అనగనగా ఒక రాజూ రాణీ ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులూ, ఒక కూతురు. రాజుమీద వారి కుటుంబానికే కాక ప్రజలకందరికీ కూడా చాలా ప్రేమ వుండేది. అతనిలాంటి మంచిరాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇలా వుండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగచేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరు ఇవ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్లోకి ఒక సాధువు దిగాడు. ఎక్కడ చూచినా రాణీగారి గొడవే! అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలో కాపలావాళ్ళు పోనిస్తేగా? "అందరూ చూడట మయింది. నీ వల్ల నేమవుతుంది. పోవోయి" అని కసిరి కొట్టారు. "అలా కాదు. మీరందరూ ఏనాడో ఆశ వదులుకొన్నారు కదా, ఇంతలో పోయిందేమున్నది, నన్నూ ఒక్కసారి చూడనియ్యండి," అని సాధువు పట్టుపట్టాడు. సరే, చివరకు సాధువుని రాణిగారి యెదుట పెట్టారు. అతను పరకాయించి చూచి, "అమ్మా! ఇది ఏమీ శరీరసంబంధమైన జబ్బు కాదు. అందుచేత యెన్ని మందులు నూరిపోసినా పనిచేయవు. మీకు యిప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చటం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశదేశాలు తిరిగి సలహాలు ఇస్తూవుంటారు" అని తన వుద్దేశం చెప్పాడు.
ఈ మాటలు రాణిగారికి అమృతగుళికలనిపించినై. యతీశ్వరుణ్ణి అనేకవిధాల పూజించి, "స్వామీ! మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్యదృష్టివల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యంకొద్దీ యివాళ మీ దర్శనం లభించింది. మరి, నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా?" అని ఆత్రంతో ప్రార్థించింది. "ఉపాయంలేకేమి? ఈ పట్టణానికి ఉత్తరదిశని పది ఆమడల దూరంలో ఒక రాక్షసి వున్నది. ఆ రాక్షసి రాజ్యంలో మూడు వింతవస్తువులున్నాయి. అయితే, అవి జయించుకురావడం కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే. సందేహం లేదు. నా మాట నమ్మండి," అని సాధువు చెప్పాడు. "మాకు ఏ పనీ కష్టసాధ్యమనేది లేదు, ఆ వింతవస్తువులేమిటో సెలవియ్యండి స్వామీ!" అని అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు. "సరే, అయితే వినండి. ఆ రాజ్యంలో పాటపాడే చెట్టు, మాటలాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మళిస్తుంది. అయితే, ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకు రావాలి సుమండీ!" అని చెప్పేసి సాధువు మాయమైపోయాడు. ముందుగా పెద్దకుమారుడు రాజభూషణుడు వెడతా నన్నాడు. "మూడు నెలలు గడువు పెడుతున్నాను. అప్పటికి ఇల్లు చేరుకుంటే సరేసరి. లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి," అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన యెడారి కనిపించింది.
అక్కడ కొన్ని రాళ్లు తప్ప మరేమీ లేవు. మరి నాలుగడుగులు వేసేసరికి "ఓయి రాజభూషణుడా! ఈ ప్రయాణం యెక్కడికి? ఇది యెందుకు వచ్చిన ప్రయాణం!!" అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఎరిగివున్నవాళ్లు పలకరిస్తున్నారేమో పోనీ బదులు చెబుదామా అనే బుద్ధి పుట్టింది. కాని, ఇవన్నీ రాక్షసిరాజ్యంలో మాయలని నిశ్చయించి, రాజభూషణుడు తన దారిని తను వెళుతున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడినాడు. "నాయనా రాజకుమారా! నువు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. ఐనా భయంలేదులే. నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకు రాగలవు," అని చెప్పాడు. "తప్పకుండా నడుచుకుంటా" నని రాజభూషణుడు మాట యిచ్చాడు. అప్పుడు వృద్ధుడు "అదుగో ఆ కనపడుతున్న రాళ్లన్నీ యేమిటో తెలుసా? నీ లాగనే, నువు వచ్చిన పని కోసమే వచ్చి, శాపం వల్ల శిలలుగా మారిపోయిన శూరులు. నీవు ఆ సమీపానికి వెళ్లేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండాపోతే రాళ్ళతో కొడతారు. అప్పటికీ లొంగకుండా పొతే యెదటికి వచ్చి ముఖంపైన ఉమ్ముతారు కూడాను. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూవుంటుంది. ఇవేవీ లెక్క చేయక నీ పని మీద నీవు వెళ్లిపో. వెనకకు తిరిగి చూశావంటే నువ్వూ ఒకరాయిగా మారిపోతావు," అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని, రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు. కొంతదూరం వెళ్లేసరికి యెవరో పేరుపెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్లు రాళ్లు విసిరారు, అతను లెక్కచేయలేదు. తల్లి ఆరోగ్యంకోసం యెన్ని కష్టాలైనా పడటానికి నిశ్చయించుకున్నాడు.
మరికొంచెం సేపటికే ఎవరో వచ్చి ముఖం పైన ఉమిసేసరికి, చర్రున కత్తిదూసి, 'యెవడవురా నువ్వూ?' అంటూ వెనక్కితిరిగాడు. ఇంకేముంది! రాజభూషణుడి బదులు ఒక రాయి అక్కడ పడివున్నది!! మూడు నెలలవరకూ చూసి, రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకొని వుంటాడని ఇంటిదగ్గర నిశ్చయించుకున్నారు. ఈ సారి రెండవవాడు సుగుణభూషణుడు అన్నలాగానే మూడునెలలు గడువు పెట్టి ప్రయాణమైనాడు. ఇతను అన్నకంటె యెక్కువ ఓరిమి కనబరిచాడు. చాలా శ్రమలు పడినాడు. కాని చివరకు యెవరో వచ్చి ముఖంపైన ఉమిసేసరికి, పౌరుషంతో కత్తిదూసి, వెనకకు తిరిగి, అన్నగారిలాగానే శిల అయిపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. అందుచేత యితనికి కూడా ఆపద వచ్చి వుంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళ్లుతానని ముందుకు వచ్చింది. కొడుకుల అతీ గతీ తెలియకపోయె. ఉన్న ఒక్క కూతురూ ఎదట లేకుండా వెళ్లిపోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కాని, రాజకుమార్తె ఆగలేదు. "ఈపాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమి, లేకేమి? నేను తప్పకుండా సాధించుకు వస్తాను. చూస్తావుగద నా ప్రజ్ఞ," అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరకూ కనపడినట్టే, హేమలతకు కూడా ముసలివాడు అగపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాడిని దేమునిగా భావించింది. అతని సలహాలను వేదముగా నమ్మింది.
అతను చెప్పినదానికి అడుగుదాటకుండా నడుచుకుంటానని వొట్టేసుకుంది. ఆ ప్రకారమే చేసింది. లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కు చూచారు. కాని, హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇక యిప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగునా కనపడుతూనే వున్నాడు. పక్కనే వుంటూ, సలహాలు చెప్పుతూనే వున్నాడు. కొంచెంసేపటిలోనే హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనబడింది. అక్కడ మిల మిల మెరుస్తూ ఊటనీరు ప్రవహిస్తున్నది. "అదే బంగారపు నీరు, ఇది ఒక చుక్క తగిలేసరికి చచ్చినవాళ్లే బ్రతుకుతారు; ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయనే మాట చెప్పేదేమిటి?" అని ముసలివాడు అన్నాడు. ఆ మాట వింటూనే, హేమలత తన దగ్గర వున్న సీసాలను ఈ నీటితో నింపివేసి, చేత పట్టుకున్నది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది. చెట్టుకొమ్మకు ఒక పంజరం, ఆ పంజరంలో మాటలాడే పక్షికూడా ఆమెకు కనపడ్డాయి. "భేష్! తక్కిన రెండు వస్తువులూ ఇక్కడనే దొరికేశాయి. ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టే," నని రాజపుత్రి సంతోషించింది. "ఈ చెట్టుకొమ్మ ఒకటి పట్టుకువెళ్లి మీ ఉద్యానవనంలో పాతు, మళ్లీ మహావృక్షమవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడుతాయి. పంజరంలో పక్షి కమ్మటి కథలు చెబుతుంది. ఇవి ఎక్కడ వుంటే అక్కడ ఆరోగ్యం వుంటుంది," అని వృద్ధుడు మళ్లీ చెప్పాడు. హేమలత ఆ చెట్టుకొమ్మ ఒకటి విరిచింది. పక్షి వుండే పంజరం పట్టుకొన్నది.
ఇంటిముఖం పట్టింది. ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూతామని, దారిలో పడివున్న ఒక శిలమీద బంగారపు నీటిచుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారునిగా మారింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ళమీద కూడా తలకొక నీటిచుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్ళన్నీ రాజపుత్రులుగా మారినై. అలా మారిపోయి వచ్చిన వాళ్ళలో తన అన్నలిద్దరూ కనపడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. ముగ్గురూ కలిసి, తల్లికి కావలసిన మూడు వింతలూ పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులూ, కూతురూ కంటపడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన మూడు వింతలూ యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి, రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో మునిగి వుంటుండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతన్ని రాజకుమారులూ, హేమలతా చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోవటానికి మంచి దుస్తులు యిచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారునిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. "నేనూ మీవంటి రాజకుమారుడనే. ఈ మూడు వింతలకోసం నేనూ మీ లాగానే ప్రయాణమయ్యాను. రాక్షసుని శాపం వల్ల నాకీ ముసలిరూపం వచ్చింది, తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకీ పీడ వదిలింది," అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణీగారు మరింత సంతోషించింది. హేమలతకూ, రాజకుమారునికీ వైభవముగా పెళ్లిచేసింది. అంతటినించీ అందరూ హాయిగా వుంటున్నారు.
Comments
Post a Comment