పూర్వకాలమందు ఒక రాజు, ఆ రాజుకు అందమైన కోట ఉన్నది. ఆ కోట సమీపాన గొప్ప అరణ్యములో ఎనమండుగురు వనకన్యలుండేవారు. ఆందులో ఏడుగురు కన్యలు మంచివాళ్లు, రాజుకి మేలు కోరే వాళ్ళున్ను, ఎనిమిదవది దుష్టకన్య, అపకారి. మంచికన్యలు ఏడుగురూ చక్కటి చిన్నచిన్న పర్ణశాలలలో నివసించేవారు. దుష్టకన్య నరుల కంటపడకుండా, మారుమూల ఒక చీకటిగదిలో కాలక్షేపం చేసేది. ఇలా వుండగా, రాజుగారికి కుమార్తె పుట్టింది. ఆ శిశువు అపురూపమయిన కాంతితో వెలిగిపోతూండడం చేత 'కాంతిబాల' అని పేరు పెట్టారు. కాంతిబాల పుట్టిందనగానే ఊరందరూ చూడవచ్చారు. వనకన్యలు ఎనమండుగురూ వచ్చారు. మంచికన్యలు ఏడుగురూ కాంతిబాలకు మంచిమంచి కానుకలిచ్చి, చల్లగా ఉండుమని దీవించారు. దుష్టకన్య మాత్రం అలాగ కాక, "పగటిపూటంతా నిద్ర మైకంలో ఉండిపోవలిసింది!" అని కాంతిబాలకు శాపం పెట్టింది. ఈ శాపం విన్న, రాజూ రాణీ దుఃఖసముద్రంలో ములిగిపోయారు. గత్యంతరం తోచక, కోటలో అందరూ కుంగిపోయారు. ఆ నమయంలో ఆరవకన్య వచ్చి, "కాంతిబాల రాత్రిపూటంతా మేలుకొనే వుండాలి" అని వరమిచ్చింది. "నామాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు?" అని మండిపడుతూ దుష్టకన్య, "సరే, కాంతిబాల రాత్రిళ్ళు మేలుకొనే వుంటుంది. కాని చందమామతో పాటు ఆమె కాంతికూడా పున్నమికి పూర్తి అయి, అమావాస్యకు అంతరించి పోవాలి" అని మళ్లీ తీప్రంగా శపించింది.
అంతలో ఏడవకన్య ముందుకు వచ్చి, "తనకు తెలియని ఒక రాజకుమారుడు కాంతిబాలను తాకిన వెంటనే ఆమెకు శాప విముక్తి అయిపోవాలి!" అని చెప్పి దీవించింది. ఇక చేసేది లేక, ఎలా అయినా కాంతిబాలను కష్టాలపాలు చేసి కసి తీర్చుకుందామని దుష్టకన్య కనిపెట్టుకొని వున్నది. పాపం, కాంతిబాల పగలల్లా నిద్దరే కాని, కన్నెత్తి చూచేది కాదు. బహుళ పాడ్యమి మొదలుకుని రోజురోజుకి ఆమె ముఖం పాలిపోయి, శరీరం కృశించి, అమావాస్య నాటికి కదలక మెదలక పడుకునేది. శుక్లపక్షం ప్రారంభం కాగానే దినదినమూ అందచందాలతో వెలుగుతూ పున్నమినాడు పూర్ణమయిన కాంతితో ప్రకాశించేది. తనకు శాపం తగిలిన సంగతీ, ఆ శాపం వల్ల తనకు వికృతరూపం వచ్చే సంగతీ లోకానికి తెలిసిపోతుందేమోనని కాంతిబాలకు భయంగా వుండేది. అందుచేత ఆమె ఒంటిపాటుగా అరణ్యంలో సంచరించడం అలవాటు చేసుకొన్నది. రాజు ఇది కనిపెట్టి, అడవిలోనే ఆమెకు ప్రియమయిన ఏకాంతస్థలంలో ఒక సుందరమయిన పువ్వుల కుటీరం కట్టించి ఇచ్చాడు. అందులో ఆమె చెలికత్తెలను పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు ఆడుకొనేది. ఈ రాజ్యానికి దగ్గిరగానే మరివక రాజ్యం ఉన్నది. ఆ రాజుని శత్రువులు చంపివేసి రాజ్యం ఆక్రమించుకొన్నారు. బతుకు జీవుడా అనిచెప్పి, రాజకుమారుడు మాత్రం మారు వేషంతో తప్పించుకొని ఈ అరణ్యం చేరుకొన్నాడు.
అతను తిరిగి తిరిగి అలసిపోయి, ఒక చెట్టుకింద పడుకున్నాడు. వెన్నెల రాత్రి కావటంచేత కాంతిబాల కళకళలాడుతూ నాట్యం చేస్తూ కోకిల కంఠంతో గానం చేసుకొంటూ అతను పడుకొనివున్న ఆ చెట్టు వేపు వచ్చింది. ఇటువంటి రూపవతిని మునుపు ఎన్నడు రాజకుమారుడు చూచి ఎరుగడు. ఈమె ఫలానా రాజకూతురు అని కూడా అతనికి తెలియదు. అందుచేత, దేవకన్య అయి ఉంటుందని అనుకున్నాడు. ఆమె అందచందాలనూ, ఆటాపాటలనూ అతను రెప్ప వాల్చకుండా గమనిస్తూ ఉండేటంతలో కాంతిబల అదృశ్యమయిపోయింది. రాజకుమారుడు ఆమె కోసం రోజూ వెతుకుతూనే వున్నాడు. రాత్రి పూట మాత్రం ఆమె చెట్టు వద్దనే కనపడుతూ అతను చూస్తూ ఉండగానే మాయమయిపోతూ ఉండేది. రోజు రోజుకీ ఆమె సౌందర్యం ఎక్కువ అవుతున్నట్టు కూడా రాజకుమారుడు కనిపెట్టాడు. కనుక ఇటువంటి అపురూపమైన యువతిని ఎలా అయినా కలుసుకొని, ఆమె చరిత్ర తెలుసుకోవాలెనని అతనికి పట్టుదల ఎక్కువయింది. తిండీ నిద్రా లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ వుండగా, మంచి కన్యలలో ఒకతె అయిన ఏడవ కన్య ఒక ముసలిదానిరూపంలో అతనికి అగుపడింది. తను లోగడ దీవించినట్టుగా పొరుగుదేశపు రాజకుమారుడు కాలప్రభావము చేత ఇప్పుడు ఈ అడవికి వచ్చేశాడు. కనుక, త్వరలోనే కాంతిబాలకు శాప విముక్తి కాబోతుంది కదా అని ఆమె మనసులో ఎంతో సంతోషించింది.
ఈ సంతోషంతో ఆమె రాజకుమారుణ్ణి తన కుటీరానికి తీసుకువెళ్లి అనేక విధాల ఆదరించింది. తరువాత కాంతిబాలను గురించిన చిత్రాలన్నీ చెప్పి, మహిమగల ఒక లోటా కూడా బహుమతి చేసింది. ముసలామె దీవెన పొంది రాజకుమారుడు మళ్లీ కాంతిబాలను వెతకబోయాడు. రాజకుమారుడు దారి తప్పి ఈ అడవిలోకి వచ్చి, కాంతిబాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనేలేదు కాని, ఈ వర్తమానం తెలిసిన వెంటనే, కొన్నాళ్ల వరకూ రాజకుమారునికీ కాంతిబాలకూ సమాగమం కాకుండా ఆమె మంత్రించి వేసింది. "పున్నమి దాటిపోయేవరకూ తన మంత్రబలం చేత వాళ్లు కలుసుకోకుండా చేయగలిగినట్టయితే ఆ పైన కాంతిబాల కురూపి అయిపోతుందికదా. అప్పుడు రాజకుమారుడు అనాకారిగా వున్న ఆమెను చూచి అసహ్యించుకొంటాడు గాని మక్కువ పడడు కదా. కనుక, ఏడవ కన్య ఇచ్చిన దీవెన వ్యర్థమయిపోతుంది" అని దుష్టకన్య ఆలోచించింది. దుష్టకన్య మంత్రించినప్పటినించీ, ఆ ప్రభావం వల్ల రాజకుమారుడు పాపం మళ్లీ నిద్రాహారాలు లేకుండా ఎంత తిరిగినా కాంతిబాల కంటికి కనబడలేదు. కొద్ది రోజులయిన తరువాత, ఒకనాడు అతను నిరాశ చేసికొని, ఒక పెద్ద మర్రిచెట్టు కింద విచారంగా కూర్చున్నాడు. అప్పటికి పున్నమి దాటిపోయి, అమావాస్య కూడ వచ్చేసింది.
సరిగా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రబలం సరిపోయింది. మళ్లీ మంత్రం వేయాలంటే ఆమెకు కొంత వ్యవధి కావాలి. రాజకుమారుడు మర్రిచెట్టు కింద కూర్చుని వుండగా గబగబా మేఘాలు కమ్మి, ఉరుములతో, పిడుగులతో గొప్ప వర్షం కురిసింది. అంతలో ఒక్క మెరుపు మెరిసి, ఆ మెరుపు వెలుగులో చెట్టు కింద ఏదో మెదిలినట్టు అలికిడి అయింది. ఆ దగ్గిరికి వెళ్లి రాజకుమారుడు చూచేసరికి, ఒక ముసలిది ముసుగు వేసుకొని పడుకున్నట్టు కనిపించింది. మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వ తనకిచ్చిన లోటాలోని నీళ్లు గుక్కెడు ఆ ముసలిదాని నోటిలో పోశాడు. అతను తాకిన తక్షణమే ఆ ముసలిది ఒక అందాల బరిణ ఐన రాజకుమారిగా మారిపోయింది. అవ్వ చెప్పిన కాంతిబాల ఈ సుందరే అయివుంటుందని రాజకుమారుడు గ్రహించాడు. మరి కొంచెంసేపటికే వర్షం నిలిచిపోయి తెల్లవారింది. పుట్టిన ఇన్నాళ్లకు, కాంతిబాల వెలుగు చూచింది! ఆమెకు శాపవిముక్తి కాగానే ఏడుగురు కన్యలూ వచ్చేసి, రాజకుమారుణ్ణీ, కాంతిబాలనూ రాజు వద్దకు తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరకు అతి వైభవంగా పెళ్లి అయి, హాయిగా వున్నారు. కాంతిబాల పెళ్ళిసమయమున ఏడుగురు కన్యలకూ రాజావారు వెలలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు. దుష్టకన్యను విరిచికట్టి శూర్పణఖకుమల్లే ముక్కూ చెవులూ కోసి అడవులలోకి సాగనంపారు.
Comments
Post a Comment