విక్రమ బేతాళ కథలు - మిత్ర వంచన

Vikramarka answers Betal about betrayal in friendship. Best Vikram Betal Telugu story to read.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఏ మోసగాడి మెప్పు కోసం నీవీ విధంగా శ్రమ పడుతున్నావో నాకు తెలీదు. కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకా మార్గసింహుడి కథ చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: చతురగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడుండేవాడు. చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహమయింది. వాడి పేరు మార్గసింహుడు. వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు. యుక్తవయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం వెళ్ళిపోయాడు.

రాజైపోవటంతో చిత్రసేనుడి జీవిత విధానమంతా మారిపోయింది. ఇప్పుడతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పనిలేదు. అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరువలేదు. తన చిన్ననాటి స్నేహితుడిప్పుడు రాజయ్యాడు గనక తనకిక ఏ లోటు ఉండదని వాడనుకున్నాడు. ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చి దిద్దుకోలేదు. తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి, బికారి అయ్యాడు. పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభామంటపం వద్దకు వెళ్లి వేచి ఉన్నాడు. కొంత సేపటికి రాజు సభకు వచ్చాడు, మార్గసింహుణ్ణి చూశాడు, కానీ గుర్తించనట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా రెండు మూడు రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది. తనకూ రాజుగారికీ ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢీ చేసుకున్నాడు. తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి, "వేటగాడు తిండికి మాడవలిసిన గతేమిటి? ఇవాళ మేమంతా వేటకు పోతున్నాం. మా వెంట అడివికి రా!" అని పిలిచారు. మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మిగిలిని వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు. మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా చిక్కలేదు. వాడికి వేట బొత్తిగా రాదు.

సూర్యాస్తమయం వేళ వేటగాళ్లు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకుని ఇళ్లకు తిరిగి పోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్ళతో కలవటానికి సిగ్గు వేసింది. వాడు ఒంటరిగా ఒక కాలి బాట వెంబడి నడుస్తూ పోసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికొక గుహ కనిపించింది. గుహలోకి వాడు తొంగి చూడగా, ఒక అందమైన యువతి కూర్చుని ఉన్నది. ఆమె తొడపైన తల పెట్టుకుని ఒక మునీశ్వరుడు నిద్ర పోతున్నాడు. అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు. అది గమనించిన ఆమె, ముని లేస్తే ప్రమాదమనీ వెళ్ళిపొమ్మనీ అతనికి సైగ చేసింది. మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ, అంత అందమైన స్త్రీ తన బాల్య మిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదనీ, ఈమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గ తొడిగి పది కాలాల పాటు ఫలితాలనిస్తుందనీ ఆలోచన చేశాడు. వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి, రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పటానికి వచ్చానని కబురు చేశాడు. వెంటనే రాజుగారి దర్శనం లభించింది. 

మార్గసింహుణ్ణి చూసి రాజు, "మనం కలుసుకుని చాలా కాలమయింది. నిన్ను నేను మరిచాననుకోకు. కానీ రాజరికం ఒక పంజరం లాంటిది. వెనక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు. ఇంతకూ నీవు చెప్ప వచ్చిన రహస్యం ఏమిటి?" అన్నాడు. "అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను. ఆమె దేవకాంత అనుకోవలసిందే గాని మానవ కాంత కాదు. ఆమె వెంట ఒక మునీశ్వరుడున్నాడు. ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది గాని, ముని వద్ద గుహలో ఉండదగినది కాదు. మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు. ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం," అని చెప్పాడు మార్గసింహుడు. చిత్రసేనుడికా స్త్రీని కాజెయ్యాలని బుద్ధి పుట్టింది. అతను వెంటనే మంచి దుస్తులు ధరించి, రెండు గుర్రాలను తెప్పించి, ఒక దాని మీద తానెక్కి, రెండో దాని పైన మార్గసింహుడిని ఎక్కమని, మార్గసింహుడి వెనకగా, అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. గుహకు కొంత దూరంలో ఇద్దరూ గుర్రాలు దిగారు. చిత్రసేనుడు తన స్నేహితుడితో, "నీవు గుహలోకి తొంగి చూసి, మునీశ్వరుడింకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు. నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడ పైకి మార్చుకుని ఆ స్త్రీని నా వద్దకు పంపు. తరవాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను," అన్నాడు. మార్గసింహుడు గుహలోకి పిల్లిలా ప్రవేశించాడు. ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకుని అలాగే నిద్రపోతున్నాడు. 

మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా, "నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు. ఆయన నవ మన్మధుడు. ఈ ముని తల నా తొడ మీదికి మార్చి, నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో," అన్నాడు. వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో ముని తలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి, నిర్బంధంలో నుంచి బయట పడిన పక్షి లాగా బయటకి పారిపోయింది. చిత్రసేనుడామె అందం చూసి నిర్ఘాంతపోయాడు; ఆమె అతనూహించిన దాని కన్నా చాలా రెట్లు అందంగా ఉన్నది. అతనామెను తన గుర్రం మీద ఎక్కించుకుని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతో సేపు చూసి, తనను బాల్య మిత్రుడు వంచన చేశాడని గ్రహించి, కంట తడి పెట్టుకోసాగాడు. అతని కన్నీటి చుక్కలు మీద పడి ముని నిద్రలేచి కూర్చుని, ఆడదానికి మారుగా ఎవడో మగవాడుండటం చూసి, "ఎవరు నువ్వు? ఆ స్త్రీ ఏమయింది?" అని అడిగాడు. మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ, ఆ మునికి జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పేశాడు. అంతా విని ఆ ముని, "దుర్మార్గుడా, పాపిష్టివాడా! ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో!" అని శపించాడు. ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు. 

బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయిన వాడూ, మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి శపించక, తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక,  గోరుచుట్టు పైన రోకటి పోటులాగా, హతాశుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు? దాచకుండా ఉన్న మాట చెప్పినందుకైనా వాడి పైన ఆ ముని ఎందుకు జాలి తలవలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "రాజు కృతఘ్నుడే, కానీ లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు. అందమైన స్త్రీలను సంగ్రహించడం రాజులకు స్వాభావికం. అందుచేత ముని రాజును శపించలేదు. ఇక, ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు. ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక రాజాంతఃపురంలో ఉండాలని ఉన్నట్టయితే అది ఆమె దురదృష్టం. అందుకామెను శిక్షించడం అనవసరం. పోతే, గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పని చేశాడు. ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగట్టుతాడు. అంతే గాక వాడు ఏనాడో జీవచ్ఛవమైపోయాడు. వాడే విధంగానూ బతకలేకనే ఎండమావి లాంటి రాజాదరాన్ని వాంఛించాడు. అందుచేత చావు వాడికి విమోచనమే గాని, శిక్ష కాదు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments