విక్రమ బేతాళ కథలు - చచ్చిపోయిన పెళ్ళికొడుకు

Vikram answers Betal on why a person acted as a ghost when he had the chance to marry a rich lady. Best Vikram Betal Stories in Telugu to read.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవింతగా ఈ అర్థ రాత్రివేళ శ్రమపడుతున్నప్పటికీ నీకు దక్కవలసిన ఫలితాన్ని నీ కన్న హీనుడు పొందవచ్చు నని నీకు తోచిందా? అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్పసాగాడు: కుమారవర్మ అవంతీ నగరానికి చెందిన యువకుడు. వారిది కావటానికి ఘనమైన వంశమే కానీ, కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బతకటం కోసమనీ, దాతలనిపించుకుందామనీ ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు. అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుక్కి సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి, కోటీశ్వరుల పిల్లను, మహా వికరమైనదాన్ని కోడలుగా చేసుకోవటానికి సిద్ధపడ్డాడు.

కాని కుమారవర్మ ధనలోభి కాడు. అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందటం; మనిషిలాగా బతకటం. అందుచేత అతను డబ్బు కోసం కురూపి అయిన భార్యను చేసుకోనన్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. కుమారవర్మ విచారించలేదు. ప్రపంచం విశాలమైనది. ధైర్య సాహసాలు గల వాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి. వాటి కోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీద బయలు దేరాడు. కుమారవర్మ ఉజ్జయినీ నగరంలో కొంత కాలం ఉండి, అక్కడి నుంచి అమరావతీ పట్టణానికి బయలుదేరాడు. అదే రోజున ఉజ్జయినీ నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడనేవాడు కూడా అమరావతీ పట్టణానికి బయలుదేరాడు. ఉజ్జయినీ నగరం దాటగానే ఇద్దరూ తారసిల్లారు. ఇద్దరూ గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు. ధనగుప్తుడు  తండ్రిలాగే అస్తమానమూ వ్యాపారంలో మునిగి తేలేవాడు. తన వృత్తీ, తన నగరమూ తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాదు. కొత్త వారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి బొత్తిగా లేదు. అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పుండటంచేత త్వరలోనే ఇద్దరికీ స్నేహం కలిసింది. కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి. అతని తండ్రి కూడా ధనాశ చేత అమరావతీ పట్టణంలోని ఒక కోటీశ్వరుడి కుమార్తెను తన కొడుక్కు మాట్లాడాడు. 

ఉభయపక్షాలవారూ ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు. పెళ్లికూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారయింది. పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ ఒకరి నొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రధానం జరిగి, ముహూర్తం నిర్ణయం కావలిసి ఉన్నది. అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్త వారి ఊరుకు బయలుదేరాడు. ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో, "పిల్ల మంచి భరణం తెస్తున్నది బాగానే ఉంది. కాని ఆమె అందంగా లేకపోతే ఎలా పెళ్ళాడతావు? బతికున్నన్నాళ్ళూ ఆమెతో ఎలా కాపరం చేస్తావు?" అని ధనగుప్తుణ్ణి అడిగాడు. "పిల్ల బాగానే ఉంటుందన్నారు. కాస్త కుడీ ఎడమైతేనేం? అన్నీ ఒనగూడుతాయా? కొంతవరకు సరిపెట్టుకు పోవాలి," అన్నాడు ధనగుప్తుడు. కుమారవర్మ వెంట ఉండటం ధనగుప్తుడి కెంతో మేలయింది. కొత్త చోట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించు కోవటమూ, వీలయినన్ని సౌకర్యాలు సాధించటమూ కుమారవర్మకు బాగా తెలుసు. ఆ విద్య ధనగుప్తుడికి తెలియదు. ధనగుప్తుణ్ణి కొంచెంకూడా లక్ష్యపెట్టనివారు కుమారవర్మ పట్ల ఎంతో విధేయత కనబరిచారు. కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు.

వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతీ పట్టణం చేరుకున్నారు. అలాటి మహా నగరాన్ని ధనగుప్తు డెన్నడూ ఊహించను కూడా లేదు. కాని కుమారవర్మకు ఆ నగరం ప్రతి మూలా తెలుసు. "చీకటి పడబోతున్నది. ఇప్పుడు నీవు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు. ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి, సుఖంగా విశ్రాంతి తీసుకుని, రేపు ఉదయం వెళుదువుగాని," అని కుమారవర్మ సలహా ఇచ్చాడు. నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికీ సలహా బాగా నచ్చింది. అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్ళాడు. అది సత్రం లాగా లేదు, రాజ భవనం లాగా ఉన్నది. కుమారవర్మ సత్రం యజమానితో, "మాకిద్దరికీ చెరొక గదీ కావాలి. ప్రయాణంలో చచ్చు తిండి తిన్నాం, మృష్టాన్నభోజనం తయారు చేయించండి. డబ్బుకు చూడవద్దు," అన్నాడు. ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉన్నది. అంత రుచికరమైన వంట అతనెన్నడూ ఎరగడు. అసలే తిండిపోతు కావటంతో మితిమీరి తిన్నాడు. దాని ఫలితంగా ఒక రాత్రివేళ అతని కడుపులో శూల కలిగింది. చాలాసేపు బాధపడి, అంత కంతకూ బాధ ఎక్కువవుతూండటం చేత కేకలు పెట్టాడు. సత్రం యజమాని వచ్చి చూసి, వైద్యుడికి కబురు చేశాడు. వైద్యుడు వచ్చి ధనగుప్తుణ్ణి పరీక్షించి, అతని కడుపులో గుల్మం ఉన్నదనీ, తిన్న తిండి వికటించటం చేత ప్రమాదస్థితి ఏర్పడిందని, అతని బంధువు లెవరన్నా ఉంటే పిలిపించటం మంచిదనీ, సత్రం యజమానికి చెప్పాడు. 

అతను దూరదేశం నుంచి వచ్చిన వాడు కావటం చేత దగ్గిరలో బంధువులుండరనుకుని, సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు. ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు. "నేను తెల్లవారేలోగా తేరుకోక పోతే నా సంగతి మాధవగుప్తుడికి తెలియజెయ్యాలి. నేను వస్తున్నట్టు వారికి ముందుగానే కబురు చేశాం. నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారే మా ఇంటికి కూడా వార్త తెలపగలరు," అన్నాడు ధనగుప్తుడు. అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు. ధనగుప్తుడు తెల్లవారక ముందే ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్నం వేళకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాటు చేసి, తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవగుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలు దేరాడు. మాధవగుప్తుడి కుటుంబంవాళ్ళు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటు పడ్డారు. తాను ధనగుప్తుడు కాడనీ, అతని మరణ వార్త చెప్ప వచ్చిన వాణ్ణనీ అనటానికి అతనికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. "నిన్న ఉదయం నుంచీ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం!" అన్నాడు మాధవగుప్తుడు చిరునవ్వు నవ్వుతూ.

కుమారవర్మ వారందరి ఉత్సాహాన్నీ చూసి, వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు. అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభ్యమయింది. అందుచేత అతను తాను ధనగుప్తుడయినట్టుగా నటిస్తూ, "నిన్న నేను వచ్చి చేరేసరికి చీకటిపడింది. అందుచేత సత్రంలో బస చేశాను," అన్నాడు మాధవగుప్తుడితో. కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా, అనుకున్నదానికన్నా కూడా అందంగానూ, కలుపుగోలుగానూ ఉన్నాడని మాధవగుప్తుడి తాలూకు బంధువులంతా అనుకున్నారు. వారిలో ఒక యువకుడి ముఖం మటుకు కోపంగా, రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు. ఆ యువకుడు వజ్రపాలుడు. అతను మాధవగుప్తుడి దూరపు బంధువు. పేదవాడు. అమరావతీ నగరపు రాజు వద్ద సైనికుడిగా ఉండి పొట్టపోసుకుంటున్నాడు. అతను పేదవాడు కానట్టయితే మాధవగుప్తుడు తన కుమార్తె కల్యాణిని అతనికిచ్చి చేసి ఉండవలిసిందే. కాని తన కూతురిని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడి కోసం చాలా దూరం వెళ్ళాడు. వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి, "నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే? ఉపయోగించగలవా?" అన్నాడు. "నీకు చూడాలని ఉంటే చూడవచ్చు. కాని ఎప్పుడు? ఎక్కడ?" అన్నాడు కుమారవర్మ. "ఆ తోటలో, భోజనాలయాక," అన్నాడు వజ్రపాలుడు. "ఇంతకూ నాపై నీకేమిటి కక్ష?" అని కుమారవర్మ అడిగాడు. "నా సంగతి తెలిసి ఉంటే కల్యాణిని పెళ్ళాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచి పెట్టి, ఇంత దూరం వచ్చి ఉండవు!" అన్నాడు వజ్రపాలుడు.

ఆ సమయంలో మాధవగుప్తు డక్కడికి వచ్చి, "నాయనా, ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం. ఈలోపుగా అమ్మాయీ, నీవూ ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది గదా! మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు. ప్రధానం జరుగుతుంది," అన్నాడు. తరువాత కాస్సేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది. కాబోయే భర్త దగ్గిర చూపవలిసిన లజ్జా, బిడియమూ ఆమెలో ఏమీ కనిపించలేదు. "నీవింత అందంగా ఉంటావని నాకు తెలీదు," అన్నాడత నామెతో. "మీకు నా అందంతో ఏం పని? నేను తేవలిసిన కట్నాలూ, కానుకలూ రాసుకుని ముందుగానే ఖరారు చేసుకున్నారు గదా!" అన్నది కళ్యాణి. "అంటే మనిద్దరి మధ్యా ప్రేమకు అవకాశమే ఉండదంటావా?" అన్నాడతను. "ఏమాత్రమూ ఉండదు," అన్నది కళ్యాణి కఠినంగా. తరవాత భోజనాలయాయి. కుమారవర్మ ఎటో బయలుదేర బోతుండటం చూసి, "ఎటూ వెళ్ళకు. ఇంకో రెండు గడియల్లో పురోహితుడు వచ్చేస్తాడు," అన్నాడు మాధవగుప్తుడు.

"అలా తోటలోకి వెళ్ళొస్తాను," అంటూ కుమారవర్మ బయలుదేరాడు. తోట వాకిలి తెరుచుకుని అటు నుంచి అటే వెళ్ళిపోదామని అతని ఉద్దేశం. కాని వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు. కుమారవర్మ వెనక్కు తిరగగానే వజ్రపాలుడు వెటకారంగా, "ప్రాణాలు దక్కించుకుని పారిపోదా మనుకున్నావు కాదూ?" అని ప్రశ్నించాడు. "ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు?" అని కుమారవర్మ అడిగాడు. "అవును, నువ్వు పిరికి పందవని నాకు తెలుసు!" అన్నాడు వజ్రపాలుడు. "ఆ ధైర్యంతోనా నన్ను కత్తి యుద్ధానికి పిలిచావు? ఎంత నీచుడివి! ఎలాటి పిరికి పందవు! నిన్ను విడవరాదు!" అన్నాడు కుమారవర్మ. వజ్రపాలుడు రంకె పెట్టి, కత్తి దూసి కుమారవర్మ పై కలియబడ్డాడు. ఇద్దరూ కొద్ది క్షణాలు పోరాడాక, "నీ వింత చచ్చు వీరుడి వనుకోలేదు. ఇదుగో పట్టు!" అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన చేతికి తీసుకున్నాడు. "నా కత్తి నా కిచ్చెయ్యి," అన్నాడు వజ్రపాలుడు. "నీ కత్తి నీకివ్వట మంటే మళ్ళీ యుద్ధం సాగించటమన్న మాటే. అది నీకు అపాయకరం. ఇక ముందైనా నీవు నిజమైన పిరికి వాళ్ళతోనే యుద్ధం చెయ్యటం మంచిది," అంటూ కుమారవర్మ వెనక్కు తిరిగే సరికి కళ్యాణి అక్కడికి వచ్చి, "ఏమయింది? ఏమయింది?" అని ఆత్రంగా అడిగింది. ఏమి జరుగుతున్నదీ ఆమెకు తెలుసును! తాను ఆమె ప్రియుడి చేతిలో చచ్చిపోతాడని అనుకున్నది! ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడి కత్తిని ఆమె చేతికిస్తూ, "అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు. లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్న అతని ప్రాణానికే అపాయం కలిగించే అవకాశం జాస్తి," అని చెప్పి ఇంటి కేసి వెళ్ళాడు.

అతను మాధవగుప్తుణ్ణి చూసి, "నేను వచ్చిన పని అయిపోయింది. ఇంక నాకు సెలవిప్పించండి," అన్నాడు. మాధవగుప్తు డాశ్చర్యంతో, "అదేమిటి? ఇంకొక గడియలో పురోహితుడు ఇంటికి వచ్చి ప్రధానం చేయించి ముహూర్తం పెడతాడు," అన్నాడు. "అవుననుకోండి. నాకు అంత కన్న తొందర పని ఉన్నది. ఇంకొక గడియలో నన్ను దహనం చేసేస్తారు," అన్నాడు కుమారవర్మ. మాధవగుప్తుడి కిదేం హాస్యమో అర్థం కాలేదు. "అలా అవాచ్యాలూ పలుకుతావేమోయ్?" అన్నాడాయన. "అవాచ్యాలు కావండి. నేను చెప్పేది యదార్థం. అసలే నేను తిండిపోతును. రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు. మితిమీరి తినేశాను. నా కడుపులో గుల్మం చేరి ప్రాణం తీసేసింది. తెల్లవారుజామున నేను చచ్చిపోయాను. ఇంక కొంచెంసేపట్లో నాకు దహన క్రియలు జరుగుతాయి. నేను లేకుండా ఎలా?" అన్నాడు కుమారవర్మ. అందరూ నిర్ఘాంతపోయి నోర్లు తెరుచుకు చూస్తుండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు. తరవాత మాధవగుప్తుడు నౌకరును పంపి విచారిస్తే, కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడనీ, మధ్యాహ్నం వేళ అతనికి దహన క్రియలు జరిగాయనీ తెలిసింది. తాము చూసినది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలు నని మాధవగుప్తుడి కుటుంబం వారనుకున్నారు. 

బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. కల్యాణికి  ధనగుప్తుడంటే ఇష్టం లేని మాట నిజమే. దానికి కారణం అతను తనను డబ్బు కోసం పెళ్ళాడుతున్నాడనేది. ఆ సంగతి కుమారవర్మకు తెలుసును. ఆమె తనను ప్రేమించే పక్షంలో అతను పెళ్ళాడి ఉండే వాడని కూడా స్పష్టమవుతున్నది. అలాటి పరిస్థితిలో తానెవరో ఆమెకు తెలియ జెప్పి ఆమె ప్రేమను సంపాదించటానికి బదులు అతను ధనగుప్తుడి దయ్యం లాగా నటించి వెళ్లిపోవటాని కేమిటి కారణం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "కుమారవర్మ తనను తాను బయట పెట్టుకోకపోవటానికి ఒకటి కాదు, మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కుమారవర్మ ధనికుడు కాదు. అతను కూడా తనను డబ్బు చూసే ప్రేమిస్తున్నాడని కళ్యాణి అనుకోవచ్చు. ఆమె తానై ఒక పేదవాణ్ణి ప్రేమించింది, నిజమే. కాని ఆమె ప్రేమకు పాత్రుడైన వజ్రపాలుడు కుమారవర్మకు ఎంత హీనుడుగా కనిపించాడంటే, కళ్యాణి ప్రేమ కోసం వాడితో పోటీ పడటం అతనికి అవమానంగా తోచింది. అది రెండవ కారణం. మరొకటి కూడా ఉన్నది. తాను మామూలు మనిషేనని తెలిస్తే, తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన వజ్రపాలుడి పై కళ్యాణి కుండిన ప్రేమ కాస్తా విరిగిపోయే అవకాశం ఉన్నది. కాని తాను దయ్యమని అనుకున్న పక్షంలో కళ్యాణి వజ్రపాలుడి ఓటమిని క్షమించి అతన్ని పెళ్లాడ గలుగుతుంది. ఈ విషయాలన్నీ అలోచించి కుమారవర్మ దయ్యం లాగా నటించాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments