పూర్వకాలంలో ఒక రాజుకి ఒక్కడే కుమారుడు. అతని పేరు బుద్ధిసాగరుడు. రోజూ సాయంకాలం గుర్రాల సాలలోకి వెళ్లి, పంచకల్యాణిని స్వయంగా, తీసుకొని, స్వారి వెళ్లటం అతనికి మామూలు. ఒకనాడు అతను గుర్రాల సాలకు పోయేసరికి, అక్కడ ఒక చిన్న పిల్లి పిల్ల కనపడి, "రాజకుమారా! త్వరలోనే మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది. ఆమె నిన్నూ, మీ కుటుంబాన్నీ మింగివేసి, ఇల్లు నేలమట్టం చేసి వేస్తుంది. కనుక నీవు ఈ వెంటనే భూలోకం చివరనున్న పువ్వులకోటకు వెళ్లిపోతివంటే తప్పించుకోగలుగుతావు" అని చెప్పింది. ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకల్యాణి పైన దౌడు ప్రారంభించాడు. కొంతదూరంలో అతనికి ఒక మైదానం కనపడింది. అక్కడ ఇద్దరు అవ్వలు కూచుని కుట్టు కుడుతూ కనిపించారు. దారం తెగిపోతే కొత్త దారం తీసుకుని, సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకొని వాళ్లు అలా కుట్టుతూనే వున్నారు. "అవ్వల్లారా ! ఇదేనా భూలోకానికి చివర, చెప్పండి. నా రాక్షసి చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి, నన్ను కబళించి వేస్తుంది. అందుకని మీతో ఇక్కడ ఉండిపోతాను" అన్నాడు రాజకుమారుడు. "నాయనా, భూలోకానికి చివర ఇది కాదు. ఈ దారమంతా అయిపోయి, సూదులన్ని విరిగిపోగానే మేము చచ్చిపోతాము. అప్పుడు మీ చెల్లెలు వచ్చిపడితే నువ్వెక్కడికి పోగలవు! మా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు" అని అవ్వలిద్ధరూ అతనితో చెప్పారు. తన బతుకు ఒంటిపాటు అయినందుకు విచారిస్తూ, బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు తీసి ఒక అడవి చేరుకొన్నాడు.
అక్కడ చెట్టుపీకుడుగాడు పెద్దపెద్ద వృక్షాలను పీకి పడవేస్తుంటే, అవి పెళాపెళా శబ్దం చేస్తూ వున్నాయి. రాజకుమారుడు అతనితో "అబ్బీ! ఇదేనా భూలోకానికి చివర, చెప్పు. నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి, నన్ను కబళించివేస్తుంది. అందుకని నీతో ఇక్కడ ఉండిపోతాను" అన్నాడు. "నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. ఇంక కొద్ది చెట్లే ఉన్నయి. అవి పీకడం పూర్తి కావడంతో నా ఆయువు సరిపోతుంది. అప్పుడు అమాంతంగా నీ చెల్లెలు వచ్చి కబళించబోతే నువ్వెక్కడికి పోగలవు? నాదగ్గర ఉండటం నీకు మేలు కాదు" అని చెట్టుపీకుడుగాడు చెప్పాడు. ఒంటిపాటు బతుకయినందుకు ఏడుస్తూ, బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు. ఈసారి ఒక కొండ ప్రదేశం కనపడింది. అక్కడ పర్వతవర్ధనుడు కొండలను ఎత్తి బంతులలాగ ఎగురవేస్తున్నాడు. అవి ఎత్తునుంచి నేలపైన పడి, దుమ్మయిపోతున్నయి. పర్వతవర్ధనుణ్ని చూచి రాజకుమారుడు "అబ్బీ! ఇదేనా భూలోకానికి చివర, చెప్పు, నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుచేత ఇక్కడ నీతో ఉండిపోతాను" అన్నాడు. "నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. అదుగో ఆ పర్వతాలు కాసినీ ఎగర వేయడముతో నా జీవితము సరిపోతుంది. అప్పుడు హఠాత్తుగా నీ చెల్లెలు తరుముకు వచ్చి కబళించితే నువ్వెక్కడికి పోగలవు? నాదగ్గర ఉండటం నీకు క్షేమం కాదు" అని పర్వతవర్ధనుడు చెప్పాడు. తన బతుకు ఒంటిపాటయినందుకు ఏడిచి రాగాలెట్టి, బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు.
పోగాపోగా బుద్ధిసాగరుడికి, మేఘాలలో నించి వేలాడుతున్న ఒక పువ్వులమేడ కనపడింది. అదే తప్పకుండా భూలోకానికి చివర అయివుంటుందని అతను నిశ్చయించుకొన్నాడు. తెరిచి వున్న వాకిలి నించి పంచకల్యాణి సరాసరి కోటలోకి వెళ్లి తోటలో ఆగింది. కోటలోనించి ఒక నుందరి దిగివచ్చి, రాజకుమారుణ్ని చెయ్యిపట్టుకొని లోపలకు తీసుకుపోయింది. "అబ్బాయీ! నువు వెతుక్కుంటూ వచ్చిన ఆ భూలోకం చివర ఇదేను, ఇంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా వుంది. ఏకాంతంగా ఉండటంవల్ల ఇంత కాలం నాకేమీ తోచిందికాదు. నా పేరు ఛాయాసుందరి. నాతో ఆడుకుంటూ నువు ఇక్కడనే ఉండిపోవాలి" అని ఆమె బుద్ధిసాగరుణ్ణి బలవంత పెట్టింది. ఛాయాసుందరి ఇష్టప్రకారం అతను పువ్వులకోటలోనే ఉండి, ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అతను తోటలన్నీ తిరిగేవాడు. చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఎక్కేవాడు. అయినా ఛాయాసుందరి అతన్ని ఎప్పుడూ ఆటంకపరచలేదు. ఒకరోజున బుద్ధిసాగరుడు, కోటపైకి ఎక్కి చుట్టూ చూచాడు. ఒక దిక్కున తన ఊరూ, ఆ వూళ్లో పైకప్పు లేచిపోయిన వాళ్ళ ఇల్లూ, బీటలు వేసిన గోడలూ కళ్ళకు కట్టినట్టు కనబడినయి. ఇదంతా తన రాక్షసి చెల్లెలు చేసిన పనే అయివుంటుందని అతనికి జ్ఞాపకంవచ్చి, ఏడిచి రాగాలు పెట్టాడు. అతని కళ్లు ఎర్రగా ఉండటం చూసి, "ఏమిటి కారణ?" మని ఛాయాసుందరి అడిగింది. నా మనస్సు ఏమీ బాగులేదు. నాకు చెల్లెలు పుట్టి, మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని పిల్లిపిల్ల కనపడి చెప్పింది. నేనిప్పుడే ఊరికిపోయి, నా తలిదండ్రులను బతికించగలనేమో చూచి వస్తాను" అని రాజకుమారుడు మాయామర్శం లేకుండా తన మనసులో బాధ చెప్పాడు.
ఛాయాసుందరి ఎంత వద్దని చెప్పినా అతను కాదు కూడదని బయలుదేరాడు. అప్పుడు ఛాయాసుందరి అతనికి ఒక మాయకుంచె, ఒక మాయదువ్వెన్న, రెండు మాయరేగిపళ్లు ఇచ్చి వాటిని ఉపయోగించే విధం చెప్పి పంపించింది. పువ్వులకోట నుండి తిరిగివచ్చేటప్పుడు రాజకుమారుడికి ముందు పర్వతవర్ధనుడు కనపడ్డాడు. అతను విసరవలిసినది ఇంక ఒక్క కొండ మాత్రమే ఉన్నది. దానితో అతని పని సరి, అందుకని విచారంగా ఉన్నాడు. బుద్ధిసాగరుడు అతనితో విచారించవద్దని చెప్పి, తనవద్ద ఉన్న మాయకుంచె విసిరేసరికి భూమి పటేల్ మని బద్ధలయి, అందులోనించి కోటి వేల పర్వతాలు పైకిపుట్టుకు వచ్చినాయి. అవి చూచేవరకు పర్వతవర్ధనుడికి ఎంతో సంతోషం కలిగింది. "నాయనా, ఈ పర్వతాలు ఒక వెయ్యేళ్ళ వరకూ సరిపోతయి. నాకు మళ్లీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది" అని రాజకుమారుణ్ణి దీవించి పంపాడు. రెండో మకాములో చెట్టు పీకుడుగాడు అగుపించాడు. ఇంక అతను పీకవలసినవి రెండే చెట్లు ఉండటంచేత, అవి కాగానే చచ్చిపోతాను కదా అనే బెంగతో ముఖం వేలవేసుకుని వున్నాడు. "నీకేం భయంలేదని చెప్పి బుద్ధిసాగరుడు తన దగ్గర ఉన్న మాయదువ్వెన విసిరేసరికి, అక్కడ ఒక గొప్ప అరణ్యం తయారయింది. అది చూచి చెట్టుపీకుడుగాడికి సంతోషం కలిగింది. "నాయనా, ఈ వృక్షాలు ఒక వెయ్యేళ్ల వరకూ చాలును. నాకు మళ్లీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది" అని దీవించి పంపాడు.
తరువాత మైదానంలో బుద్ధిసాగరుడికి అవ్వలిద్దరూ కనపడ్డారు. సూదులూ, దారమూ ఐపోవచ్చిన కారణంచేత, ఇక ఎలాగా చచ్చిపోతాము కదా అని వాళ్లు విరక్తిగా ఉన్నారు. "మీకు వచ్చిన భయం లేదు" అని అంటూ బుద్ధిసాగరుడు తన వద్ద ఉన్న రేగిపళ్లు ఇద్దరకూ చెరివకటి ఇచ్చాడు. "అవి తినేసరికి వాళ్ళకు యౌవనం వచ్చేసింది. వాళ్లు చాలా సంతోషించి, "నాయనా! నీ ధర్మమా అని మాకు మళ్లీ వెయ్యేళ్ళవరకూ ఆయువు పోశావు. మేము ఇంతకాలంనించీ అల్లుతూ వున్న జేబురుమాలు నీకు బహుమతి చేస్తున్నాము. పని వచ్చినప్పుడు దీనిని నేల మీద విసిరినట్టయితే నీకు కావలసిన సహాయం కలుగుతుంది. దగ్గిర ఉంచుకో" మని చెప్పి దీవించి ఇచ్చారు. బుద్ధిసాగరుడు ఇల్లు చేరుకునేసరికి తల్లీ లేదు, తండ్రీ లేడు. ఒక గోడ బీటలోనించి అతను ఇంట్లోకి తొంగి చూచాడు. అన్న ఏ క్షణాన వస్తాడో అని చెల్లెలు పెంచిన శరీరం తగ్గించుకుని వుంచింది. ఆమెను చూచి బుద్ధిసాగరుడు భయపడి పారిపోబోయేసరికి, చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు ఇవతలకు వచ్చి, "అన్నయ్యా, నీ కోసమే ఎదురుచూస్తూ వున్నాను. ఈ గదిలో హాయిగా పాడుకుంటూ కూర్చో, ఇంతలో నేను ఫలహారం తయారుచేసి పట్టుకువస్తాను" అని ప్రేమతో ఆహ్వానించింది. అతను అలాగ కూర్చుని పాడుకుంటూ వుండగా, పిల్లిపిల్ల మళ్లీ వచ్చి "నాయనా, నీ చెల్లెలు నీకోసం ఫలహారం చేస్తున్నదనుకుంటున్నావు కాబోలు. అదేమీ లేదు, నిన్నే ఫలహారం చేయటానికి సిద్ధం చేసుకొంటున్నది. తక్షణమే పారిపో" అని చెప్పింది.
పిల్లిపిల్ల సలహా ప్రకారం బుద్ధిసాగరుడు పంచ కల్యాణని ఎక్కి పరుగుచ్చుకొన్నాడు. పాట ఆగిపోవటం కనిపెట్టి, చెల్లెలు గదిలోకి వచ్చి చూచింది. అన్న కనపడకపోయే సరికి, అతని జాడ కనుక్కొని ఉరుముకుంటూ వెంబడించింది. అప్పుడు బుద్ధిసాగరుడు అవ్వలిచ్చిన జేబురుమాలు తిసి విసిరాడు. ఆక్కడ ఒక లోతయిన అగాధం ఏర్పడింది. ఆమె అది దాటి వచ్చేలోపల అతను అడవి చేరుకొన్నాడు. రెప్పపాటు కాలంలో ఆమె అడవికి వచ్చేసింది. ఈ లోపల చెట్టుపీకుడు గాడు పెద్ద వృక్షాలు పెకలించి అడ్డుగా పడవేశాడు. అవి తప్పించుకుని ఆమె మళ్లీ బయలుదేరేలోగా బుద్ధిసాగరుడు కొండలు చేరుకొన్నాడు. ఆమె అతనిని వెంట తరుముతూనే వుంది. అక్కడ పర్వతవర్ధనుడు మాత్రం ఊరుకొన్నాడా? గొప్ప పర్వతాలు కొన్ని ఎత్తి అడ్డు పడవేశాడు. వాటిని తప్పించుకుని ఆమె మళ్లీ వెళ్లే లోపల బుద్ధిసాగరుడు పువ్వులకోట చేరుకొన్నాడు. "ఈసారి ఎలా తప్పించుకుంటావ్!" అని అరుస్తూ గోల పెడుతూ ఆమె వెంటబడుతూనే వుంది. మేఘాలలోనించి ఇదంతా కనిపెడుతూ వున్న ఛాయాసుందరి కోట తలుపు తెరిచే వుంచింది. పంచకల్యాణి మళ్లీ తలుపులోనించి సరాసరి వెళ్లి కోటలో ఆగింది. రాక్షసి చెల్లెలు గర్జించుకుంటూ వచ్చి "నా అన్నను నాకు ఇచ్చి వేయి" అని ఛాయాసుందరిని అడిగింది. "నేనివ్వను, పో" అని ఛాయాసుందరి చెప్పింది.
ఇక దెబ్బలాడి ఇతనిని జయించలేము, యుక్తి చెయాలి, అని ఆమె నిశ్చయించుకుంది. తన శరీరం బాగా తగ్గించి ఒక చిన్ని బాలిక రూపంలో ఛాయాసుందరి వద్దకు వచ్చి, "పొనీ, నేనొక్కమాట చెబుతాను: నన్నూ, మా అన్ననీ త్రాసులో పెట్టి తూచు. ఎవరు ఎక్కువ బరువుంటే వాళ్లు గెలిచినట్టు. నాకంటె అతను ఎక్కువ బరువయితే మాటాడక పోతాను, లేకుంటే ఎత్తుకుపోతాను" అని అన్నది. ఈ మాయ మాటలకు ఛాయాసుందరి నవ్వి సరేనన్నది. త్రాసు చిప్పలు భూలోకపు చివరకు ఆనేటట్టుగా ఛాయాసుందరి మేఘమండలము నించి వేలాడవేసింది. బుద్ధిసాగరుడు ఎక్కిన చిప్ప కిందికంటా దిగిపోయేసరికి, కోపం కొద్ది చెల్లెలు శరీరం పెంచి, "ఇదుగో, నేనే ఎక్కువ బరువూ!" అంటూ, త్రాసుచిప్పలోకి దూకింది. అమె బరువుకి త్రాసుచిప్ప తెగిపోయి ఆమె నేలమీదికి దొర్లిపోయింది. ఆ చిప్ప ఎప్పుడయితే తెగిపోయిందో, బుద్ధిసాగరుడున్నత్రాసు చిప్ప పైకంటా లేచిపోయింది. అతను తెరిచి వున్న తలుపులోనించి దూరి, మేఘమండలంలోని పువ్వుల కోటలోకి వెళ్లిపోయాడు. కోపం పట్టలేక పళ్లు కొరుకుతూ వున్న చెల్లెలిని చూచి నవ్వతూ, ఛాయాసుందరి మెల్లిగా కిటికీతలుపులు మూసివేసింది. అంతటినించీ చెల్లెలి పీడ లేకుండా ఛాయాసుందరీ, బుద్ధిసాగరుడూ హాయిగా కోటలో ఆడుకొంటారు. వాళ్లు పగటి పూట నక్షత్రాలను పట్టుకుపోయి వాటితో ఆడుకొంటారు. అందుకనే పగలు మనకి చుక్కలు కనపడవు. రాత్రిళ్లు మళ్లీ పట్టుకువచ్చి వాటిని మన కోసం ఆకాశం మీద వదిలేస్తుంటారు.
Comments
Post a Comment