అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవిమార్గము ద్వారా పొరుగూరికి పోవాల్సివచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింది నుంచి పోతూఉండగా, "అబ్బాయీ! నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నాయి. అవి నీకు కావాలా?" అంటూ, ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటు యిటు చూచాడు. కాని, ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ కనపడలేదు. "ఈ చెట్టు మీద ఏదో దెయ్యం వుండి ఉంటుంది. నన్ను మోసం చెయ్యటానికి అదే యిలా అరిచి ఉంటుంది. కనుక ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలువకూడదు." అనుకొని అతను తిరిగి తన దారిన పోసాగాడు. కాని, మంగలి యింకా వందగజాల దూరమైనా పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపునుంచి, "నిన్నేనయ్యా, అలా పారిపోతావేమిటి? నేను చెప్పింది అబద్ధం కాదు. నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు యిస్తాను రా" అని వినిపించింది. ఈ సారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో ఏంపోయింది, అని తలచి, చెట్టు దగ్గరికి తిరిగివచ్చి, "నాకు కావాలి" అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా "సరే, ఏడుగోతాలూ మీ ఇంటికి చేరాయి. పోయి చూచుకో" అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది. ఈ జవాబు వినేవరకు మంగలికి ఆశతో పాటు అనుమానం కూడా కలిగింది. "ఐనా, ఈ మాటలు ఎంతవరకు నిజమో చూదాం" అని అలోచించి, వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకొన్నాడు. తలుపు తెరిచి చూచేవరకు, ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనబడినై.
గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు. వరసగా ఆరు గోతాలనిండుగా మిలమిల మెరుస్తూ వరహాలున్నై. ఏడవ గోతం విప్పి చూచాడు. కాని అందులో ఏమీ లేవు. ఒక్క చీటీ మాత్రం వుంది. ఆ చీటీమీద ఈ విధంగా రాసివుంది. "ఈ ఏడవగోతం నింపటం నీవంతు. అది నింపగలిగితేనే నేను నీకు యిచ్చిన మిగతా ఆరు గోతాల వరహాలు నీకు దక్కుతై. అది గనక నింపలేకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏవిధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతై." ఈ చీటీ కంటపడేవరకు, ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవగోతం కూడా పూర్తి చేయాలీ అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతం నిండుగా వరహాలు నింపాలీ అంటే అంత తేలికగా అయ్యే పనా? కాని, మంగలికి మాత్రం తను కడుపు మాడ్చుకొని అయినా సరే, ఆ గోతం నింపి, ఆ ఆరుగోతాల వరహాలు పోకుండా నిలవచేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను, తన ఇంట్లో వున్నా వెండి, బంగారు నగలన్నిటినీ అమ్మివేసి, వాటిని వరహాలుగా మార్చి, ఏడవ గోతంలో పోశాడు. కాని వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు. ఇది పనికాదని చెప్పి, తను కడుపునిండా తిండి తినటం మానుకొన్నాడు. కడుపు మాడ్చుకొని ధనం పోగుచేసి అయినాసరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కాని నెలల తరబడి వాడు అలా కడుపుమాడ్చుకొని ధనం కూడబెట్టిన అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, "ప్రభూ! చాలా కష్టకాలంగా ఉన్నదండి. జీతం బొత్తిగా చాలటం లేదండి. ఏలినవారు కటాక్షించాలండి" అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు.
రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచీ వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఆ జీతమంతా కూడబెట్టి, ఆ ఏడోగోతంలో వేస్తూ వచ్చాడు. మరి కొన్ని నెలలు గడిచినై. కాని, ఎంతకూ గోతం నిండదే! ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగపట్టుకుంది. "నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడోగోతం నింపలేకపోతున్నాను. ఇది నింపలేకపోతే మిగతా ఆరూ కూడా మాయమయిపోతాయి కదా? ఏమి చెయ్యను?" అని. వాడికి ఇరవైనాలుగు గంటలూ యిదే దిగులు. ఇలా ఉండగా, మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చెయ్యటానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి, "ఏమిరా అబ్బాయీ! నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువు ఉత్సాహంగానూ, నిశ్చింతగానూ ఉండేవాడివే? ఇప్పుడిట్లా బిక్కమొగం వేసికొని ఉండటానికి కారణమేమిటి? నీకేమి కీడు మూడింది? కొంపతీసి, ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదుకద!" అని ప్రశ్నించాడు. "ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదుకద!" అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు. "అవును, మహారాజా! కాని, ఈ సంగతి తమరి కెలా తెలిసిందండి?" అంటూ, కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి.
అప్పుడు రాజు, "ఓరి పిచ్చివాడా! ఎవరు చెప్పేదేమిటి? నీకింకా తెలియనే తెలియదా! అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడుగోతాలనూ ఎవరికైతే దత్తం చేస్తాడో, వాళ్ళయందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తయి. యక్షుడు నాకూ ఇలాగే 'ఈ గోతాలను తీసుకో' మని చెప్పి యిచ్చాడు. నీకు కనిపించినట్టుగానే ఆరు గోతాలనిండుగా వరహాలు, ఏడోగోతంలో చీటీ కనిపించినై. కాని నీలాగా నేను ఆ ఏడోగోతం నింపటానికి ప్రయత్నింపదలచలేదు. ఎందువల్లనంటే యిందులో ఏదో మోసం వుండబట్టే ఈ గోతాలింత తేలికగా సమకూరినై. ఈ ఏడవ గోతం నింపటానికి ప్రయత్నించటం శుద్ధ తెలివితక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గిరికి వెళ్ళి, 'నీ గోతాలు నా కక్కర్లేదు. నీవి నీవే తీసుకో' అని కేకవేశాను. ఇలా కేక వేసి నేను తిరిగి యింటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనై. "కనుక నువ్వుకూడా తక్షణమేపోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చివేయి. వెళ్లు. ఆలస్యం చేయకు" అని మంగలి సలహా చెప్పాడు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని, యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి, "ఓయి యక్షుడా! నీ గోతాలు నీవే తీసుకో బాబూ! నాకు అవి ఎంతమాత్రం అక్కరలేదు." అని వేడుకొన్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీరవాక్కతో 'సరే అలాగే తీసుకొంటాను. నీవు వెళ్లు!' అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూచేసరికి, ఆ ఏడుగోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో, అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినై. కాని దురదృష్ట మేమంటే అవి మాయమైపోవటమే గాక, వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళనించీ కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కాపోయింది!
Comments
Post a Comment