చందమామ కథలు - యుక్తిపరుడు

 

Telugu Chandamama stories of three friends who try to win the princess to become king. Best Chandamama telugu stories to read.

అనగనగా ఒక నగరములో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అందులో ఒకడు ధనికుడు, రెండవవాడు విద్వాంసుడు, మూడవవాడు యుక్తిపరుడున్ను. ఈ ముగ్గురిలో ఒకప్పుడు "నేను అధికుడ" నంటే "నేను అధికుడను" అని వాదోపవాదాలు బయల్దేరినై. అప్పుడు వారిలో ఒకడు "అబ్బాయీ! ఈ నగరపు రాజకుమారి "నేను పురుషుల ముఖము చూడను" అని శపథం పట్టి, పురుషుల కంట పడకుండా ప్రత్యేకం ఒక మేడ కట్టించుకొని, అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాటాడి, ఆమెను పెళ్లాడిన "వాడే సమర్థు" డని చెప్పేవరకు, తక్కిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు. వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగ నంతర్పణలు, సమారాధనలు, దానాలు, ధర్మాలు చేయనారంభించాడు. తన ఖజానాలో ఉండే వజ్రాలు, వైడూర్యాలూ, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలూ ప్రదర్శించటం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి వలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకొని వున్నాడు. ఈ ధనికుని ఐశ్వరాన్ని గురించీ, దాతృత్వాన్ని గురించీ దాసీలు రాజకుమారితో చెప్పగా, ఆమె "ఆ మనిషి స్త్రీయా, పురుషుడా?" అని అడిగింది. "పురుషుడే" అని చెప్పారు, దాసీలు. "ఐతే పురుషుల విషయం నాముందు చెప్పబోకండి" అని రాజకుమారి చీదరించుకొన్నది. ఇది విన్న ధనికుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసివచ్చింది. తరువాత విద్వాంసుని వంతు వచ్చింది. అతను రాజవీధిలో మకామువేసి, పరకాయ ప్రవేశము, అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శింపసాగాడు. ఈ  విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పేవరకు, ఆమె "సరే, అన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా, స్త్రీయా?" అని అడిగింది. "పురుషుడే" అన్నారు దాసీలు. "ఛఛ! పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిని వేశారంటే, తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను" అంటూ రాజకుమారి హెచ్చరించింది.

ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది, మరలిపోయాడు. చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది. యుక్తిపరుడు వెళ్ళివెళ్ళి రాజకుమారికి వాడుకగా పువ్వుల మాలలు అల్లి ఇస్తూ వుండే ఒక ముసలమ్మ ఇంట బసచేశాడు. ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుక వచ్చి, దండ గుచ్చి ముసలిదాని కిచ్చి "అవ్వా! అవ్వా!! ఇవాళ పూలమాల నేను కట్టాను. ఈ పూలమాల తీసుకువెళ్లి రాజకుమారికి ఇవ్వు. ఆమె చూచి సంతోషించి, దీనిని ఎవరుకట్టారు?" అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా "నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరినించి వచ్చిందండి. ఈ దండ ఆమె కట్టింది" అను. తరువాత మళ్లీ రాజకుమారి ఏమి అంటుందో, వచ్చి నాతో చెప్పు అన్నాడు. అవ్వ అతను చెప్పినట్టే చేయగా, రాజకుమారి చాలా సంతోషించి, "అవ్వా, అవ్వా!! నీ అక్కకూతురును నేను చూడాలి. రేపు నీతో వెంటబెట్టుకు రావలసింది" అన్నది. ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతి చెప్పింది. మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు. స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంత మాత్రమూ గుర్తుపట్ట లేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెగా చూచుకొంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది.  కొంతసేపైన తరువాత యుక్తిపరుడు "రాజకుమారీ ! నిన్నొక ప్రశ్న వేస్తాను. నిజం చెబుతావా?" అని అడిగాడు. "తప్పక చెబుతా"నన్నది రాజకుమారి. "అయితే, పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావుట కదా? పురుషులంటే నీకెందుకు కోపం?" అన్నాడు.

అప్పుడు రాజకుమారి "చెలీ! ఇది నా జీవితంలో చాలా రహస్యవిషయం. కాని, ప్రాణ సమానురాలవు గనుక నీకు చెబుతున్నాను. ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా! అసలు విషయం ఏమిటంటే, వెనుకటి జన్మలో నేనూ, నా భర్తా మృగాలుగా ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరమూ వేటగానివలలో చిక్కుకోగా, గర్భిణి అయివున్న నేను తప్పించుకుపోలేకపోయాను. కాని, నా భర్త నా గొడవ తలచనైనా తలచక, తనదారిన తను పోయాడు. ఇక గత్యంతరమేముంది? వేటగాడు నన్ను పట్టి చంపివేశాడు. అప్పటినించీ స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టుపెట్టుకొన్నాను. నేను పూర్వజన్మ స్మృతి కలదానను. అందుచేత ఈ విషయం జ్ఞాపకముంచుకొని, నీకు చెప్పగలిగాను" అని చెప్పింది. ఇది విని, ఇంకా ఉంటే తన వేషం కాస్తా బయల్పడుతుందనే భయంతో, యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలవక, ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసికొని, రాజుగారి కోట పక్కని తోటలో మకాం ఏర్పరుచుకొన్నాడు. అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు "అబ్బాయీ ! నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రానీ, కాని స్త్రీలను మాత్రం రానీయకు. జాగర్త! స్త్రీలు వచ్చినట్టయితే శపించి వేస్తాను" అని చెప్పేవరకు, ఆడ పురుగైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా, తోటమాలి కాపలా కాస్తున్నాడు. ప్రతిరోజూ పట్టణంలో మగవాళ్ళంతా ఆయన వద్దకు వచ్చి, దీవెనలు అందుకొని పోతూ వున్నారు. యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది. ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, "మహానుభావా! తమరు మా కోటకు దయచేసి, మా గృహం పావనం చేసి, మమల్ని ధన్యుల్ని చేయండి" అంటూ ప్రార్థించాడు.

అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీ ముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు. అప్పుడు రాజు "స్వామీ మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను" అని చెప్పి, కోటలోకి ఆడవాళ్ళెవరూ రాకుండా కట్టుబాట్లుచేసి, యతీశ్వరుణ్ణి అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు. ఈ యతీశ్వరుని సమాచారమంతా ఎలాగో రాజకుమారి చెవుల బడింది. "యిదేమిటీ వింత! నా ప్రతిజ్ఞకు సరిగా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే, మునీశ్వరుడు పట్టినది," అని ఆమె ఆశ్చర్యపడింది. ఇటువంటి చిత్రమైన మనిషిని చూచి తీరాలి అని, రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకొని, యతీశ్వరుని తొంగిచూస్తూ, అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ వుంది. రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి, చివరకు "స్వామీ! నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు. కాన, ఒక్కటి మాత్రం ఉండిపోయింది. తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో, కారణం చెప్పాలి" అంటూ పట్టుదలగా అడిగాడు. "రాజా! నీవు ప్రాధేయపడుతున్నావు గనుక, చెబుతున్నా, విను. వెనుకటి జన్మలో నేనూ నా భార్యా మృగాలుగా పుట్టాము. ఒకరోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకొన్నాము. అప్పుడు గర్భిణిగా వుండిన నా భార్య నన్ను వదిలేసి, తను మట్టుకు తప్పించుకు పారిపోయింది. కనుక, స్త్రీజాతి ముఖం చూడకూడదు అని నేను ప్రతిజ్ఞ చేశాను. పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత, ఈ కథ జ్ఞాపకముంచుకొని, వెల్లడి చేయగలిగాను" అని మునివేషంలో వున్న యుక్తిపరుడు చెప్పాడు. ఈ మాటలు కిటికీలోనించి విన్న రాజకుమారి గబగబ కిందికి దిగివచ్చి, యతీశ్వరుని ఎదుట నిలబడి, "అయ్యా! నీవు అబద్ధము చెబుతున్నావు. వలలో నుండి తప్పించుకొనిపోయింది, ఆడమృగమా? మగమృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మమందు ఆడమృగమునై పుట్టింది నేను, వలలో చిక్కుకొని వేటగాని చేతిలో చచ్చింది కూడ నేనే. నిజం కప్పిపుచ్చి, ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెబుతున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకూ నా భర్తకూ తప్ప మరెవ్వరికీ తెలియదు. కనుక, నీవే నా భర్తవు" అంటూ, అతని చేయి పట్టుకున్నది! అమె కోరికపై, రాజు ఆ ఇద్దరకూ అతి వైభవంగా పెళ్ళిచేశాడు. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. యుక్తిపరుడే తమ కంటె అధికుడూ, సమర్థుడూ అని తక్కిన ఇద్దరూ ఒప్పుకొన్నారు.

Comments