చందమామ కథలు - వాక్శుద్ధి కథ

 

Chandamama Telugu Story of a kid who has the power to make whatever he speaks come true. Best Telugu Chandamama Stories to read.

పూర్వకాలమందు ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అది యేమి మహిమోకాని, ఆతని నోటి వెంట ఏమాట వచ్చినా సరే, ఆక్షరాలా ఆ ప్రకారం  జరిగి తీరేది. ఈ కారణంచేత అందరూ, ఆ పిల్లవానిని 'వాక్శుద్ధి' అని పిలిచేవాళ్లు. ఒకరోజున, అతని చెల్లెలు 'అన్నయ్యా! తోటలోకి వెళ్లి మామిడిపళ్లు కోసుకొందాము రా' అని చెప్పి తీసుకుపోయింది. చెట్టు నిండా పళ్లున్నాయి కాని, చేతికి అందటం లేదు. పోనీ పొడుగాటి కర్ర దొరుకుతుందేమోనని వాక్శుద్ధి వెతికాడు. కర్ర కనపడలేదు గాని, ఒక రాయి దొరికింది. 'భేష్‌, బాగున్న' దనుకుని గురిచూసి, వాక్శుద్ధి ఆ రాయి పండువేపు విసిరాడు. పండు ఎప్పుడు కింద పడుతుందా, ఎప్పుడు తిందామా అని అతని చెల్లెలికి నోరూరిపోతున్నది. ఆమె అలా ఆత్రంతో కనిపెట్టుకొని వుండగా వాక్శుద్ధి విసిరిన రాయి గురి తప్పి ఆమె కణతకు తగిలి, ఆమె వెంటనే నేలను వాలిపోయింది. కణతనుండి, బొలబొల ప్రవహిస్తున్న నెత్తురును వాక్శుద్ధి తన తువాలుతో తుడిచి, కట్టు కట్టాడు. ఈ ఆపద సంభవించినందుకు వాక్శుద్ధి చాలా నొచ్చుకున్నాడు. ఎవరయినా దుర్మార్గులు రాయి విసిరి వుంటారేమోనని నాలుగుమూలలా కలియజూచాడు. కాని, అ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. తీరా రాయి ,తీసి చూచేసరికి, అది తను విసిరినదేకాని, పైవాళ్ళు ఎవళ్ళూ విసరలేదని తేలింది. పోతే తను పండు వేపు గురి చూచికొట్టిన రాయి పోయిపోయి ఎక్కడనో దూరంలో ఉన్న చెల్లెలి తలకు తగలడం యేమిటి ? ఇలా జరగటానికి కారణం దయ్యమా, భూతమా, శక్తా? ఏమిటయివుంటుందీ ? అని ఎన్నోవిధాల ఆలోచించాడు.

ఎంతసేపటికీ ఆలోచన తోచిందికాదు. చివరకు మనసుకి కష్టంతోచి, "ఈ శక్తి నాశనం గానూ!" అంటూ శపించాడు. వాక్శుద్ధి నోటివెంట ఈ మాట వచ్చి రావడంతోనే, నిజంగానే ప్రపంచంలో శక్తి నశించిపోయింది. ఇంతలో అతని చెల్లెలు కొంచెం తేరుకొన్నది. ఆమెను ఓదార్చి, మళ్లీ రాయి తీసుకుని, మామిడి పండుకి గురిచూచి కొట్టాడు. దెబ్బతో పండు టపీమని 'ఊడింది కాని, కింద పడలేదు, పండేకాదు, రాయీ కిందపడలేదు. రెండూ కూడా ఆకాశమార్గాన గాలిపటాలలాగ ఎగిరిపోతున్నయి. ఈ వింత చూచి వాక్శుద్ధికి ఆశ్చర్యం కలిగింది. "సరే, ఎంతదూరమని ఇవి అలా ఎగురుతాయి. ఎప్పటికయినా కింద పడకపోతయా? చూద్దాం" అని అనుకొని, అతను పండువెంబడే పోజొచ్చాడు. మామిడిపండు అతనికి అందకుండా, మరీ ఎత్తుగా ఎగురుతున్నది. వాక్శుద్ధి కూడా పండు వెంట పరుగెత్తుతూనే వున్నాడు. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు అని చెప్పి, అతని చెల్లెలు మామిడి తోటలో కనిపెట్టుకు కూర్చుంది. కాని ఎంత సేపటికీ అన్న రాకపోయేసరికి, తను ఒక్కర్తే ఇంటికి వెళ్లిపోయింది. మామిడిపండూ, రాయీ కీలుగుర్రాల లాగ అంతకంతకు పైకి ఎగిరిపోయి చివరకు మాయమైపోయినయి. వాక్శుద్ధి అప్పటివరకూ వాటి వెంబడి తిరిగి తిరిగి చేసేదిలేక, పొద్దుకుంకే వేళకు ఇల్లు చేరుకున్నాడు. అబ్బాయికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నది వాళ్ల అమ్మ. వాక్శుద్ధి కనబడగానే అపేక్షతో, "ఎక్కడికి పోయినావుర నాయనా! ఇంత అలిసిపోయావే!!" అని బుజ్జగించి, బడలిక తీరేందుకు స్నానానికి వేడి నీళ్లు కాచింది.

ఆమె చెంబుతో నీళ్లు ముంచి, కుమారుని తలపైన పోసింది, కాని ఒక్క చుక్క కూడా అతని తలమీద పడనే లేదు. ఆమె చెంబుతో ముంచుతున్నకొద్దీ కాగులో నీళ్లు తరిగిపోతున్నయే కాని, నీటి బొట్టు మాత్రం కొడుకు నెత్తిమీద పడలేదు. ఇదేమిటా విడ్డూరమనుకుని, చేరెడు నీళ్లు చేతితో తీసి, చమురు రాసినట్టుగా రాసి, పోయి తుడుచుకోమన్నది ఆమె. అలాగే చేసి గోడకు తగిలించివున్న వాక్శుద్ధి తువాలు అందుకుందామని కాళ్లు పైకి ఎత్తేసరికి, గాలిలో తేలిపోయి, ఇంటి బయటికి ఎగురుకుంటూ వచ్చాడు. ఈ చిత్రం చూచి, వాక్శుద్ధి చెల్లెలు తన నేస్తురాండ్ర వద్దకు పరుగెత్తుకువెళ్లి "రండి, రండి! మా అన్నయ్య తమాషా అయిన మొగ్గలు వేస్తున్నాడు, చూదురుగాని రండి!!" అని చెప్పి, పిలుచుకు వచ్చింది. వాళ్లందరూ ఉరుకులు వేసుకొంటూ వచ్చారు. మేడపైకి ఎగిరిపోయిన వాక్శుద్ధినిచూచి, వాళ్లు నిర్ఘాంతపోయారు. ఇంతలోవాక్శుద్ధి చెల్లెలు "అన్నయ్యా! నువు ఎలాగా మేడమీదికి ఎక్కావు కదా, అక్కడ నా బంతి చిక్కుకుపోయింది. అది తీసి ఇలా పడ వెయ్యి" అన్నది. చెల్లెలు కోసమని బంతి వెతికి తీసి, కింద పడవేయబోగా, అది కింద పడక, బుడగలాగా ఆకాశంలోనే తేలుతున్నది. కోపం కొద్దీ వాక్శుద్ధి ఆ బంతిని ఒక్క తన్ను తన్నేసరికి, కాలు జారిందో ఏమో, అతను దభేలున కిందపడ్డాడు. ఇది చూచి, ఇంట్లో అందరూ గొల్లుమని గోలచేశారు. వెంటనే డాక్టరును రప్పించారు. డాక్టరు ఇంజక్షన్‌ చేద్దామని మందు ఎక్కించబోతే పిచికారి గొట్టంలోకి మందు ఎక్కలేదు.

మరివోక గొట్టంతీసి చూచాడు, అందులోకీ ఎక్కలేదు. అలా ఎన్ని గొట్టాలు తెచ్చి ప్రయత్నించినా ఒక్క గొట్టములోకి కూడా మందు మాత్రం ఎక్కటంలేదు. ఇటువంటి అసందర్భం ఆయనకు ఎన్నడూ అనుభవంలో లేదు, ఈ విధంగా కథ అడ్డం తిరగటంచూచి, డాక్టరుకే ఆశ్చర్యం కలిగింది. చిన్నవాడు బతికే ఎత్తు లేదు కాబోలునని తలిదండ్రులు కంగారుపడుతున్నారు. ఆ సమయంలో, అక్కడ మూగిన కొంతమంది, వాక్శుద్ధికి దిష్టి తీశారు, కొంతమంది మంత్రించిన విభూతి బొట్టుపెట్టారు. అలా ఎవళ్లకు తెలిసిన ప్రక్రియ వాళ్లు చేసి చూచారు. ఏ తల్లి చేతి చలవ వల్లనో కొంత సేపటికి వాక్శుద్ధి తేరుకుని లేచాడు. అతను లేవగానే ఎవళ్ళ ఇళ్ళకు వాళ్లు వెళ్లిపోయారు. మరునాటినించీ, వాక్శుద్ధివలెనే అతని స్నేహితులుకూడా ఎత్తుకి ఎగిరి, మొగ్గలు వేయటం ప్రారంభించారు. ఒకడు తాడి ఎత్తు, ఇంకొకడు నాలుగుతాళ్ళ ఎత్తు, మరివకడు పదితాళ్ల ఎత్తు వరకు కూడా ఎగిరి కిందికి దిగి వచ్చారు. ఎలా ఎగురగలుగుతున్నారో వాళ్లకే తెలియటంలేదు. ఇంకొక కుర్రాడు పైకి ఎగిరి, మరి కనపడకుండా మాయమే ఐపోయాడు. వాడు ఎక్కడికి పోయాడో తెలియనే లేదు. చాలామంది భూమిపైన పాదం మోపకుండా, ఇంచుమించు గాలిలో ఈదుతున్నారు!! ఒకడు నీటిమీద నడిచాడు. ఇంకొకడు తలకిందుగా నడిచిపోతున్నాడు. ఒకటేమిటి ? ఎలా తలుచుకుంటే అలాగ, ఎక్కడికి పడితే అక్కడికి వాళ్లందరూ ఎగిరిపోతున్నారు! పిల్లలను చూచి పెద్దలు కూడా ఈ ఆకాశ ప్రయాణాలు ఆరంభించారు.

మొగ్గలువేయటం, గాలిలో ఈదటం మాత్రమే కాదు, గోపాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్నీ, హనుమంతుడు నంజీవి పర్వతాన్నీ ఎత్తిపట్టినట్టు వాళ్లు బరువైన వస్తువులను ఇట్టే ఎత్తి వేయగలుగుతున్నారు! అయితే కొన్ని ఉపయోగమైన పనులు కూడా జరుగుతూ వచ్చాయి. వంకెలు అవసరం లేకుండా బట్టలు గోడలకు అంటుకొని ఉండటం, మేజాబల్లలు అక్కరలేకనే ఎత్తుగా ఉంచిన పాత్రలు పడిపోకుండా ఉండటం, ఇటువంటివి. కాని, అంతటితో ఆగక, అనర్థాలు కొన్ని కలగడంతో, ప్రజలు జీవించటం కష్టమైపోయింది. అవి ఏమిటీ అంటారా? దాహంతో గిలగిల్లాడుతున్నవాళ్లు గుక్కెడు నీళ్లు గొంతుకలో పోసుకుందామంటే పాత్రలో నీళ్లు ఊడిపడవు. తాగటానికే నీళ్లు లేనప్పుడు ఇక వళ్ళు తడుపుకోవడంమాట ఎవరు తలపెట్టగలరు? రోజురోజుకీ గాలిలో వేడి ఎక్కువ కావటంవల్ల ప్రజలకు శోష కొడుతూ వచ్చింది. ఎన్నాళ్లకూ చల్లటిగాలి తిరగకపోవటంచేత వాన కురిసే ఆశ కాస్తా అణగారిపోయింది. క్రమంగా నీటిపైన ఓడలూ, భూమిమీది బళ్ళూ కూడా తలక్రిందులై బోల్తాకొట్ట నారంభించాయి. చివరకు, జనం ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమయిపోయింది. ఈ కష్టాలను ప్రజలు భరించలేక, పెద్ద మర్రిచెట్టుకింద ఊరి పెద్దలను సమావేశపరిచారు. బుద్ధిమంతులు విచారణచేసి, దీనికంతకూ ఒక్కటే కారణమయి వుంటుందని నిశ్చయించేశారు. అది యేమిటీ అంటే: లోగడ వాక్శుద్ధి మామిడితోటలో తన చెల్లెలి తలకు రాయి తగిలినప్పుడు, ఏదో దుష్టశక్తి ఆ పని చేసి వుంటుందని అనుకొని, 'ఈ శక్తి నాశనంగానూ!' అని శపించివున్నాడు. 

అతని నోటి వెంట వచ్చిన మాటకు తిరుగులేదు. కనుక ఆ శాపం వల్లనే ఇప్పుడు "శక్తి" నాశనమైపోయిందని ఊరి పెద్దలు ఆన్నారు. "శక్తి యేమిటి? నాశనం కావడం యేమిటి?" అని తెలియనివాళ్లు పెద్దలను అడిగేసరికి, వారు ఇలా చెప్పారు : "అబ్బాయిలూ! మనం నివసిస్తూ వున్న భూమికి ఆకర్షణశ క్తి వున్నది. ఆనగా ప్రతి వస్తువునూ భూమి తన వైపు లాక్కొంటుంది. ఇప్పుడు వాక్శుద్ధి శపించటం వల్ల ఆ శక్తి లేకుండాపోయింది. అది పోవటం చేతనే మనుష్యులకూ వస్తువులకూ కూడా బరువులేక, ఎక్కడివక్కడనే ఉండిపోతున్నయి. గాలిలో బరువూ, ఒత్తిడీ లేకపోవటంచేతనే వస్తువులూ, మనుష్యులూ ఎగిరిపోవటం జరుగుతున్నది. పైగా ఇందువల్లనే ఊపిరితిత్తులలోకి గాలి ప్రసరించటం మానివేసింది" అని. ఇదంతా విన్నతరువాత ప్రజలందరూ వాక్శుద్ధి వద్దకు వెళ్లి, "నాయనా, వాక్శుద్దీ! నీ మాటకు తిరుగులేదన్న సంగతి అందరకూ తెలుసు. నీ చెల్లెలి తలకు రాయి తగలటంవల్ల, కోపం కొద్దీ "ఈ శక్తి నాశనం కానూ" అని నువ్వు శపించటం కూడా చాలామందికి వినిపించింది.  అయితే ఆ శాపం వల్లనే ప్రపంచం ఇలా తారుమారు అయిందన్న విషయం ఎవళ్ళూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఊరి పెద్దలు సభ చేసి, ఈ కష్టాలన్నిటికీ నీ శాపమే కారణమని నిశ్చయించారు. కనుక, లోకం మీద దయదలిచి, శాపాన్ని ఉపసంహరించుకోవలిసింది" అని అతనిని బతిమాలారు. వాళ్ల కోరిక ప్రకారం అతను అలా చేయగానే, భూమికి తిరిగి ఆకర్షణశ క్తి కలిగింది. ప్రపంచం మళ్లీ ఎప్పటిలాగ నడిచి, ప్రజలకు కష్టాలు తప్పిపోయినై.


Comments