- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వశక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకు తార్కాణంగా శ్రుతవర్మ కథ చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: పూర్వం కన్యాకుబ్జదేశంలో కృతవర్మా, శ్రుతవర్మా అని ఇద్దరు మిత్రులుండేవారు. వాళ్ళు, బాల్య స్నేహితులు; కాని వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష గలవాడు, శ్రుతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించటం ఇష్టం; శ్రుతవర్మకు తాగుడూ, జూదమూ ఇష్టం.
అయితే ఉన్నచోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకుతెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శ్రుతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులూ, కొండలూ, లోయలూ దాటి మరొక దేశం వెళ్ళారు. అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పని చేసి, పుష్కలంగా డబ్బు పోగుచేసుకున్నాడు. శ్రుతవర్మ జూదరులతోనూ, తాగుబోతులతోనూ తిరిగి, తుచ్ఛమైన సుఖాలలో కాలం వెళ్ళబుచ్చాడు. మూడేళ్ళు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికీ, స్వగ్రామానికీ తిరిగి పోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శ్రుతవర్మను, "నేను మన ఊరికి తిరిగి పోతున్నాను. నువ్వు కూడా వస్తావా?" అని అడిగాడు. "నాక్కూడా రావాలనే ఉంది. ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగాలేదు. కాని ఎలా రాను? ప్రయాణపు ఖర్చుకు నా దగ్గిర చిల్లిగవ్వ లేదు. మంచి బట్టలైనా లేవు," అన్నాడు శ్రుతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో, కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళ బుద్ధిపుట్టలేదు. అతను శ్రుతవర్మకు బట్టలు కొనిపెట్టి, ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి, అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు తమ దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శ్రుతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి, అతని శవాన్ని దారి పక్క పొదలలోకి ఈడ్చేసి, అతని డబ్బంతా తీసుకుని, ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్థులు కృతవర్మను గురించి అడిగారు. శ్రుతవర్మ వారితో, "వాడి మాట అడగకండి. మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడు బుద్ధులు అలవరుచుకుని, పాడు స్నేహితాలు మరిగి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు. అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు," అని చెప్పాడు.
కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శ్రుతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలలో పడి, తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు. శ్రుతవర్మ, తాను కృతవర్మను చంపిన కొండ కనుమ కుండా నడుస్తుండగా, "శ్రుతా! శ్రుతా!" అని ఎవరో పిలిచినట్టయింది. వెనక్కు తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శ్రుతవర్మ ముందుకు సాగాడు. కానీ మళ్ళీ అదే కేక వినపడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి, ఆ పిలుపు దారికి పక్కాగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గిరికి వెళ్ళి చూసే సరికి ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దాని కేసి నిర్ఘాంతపోయి చూస్తుండగా, "శ్రుతా? మూడేళ్ళ కిందట నన్ను చంపి, నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను. ఎప్పటికైనా తిరిగి కనపడక పోతావా అని నీ కోసం ఇక్కడ రోజూ ఎదురుచూస్తున్నాను. ఇవాళ నువ్వు కనబడ్డావు, నా కోరిక ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉన్నది!" అన్నది. శ్రుతవర్మ కంగారుపడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకుని పోనివ్వలేదు. "ఎక్కడికి పోతున్నావు?" అని అది శ్రుతవర్మ నడిగింది. శ్రుతవర్మ నిజం చెప్పేశాడు. "మన ఊరెళ్ళాను. డబ్బంతా ఖర్చయిపోయింది. ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళనీ, నీకు పుణ్యం ఉంటుంది," అన్నాడతను.
"అలాగా? అయితే నువు కొంచెం కూడా మారలేదన్న మాట. నీకెప్పుడూ చిక్కులే! నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను. ఏమంటావు? నన్నొక పెట్టెలో పెట్టి వెంట తీసుకు పో. నాకా, తిండి ఖర్చులేదు. బట్ట ఖర్చులేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వింకే విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదుగో, చూపిస్తాను చూడు!" అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. "చూశావు గదా, శ్రుతా. నువు నీ యిష్టం వచ్చినపాట పాడు. దానికి లయ సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను. ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు, కాదూ?" అన్నది ఆస్థిపంజరం. "నిజమే. నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు," అని శ్రుతవర్మ ఒప్పుకుని, అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ, అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తేగాని నమ్మ దలచలేదు. ఆయన శ్రుతవర్మకు కబురు చేసి తన దేవిడీలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కాని ఏ కారణంచేతనో అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు సరి కదా, కదలనన్నా కదలలేదు. శ్రుతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరం లాగే పడి ఉన్నది గాని అందులో విశేషం ఏమీ కనిపించలేదు.
శ్రుతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేదే. కాని రాజుగారికి మటుకు తీరని అవమానమయింది. ఆయన కోపంతో, "ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి," అన్నాడు. రాజభటులు శ్రుతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక్క సందేహం. తన మిత్రుడైన శ్రుతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదట ఎందుకు నృత్యం చెయ్యలేక పోయింది? ఆ అస్థిపంజరం లోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "కృతవర్మ అస్థిపంజరం రూపంలో శ్రుతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీది ప్రేమతో కాదు; నృత్యాలు చేసి శ్రుతవర్మకు కీర్తీ, డబ్బూ సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శ్రుతవర్మ పైన పగ తీర్చుకోవటానికే ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవటం కోసమే రాజు ఎదట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శ్రుతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment