చందమామ కథలు - ధర్మప్రభువు

 

Telugu Chandamama story of a honest king who never compromised on providing Justice even if it was his son. Best Chandamama telugu stories to read.

ఒకానొకప్పుడు చోళప్రభువులు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవారు. వారిలో ఒకడు మనునీతిచోళుడు. ఆయన పాలనలో ధర్మం నాలుగుపాదాల నడిచేది. మనుష్యులకే కాకుండా, నోరులేని జంతువులకు కూడా ఆయన రాజ్యంలో న్యాయం దొరికేది. ఇటువంటి కీర్తి గడించిన మనువుకు లేకలేక ఒక్కగానొక్క కుమారుడు కలిగాడు. వానికి విధివిడంగుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. విధివిడంగుడు మంచి బుద్ధిమంతుడై తండ్రివలెనే అతను కూడా జీవకారుణ్యం ముఖ్యమైన ఆదర్శంగా పెట్టుకున్నాడు. ఇలా ఉండగా, ఒక రోజున విధివిడంగుడు దేవదర్శనానికి వెళ్లవలెనని తన రథంలో బయల్దేరాడు. రథం వెళ్ళుతూ వుండగా, దురదృష్టవశాన, ఒక చిన్నారి ఆవు దూడ గెంతుకొంటూ వచ్చి ఆ రథ చక్రాలక్రింద పడి వెంటనే చనిపోయింది. ఆవుదూడ అవస్థ కనులార చూడగానే విధివిడంగుడు కొయ్యబారిపోయాడు. నోటమాట రాలేదు. కొంతసేపటికి అతను తేరుకొని, "అయ్యో, పరమేశ్వరా! నీ దర్శనం చేసుకొందామని బయల్దేరడమేమిటి, ఇటువంటి ఘోరపాపానికి ఒడికట్టుకోవలసి రావడమేమిటి? ఈ వార్త చెవినిపడితే, కరుణానిధి అయినటువంటి నా తండ్రి క్షమించడు! అందులోనూ, తన కొడుకే ఇలాంటి దుష్టకార్యం చేశాడని విని, ఆయన ఎంత దుఃఖిస్తాడో! ఛ! నా తండ్రి పేరు, రూపుమాపటానికి నేను చెడపుట్టాను. పాపం, ఈ చిన్నారి దూడను కన్న ఆ గోమాత ఎక్కడెక్కడ వెతుకులాడుతున్నదో! చచ్చిన ఈ లేగ కంటపడగానే అది ఎంతగా విలపించి గోలపెడుతుందో కదా! ఉహూ!! దాని దుఃఖం నేను ఈ కన్నులతో చూడలేను. మళ్ళీపోయి, నా తండ్రికి ముఖం చూపలేను. ఆయనకు ఈ వార్త తెలియకముందే నేను ప్రాణాలు విడిచేస్తాను. ఇదే కర్తవ్యం," అంటూ విధివిడంగుడు కుమిలిపోయాడు.

అక్కడ ఉన్నవాళ్లందరూ అతనిని ఓదార్చసాగారు. ఇంతలో ఆవు 'అంబా! అంబా!!' అని తన లేగకోసం అరుచుకొంటూ, పరుగెత్తుకొని రధం దగ్గరకు వచ్చింది. అది పడిన దుఃఖం, ఆవేదన చూచిన ప్రతివాళ్ళకూ కన్నులవెంట జలజల నీటిచుక్కలు రాలినై. ఆ ఆవు అట్టేసేపు అక్కడ ఆగలేదు. అది సరాసరి రాజుగారి కోటకు చేరుకొని, న్యాయగంటకు కట్టివుండే తాడు నోటితోపట్టి లాగేవరకు గంట గణగణ మ్రోగింది. రాజు ఆత్రంతో గబగబ భవనం దిగివచ్చి కన్నీరు కార్చుతూ దుఃఖసముద్రంలో మునిగివున్న ఆ ఆవును చూచి ఆశ్చర్యపోయాడు. నోరులేని ఈ ఆవుకు ఏమి విపత్తు సంభవించివుంటుందా అని వివరాలు కనుక్కునేటప్పటికి, నిజం తెలిసి, ఆయన తక్షణమే మూర్ఛపోయాడు. ప్రియమైన తన కుమారుడే ఈ పాపపు పని చేశాడని విన్నప్పుడు, ఆయన విచారానికి అంతులేకపోయింది. చాలాసేపటి ప్రభువుకు స్మృతివచ్చింది. తరువాత ఆయన న్యాయం బాగా ఆలోచించి, మంత్రితో "ప్రాణానికి బదులు మళ్లీ ప్రాణం యివ్వటమే ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నయి కనుక, ఏ రథం క్రిందనైతే ఆ ఆవుదూడ చచ్చిపోయిందో, ఆ రథచక్రాలనే శరీరంపైన దొర్లించి, నా కుమారుని ప్రాణం తీయించవలిసింది" అని ఆజ్ఞాపించాడు. రాజు చేసిన ఈ ఉత్తరవు వినగానే మంత్రి గుండె నీరైపోయింది. 

కాని ప్రభువు ఆజ్ఞకు ఎదురుచెప్పటానికి వీలులేదు కదా? రాజకుమారుని చంపించటానికి మనస్సు ఒప్పక, చేసేదిలేక, రెండవకంటివానికి తెలియకుండా మంత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంగతి రాజుకు తెలిసి, తనే రథం మీద ఆవుదూడ చచ్చిన ప్రదేశానికి వెళ్లి, తను చెప్పిన తీర్పు ప్రకారం, కుమారుని పైన రథచక్రాలు దొర్లెటట్టు ఏర్పాటు చేసి, వానిని చంపించి వేశాడు. "నాకు కుడిభుజంగా వున్న మంత్రి పోయాడు. లేకలేక పుట్టిన నా కుమారుడు పోయాడు. ఇక, ఇదివరకులాగా రాజ్యపాలన జరపటం నా వల్ల అయే పనికాదు. కనుక నేను బ్రతికిమాత్రం ఏమి లాభం." అనుకుంటూ రాజు కళ్ళుమూసుకొని దేవుని ధ్యానించి, కత్తితో పొడుచుకొని చనిపోబోయాడు. అప్పుడు ఒక చిత్రం జరిగింది. "మహారాజా! నీవు ఆత్మహత్య చేసుకోవటానికి వీల్లేదు. నీవు ధర్మప్రభువనీ, నీ రాజ్యంలో ధర్మం నాలుగుపాదాలా నడుస్తున్నదనీ, మానవులకూ, నోరులేని మూగ జీవులకూ ఒకే విధమైన న్యాయం దొరుకుతుందనీ కీర్తికాంత చెప్పగా విని, నిన్ను పరీక్షింపవచ్చిన ధర్మదేవతను నేను. నీవు పరీక్షకు నిలిచావు, సంతోషమైంది. ఈ పరీక్షవల్ల నీ కీర్తి ఇంకా ఎక్కువగా వ్యాపించబోతున్నది. నీవు ఇదే విధంగా రాజ్యంలో ధర్మం నిలిపి, ప్రజలకు శాంతి సౌఖ్యాలు కూర్చవలసింది" అంటూ, ఒక అశరీరవాక్కు వినిపించింది. రాజు ఆశ్చర్యభరితుడై కన్నులు విప్పేసరికల్లా, ప్రాణసమానుడైన తన కుమారుడు, మంత్రి కూడ బ్రతికివచ్చారు. రథం క్రింద పడిన ఆవు దూడకూడా ధర్మదేవత అనుగ్రహం వల్ల బ్రతికి, తల్లికి ఆనందం కలిగించింది. 


Comments