- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ నిశిరాత్రి నీవు పడుతున్న శ్రమ అంతా భ్రమ కావచ్చుననీ, అకస్మాత్తుగా ఈ భ్రమ తొలగిపోయి నీవు నీ ఇంటనే ఉండవచ్చుననీ నీకు సందేహం కలిగిందా? అలాటి అనుభవం పొందినవాడు పుష్కరుడొకడుండేవాడు. శ్రమ తెలియకుండా అతని కథ విను," అంటూ ఇలా చెప్పసాగాడు: వింధ్యాటవీ ప్రాంతంలో పుష్కరమనే చిన్న రాజ్యం ఉండేది. దానికి పుష్కరుడనే రాజుండేవాడు. అతను యువకుడు. కొత్తగా రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులిద్దరూ పోయారు. పుష్కరుడు వారికి ఎంతో భక్తిశ్రద్ధలతో దినవారలు జరిపి, తన కాలమంతా విష్ణు చింతనలోనే గడుపుతూ వచ్చాడు.
అతను పసితనం నుంచీ విష్ణుభక్తుడు. తల్లిదండ్రులు పోయాక అతనికి విష్ణుమూర్తి తప్ప మరెవరూ ఆప్తులు లేరనిపించింది. "విష్ణుమూర్తిని నేనింతగా నమ్ముకుని ఉన్నాను గదా, ఆయన నా పట్ల అనుగ్రహం ఎందుకు చూపడు? కనీసం తన మహిమ అయినా ఎందుకు ప్రదర్శించడు?" అని అస్తమానమూ దిగులుపడేవాడు. చూస్తుండగానే ఏడాది తిరిగిపోయింది. పుష్కరుడి తండ్రి తద్దినం వచ్చింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యమని తన మనుషులను పురమాయించి, పుష్కరుడు పెందలాడే స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళాడు. అతను విష్ణు ధ్యానం చేస్తూ నీటిలో మునగగానే అక్కడికొక అప్సరస లాంటి మనిషి వచ్చింది. ఆ మనిషిని చూడగానే పుష్కరుడి మనస్సంతా చంచలమైపోయింది. అలాటిదాన్ని భార్యగా చేసుకోని జన్మ వృధా అనిపించింది. దేవుడా ఆడ మనిషిని తన కోసమే సృష్టించాడనుకొని అతను ఆమె వెంట బయలుదేరాడు. అది చూసి ఆ స్త్రీ, "అయ్యా, మీరు రాజులు, నేను అంటరాని దాన్ని. నాకు పెళ్ళి కూడా కాలేదు. మీరు నా వెంట రావటం చూసి మా వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇలా చెయ్యటం మీకు ధర్మం కాదు," అన్నది. అయినా పుష్కరుడు దాని వెనకే నడుచుకుంటూ గూడెంకు వెళ్ళి, అక్కడి వాళ్ళతో, "ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యండి. నేనీమెను మోహించాను," అన్నాడు. వాళ్ళు, "మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రాజువైన నీవు ఇలాటి పెళ్ళి చేసుకుంటే మీ ప్రజలేమంటారు?" అని చెప్పి చూశారు. పుష్కరుడు వినక, ఆ మనిషినే పెళ్లాడతానని పట్టుబట్టాడు.
అతనికి ఆమెను ఇచ్చి పెళ్ళి చేశారు. అతను సమస్తమూ విడిచి పెట్టి, ఆ గూడెంలోనే కాపరం పెట్టాడు. అతనికి ఆ భార్య వల్ల ఇద్దరు మగపిల్లలూ, ఒక ఆడపిల్లా కలిగారు. పుష్కరుడికి సంసార భారం జాస్తి అయింది. అతను భార్య కుట్టే చెప్పులు తీసుకుపోయి అమ్ముకొచ్చేవాడు, అడివికి వెళ్ళి కట్టే, కంపా కొట్టి మోపు కట్టి దగ్గిరలో ఉండే పట్టణానికి తీసుకుపోయి అమ్ముకుని వస్తుండేవాడు. ఇలా ఒకసారి అతను కట్టెపుల్లలు మోపుగట్టి పట్టణానికి చేరేసరికి అక్కడ ఒక సంగతి వింతగా చెప్పుకుంటున్నారు. ఆ నగరపు రాజకూతురు రోజూ నలుగు పెట్టుకున్న పిండిని దొడ్లో ఒక మూల వేసే వాళ్ళు. అక్కడ ఒక చెట్టు మొలిచింది. అదేం చెట్టో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ చెట్టు పేరు చెప్పినవాడికి తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తానని రాజు కొత్తగా ప్రకటన చేశాడు. దాన్ని గురించే ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు. పుష్కరుడు గుంపుల వెంట రాజప్రాసాదంలోకి వెళ్ళి, ఒక మూల పెరుగుతున్న మొక్కను చూస్తూనే, "ఇది గంధపు మొక్క, ఆ మాత్రం తెలియదా?" అన్నాడు. దాసీలు వెళ్ళి రాజుతో అతనన్న మాట చెప్పారు. రాజు అతన్ని పిలిపించి, తన కుమార్తెనిచ్చి పెళ్ళిచేసేశాడు. పుల్లల కోసం అడివికి వెళ్లిన తన భర్త ఎందుకు తిరిగి రాలేదో ఆ భార్యకు అర్థం కాలేదు. అతనికి రాజుగారు తన కూతురునిచ్చి పెళ్ళి చేశారనీ, తన భర్త ఇప్పుడు రాజభవనంలో సమస్త సుఖాలూ అనుభవిస్తున్నాడనీ కొంత కాలానికి తెలియవచ్చింది.
వెంటనే ఆమె తన బిడ్డలను పిలిచి, "మీ అయ్య ఫలాని చోట ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, తిండికి జరగటం లేదని చెప్పి, ఆయన ఇచ్చినది పుచ్చుకురండి," అని పంపింది. పుష్కరుడు తన కొత్త భార్యతో కాపరం ఉంటున్న మేడ కిందకి వచ్చి వాళ్ళు, "అయ్యా, ఆకలి! బాబూ, ఆకలి!" అని ఆర్తిగా అరవసాగారు. పుష్కరుడు మేడ కిటికీలో నుంచి తొంగిచూసి, తన బిడ్డలను గుర్తించి, చల్లగా తన వేలి ఉంగరం తీసి వాళ్ళ ముందు పడేశాడు. వాళ్ళు దాన్ని తీసుకుని తమ తల్లి దగ్గిరికి వెళ్లిపోయారు. అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటున్న అతని కొత్తభార్య పుష్కరుడు చేసిన పని గమనించింది; కానీ పైకేమీ అనలేదు. మొదటి భార్య తన భర్త పంపిన ఉంగరాన్ని అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని సుఖంగా జరిపింది. డబ్బు అయిపోగానే ఆమె తన పిల్లలను మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గిరికి పంపింది. వాళ్ళు ముగ్గురూ మరొకసారి తమ తండ్రి మేడ వద్దకు వచ్చి, "అయ్యా, ఆకలి!" అని అరిచారు. ఈసారి పుష్కరుడు కిటికీలో నుంచి రెండు బంగారు రేకులు పడేశాడు. పిల్లలు వాటిని తీసుకుని తల్లి వద్దకు తిరిగి వెళ్ళారు. రాజకుమార్తె ఈసారి కూడా తన భర్త చేసిన పని గమనించింది. "కుక్క ముట్టుకున్న కుండను ఏంచెయ్యాలి?" అని ఒక చీటీ మీద రాసి, ఒక దాసిద్వారా రాజసభలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. రాజది చదువుకుని, "కుక్క ముట్టుకున్న కుండను అవతల పారెయ్య వలిసింది," అని, ఆ చీటీకి జవాబు రాసి తన మంత్రికి చూపాడు. "అవతల పారెయ్యనవసరం లేదు, మహారాజా. అగ్నితో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు," అన్నాడు మంత్రి.
అప్పుడు రాజు, "కుక్క ముట్టిన కుండను నిప్పుకు చూపించి వాడుకోవచ్చు," అని జవాబు రాసి తన కూతురికి పంపాడు. ఆ రాత్రి పుష్కరుడు నిద్రపోతుండగా రాజకుమార్తె అతను పడుకున్న గదికి నిప్పు పెట్టింది. నిద్రపోతున్న పుష్కరుడి పైన కాలే వస్తువులు పడి చుర్రుమన్నది. ఆ బాధకు అతను చప్పున నీటిలో నుంచి పైకి లేచాడు. తన తండ్రి ఆబ్దికం జ్ఞాపకం వచ్చి, తాను చాలా సేపు తాత్సారం చేశానని భయపడి గబగబా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. "ఇంతలోనే తిరిగి వచ్చారే! అప్పుడే స్నానం అయిపోయిందా?" అన్నారు బ్రాహ్మణులు. స్నానం చేద్దామని నీటిలో మునిగి మళ్ళీ పైకి లేచే లోపుగా తనకు జరిగిన అనుభవాలన్నిటినీ అతను బ్రాహ్మణులకు చెప్పాడు. వారు అంతా విని, "నిశ్చయంగా ఇది విష్ణు మాయ!" అన్నారు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక్క సందేహం. విష్ణువు తన మాయను ఇలా ప్రదర్శించటంలో ఆయన ఉద్దేశమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "పుష్కరుడు రాజుగా తన బాధ్యతలను విస్మరించి ఎప్పుడూ విష్ణుచింతనలోనే కాలం పుచ్చాడు. అందుచేత మనిషికి కలిగే సహజ వికారాలనూ, నిరుపేదలు గడిపే నికృష్టజీవితాన్నీ, పుష్కరుడికి గుర్తు చేసే ఉద్దేశంతో విష్ణువు తన మాయను అలా ప్రదర్శించాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment