చందమామ కథలు - దేవతా ఫిడేలు

 

Chandamama Telugu Story of a King who learnt his lesson for misusing a musical gift from a fairy. Best Chandamama Telugu Stories to read.

అనగనగా ఒక రాజు. ఆ రాజుకి సంగీతమంటే చాలా సరదా. తనకు సంగీతం నేర్పటానికాని గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాలమీద యేర్పాటు చేసుకున్నాడు. కాని రాజుకి వారి వల్ల ఏ మాత్రం సంగీతం అబ్బింది కాదు. ఒక విద్వాంసుడు కాదని మరొకరు, అతను కాదని మరొకరు, యిలా రాజు నెల నెలకీ సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే వున్నాడు. కాని, పాపం ఒక్క ముక్కయినా సంగీతం పట్టుబడలేదు. నోటితో పాడటం రాకపోతే పోయింది, కనీసం యే ఫిడేలో, వీణో వాయించటమన్నా వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్యసంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేయించి చూచాడు. కాని, వారి వల్లా ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది." ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కయినా సంగీతం పట్టుపడకపోవటం ఎంత చిన్నతనం! ఈ సంగతి ప్రజల చెవిని బడిందంటే నేను చాలా చులకనైపోతానే" అని ఈ దిగులుతో రాజుకి సరిగా అన్నం కూడా సయించకుండ పోయింది. ఎప్పుడూ "నాకు సంగీతం ఎలావస్తుంది?" అని ఒకటే దిగులు. ఇలా వుండగా ఒకరోజు రాత్రి రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి యిలా చెప్పింది: "రాజా! నీ మనస్సులో వున్న దిగులు ఏమిటో నాకు తెలుసు. నీ స్థితి చూస్తే నాకు చాలా జాలివేసింది. నీకు సహాయం చేద్దామనే నేను వచ్చాను. ఇదిగో ఈ ఫిడేలు నీకు యిస్తున్నాను. దీన్ని చేతబట్టుకుని తీగెలమీద కమాను ఆడించితే చాలు. దీనినించి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది. నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నీ యిష్టం వచ్చినంత సేపు దీన్ని వాయించుకోవచ్చు. ఇందులో మరో విశేషం కూడా వుంది. దీన్ని నువ్వు ఎవరి యెదుట వాయిస్తావో వాళ్లు పరవశమై నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు. నీవు ఫిడేలు వాయించటం ఆపితే గాని వాళ్లు ఆడటం మానలేరు. కనుక నీ యిష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకొంటూ హాయిగా వుండు." 

ఇలా చెప్పి, ఆ దేవకన్య ఫిడేలుని రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైంది. ఫిడేలు పడిన చప్పుడు విని రాజు త్రుళ్ళిపడి లేచాడు. పక్కమీద ఫిడేలు వుంది. దాన్నితీసి చూసి "నిజంగా ఇది మోగుతుందా?" అనుకుంటూ వాయించబోయాడు. కమాను తీగెలకు తగలగానే కమ్మటి సంగీతం వినవచ్చింది. రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అప్పటికి తను కలలో చూచింది నిజమేనని రాజు నిశ్చయించుకున్నాడు. కలలో దేవకన్య చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగినై. దేవకన్య చెప్పినట్లు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్లు నృత్యం చేసేమాట నిజమో కాదో పరీక్షచేసి చూడాలనుకున్నాడు. వెంటనే నౌకరును కేకవేశాడు. నౌకరు వచ్చి నిలబడగానే, రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు. వెంటనే నౌకరు నృత్యం చెయ్యసాగాడు. రాజుకి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా త్వరగా, ఇంకా త్వరగా వాయించసాగాడు. నౌకరు కూడా త్వరత్వరగా నృత్యం చేస్తున్నాడు.  

చివరకు నౌకరుకు కాళ్ళు నొప్పి పుట్టినై. వాడు ఆడకుండా వుందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి "ఇదేదో మాయగావుంది మహారాజా! నేను ఆడలేకపోతున్నాను. పోనీ, ఊరుకుందామంటే నా వల్ల కాకుండా వుంది. ఎలాగైనా ఈ బాధ వదిలించండి. కాళ్లు లాక్కుపోతున్నై" అని గోలపెట్టాడు. రాజు ఫిడేలు వాయించటం ఆపాడు. నౌకరు కూడా ఠక్కున ఆడటం మానివేశాడు. ఇప్పుడు రాజుకి తనకు కలలో దేవకన్య కనిపించి చెప్పినదంతా నిజమని తేలిపోయింది. ఇక తనని చూసి ప్రజలు నవ్వుతారని తను భయపడవలసిన అవసరం లేదు. తెల్లవారింది. మామూలు ప్రకారం రాజు దర్బారు జరుపుతూ, జరుపుతూ తన ఫిడేలుని వాయించసాగాడు. దర్బారులో వున్న మంత్రులు, సామంతులు, సేనానులు అంతా ఆడటం మొదలుపెట్టారు. తన ప్రజ్ఞ అంతా చూపాలని రాజు యింకా త్వరగా వాయించసాగాడు. వాళ్లు యింకా త్వరగా ఆడసాగారు. "ఇక చాలించండి మహారాజా! మా కాళ్ళు పీక్కుపోతున్నై" అని అందరూ మొత్తుకునే వరకూ రాజు వాయించటం ఆపలేదు. చివరకు ఎలాగైతేనేం రాజు ఫిడేలు ఆపాడు, మంత్రులూ వాళ్ళు ఆడటం మానేశారు. అంతటితో ఆ రోజు దర్బారు ముగిసింది. రాజు ఫిడేలుని ఎప్పుడూ తన దగ్గిరే జాగ్రత్తగా వుంచుకునేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకు పడుకునే వాడు. కనపడ్డవాళ్లందరి యెదటా ఫిడేలు వాయించటం, వాళ్ళు ఆడటం, వాళ్లకు కాళ్లు నొప్పులు పుట్టేవరకూ వాయించి, వాళ్లు గోల పెడుతుంటే తనునవ్వటం రాజుకు ఒక ఆట అయిపోయింది. ఒకరోజు రాజు దర్బారులో వున్నాడు. ఫిడేలు పక్కనే వుంది. దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించటానికి ఫిడేలు కోసం ప్రక్కన చూశాడు. అది అక్కడ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. "ఏ దుర్మార్గుడు ఈ దొంగతనం చేసింది!" అంటూ కళ్లెర్రజేశాడు. 

అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకు వాయిస్తూ కనిపించింది. కోతి వాయించ సాగేసరికి రాజు ఆడసాగాడు. కాని దర్బారులో వున్న మిగతావాళ్లు మాత్రం ఆడటం లేదు. కోతి ఫిడేలు చాల త్వరత్వరగా వాయించసాగింది. రాజు గోలపెడుతూ చిందులు త్రొక్కసాగాడు. ఆ విధంగా ఆడి, ఆడి రాజు చివరకు అలిసి మూర్ఛపోయాడు. మంత్రులూ వాళ్లు రాజు చుట్టూ గుమిగూడి శైత్యోపచారాలు చేశారు. కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది. కోతి కోసం చూచాడు. కాని యిప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిలిచివుంది. ఆమె చేతిలో ఫిడేలు వుంది. రాజు తెల్లబోతూ ఆమెవంక చూడసాగాడు. "అలా చూస్తావేం రాజా! నీవేమీ కలగనటం లేదు. నీ దుర్భుద్ధికి తగిన ఫలం పొందావు. అంతే" అన్నది దేవకన్య. "నేనేం తప్పుచేశాను" అన్నాడు రాజు భయపడుతూ. "ఇంకా ఏంచెయ్యాలి? పాపం, నవ్వులపాలై పోతావుగదా అని నీకు నేను ఫిడేలు యిస్తే, అమాయకులనందర్నీ ఏడిపిస్తావా? వాళ్ళు ఎంతకష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా?" అంది దేవకన్య. "తప్పుచేశాను. క్షమించు తల్లీ. ఇక ముందు అలా చెయ్యను. ఫిడేలుని తిరిగి దయచెయ్యి" అని యెంతో దీనంగా అడిగాడు రాజు. దేవకన్యకి జాలి కలిగింది. ఫిడేలుని రాజుకు అందిచ్చి ఆమె మాయమైంది. రాజు చాల సంతోషించాడు. ఆ నాటికిక దర్బారు చాలించాడు. ఎవరిళ్ళకు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, రాజు ఒంటరిగా కూర్చుని కొంచెంసేపు ఫిడేలు వాయించుకున్నాడు. ఆ రోజు మొదలు రాజు ఎవరినీ ఏడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు.

Comments