విక్రమ బేతాళ కథలు - పూర్వజన్మస్మృతి

Vikram answers Betal on how a woman achieved heaven through good deeds. Best Vikram Betal Telugu Stories to Read.

విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, సకల సౌఖ్యాలూ అనుభవించుతూ, హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించటం చూస్తుంటే నాకు సారణదేశపు రాణి రత్నావళి కథ గుర్తుకొస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుల కామె కథ చెబుతాను విను," అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం సారణదేశంలో ఒక చండాలుడుండే వాడు. వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకుని అందులో కాపుర ముండేవాడు. వాడూ, వాడి భార్యా, నలుగురు కొడుకులూ కటిక దారిద్య్రం అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు. వాళ్లేనాడూ గంజి తప్ప భోజనం ఎరగరు.

ఒక్కొక్కసారి అదీ దొరక్క ఇన్ని మంచి నీళ్ళు తాగి పడుకునే వాళ్ళు. చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు. కోపిష్ఠి మొగుడు తనను తన్నినా, పిల్లలను తన్నినా ఏమీ మాట్లాడేది కాదు. ఎంతెంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది. ఆమెది జాలి గుండె. తన కష్టాలను లక్ష్యం చెయ్యని మనిషి. ఎవరికే మాత్రం కష్టం కలిగినా ఎంతో బాధ పడేది. ఒక రోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని నీళ్ల కోసం దిగుడు బావి దగ్గిరికి వెళ్ళింది. అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది. దిగుడు బావి చాలా లోతు. ఆవు అందులోకి దిగి నీళ్ళు తాగలేదు. ఆమె బావిలోకి దిగి, కడవతో నీళ్ళు తెచ్చి ఆవు ముందుంచింది. కాని కడవ మూతి చిన్నది కావటం చేత ఆవు నీరు తాగలేక పోయింది. అందుచేత ఆమె కడవ పై భాగాన్ని రాతితో పగలగొట్టి, కింది భాగాన్ని బోలెలాగా తయారుచేసింది. అప్పు డావు నీరు తాగ గలిగింది. ఆమె ఆ బోలెతో బావి నుంచి చాలా సార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది. చివరకు దాహం తీరి ఆవు వెళ్ళిపోయింది. కడవతో నీళ్ళ కోసం వెళ్ళిన మనిషి ఉత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చి, "నీళ్ళకని వెళ్ళి ఇంత సేపయాక నీళ్ళు లేకుండా వస్తున్నావా, భడవా" అని, తన చెప్పులు కుట్టే ఆరెను ఆమె పైన విసిరికొట్టాడు. 

దురదృష్ట వశాన ఆ ఆరె ఆమె కణతలో దిగబడింది. ఆమె కిక్కురు మనకుండా స్పృహ తప్పి పడిపోయి, కొద్ది సేపట్లో ప్రాణాలు వదిలింది. ఆమెను తీసుకు పోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు. ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకు పోయారు. దేవేంద్రు డామెతో, "అమ్మా, దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జల దానం చేసి ప్రాణాలు నిలబెట్టావు గనక, ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలనుభవించే అర్హత పొందావు. అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున, తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుశ్శేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసెయ్యి. అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది," అన్నాడు. అది విని ఆమె, "దేవా, నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వ జన్మస్మృతి ఉండేలాగు అనుగ్రహించండి," అన్నది. దేవేంద్రుడు సరేనన్నాడు.

త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు. ఆమె అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ, పెరిగి పెద్దదయింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే, సారణ దేశపు యువరాజైన వీరసింహుడి కిచ్చి పెళ్ళి చేశారు. కొద్ది సంవత్సరాల అనంతరం సారణ దేశానికి కరువు వచ్చింది. రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. బావులూ, చెరువులూ తవ్వించాడు, యజ్ఞాలూ, యాగాలూ చేయించాడు. అన్నదానాలు జరిపించాడు. ఈ ప్రయత్నాలలో రాచనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది. ఒక నాటి సాయంకాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట బెట్టుకుని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు. చెరువు తవ్వటం పూర్తి అయింది. చెరువులోకి పూటుగా నీరు కూడా వచ్చింది. అనేక వందల పని వాళ్ళు చెరువు చుట్టూతా గట్ల మీద పని చేస్తున్నారు. ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయి కేసి తిరిగాయి. ఆ బండరాతిని అయిదుగురు మనుషులు విశ్వ ప్రయత్నంతో కదిలిస్తున్నారు. వారిలో ఒకడు వృద్ధుడు, మిగిలిన వాళ్ళు నడికారువాళ్ళు. అందరి శరీరాల పైనా చెమటలు దిగ గారుతున్నాయి, అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు. రత్నావళి వాళ్ళను చూస్తూనే గుర్తించింది. ఆ ముసలివాడు పూర్వ జన్మలో తన భర్త, మిగిలిన నలుగురూ తన కొడుకులు. వారినీ, నీచమైన వారి స్థితినీ, వారు పడుతున్న యాతననూ చూసి ఆమెకు గుండె బద్దలైపోయింది. "అయ్యో!" అని ఒక్క కేకపెట్టి ఆమె విరుచుకుని పడిపోయింది.

ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి. ఆమె భర్తా, పరివారమూ ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధ పడ్డారు. అలా జరగటానికి కారణమేమిటో వారికి అంతు చిక్కలేదు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, రత్నావళికి పూర్వ జన్మస్మృతి ఉండటం చేతనే కదా, తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తనూ, కొడుకులనూ చూసి పరితపించి ప్రాణాలు విడిచింది? అసలామె దేవేంద్రుణ్ణి పూర్వ జన్మస్మృతి ఉండాలని ఎందుకడిగింది? అందువల్ల ఆమెకు నష్టమే గాని లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనబడదు. ఆమె తనకా జన్మలో కలిగిన కష్టాలన్నిటినీ సహించింది. అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేటంత పుణ్యం సంపాదించుకున్నది. దేవేంద్రుడు తన కింకా ఆయుశ్శేషం ఉన్నదనీ, అది తీరగలందులకు తాను సుఖ మయమైన జన్మ ఎత్తవలసి ఉంటుందనీ అన్నప్పుడామెకు ఆ జన్మ పై వ్యామోహం కలగలేదు; తాను వెనక ఎత్తిన జన్మకంటె అది మంచిది కాకపోవచ్చు నన్న భయంతోనే ఆమె పూర్వ జన్మస్మృతి కోరింది. పూర్వ జన్మలో ఆమెది జాలి గుండె. రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె నా జాలి వదలలేదు. మరొక సంగతి ఏమంటే, ఆమె మరణానికి అసలు కారణం ఆయుశ్శేషం తీరిపోవటమే గాని, తన పూర్వ భర్తా, కొడుకులూ కష్టపడటం చూసి, ఆమె జాలిపడటం కాదు," అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.

Comments