చందమామ కథలు - బహుమానం

Telugu Chandamama Story of how a situation put a poor man in a misunderstanding situation. Best Chandamama telugu story on honesty.
ఒక గ్రామంలో గంగులు, గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి, ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకు 'గగనమ్మ' అని పేరుపెట్టి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గవరమ్మ ఎంతకాలం నించో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక బంగారం కాసు కొన్నది. దానిని భర్తకు ఇచ్చి, " కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి" అని చెప్పి పంపింది. బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు. ఆ వూరిలోనే బులిబాపిరాజుగారనే జమీందారు ఉన్నాడు. ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది. బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది. కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్ళాలంటే బాపిరాజుగారి గుమ్మం ముందునించే వెళ్లాలి. గంగులు ఆ దారిని పోతూవుండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయారు. సావిట్లో తాటాకు చాప మీద గంగులును కూర్చోబెట్టి రాజుగారు మాటాడుతూండగా,  ఏడుస్తూ వున్న మూడేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది. ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూచి, గంగులు "మన గగనకు కూడా ఇటువంటి మురుగులేకదా చేయించబోతున్నాము" అనుకొని, మురిసిపోయాడు. ఇంతలో బసవమ్మ లోపలి నించి గబగబ వచ్చి, పిల్ల ఆడుకొంటూ వున్న స్థలమంతా వెతికింది. "ఎందు కలా వెతుకుతున్నా?" వని భర్త అడిగేవరకు "అమ్మాయి ఏడుస్తూ వుంటే నారాయణమ్మగారు రెండు కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది. ఇప్పుడు వెతికితే, ఒక్కటే కనపడుతున్నది" అని చెప్పింది.

ఈ మాట వినగానే రాజుగారు "ఏమి గంగులూ నువుగాని తీయలేదుకద ?" అని అడిగారు. ఇప్పుడు గంగులు సంగతి చిక్కులో పడింది. ఇక్కడ రాజుగారి ఇంట్లో కాసు కనపడకుండా పోయింది. తను పేదవాడు కావటంచేత, ఆ సమయంలో అక్కడనే ఉండటంచేత, తనను వారు అనుమానించటంలో ఆశ్చర్యం లేదు. పైగా, తన వద్ద సరీగా ఒకే ఒక కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది. కనుక, అతను ఏమి చెప్పుకొందామనుకొన్నా లోకం నమ్మదు. అందుచేత, తన వద్ద ఉన్న కాసు వారికిచ్చివేసి, "నేనే తీశా?" నంటే తీరిపోతుందనుకున్నాడు. తన కాసు ఒక్కటీ వారికి ఇచ్చివేస్తే, మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తయి? ఇంతకూ ఇంటికిపోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం? ఈ విధంగా గంగులు, మనస్సులో మధనపడి, తనవద్దనుండే కాసు తీసి రాజుగారికి ఇచ్చివేసి, ఉసూరుమంటూ తన మానాన తను పోయాడు. గవరమ్మ అస్తమానం 'ఏమండీ! ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు?" అని భర్తను పోరుతూవుండేది. "ఇదుగో అదుగో" అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పనిమీద, ఆ వీధిని పోతూ, గవరమ్మ కంట పడేసరికి, ఆమె బ్రహ్మన్నను నిలేసి అడిగింది. ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్ఘాంతపోయాడు. తరువాత నిజానిజాలు బయటపడ్డాయి. భర్త ఇంటికి వచ్చిన తరువాత "ఏమిటి మోసం?" అని గవరమ్మ కంగారుపడుతూ అడిగింది. ఆనాడు బాపిరాజుగారి ఇంట జరిగినదంతా గంగులు దాపరికం లేకుండా చెప్పే వరకు, ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది.

ఒక రోజున బాపిరాజుగారి భార్య బసవమ్మ వడ్లు ఎండబోసింది. సాయంత్రం ధాన్యం ఎండిన తరువాత వాటిని బస్తాలకు ఎత్తి, చాపలు దులుపుతూ వుండగా, ఒక తాటాకు చాపలోనించి బంగారపు కాసు ఒకటి కింద రాలింది. బసవమ్మ ఆశ్చర్యంతో గబగబ ఇంట్లోకి పోయి, తన వద్దనున్న కాసులు లెక్క చూచింది. "నా పెట్టెలో ఉండవలసిన పధ్నాలుగు కాసులూ సరీగానే ఉన్నవి. ఆరోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగి ఇచ్చి వేశాడుకదా. మరి, అదనంగా ఇప్పుడు ఈకాసు ఎక్కడినించి వచ్చిందీ?" అని ఆమెకు సంశయం కలిగింది. ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే, ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు. పధ్నాలుగు కాసులూ పరీక్షించగా అందులో పదమూడు కాసులు 1830 లో తయారయినట్టూ, ఒక్కటి మాత్రం 1843 సంవత్సరంలో తయారైనట్టూ వాటి మీదనుండే ముద్రలు చెప్పాయి. అప్పుడు రాజుగారు "మన పధ్నాలుగు కాసులూ ఒక్కసారిగా కొన్నవే. కనుక వాటన్నిటిపయినా ఒకే సంవత్సరం వేసి ఉండాలి. ఇందులో పదమూడు కాసులు మనవే, కాని 1843 సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు" అని నిశ్చయించారు. "అయితే ఈ కాసు గంగులిదే అయి ఉండాలి" అని బసవమ్మ అన్నది. వెంటనే గంగులుకి కబురంపి పిలిపించారు. కాసును గురించి మళ్లీ వారు అడిగేవరకు గంగులు హడలిపోయాడు.

"నీకొచ్చిన భయం ఏమి లేదు, గంగులూ! నిజంచెప్పు" అని బసవమ్మగారు నెమ్మదిగా అడిగిన మీదట, కళ్ల నీళ్లు గుక్కుకుంటూ గంగులు జరిగిన కథ అంతా చెప్పాడు. అదంతా విని, "అయ్యయ్యో, ఎంతపని జరిగింది!  గంగిగోవువంటి గంగులు మనస్సు ఎరక్కపోయి కష్టపెట్టామే. నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఈడ్చాము" అని బసవమ్మగారు అనేక విధాల విచారించింది. గంగులు ఇంటికి వెళ్లిపోయాడు. ఇలా వుండగా, మరో వారం రోజుల కల్లా పెళ్లామునూ, బిడ్డనీ వెంటబెట్టుకు రమ్మన్నారని చెప్పి గంగులుకు బులిబాపిరాజు గారి వద్ద నించి మళ్లీ కబురువచ్చింది. రాజుగారి కబురంటే "గొప్ప దొరలతో పని ఏమిమాట వచ్చిపోతుందో" నని గంగులు భయపడుతూనే వుంటాడు. ఏమయితే మటుకి తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ? కుటుంబాన్ని వెంటబెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చుని వున్నాడు. గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి, అందులో వస్తువులు బసవమ్మగారికి అందించాడు. ఆమె ఒకొక్క వస్తువే అంది పుచ్చుకుని, చేతికి మురుగులు, కాళ్లకు గొలుసులు, మెడలో ముత్యాలహారమూ, వేలికి ఉంగరమూ, స్వయంగా గగనకు తొడిగి, అలంకరించింది. ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది. చిన్నారి గగనమ్మ చిట్టిగంతులు చూచి ఆమె తలిదండ్రులూ రాజుగారి కుటుంబమేగాక అక్కడ వున్నవారు అందరూ ఎంతో సంతోషించారు.


Comments