చందమామ కథలు - అన్నదాన మహిమ

 

Telugu Chandamama Story of brahmin who wanted to know the result of donating food. Best Chandamama Telugu stories.

పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తన యింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంటపోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు. ఒకాయన ఏమన్నాడంటే, "అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యంకాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి" అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై "నీకేం కావాలి?" అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, "అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు, కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు" అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.

అప్పుడు దేవి అతనితో "నీకు అన్నదాన మహిమ తెలియాలీ అంటే నేను చెప్పటం కాదు ; అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను, విను: హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయన దగ్గరకు వెళ్లి అయనకి కొడుకు పుట్టాలని దీవించు, ఆరాజు సంతోషించి, "బాబూ మీకేం కావాల"ని అడుగుతాడు. అప్పుడు నీవు, "నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు" అని చెప్పు. "ఇంతే గదా?" అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని "అన్నదాన౦ వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి?" అని అడిగి తెలుసుకో" అని చెప్పింది. బ్రాహ్మణుడు "సరే" అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?" అని ఆత్రముతో ఆడిగాడు. "హేమవత పర్వతం దగ్గరికి పోవాలి" అన్నాడు బ్రాహ్మడు. "బాబూ, దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రమయిపోయింది. పులులూ, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి" అన్నాడు బోయవాడు. బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లేడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు తన యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందీ అని ఆలోచించాడు. ఆనపకాయలూ, కందికాయలూ, పెసరకాయలూ కావలసినన్ని ఉన్నాయి గాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు. 

బ్రాహ్మడు, "నాయనా, నాకేమీ వద్దోయ్‌, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో" అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణ్ణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పిందికాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కింద పడుకోబోకండి, పులులు వస్తాయి' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచెమీద పడుకోబెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు. బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారుఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడ నుంచో ఓ పులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి, జరిగినదంతా తెలుసుకుని, తన మూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బ్రాహ్మణునితో "స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు "హేమవతానికి దారి చూపిస్తాను, నడవండి" అని ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి,  వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు.

అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. "పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాల" ని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య తొమ్మిది నెలలూ మోసి, చందమామలాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి, "అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు" అని అడిగేడు. అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో యిలా అన్నాడు: "పదినెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారపప్పూ, పురిషెడు తేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండీ! ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుణ్ణయి పుట్టి, రాజ్యమేలబోతున్నాను. ఒకనాటిదానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు, నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి." ఇలా చెప్పేసి, ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగ "కువ్వా కువ్వా" అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి, తన వూరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పేడు. ఆ దంపతులు అప్పటినించీ విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధీ, పుత్రపౌత్రాభివృద్ధీ కలిగి సుఖంగా ఉంటున్నారు.


Comments