చందమామ కథలు - అశ్వబలి

 

Telugu Chandamama story about a citizen showing example of loyalty and sacrifice to the king. Best Chandamama telugu stories to read.

గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో, పూర్వం 'గిజ్రూ' అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు. పరిపాలనలో గిజ్రూ చాలా కచ్చితమైనవాడు. కాని ఎంత కచ్చితమైనవాడో అంత దయకలవాడు. గిజ్రూ, గొప్ప దాత అని దేశ దేశాల కీర్తి వ్యాపించింది. దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు. 'గిజ్రూ! నాకీ వస్తువు కావాలీ' అని ఎవరైనా వచ్చి అడిగితే, 'లేదు' అనే మాట అతని నోట ఎన్నడూ రాదు. ఇంతటి ఉదారుడైన గిజ్రూ వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని, దూర దేశాలనుంచి కూడా ప్రజలు వచ్చేవారు. తన ఇంటికి ఎవరువచ్చినా, గిజ్రూ ఎంతో మర్యాదగా వారిని ఆదరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి, పంచభక్ష్య పరమాన్నములతో భోజనం పెట్టి, హాయిగా పడుకునేందుకు హంసతూలికాతల్పాలు అమర్చేవాడు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రూ మంచితనానికి మెచ్చుకొని, ఆ వచ్చిన అతిథులు తృప్తిపడేవారు. ఒకవేళ, గిజ్రూ వద్ద అయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ, గిజ్రూ ఇంట ఆతిథ్యం పొందిన తరువాత వారిలో దురాశలు అంతరించి, వారి మనసు మంచిగా మారిపోయేది. ఇటువంటి గిజ్రూకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది. అది యేమిటంటే, అతను అపురూపంగా పెంచుకొంటున్న ' ఆమ్రాక్' అనే గుర్రం. ఆమ్రాక్ పైన గిజ్రూకు పంచప్రాణాలు. ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం కూడా గిజ్రూ అంత మంచివాడే. ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా.


సరదా ఉండటం చేతనే, ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడినుంచీ రప్పించి, సుల్తాను తన దివాణపు డేరాలలో అట్టెపెట్టుకొన్నాడు. కాని, ఒక రోజున, ఎవరో వచ్చి 'తమ దివాణంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రూ వద్ద ఉన్న ఆమ్రాక్ చాలా అందమైనది' అని సుల్తానుతో చెప్పారు. ఆ మాట విని సుల్తాను, "సరే, దీనికేముంది? గిజ్రూకు కోరిన ధనమిచ్చి, ఆమ్రాక్ ను తీసుకురండి" అని చెప్పి, ఒంటెలపైన వరహాల సంచులు వేయించి, తన రాయబారుల్ని పంపించాడు. ఎంత ధనమిచ్చినా గిజ్రూ తన గుఱ్ఱాన్ని వదలలేదు. ఇది పని కాదని తలచి, రాయబారులు ఒకసారికంటె మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ, ఏడుసార్లు గిజ్రూ వద్దకు వెళ్ళారు. ఎన్నడూ ఎవ్వరికీ ఏది అడిగినా 'లేదు' అనే మాట చెప్పని గిజ్రూ, ఈ ఏడుసార్లూ కూడా 'దయవుంచి మన్నించండి. ఆమ్రాక్ ను తప్పించి మరేదైనా అడగండి' అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు. ఈ సంగతి సుల్తాను విని ఆశ్చర్యపడి, ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ ఆమ్రాక్ సంగతి ఏంటో చూడాలని తానే మారువేషంలో గిజ్రూ వద్దకు వచ్చాడు! సుల్తాను వచ్చి కళ్ళారా ఆ గుర్రాన్ని చూచిన తరువాత ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరిపోయింది. సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు. కానైతే, "మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్రూ నోటి వెంటనే లేదనే మాట వచ్చిందే! ఆమ్రాక్ ను నేను సంపాయించటం కల్ల!!" అని సుల్తాను నిరాశతో మంచంపట్టాడు. క్రమేణా సుల్తానువ్యాధి ప్రమాదస్థితికి వచ్చింది. అప్పుడు సుల్తాను కొడుకు వజీరును పిలిపించి, "ఓయి వజీరు! ఎలా అయినా సరే, మనం ఆమ్రాక్ ను వెంటనే సంపాదించుకు రావాలి. లేనిపక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు. ఏమిటి నీ సలహా?" అని అడిగాడు.   

అందుకు వజీరు "అయ్యా! మీరెందుకు అలా భయపడతారు? గిజ్రూకు ఎవరేది అడిగినా 'లేదు' అనకుండా ఇచ్చే వ్రతమున్నది కదా. ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటమనేది ఏమంత అసాధ్యమైన పని? నేను చెప్పినట్లు చెయ్యండి. ఈ కార్యం నిమిత్తం గిజ్రూ వద్దకు మీరే స్వయంగా వెళ్లి, నాన్నగారి పేరుచెప్పి, ఒక్క సంవత్సరం పాటు ఆమ్రాక్ ను మన దివాణంలో ఉంచాలని కోరండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది" అని చెప్పాడు. సుల్తాను కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకొని బయల్దేరి గిజ్రూడేరాకు చేరేవరకు, అక్కడ ఒక గొఱ్ఱెలకాపరి తప్ప మరెవ్వరూ లేరు. "అయ్యా! ఇక్కడ నీళ్లన్నీ ఇంకిపోయినయ్యండి. కనుక, ఇక్కడికి తిన్నగా తూర్పుదిక్కున పది మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు," అని చెప్పాడు గొఱ్ఱెలకాపరి. సుల్తాను కొడుకు వెతుక్కొంటూ వెళ్ళి గిజ్రూ మకాం చేరుకొన్నాడు. గిజ్రూ అతనిని ఒక పట్టుపరుపు పైన కూర్చుండబెట్టి, మర్యాదలన్నీ జరిపిన తరువాత భోజనానికి లెమ్మన్నాడు. ఆ విందులో వడ్డించిన పదార్థాలవంటివి సుల్తాను కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరుగడు. తరువాత, గిజ్రూ సుల్తాను కొడుకు వద్దకు వచ్చి "ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో, నా వల్ల కాగల పని ఏమిటో సెలవియ్యండి" అని అడిగాడు. అందుకు సుల్తాను కొడుకు "మీతో పని ఉండే వచ్చాము. మా తండ్రిగారు ఆమ్రాక్ మీద మక్కువ కలిగి, దాని కోసం బెంగపెట్టుకొన్నారు," అన్నాడు.

"ఆమ్రాక్ మీదనా!" అని ఆశ్చర్యంతో అడిగి, గిజ్రూ తల వంచుకొన్నాడు. "అవును, ఆమ్రాక్ కోసం నాయనగారు బెంగపెట్టుకొని మంచం పట్టివున్నారు. ఆయన చాలా ప్రమాదావస్థలో ఉన్నారు." అన్నాడు సుల్తాను కొడుకు. గిజ్రూ బొటబొట కన్నీరు కార్చాడు. ఇది చూచి సుల్తాను కొడుకు "గిజ్రూ, ఎందుకలా కంట తడిపెడుతున్నావ్?" అని అడిగాడు. గిజ్రూ కన్నీరు తుడుచుకుంటూ, "తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి. అందుచేత, విందుకు తగిన పదార్థం తయారుచేయాలనే ఆత్రంతో, నా ప్రాణమైన ఆమ్రాక్ నే వండి వడ్డింపించాను" అని చెప్పలేక చెప్పలేక చెప్పాడు. "గిజ్రూ! మా పట్ల నీకు ఎంతటి భక్తి, గౌరవాలున్నయో, ఇప్పుడు తెలిసింది. నీ ఔదార్యమూ, త్యాగమూ ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను. తీరా ఇప్పుడు ఆమ్రాక్కు బలి అయిపోయింది. ఏమిచేయగలం? కాని, ఆమ్రాక్కు బలి కావటంవల్ల నీ కీర్తి, నీ అసమాన త్యాగం వల్ల ఆమ్రాక్ కీర్తీ శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు," అని చెప్పి సుల్తాను కొడుకు గిజ్రూను ఊరడించాడు. ఈ సమాచారమంతా తెలిసి సుల్తాను ఒళ్ళు నిమ్మళించింది. తరువాత, గిజ్రూ ఏ స్థలంలోనైతే ఆమ్రాక్కును బలిచేసి తన కొడుకునకు విందుచేశాడో, ఆ ప్రదేశమందు ఆమ్రాక్కు జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు. ఆ విగ్రహం చూచినప్పుడల్లా ప్రతివారికీ గిజ్రూ చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తూంటాయి.

Comments