విక్రమ బేతాళ కథలు - కర్మపరిపాకం

Vikram answers Betal on the real reason why a person did not seek salvation till an incident happened. Best Vikram Betal Telugu Stories to Read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ వేళ కాని వేళ నీవీ విధంగా ఈ శవాన్ని మోస్తున్నావంటే నీ కర్మపరిపాకం చెందక పోవటమే కారణమని తోస్తుంది. పూర్వం నీలాగే ధనగుప్తుడనే వాడు తరించటానికి ఎన్నో అవకాశాలు లభించి కూడా, కర్మపరిపాకం కానందున ఎన్నో హీన జన్మ లెత్తాడు. శ్రమ తెలియకుండా ఆ ధనగుప్తుడి కథ చెబుతాను, విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: ధనగుప్తుడు కాశీ నగరంలో వ్యాపారం చేసుకునేవాడు. వ్యాపార దక్షత కలవాడు కావటం చేత ధనం పుష్కలంగా గడించాడు. ధనార్జనకు తగ్గట్టు ధనగుప్తుడికి దైవ భక్తీ, ధర్మపరత్వమూ కూడా ఉండేవి.

ఎప్పుడూ బీదలకు దానాలు చేసేవాడు. యతులకు, సన్యాసులకు ఆతిథ్య మిచ్చే వాడు. అతనికి ముగ్గురు కొడుకులుండేవారు. ఒకనాడు మానససరోవరం నుండి దయానందుడనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు. ధనగుప్తుడాయనకు భక్తితో పాదపూజ చేసి, ఆతిథ్యమిచ్చాడు. అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి, సిద్ధుడు ధనగుప్తుణ్ణి ఏకాంతంగా దగ్గిరికి పిలిచి, "నాయనా, నీకు తరించే దారి చూపమంటావా?" అని అడిగాడు. ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకుని, "స్వామీ, అంతకంటె నాకు కావలిసిందేమున్నది? అయితే నా కొడుకు లింకా చిన్నవాళ్లు. మరొక అయిదేళ్ళు పొతే వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడ గలుగుతారు. అప్పుడు నాకు తరించే మార్గం ఉపదేశింతురు గాని," అన్నాడు. సిద్ధుడు, "సరే, అలాగే కానీ!" అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన ఆరు మాసాలకే ధనగుప్తుడు గుండె జబ్బు వచ్చి మరణించాడు. అతని కొడుకులు చిన్న పిల్లలు కావటం చేత వారికి వ్యాపారం గొడవలు తెలియలేదు. వారికి తోడ్పడే మిషమీద పదిమందీ చేరి వారి డబ్బంతా తినేశారు. వ్యాపారం మూలపడే సరికి ధనగుప్తుడి కొడుకులు రెండు గిత్తలను కొని వ్యవసాయం సాగించారు. వారికి అందులో కొంత కలిసి వచ్చింది. ఏదో ఒక విధంగా వారు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ధనగుప్తుడు చెప్పిన అయిదేళ్ల గడువు తీరగానే దయానంద సిద్ధుడు మళ్ళీ వచ్చాడు. ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకుని సిద్దుడు తిరిగి వెళ్ళిపోతూ, బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న ఒక గిత్తను చూసి అది ధనగుప్తుడే నని తెలుసుకున్నాడు. 

ఆయన ఆ గిత్తను సమీపించి దానిపై కమండలూదకం చల్లి, "నాయనా, ఇప్పుడైనా తరుణోపాయం చెప్పమంటావా?" అని అడిగాడు. ఆ గిత్త మనుష్య భాషలో, "స్వామీ, మరొక అయిదు సంవత్సరాలు ఆగండి. నేను లేని కారణంచేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బ తిని వ్యవసాయం మొదలు పెట్టారు. నా సహాయంతో వాళ్ళకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగా ఉంటున్నది. మరో అయిదేళ్ళిలాగే సహాయపడ్డానంటే వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడతారు," అన్నది. "సరే, అలాగే కానీ!" అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. సిద్ధుడు వెళ్ళిన కొద్ది కాలానికే ఆ గిత్త రోగం వచ్చి చచ్చింది. అది మొదలు ధనగుప్తుడి కొడుకులకు వ్యవసాయంలో నష్టం వచ్చింది. కారణాంతరాలు కూడా ఏర్పడటం వల్ల వాళ్ళు ఉన్న కాస్త పొలమూ, ఇల్లూ పోగొట్టుకుని, ఊరి చివర చిన్న పాక ఒకటి వేసుకుని, కూలి చేసుకుంటూ పొట్ట పోసుకోసాగారు. మళ్ళీ అయిదు సంవత్సరాలు కాగానే సిద్ధుడు, గిత్త రూపంలో ఉన్న ధనగుప్తుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టు విని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క బొంయి మని అరుస్తూ ఆయన మీదకి వచ్చింది. సిద్ధుడు దాని పై కమండలూదకం చల్లి, "ఏమి నాయనా, ఇప్పటికైనా ఉపదేశం పొందుతావా?" అని అడిగాడు. "ఇంకొక్క అయిదు సంవత్సరాలాగండి, స్వామీ. నా కొడుకులు కూలి చేసుకుని కాస్త కాస్తే వెనక వేసుకుంటున్నారు. యాచకులూ, దొంగలూ రాకుండా నేను కాపలా కాస్తున్నాను. అయిదేళ్ళు ఇలా కాపాడానంటే ఆ తరువాత వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళే నిలబడతారు," అన్నది కుక్క మనిషి భాషలో.  

"సరే అలాగే కానీ!" అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకే ఆ కుక్క కూడా చనిపోయింది. ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్టపు జీవితం గడుపుతున్నారు. అయిదేళ్ళు తిరగగానే తిరిగి సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు. కుక్క విషయం ఆయన విచారించగా ధనగుప్తుడి కొడుకులు అది నాలుగైదేళ్ల కిందట రోగం వచ్చి చనిపోయినట్టు చెప్పారు. సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్యదృష్టితో వెతకగా అతను భూమిలోపల ఒక చోట పాము రూపంలో లంకె బిందెలను అంటి పెట్టుకుని ఉన్నట్టు తెలియవచ్చింది. ఆయన ధనగుప్తుడి కొడుకులతో, "నాయనలారా, మీకు లంకె బిందెలు దొరికే చోటు చూపుతాను, వాటిని తవ్వి తెచ్చుకుంటారా?" అని అడిగాడు. "అంతకంటే కావలిసిందేమిటి?" అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురూ, మూడు గడ్డపారలు తీసుకుని సిద్ధుడి వెంట వెళ్ళి, ఆయన తవ్వమన్న చోట తవ్వారు. లంకెబిందెలు దొరికాయి, కాని వాటిని చుట్టుకుని ఉన్న ఒక పాము తల ఎత్తి చూసింది. వెంటనే ముగ్గురూ దాని మీద మూడు దెబ్బలు వేశారు. సిద్ధుడు వారిని వారించి ఆ పామును పూర్తిగా చంపకుండా కాపాడి, దాని పై కమండలూదకం చల్లి, "నాయనా, ఇప్పుడైనా తరించే మార్గం చెప్పమంటావా?" అని ప్రశ్నించాడు. పాము బాధగా తల ఎత్తి, మానవ భాషలో, "త్వరగా చెప్పండి, స్వామీ," అన్నది. సిద్ధుడు దాని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అంతా విని పాము తల వాల్చేసి ప్రాణాలు విడిచింది. 

ధనగుప్తుడి కొడుకులు ఆ లంకె బిందెలు పట్టుకుపోయి, తిరిగి ఆస్తి పాస్తులు సంపాదించి బాగుపడ్డారు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. పాము జన్మ కన్న కుక్క జన్మా, దాని కన్న పశువు జన్మా, దాని కన్న మానవ జన్మ ఉత్తమమైనవి గదా. ఉత్తమ జన్మలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడికి తరించాలని లేని తహ తహ పాము జన్మలో ఎందుకు కలిగింది? అతను ఇంకా హీన జన్మలెత్తవలసి వస్తుందని భయపడ్డడా? లేక లంకె బిందెలు పొందాక తన కొడుకులకు తన సంరక్షణ యిక అవసరముండదనుకున్నాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "ధనగుప్తుడి మనసు మారటానికి హీన జన్మలెత్తుతానన్న భయమూ కారణం కాదు, ఇకముందు తన కొడుకులకు తన సంరక్షణ అవసరముండదన్నదీ కారణం కాదు. కొడుకుల పై గల మమకారమే అతన్ని తరించనివ్వకుండా చేసింది. ఆ మమకారం చేతనే అతను కుక్క జన్మ ఎత్తికూడా తాను హీన జన్మ ఎత్తినందుకు విచారించలేదు. ఇక సంరక్షణ మాటకు వస్తే, అతను ఎంతగా సంరక్షించినా అతని కొడుకుల స్థితి అంత కంతకూ దిగజారి పోయిందేగాని, అణు మాత్రమైనా మెరుగు కాలేదు. అందుచేత ధనగుప్తుడిలో అసలైన పరివర్తనకు కారణం కొడుకులపై మమకారం పోవటం; దానికి కారణం వారు అతన్ని కొట్టిన చావు దెబ్బలు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments