ఒక వూరిలో వక్రుడు, ఉక్రుడు అని ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. వారు నివసించే వూరికి, మూడువందల మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదనీ, ఆ కొండలో బంగారం ఉన్నదనీ తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా! "భేష్, బాగా వున్నది తమ్ముడూ! మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్లి, అక్కడ వున్న ఆ బంగారమంతా తెచ్చుకుందాము, ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే, మనం ఇద్దరమూ ఆజన్మాంతమూ హాయిగా కాలి మీద కాలు వేసుకొని కాలక్షేపం చేయవచ్చు," అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా, తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తుంటాడు వక్రుడు ఎప్పుడూ. అందుకనే నునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను అశపడ్డాడు. కాని తమ్ముని ఉద్దేశం వేరు. ఈ కారణం చేతనే, కొండ మీది బంగారమును గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పిన, ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ, పెద్దవాని మాట జవదాటడం ఇష్టంలేక వక్రునితో ఉక్రుడు "సరే అన్నయ్యా, అలాగే వెళ్లి తెచ్చుకుందాములే" అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సామ్ము చేత పుచ్చుకొని, కూలీ జట్టుని వెంట బెట్టుకొని, మజిలీలు చేసుకొంటూ, ఇంచుమించు ఒక నెల రోజులకు అ పర్వతం చేరుకొన్నాడు. ఆత్రంతో వున్న అన్నగారు, కూలీలతో సహా గబగబ కొండ ఎక్కి, వెంటనే తవ్వే పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, "అన్నయ్యా ! అందరమూ కొండ పైన కూర్చుని చేసేదేమున్నది? నీవు పని పూర్తి చేసుకొని వచ్చేవరకు నేను ఇక్కడనే వుండి కాపలా కాస్తాను" అనే వరకు వక్రుడు సరేనన్నాడు.
ఉక్రుడు, కొండ దిగువనున్న ఆ గ్రామస్థులను మంచి చేసికొని, చిన్న నివాసం ఏర్పరచుకొన్నాడు. కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుకగా మసులుకొంటూ వుండటం చేత, వారు ఉక్రుని కోరిక అన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంత కాలమైన తరువాత ఉక్రుడు ఆ వూరి మునసబు వద్దకు వెళ్ళి "అయ్యా! నేను ఇలా వ్యర్థంగా కాలం గడపడం బాగులేదు. కనుక, మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఏర్పాటు చేయించండి. పంట పండగానే బుణాలు తీర్మానం చేసుకొంటాను." అని కోరేవరకు, గ్రామ మునసబు సంతోషంతో అతనికి మూడు ఎకరముల నేలా, అది సాగుచేయటానికి అవసరమైన పరికరములూ, ధనమూ, పరివారమూ అన్నీ సమకూర్చి పెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయముతో ఉక్రుడు కష్టపడి పొలం సాగుచేసి పండించాడు. అతనికి దైవసాయము తోడుపడటం చేత, పంట బాగా పండింది. వ్యవసాయఖర్చులు, మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా పాతిక బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్థులందరూ సంతోషించారు. అతను, తనవంతు ధాన్యమును మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకొని, కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి, ధాన్యం నిలవ వేసుకొనేవరకు సుమారు ఆరు మాసముల కాలం పట్టింది. కూలీలతో సహా మరి కొద్దిరోజులకే అతని అన్న వక్రుడు కొండదిగి వచ్చాడు. వారి స్థితి ఎలా వున్నదంటే తెచ్చుకొన్న సొమ్ము అంతా కర్చయిపోయింది. ఆహార పదార్థములన్నీ అయిపోయినయి. ఒక్క అడుగైనా ముందుకు పడక, వారందరూ ఆకలిదప్పులతో శోషకొట్టి పోయినారు.
ఈ ఆరు నెలలలోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకొని వచ్చిన బంగారపు పెళ్ళలు మాత్రమే, అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి. కాని, కడుపుకి తిందామంటే చారెడు ధాన్యపుగింజలైనా చేతిలో లేవు. వక్రుడూ, అతని వెంటనున్న కూలీలూ ఆకలితో అలమటించి పోతున్నారు. కాని, ఈ పల్లెటూరిలో వీరినందరునూ ఆదరించే వారెవరు? వక్రుని వద్ధ బంగారము ఉన్నమాట నిజమే. కాని, ఈ సమయంలో ఈ పల్లెటూరిలో అదేమన్నా కూడుపెడుతుందా ? అదనుకు అక్కర వస్తుందా? వక్రుడు దిగి వస్తూనే, దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకొన్నాడు. అది విని ఉక్రుడు "అన్నయ్యా! అందరకూ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది. కాని, భోజనం పెట్టినందుకు గ్రామస్థులు తలకొక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకొంటారు" అని చెప్పేవరకు, వక్రుడు ఉగ్రుడైపోయినాడు. తమ్ముడు గ్రామస్థులతో కలసి, తను కష్టపడి సంపాదించుకు వచ్చిన బంగారం కాస్తా కాజెయ్యటానికి ఈ వ్యూహం పన్ని వుంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ, కోపంతోనూ వక్రుడు ఆవేశ పూరితుడై, బస్తాలోని బంగారు పెళ్లల న్నిటినీ అక్కడ కుమ్మరించి "సరే తమ్ముడూ! మా వద్ద వున్న సొమ్ము ఇదే. దీనిని గ్రామస్థులకు ఇచ్చి, మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటె ఏమి చేయగలం? ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే, తరువాతి మాట చూసుకోవచ్చు" అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకొన్న బియ్యము తీసి, పేదరాసి పెద్దమ్మను రప్పంచాడు. వక్రుడూ, కూలీలూ శుభ్రంగా స్నానం చేసుకువచ్చేటంతలో, పంచభక్ష్య పరమాన్నములతో వంట సిద్ధమైంది. ఆరు నెలల నించి ఇటువంటి తిండికి మొగము వాచిన వక్రుడూ, కూలీలూ ఈ భోజనం వరప్రసాదముగా భావించారు. భోజనము అవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేవరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ బంగారపు పెళ్లలన్ని అన్నకు తిరుగా ఇచ్చి "అన్నయ్యా! అనవుసరంగా నీవు నా పైన అపోహ పడ్డావు కాని, నీసొత్తు నాకు చీపురు ముల్లయినా అక్కరలేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు," అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాప పడ్డాడు. "తమ్ముడూ, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృథాచేశాను. అదే కాలంలో నీవు నల్లబంగారమనే నేలను పండించి, హాయిగా, నువు తిని పది మందిని పొషించ గలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ" అని చెప్పి అనేక విధాల మెచ్చుకొన్నాడు. అప్పుడు అన్నాదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లిపోయి, ఖాళీగా పడిపున్న బంజరులను ప్రభుత్వం వద్ద నించి కౌలుకు తీసికొని పండించ నారంభించారు. కాయకష్టంవల్ల కలిగే లాభాలను, వాటి విలువనూ, తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల, వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటి నించీ వారు పేరొందిన రైతుబిడ్డలై, రాణించి, గొప్ప ఐశ్వర్యవంతులైనారు.
Comments
Post a Comment