చందమామ కథలు - పుండరీకుడు

 

Chandamama Telugu Story of a devotee who made the god himself to visit him at home. Best Telugu Chandamama stories to read.

పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుచరిత. ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు. పాండురంగ విఠలుణ్ణి దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజనచేస్తూ పండరీపురానికి బయలుదేరారు. సుచరిత యిది చూచి భర్తతో "ఏమండీ, మనం కూడా పండరీపురం వెడదామా?" అని అడిగింది. "ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైన ఆధారపడి ఉన్న తల్లితండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలు? మనకి ఇల్లే పండరీపురం. ఆ పాండురంగ విఠలుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ, ఈ ముసలి దంపతులకు సేవ చెయ్యటం కన్న మనకి మరొక ఆలోచన ఉండకూడదు" అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్ళాలని వున్నా, సుచరిత పైకి ఏమీ అనలేక ఊరుకుంది. తక్కిన భక్తులంతా అనుకొన్న ప్రకారం బయల్దేరి పండరీపురం వెళ్లిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్ళల్లో ముసలి తలితండ్రులో లేక రోగిష్ఠి భర్తలో, భార్యలో, పిల్లలో లేకపోలేదు. కాని వాళ్ళు పుండరీకునికి మల్లే "మనం వెడితే మనవాళ్ళ గతేమికాను?" అని ఆలోచించక, "ఎవళ్ళఖర్మ వాళ్ళది. వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా?" అని నిశ్చింతగా చక్కాపోయారు. పుండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్లలేక పోయినందుకు కొంచెమైనా దిగులుపడలేదు. ప్రతిరోజూ ప్రొద్దున్నే లేచి, వెయ్యిమంది పరిచారికలపెట్టు అయి తలితండ్రులకి సేవ చేసేవాడు. 


పాపం వాళ్ళు కూచుంటే లేవలేని ముసిలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె వొళ్ళంతా రాసి, నలుగుబెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలుతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఊతయిచ్చి, లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికెదురుగా పీటల మీద కూర్చోపెట్టి, తండ్రికి సంధ్యవార్చుకునే నిమిత్తం జారీతెచ్చి ఇచ్చేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడూ, భక్తుడూ, కర్మిష్ఠీని. ఐతే ఏం? ముసలితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి, దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మరిచిపోయేవాడు. పూజ అయే దాకా పుండరీకుడు తడబడుతూన్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూండేవాడు. ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా ఆనేది కాదు. దేవతార్చన సమయంలో గంధం, అక్షతలూ, యజ్ఞోపవీతం పువ్వులూ మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూండేవాడు. అదే సమయంలో తాను గూడా పాండురంగ విఠలునికి పూజచేసి, తులసి తీర్థాన్ని తల్లికీ తండ్రికీ ఇచ్చేవాడు. పంచభక్ష్య పరమాన్నాలూ చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లి తండ్రులకు వడ్డించి, తర్వాత తను తినేవాడు. ఆ ముసిలివాళ్లకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకూ కోపం వచ్చేది. తను కూడా వాళ్ళతో బాటు చిరాకు పడక, పుండరీకుడు వాళ్లని చిన్న బిడ్డల్ని లాలించినట్లు లాలించేవాడు. వాళ్లు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైన తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తలితండ్రులకు సేవచేస్తూ వెనక దిగడిపోగా, తక్కిన భక్తులంతా "జయ పాండురంగ విఠలే" అని భజన చేస్తూ, పండరీపురం చేరుకున్నారు. 

వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేదు! ఆ పీఠం కాళీగా కనపడింది! 'స్వామి ఏడీ! స్వామి ఏడీ!!' అంటూ భక్తులంతా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుక్కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కాపోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు. అప్పటికీ స్వామి రాలేదు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకుని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తమ గ్రామానికి చేరుకున్నారు. పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదలి పుండరీకుడున్న ఊరికి వచ్చెయ్యటమే అయన గుళ్ళో లేకపోవటానికి కారణం. వృద్ధులైన తల్లితండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడటానికి ఆ మహా భక్తుడయిన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు గదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళేడు. కాని, ఈ దేవ రహస్యం సామాన్యజనానికి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంటి వాకిట నిలబడే వేళకి అతను తన తల్లి తండ్రులకు భక్తిశ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. "పుండరీకా, భక్తాగ్రేసరా! నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి, మేమే నీ వద్దకు వచ్చామయ్యా" అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు. "స్వామీ, ఇదుగో వచ్చేస్తున్నా. ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోసెయ్యటం అయింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి, లోపలకు తీసుకొచ్చి కూర్చోపెట్టి నీ దర్శనానికి వస్తా" నన్నాడు పుండరీకుడు.

ఆ మాటలు విని సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరి సహా వచ్చి వాకిట నిలపడితే ఎదురురాక "వస్తా అలాగే నిలపడి ఉండు" అనవచ్చా? స్వామికేమి కోపం వస్తుందో? అని ఆమె భయపడి చూస్తున్నది. కాని శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట పడికట్టుమీద నిలపడ్డవాడు అలాగే నిలుచుండిపోయాడు. మరి కొంతసేపటికి పుండరీకుడు తల్లితండ్రుల్ని లోనికి తీసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి, దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోపెట్టి, జారీ దగ్గిరపెట్టి 'ఒక్క క్షణంలో వస్తాన' ని పాండురంగస్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటకి వచ్చాడు. పిలవగానే వెళ్ళక, ఇంత ఆలస్యం చేయడమూ, పైగా పని చూసుకువచ్చేవరకూ ఉండుమనటమూ ఎంత పొరపాటు! అందులోనూ కేవలమూ స్వామితోనా ఇటువంటి జవాబులు చెప్పటం? స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగనికేసి చూస్తూ వుంది. ఏం చిత్రమో? పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలపడివున్నది? కాదు. ఎవరో ముసిలాయన! ఎవరో ఏమిటి? తన మామగారిలాగే ఉన్నాడు! ఇప్పుడేగా తన భర్త మామగారిని స్నానంచేయించి లోపలి తీసుకు వెళ్ళింది? అంతవరకూ ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలపడి ఉన్న దేవేరికూడా ఇప్పుడు కనపడదే? ఆమె స్థానే తన అత్తగారికి మల్లే ఉన్న ముసిలామె ఎవరో నిలపడి ఉన్నది! సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది.  

తలితండ్రులకి పరిచర్య చెయ్యటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు. 'ఆ తలితండ్రులకు పరిచర్య చెయ్యటం మాకు పరిచర్య చేయటంలాంటిదే సుమా' అని తనకు తెలపటం కోసం లక్ష్మీ నారాయణులు తనకు అత్తామామలరూపంలో కనపడుతున్నారు" అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, "గరుడవాహన! జగన్నాధ! పుండరీకాక్ష! పాండురంగా!" అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు. పాండురంగాడూ దేవేరీకూడా పరమానందభరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సున ఉంచి, "పుండరీకా! భక్తాగ్రేసరా! వృద్ధులైన నీ తలిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజా, పరిచర్యా మాకు చెందినై. కుమారా నీకేమి కావాలో కోరుకో" అన్నారు. సుచరిత తన భర్త ఏం వరం కోరుతాడో అని వింటోంది. పుండరీకుడు, "స్వామీ! నాకూ, నా భార్యకూ కూడా అందరి భక్తులకు మల్లేనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది. కాని శతవృద్ధులయిన నా తల్లిదండ్రుల్ని విడిచి పండరీపురంరాలేము. మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగా వచ్చారు గనక మీరిక్కడనే ఆగిపొండి. ఇదే నా కోరిక" అన్నాడు. ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది. తమ్ము కటాక్షించటానికి ఒక మారు స్వామి దేవేరితో వేంచేశాడు గాని శాశ్వతంగా ఇక్కడనే ఉండిపొమ్మంటే ఉంటాడా అనుకుంది. 

కాని పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే, ఆ పడికట్టుమీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. అంతే కాదు. గంగాదేవిని రప్పించి, "ఇక్కడ నేను ఉండిపోతున్నాను. అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు. వాళ్ళకి స్నానపానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావలి. అందుచేత నువ్విక్కడ ప్రవహించు" అని ఆజ్ఞాపించాడు. తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది. పుండరీకుని గ్రామమే పుండరీకక్షేత్రమైంది. పాండురంగని దర్శనం కోసం, భక్తులేకాక బ్రహ్మ, శివుడూ మొదలైన దేవగణమందరూ అక్కడికి వస్తూండేవారు. ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేర లేకపోయింది. పుండరీకుని సంగతి తెలిశాక వాళ్లందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది. తమర్ని కనిపెంచి పెద్దవాళ్లని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లితండ్రులకు పరిచర్య చెయ్యటమే భగవంతుణ్ణి సంతోషపెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు. మానవులందరకూ కొన్నికొన్ని విధులు ఏర్పడివున్నాయి. ఎలా అంటే బిడ్డలు తలిదండ్రులను సేవించటం, భార్యలు భర్తలను సేవించటం, భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం, ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయడం. ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతై. తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి, భక్తుని కోరికలు నెరవేర్చాడు. తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి, వ్యర్థంగా తిరిగి రావలసివచ్చింది.

Comments