- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా నీవు అధికులందరిలోకీ అధికుడివి. అందుచేత నీ కన్న అధికుడు నిన్ను ఇలా శ్రమ పెట్టుతున్నాడనుకోవటానికి అవకాశం లేదు. బుడతమనుషులు పాంచాల రాజును చిక్కులు పెట్టినట్టుగా, నిన్నెవరో అల్పులు శ్రమ పెడుతున్నారని నాకు తోస్తున్నది. శ్రమ తెలియకుండా నీకు వారి కథ చెబుతాను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: పాంచాలానికి దక్షిణ సరిహద్దు సమీపంలోని విశాలమైన ఒక కొండ కనుమలో బుడతమనుషుల రాజ్యం ఒకటి ఉండేది. వాళ్ళు కావడానికి మనుషులే అయినా, మామూలు మనుషుల చిటికెన వేలంత ప్రమాణంలో ఉండేవారు.
అయినా బుడత రాజు తక్కువ వాడేమీ కాదు. అతనికి అనేకమంది సామంతులూ, మంత్రులూ, బలగమూ, ఆస్థానకవులూ, మల్లులూ, వందిమాగధులూ ఉండేవారు. ఒక సందర్భంలో ఈ బుడతరాజు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి, తన కింద ఉన్న ప్రముఖుల నందరినీ ఆహ్వానించాడు. వందిమాగధులు స్తోత్రపాఠాలు చేశారు. గాయకులు పాడారు. మల్లులు మిడతలు మొదలుగు మృగాలతో పోరాడి వాటిని చంపేశారు. తన వైభవమంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపిస్తూంటే బుడతరాజుకు ఆనందపారవశ్యం వచ్చేసింది. ఆ పారవశ్యంలో అతను లేచి నిలబడి, "ఇక్కడ చేరిన మీలో ఎవరైనా నా కన్న గొప్ప రాజును చూశారా?" అని అడిగాడు. "లేదు, లేదు," అని బుడతలంతా ఏక కంఠంగా జవాబు చెప్పారు. కాని మరుక్షణమే ఎవరో విరగబడి నవ్వుతూండటం బుడతరాజు చెవిన పడింది. ఆ నవ్వుతున్నది తన ఆస్థాన కవే. బుడతరాజు కవి నవ్వుకు కారణం అడిగాడు. "నవ్వక ఏంచెయ్యను? మనకు ఒక యోజనం లోపు దూరంలో ఒక జాతి మనుషులున్నారు. అలాటి మనిషి గట్టిగా కాలితో నేలను తన్నాడంటే మనమంతా కుర్చీల మీది నుంచి కిందపడి, భయంతో ప్రాణాలు విడిచేస్తాం," అన్నాడు కవి. "ఈ ద్రోహిని వెంటనే పట్టుకుని చీకటి కొట్టులో పెట్టండి," అన్నాడు రాజు. "మహారాజా, తొందర పడవద్దు. నాకొక నెలరోజులు వ్యవధి ఇచ్చినట్టయితే నేను చెప్పిన మాటలోని నిజం కొంతవరకైనా రుజువు చేసుకుంటాను," అన్నాడు కవి. "సరే, వ్యవధి ఇస్తున్నాను. కానీ వ్యవధిలోపుగా నీ మాట రుజువు చేసుకోలేకపోతివా, నీకు చీకటి కొట్టు తప్పదు," అన్నాడు బుడతరాజు.
బుడతకవి ఇంటికి వెళ్ళి ప్రయాణ సన్నాహమంతా చేసుకుని వెంటనే పాంచాల రాజధానికి బయలుదేరాడు. అతను ఎక్కడా ఆగకుండా వారం రోజులు ప్రయాణం చేసి రాజధానికి వచ్చి, ద్వారపాలకుడి పాదాల దగ్గిర నిలబడి గట్టిగా కేకపెట్టాడు. ద్వారపాలకుడు కిందికి చూసి, తన మడమలంత ఎత్తున విచిత్ర ప్రాణిని చూసి, మనిషేనని గుర్తించి, ఆ సంగతి రాజుగారికి విన్నవించాడు. ఎవరో బుడతమనిషి వచ్చాడని విని పాంచాలరాజు, "ఆ బుడత మన కుబ్జుడంత ఉంటాడా?" అని అడిగాడు. "లేదు, మహారాజా. ఈ బుడత మన కుబ్జుడి అరిచేతి మీద హాయిగా నిలబడగలడు," అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాట విని రాజసభలో వారంతా విరగబడి నవ్వారు. అంత బుల్లిమనిషిని కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో సభలోని వాళ్ళంతా ద్వారం వద్దకు పరిగెత్తి వచ్చి బుడతకవి చుట్టూ మూగారు. "రాక్షసబాబుల్లారా, కొంచెం దూరంగా ఉండండి. మీ ఊపిరికి నేను నిలవలేకుండా ఉన్నాను. నేను మీ రాజుగారిని చూడ వచ్చాను. ఆ చిన్న రాక్షసాయన నన్ను రాజుగారి దగ్గిరికి తీసుకుపోతాడేమో!" అన్నాడు బుడతకవి, కుబ్జుణ్ణి చూసి. కుబ్జుడు దగ్గిరగా వచ్చి, బుడతకవిని జాగ్రత్తగా భూమి మీది నుంచి ఎత్తి తన అరిచేతిలో నిలబెట్టుకుని, రాజు దగ్గరికి తీసుకుపోయాడు. బుడతకవిని చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు. బుడతకవి రాజుకు తమ బుడత ప్రపంచం గురించి ఎన్నో వింతలు చెప్పి, తన కవితాశక్తి కూడా ప్రదర్శించాడు. రాజసభలో వాళ్ళంతా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నారు.
"బుడతకవీ, నువ్వు మూడు రోజుల పాటు మా అతిథివిగా ఉండి మరీ వెళ్ళాలి," అన్నాడు రాజు. "మహారాజా, మీ కుబ్జుణ్ణి మా లోకానికి అతిథిగా పంపే పక్షంలో అలాగే మీ ఆతిథ్యం స్వీకరిస్తాను," అన్నాడు బుడతకవి. రాజు సరే నన్నాడు. మూడు రోజులూ మూడు యుగాలుగా గడిపి బుడతకవి కుబ్జుణ్ణి వెంటబెట్టుకుని తమ లోకానికి బయలుదేరాడు. ఈసారి బుడతకవికి ప్రయాణం సుఖంగానూ, శీఘ్రంగానూ సాగింది. ఎందుకంటే, అతను కుబ్జుడి తలపాగాలో కూర్చుని, దారి చెబుతూ వచ్చాడు. ఒక జాము లోపల వాళ్ళిద్దరూ బుడతలోకానికి చేరుకున్నారు. కుబ్జుణ్ణి అంత దూరంలోనే చూసి, "ఆమ్మో, రాక్షసి," అంటూ బుడతలు హాహాకారాలు చేశారు. బుడతకవి రాక్షసుణ్ణి వెంటపెట్టుకొస్తున్నాడన్న వార్త బుడతరాజుకు చేరింది. రాజు బుడతకవిని పిలిపించి, "ఎక్కడికి వెళ్ళివచ్చావు? మనల్ని చంపుకు తినటానికి రాక్షసుణ్ణి ఎవణ్ణో వెంట పెట్టుకు వచ్చావుట, దేనికి?" అన్నాడు. "అతను రాక్షసుడెందుకయ్యాడు? మరుగుజ్జు! అతని కన్న నాలుగింతలు ఎత్తుండే మనుషులున్నారు!" అన్నాడు బుడతకవి. బుడతరాజు కుబ్జుడి ఎత్తూ, లావూ చూసి నిర్గాంతపోయాడు. ఇంతకన్న కూడా పెద్ద మనుషులుంటారంటే ఆయనకు నమ్మకం కలగలేదు. "అసలు మనుషులను చూడాలంటే, మీరు ఈ కుబ్జుడుండే దేశానికి వెళ్ళిరండి," అన్నాడు బుడతకవి. కొద్ది రోజులు పోయాక బుడతరాజు ఎవరితోనూ చెప్పకుండా, మనుషులను చూద్దామనే ఉద్దేశంతో గుర్రాన్నెక్కి పాంచాల రాజధానికి బయలుదేరి వెళ్ళాడు.
ఆయన రాజభవనానికి చేరేసరికి రాత్రి అయింది. అందరూ నిద్రపోతున్నారు. బుడతరాజుకు ఆకలి మండిపోతున్నది. ఆయన తలుపుల కిందుగా రాజభవనం లోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుక్కుంటూ పాకశాలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద గంగాళాల్లాగా ఆయనకు తోచాయి. వాటిలో ఒక చిన్న పాత్ర అంచు మీదికి అతి కష్టం మీద ఎక్కి లోపలికి తొంగి చూసేసరికి దాని లోపలి నుంచి కమ్మని వాసన వచ్చింది. ఆ పాత్ర అడుగున కొంచెంగా పాయసం ఉన్నది. దాన్ని తిందామనే ఆశతో బుడతరాజు ఆ పాత్రలోకి జారి, పాయసంలో నడుములోతున కూరుకుపోయి, ఎంత ప్రయతించినా పైకి రాలేకపోయాడు. మర్నాడు పొద్దున్న పాకశాలకు చెందిన స్త్రీలు ఆ పాత్రలో ఉన్న బుడతరాజును చూసి, వెనక వచ్చిన బుడతకవే ననుకుని రాజుగారి ముందుంచారు. కుబ్జుణ్ణి చూసే భయపడిన బుడతరాజుకు అసలు మనుషులను చూడగానే ప్రాణాలెగిరిపోయినంత పని అయింది. ఆయన పాంచాల రాజును చూస్తూనే కంగారుగా, "నన్ను వదిలెయ్యండి. నేను బుడతరాజును. మా దేశంలో నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు," అని కేకలు పెట్టాడు. పాంచాల రాజు నవ్వి, "ఇది మీ దేశం కాదు. నువ్వు మా వద్దకు గౌరవప్రదంగా రాలేదు. నిన్ను మా దాసీలు ఎంగిలి పాత్రలలో నుంచి పైకి తీశారు. నేను నిన్ను పోనివ్వను. ఏం చెయ్యగలవు?" అని ప్రశ్నించాడు. నిజానికి బుడతరాజు ఏమీ చెయ్యలేక పోయాడు. ఆయన పాంచాలరాజుకు బందీ అయ్యాడని బుడతలకు తెలియడానికి చాలా కాలం పట్టింది.
వాళ్ళు బుడతకవిని రాయబారిగా పంపారు. బుడతకవి వచ్చి తమ రాజును ఇచ్చెయ్యమని వినయంగా ప్రార్థించాడు. "ఇయ్యకపోతే మీ బుడతలు ఏం చేస్తారు?" అన్నాడు పాంచాల రాజు. "ఏమైనా చెయ్యగలం. మాకు సంఖ్యా బలం ఉన్నది. తరవాత మీరు పశ్చాత్తాపపడగలరు," అన్నాడు బుడతకవి. "సరే, మీ శక్తి ఏమిటో చూస్తాను. మీ రాజు నిచ్చేది లేదు," అన్నాడు పాంచాల రాజు. ఆ యేడు పాంచాల దేశంలో ఏ మూల ఏ రైతు ఏ ఏ ధాన్యపు మొక్క నాటినా దాన్ని ఎవరో వచ్చి ధ్వంసం చేసి పోయారు. ఆ యేడు దేశమంతటా కలిపి తూమెడు ధాన్యమైనా పండలేదు. జనం తిండికి లేక చచ్చారు, దారుణమైన క్షామం ఏర్పడింది. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. ఎవరు అల్పులు, ఎవరు అధికులు? వేలంత లేని బుడతల శక్తి గొప్పదా? మామూలు మానవుల శక్తి గొప్పదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల బద్దలవుతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "ఏదో ఒక్క అంశాన్ని ఆధారం చేసుకుని మనం కొందరిని అల్పులనీ, మరి కొందరిని అధికులనీ అనుకుంటాం, కాని సృష్టిలో అన్ని విధాలా అల్పులైనవారూ, అన్ని విధాలా అధికులైనవారూ లేరు. దేవతల చేత సైతం ఓడకుండా వరాలు పొందిన రావణుడు కోతుల చేతిలో సర్వనాశనం పొందలేదా? అధికుణ్ణని గర్వించిన వాడు ఆ గర్వంతోనే అల్పుడవుతాడు; అన్యాయానికి గురి అయిన అల్పుడు కూడా అధికుడైపోయి అపారమైన శక్తులు ప్రదర్శిస్తాడు," అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment