అనగనగా ప్రసన్న అనే అందాల బాలిక వుండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపుఒడ్డున నాగకన్యలతో ఆడుకొనేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకమందు వనలక్ష్మి 'పండూ' అంటే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. 'పూయీ' అంటే పువ్వులు పూస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో "అమ్మాయీ! ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి. కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి, ఏటికేడాదీ రాత్రింబగళ్లు కష్టపడినా రైతులకి సాయపడాలి. నువు నాగకన్యలతో ఆడుకొంటూవుండు. కాని, వాళ్లను విడిచి ఒక్కతెవూ మాత్రం ఎక్కడకూ పోబోకు" అని చెప్పింది. "అలాగేలే" అంటూ ప్రసన్న, ఉత్సాహంతో గెంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినపడగానే ఆమె నేస్తులయిన నాగకన్యలు బిలబిలమంటూ వచ్చేసి ఇసికలో కూర్చున్నారు. వాళ్ళు కొంతసేపు పిచ్చికగూళ్ళు కట్టుకొన్నారు. మళ్లీ వాటిని పడగొట్టివేశారు. తరువాత నాగకన్యలందరూ తాము తీసుకువచ్చిన నత్తగుల్లలతో ఒక అందమయిన దండ గుచ్చి, దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు. ప్రసన్న పూలతోటలోనించి తెచ్చిన పూలతో మాలికలుచేసి వాళ్లకు వేసింది. ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకొన్నాక వాళ్లతో ప్రసన్న, "మనం ఇంకా కొంచెం దూరం వెళదాం, రండి. అక్కడ రకరకాల పువ్వులూ వింతవింత పువ్వులూ ఉన్నాయి. చక్కా దండాలు గుచ్చుకుని ఆడుకుందాం" అని పిలిచింది. అందుకు వాళ్లు "తడి జాగా దాటి పొడిగా వుండే చోటుకి వస్తే మాకు జబ్బు చేస్తుంది. కనుక మేము రాము," అని కచ్చితంగా చెప్పేశారు.
అప్పుడు ప్రసన్న, "సరే, మీరిక్కడనే ఉండండి, అదిగో ఆ తోటకు వెళ్లి మంచి మంచి పుష్పాలు కోసి నిమిషంలో పట్టుక వస్తాను." అని అంటూ, పరుగుచ్చుకున్నది. చెప్పినట్టుగానే విచిత్రమయిన పువ్వులు ఒడిలో నింపుకొని ఆమె తిరిగి వస్తూవుంటే, దారిలో చాలా సుందరమయిన ఒక పువ్వులగుత్తి కంటపడింది. ఒక గుత్తికి వందపువ్వులు ఉండటం చూసి ఆమెకు చాలా ఆనందమయింది. "ఇటువంటి వింతపువ్వు విత్తనం ఉండాలి కాని, పువ్వు మాత్రం పట్టుకెళితే చాలదు" అని అనుకొని, మొక్క పళాన లాగివేయటానికి ప్రయత్నించింది. ప్రసన్న కష్టపడి లాగగా, కొంతసేపటికి మొక్క వేళ్ళతో సహా ఊడివచ్చింది కాని, ఆ ఊడివచ్చిన రంధ్రం చూస్తూవుండగానే పెద్దయిపోయి, భూమి కిందినించి పెళపెళమనే ధ్వని కూడా వినపడింది. క్రమంగా ప్రసన్నకు గుర్రాలు పరిగెత్తుతున్నట్టు, రథం నడుస్తున్నట్టు కూడా అలికిడి అయింది. కావడమేమిటి? మరొక్క చిటికసేపటిలో మూడు నల్లగుర్రాల రథంలో పాతాళలోకాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు. ఆమె భయపడి "అమ్మా అమ్మా!" అని కేకలువేసింది. కాని వనలక్ష్మికి ఈ కేక వినపడలేదు. ఇంతలో పాతాళరాజు ప్రసన్నను పట్టి రథంపయిన కూర్చోబెట్టుకుని, వాయు వేగంతో తన లోకానికి తీసుకుపోయాడు. ఆమె బెంగతోనూ భయముతోనూ ఎడ తెరిపిలేకుండా ఏడవటం చూసి, రాజు "ప్రసన్నా! నీవు నాకు రాణిగా ఉండు. నీవు ఏమికోరినా సరే, క్షణంలో తెచ్చి ఇస్తాను. నీకు వచ్చిన భయమేమీలేదు" అని అనేకవిధాల నచ్చజెప్పాడు.
"ఏమయినాసరే, నేనిక్కడ ఉండను. నన్ను మా అమ్మ దగ్గర దిగబెట్టివేయం" డని ప్రసన్న పోరుపెట్టింది. కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతురుని పిలిచింది. ప్రసన్న పలకలేదు. సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆమెతో రోజూ ఆడుకొనే నాగకన్యలను అడిగింది. వాళ్లు జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వనలక్ష్మి "ఇది కొంటెపిల్ల. ఒక్కర్తే ఎక్కడికో పోయి వుంటుంది. ఏమి ఆపద వచ్చిందో!" అని అనుకొని చాలా విచారించింది. తొమ్మిది రాత్రిళ్ళు, తొమ్మిది పగళ్ళూ నిద్రాహారాలు లేకుండా ముద్దులకూతురు కోసం దివ్వె చేతపట్టుకొని భూలోకమంతా తిరిగింది. పోగాపోగా, ఆమెకు చందమామ కనపడ్డాడు. ఆయన్ని అడిగితే, "ప్రసన్న కేకలు వినపడ్డాయి కాని, ఎటుపోయిందో తెలియదు. పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్యమహారాజుకి తెలుస్తాయి. కనుక ఆయనను కనుక్కో" మన్నాడు. వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్లి సంగతులన్నీ చెప్పింది. అందుకాయన "తల్లీ! నువు బెంగపెట్టుకోనక్కరలేదు. అమ్మడు పాతాళలోకంలో సురక్షితంగా వున్నది. ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు" అని పాతాళలోకం ఆనవాలు చెప్పాడు. ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. "పాతాళరాజు నా ముద్దుల కూతురుని తెచ్చి వప్పగించేవరకూ భూలోకంలో మళ్లీ పంటలు పండకూడదు, చెట్లు కాయకూడదు, పూవులు పోయకూడదు. ఇదే నా ఆజ్ఞ" అని చెప్పి వనలక్ష్మి శపించివేసి, కదలకుండా మాటాడకుండా దివ్వె చేతపట్టుకుని అలానే విచారముతోనూ, కోపముతోనూ, పట్టుదలతోనూ, కూర్చున్నది.
ఆ క్షణంనించీ భూమిపయిన ఒక్క గడ్డిపరక కూడా మొలవడం మానివేసింది. రైతు ఎంత కష్టపడితేమటుకి ఏం లాభం? ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువువచ్చి జనం మలమల మాడిపోసాగారు. రక్షించమంటూ జనులు దేవతలను ప్రార్థించగా, వారు అనేకవిధాల లక్ష్మితో "కోపగించుకోవద్దనీ, పంటలు మామూలుగా పండనీయవలిసిందనీ" కోరారు. కాని ఎవరు ఏమిచెప్పినా ఆమె చెవినిపెట్టలేదు. అప్పుడు అందరూ అలోచించి, ప్రసన్నను తిరిగితీసుకురావటానికి రాయబారిని పంపించారు. అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో లాలించి దయగా చూస్తున్నాడు. ఎప్పటికయినా ఆమెకు తన మీద ప్రేమ కలుగకపోతుందా అని అయన ఆశ. కాని, రాజు సొమ్ము చీపురుముల్లంతయినా, తనకు చెందినట్టయితే ఆయనకి రుణపడిపోవలిసి వస్తుందనే జంకుతో ప్రసన్న పచ్చి మంచి నీళ్లయినా ముట్టేది కాదు. ఎంతో విలువయినవీ, అపురూపమైనవీ తినుబండారాలు ప్రత్యేకంగా తయారుచేయించి "ప్రసన్నా! ఇప్పటివరకూ నువు ఇక్కడ ఒక్క కణమైనా కొరక్కపోవడం బాగులేదు. ఇదుగో ఇవి తిను, నాకు సంతోషంగా వుంటుంది." అని ఆమె ముందు ఉంచాడు. "నాకివేమీ వద్దు. మా అమ్మ తోటలో పండు కావాలి. నన్ను తీసుకుపోయి భూలోకంలో వదిలేయం"డని కోరింది.
"అలా కాదు, మీ తోటలో పళ్ళు నేనే ఇక్కడికే తెప్పించుతాను" అని అంటూ, ఈ పని మీద అనేకమంది భటులను పంపించాడు. అంతమంది భటులూ వెళ్లి, భూలోకం అంతా వెతికి ఒక ఎండిపోయిన దానిమ్మపండు పట్టుకురాగలిగారు. ఆ పండు చూడగానే, ఆకలితో వున్న ప్రసన్న, ఇక తప్పదనుకొని, అందులోవి ఆరు గింజలు తీసుకుని, నోట్లో వేసుకు చప్పరించింది. ఇంతలో ప్రజలుపంపిన రాయబారి కోటలోకి వచ్చి, ప్రసన్నను తల్లివద్దకు రమ్మన్నాడు. తన చేతిలోవున్న దానిమ్మ పండువేపు చూచి తొందరపడి ఆరు గింజలూ నోట్లో వేసుకున్నందుకు ఆమె విచారించింది. ఆమె ఆ గింజలు తినటం చూచి, పాతాళరాజు సంతోషించాడు. "సరే, ప్రసన్నా! నీకంతగా వెళ్ళిపోవాలని ఉంటే వెళ్లిపోవచ్చు. కాని, నా రాజ్యంలో ఆరు దానిమ్మ గింజలు తిన్నావు గనుక, ఏడాదిలో ఆరు నెలలు ఇక్కడికి వచ్చి నాతోపాటు వుండాలి" అన్నాడు. సరేనని ప్రసన్న రాయబారి వెంబడి వెళ్లిపోయింది. ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒడిలో దూరిపోయింది. కూతురు కంటపడగానే వనలక్ష్మికి కోపమంతా మాయమైపోయింది. ఆమె పెట్టిన శాపం వెంటనే తీసివేసింది. తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా, పచ్చటి పైరులతో అందమైన పువ్వులతో మళ్లీ కళకళలాడింది. పాతాళరాజు పెట్టిన షరతు విని, వనలక్ష్మికి కోపం వచ్చింది. కాని, ప్రసన్న "అమ్మా! ఇందుకోసం నువు బెంగపెట్టుకోవద్దు. ఆయన చాలా దయకలవాడు. నాకు ఏ లోపమూ చేయడంలేదు," అని చెప్పేసరికి, వనలక్ష్మి ఆ మాటకు వొప్పుకుంది.
Comments
Post a Comment