్రాణంపోతున్నది!" అన్నాడు.

"ఎవరు? వల్లకాటిలో రామనాధయ్యవా? మా అల్లుడివా నాయనా?" అంటూ, అచ్చమ్మ ఎగిరి గంతేసి, గబగబా వచ్చి తలుపు తీసింది. కాసిన్ని మంచినీళ్లిస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మానుకుర్చీ వేసి కూచోబెట్టి, చిక్కటి ఆవుమజ్జిగ దాహమిచ్చింది. దాహం తీరి కడుపు చల్లపడ్డాక బాటసారిలేచి, "అమ్మా, సెలవు మరి" అని వెళ్ళబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ, "అదేమిటి రామనాధయ్యా, అప్పుడే వెళ్ళిపోతానంటావ్? అల్లుడవు, రాకరాకవచ్చవాయిరి. ఉండు. మామగారు ఊళ్లో లేనప్పుడొచ్చావు. ఆయన రాకుండా వెళ్ళిపోతావా? ఇంతకీ మా అమ్మాయి సంగతే చెప్పేవుకావు" అంటూ మొదలెట్టింది. ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు. "ఇదేమిటి, నన్ను ఈవిడ అల్లుడంటూ వుంది! నాకు దాహానికి ఇవ్వలేదని ప్రాణం విసిగి 'నాకు పేరేమిటమ్మా, వల్లకాటిలో రామనాధయ్యను' అని యదాలాపంగా అనేవరకు, ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్టుంది. బహుశా ఈ యింటి వారి అల్లుడి పేరు రామనాధయ్య అయివుండాలి. లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంత మర్యాదచేయడ మేమిటి? ఇదంతా చూడగా తమాషాగానే వుంది," అనుకొన్నాడు. అయినా, ఆ యిల్లాలు తన కూతురును గురించిన క్షేమవార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదుగద! అందుచేత, అతను ఎందుకయినా మంచిదని "మీ అమ్మాయి కులాసాగానే వుంది" అని చెప్పాడు. ఆవిడ సంతోషించి, "ఒక్క క్షణంలో వస్తా" నని చెప్పి లోపలికి వెళ్లి, మినప్పప్పు గబగబా రుబ్బేసి, అల్లుడి కోసమని గారెలు తయారుచేసి పట్టుకొచ్చింది.  అవతల మునిగిపోయే పని ఏమిలేదు గనుక ఆ వచ్చిన వాడు తాపీగా కూర్చుని గారెలన్నీ తిన్నాడు. చెయ్యి కడుక్కుని, "ఇంక నేను వెడతానండి" అన్నాడు.

"ఆయన రేపో, ఎల్లుండో వచ్చేస్తారు. వెడుదుగానిలే బాబూ!" అన్నది అచ్చమ్మ. "అలా కాదత్తగారు! ఇంటిదగ్గర మీ అమ్మాయి ఒక్కర్తే ఉండలేదు. సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవాలి. అంతే కాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్లి. అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్లాలి" అన్నాడు. "ఓహో, అలాగా? తప్పకుండా తీసుకెళ్లు. అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది." "సంతోషిస్తుంది కాని, అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తోంది." "ఏం? ఎందుకు సందేహించడం?" "ఎందుకేమిటి? పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలెట్టుకొస్తారు. మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు. మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి!" "అయ్యో, ఐతే ఎలా మరి!" "ఎక్కడైనా నగలు ఎరువుతెచ్చుకోమన్నాను. కాని ఎవళ్లూ ఇవ్వనన్నారుట. 'పోనీ, మా అమ్మని అడిగి తెండీ' అని నన్ను పంపింది." "ఆ మాట చెప్పేవు కాదేం నాయనా ఇంతసేపటి నించీని? తప్పకుండా పట్టుకెళ్లు. కంటీ, కట్టకాసులపేరూ, ఒడ్డాణం, దండ కడియాలూ అన్నీ ఉన్నాయి. మనకేం లోటూ?" "మళ్లీ, వారం తిరక్కుండా పట్టుకు చక్కా వచ్చేస్తానత్తగారు. వీలయితే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేనూ మీ అమ్మాయీని. పట్టుచీరలు కూడా ఉంటే ఇవ్వండి. విలువైన చీరల మీదగాని బంగారపునగలు రాణించవు."

"అలాగే ఇస్తాను పట్టుకువెళ్లునాయనా! అమ్మాయికంటే మాకు ఎక్కువ, ఎవరు? మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కద!" తన నగలూ, పట్టుచీరలూ ఎరువివ్వకపోతే తానెన్నడూ ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి, అచ్చమ్మ లోపలికెళ్ళి పెట్టెతెరచి, ముద్దినుసు నగలూ, చీరలూ తెచ్చి, ఆ అతిథి ముందు పెట్టింది. వాడు తాపీగా నగలూ బట్టలూ తన సంచీలో ఇముడ్చుకుని, "ఇంక వెళ్తానత్తా. ఇవన్నీ మళ్లీ పువ్వుల్లో పెట్టి తెస్తాను. వారం తిరక్కుండా వచ్చేస్తాను" అంటూ, తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు. మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు. అతడు గుమ్మంలో అడుగు పెట్టేడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, "ఏమండోయ్, మన అమ్మాయి కులాసాగానే ఉందిట!" అంది. "మన అమ్మాయా? మనకి అమ్మాయి లేందే?" "అదేమిటలా అంటారు? మన అల్లుడే స్వయంగా వచ్చి, పిల్ల కులాసాగా ఉందని చెపితేనే?" "అల్లుడా? ఎవడు వాడు?" "ఎవడేమిటండీ? వల్లకాటి రామనాధయ్యేనండీ" అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి వున్న 'రామనాధయ్య' మాట జ్ఞాపకానికొచ్చింది. ఎవడో తన వెఱ్ఱిబాగుల పెళ్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి, "ఏడే వాడు?" అని అడిగేడు. 

"వెళ్లిపోయాడండీ. మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతనూ, మన అమ్మాయీ పెళ్లికి వెడుతున్నారుట. నా నగలూ, బట్టలూ ఎరువు తెమ్మని అమ్మాయే అతణ్ణి పంపింది." "కొంపతీసి ఏమీ ఇవ్వలేదుగదా?" "అదేమిటండీ? కూతురాయిరి, ఇవ్వకపోతే ఎలా? ఇంతకీ అచ్చంగా ఇచ్చి వేశామా, ఏమన్నానా? ఎరువేగా? వారం తిరక్కుండా తెచ్చేస్తా నన్నాడు అల్లుడు. అందుకని నగలూ, చీరలూ ఇచ్చాను. అన్నట్లు చెప్పటం మరచిపోయాను. పెళ్ళినించి ఇంటికి వెళ్లేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండీ." ఆ మాట విని వెంకటప్ప 'లబో లబో' మని గుండె బాదుకున్నాడు. 'ఎంత తెలివి తక్కువ పీనుగువే!' అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకుమించి చేసేదేముంది? "నిన్ను తిట్టి ఏం ప్రయోజనం? తప్పంతా నాది! 'మనకి అమ్మాయీలేదు, అల్లుడూలేడ' ని చెప్పక 'వల్లకాటిలో రామనాధయ్య మన అల్లుడనటం' నాదే తప్పు. తెలివితక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి ఔతుంది" అని ఏడవటం మొదలెట్టేడు. 'అమ్మాయీ లేదు. అల్లుడూ లేడ' ని మొగుడు ఏడుస్తోంటే ఆ మాట అచ్చమ్మకు అర్థంగాక, వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవడం మొదలెట్టింది. దానితో ఊరంతా పోగై, సంగతి తెలుసుకొన్నారు. నగా నట్రా పోయినందుకు ఏడుస్తోన్న వెంకటప్పనీ, లేని కూతురూ అల్లుడూ పోయారనుకుని ఏడుస్తూ వున్న అచ్చమ్మనీ ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు. అచ్చమ్మ తెలివితక్కువవల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి. సంసారం సరిగా నడవాలంటే, ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు.


Comments