చందమామ కథలు - వృకాసురుడు

 

Telugu Chandamama Story of a demon who tried to use the boon got from Lord Shiva on the god himself. Best Chandamama Telugu Stories to read.

పూర్వం వృకాసురుడని ఒక రాక్షసుడుండే వాడు. 'వృకము' అంటే తోడేలు. అది సాధుజంతువుల్ని మ్రింగేసే కౄరమృగం. వృకాసురుడు కూడా తోడేలుకు మల్లే లోకంలో ఉండే సాధుజనుల్ని పీడించి హడలుగొడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. "చచ్చు మనుషుల్నీ, చచ్చు దేవతల్నీ బాధపెడితే ఏముంది? నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణే ఏడిపించాలి" అనుకున్నాడు. అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి, "స్వామీ, నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది. మార్గం ఏమిటి?" అని అడిగేడు. నారదుడు, "భగవంతుణ్ణి వశం చేసుకోవాలని ఉంటే ఎవరికైనా ఒక్కటే మార్గం. అదేమిటంటే తపస్సు చెయ్యటం. చాలా శుచివైయుండి, దీక్షతో తపస్సు చెయ్యి. శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు" అని చెప్పి, తన దారిని వెళ్ళిపోయాడు. వృకాసురుడు 'సరే' అని చెప్పి, నదిలోకి వెళ్లి స్నానం చేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తుత్తి తపస్సు చేస్తే లాభం లేదని తలచి, వృకాసురుడు ఒక క్రొత్త పద్ధతి కనిపెట్టేడు. ఒక పెద్ద హోమగుండం తయారుచేసి, తన శరీరంలోంచి మాంసఖండాలు కోసి ఆ గుండంలో వెయ్యటం మొదలెట్టేడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు! తన శరీరంలో మాంసం అంతా కోసి గుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవటం చూసి, వృకాసురుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చేయబోయాడు. ఏమిటంటే, తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని. అందుకు సిద్ధపడ్డాడు కూడా.

ఇదంతా కనిపెడుతున్న శివుడు ఇక ఆలస్యం చెయ్యలేదు. తక్షణం ప్రత్యక్షమై, "వృకాసురా, నీ సాహసానికి మెచ్చుకున్నాను, లేవయ్యా ఇంక. అయ్యో పాపం శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావే! నేను అనవసరంగా ఆలస్యం చేశాను. ఐతేనేంలే, వచ్చానుగా ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో," అన్నాడు. ఏం వరం కోరుకోవాలి వృకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు. "స్వామీ, మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు. నాకు వరాలెందుకు? ఐనా మీరు కోరుకోమన్నారు గనక కోరుకుంటున్నాను. చూడండీ, నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడి నెత్తి మీద పెడతానో వాడి తల వెయ్యి వ్రక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి!" అన్నాడు. వాడికోర్కె వినేటప్పటికి శివునికి ఆశ్చర్యం వేసింది. "ఇదేమిటి వెఱ్ఱివాడు! ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరమడిగాడేమిటి?" అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, "ఇదేమిటోయ్, ఇలా కోరేవు!" అని కూడా అడిగిచూశాడు. అందుకు వృకాసురుడు, "వరం అడగమన్నావు కనుక అడిగేను. ఇవ్వటం ఇష్టం లేకపోతే, ఇవ్వలేనని చెప్పి పోరాదా?" అన్నాడు. "నేను వరం ఇవ్వలేకపోవటమేమిటి? ఇచ్చాను పుచ్చుకో. నీ ఖర్మం ఎలా ఉంటే అలా అవుతుంది" అని చెప్పి, శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి, వెళ్ళిపోబోయాడు.

తక్షణమే వృకాసురుడు వెకిలినవ్వు నవ్వుతో, "ఏమయ్యోయ్ మహాదేవా, ఆగు. ఈ వరం నీ ఖర్మం కాలే ఇచ్చావు. నిన్ను ఏడిపించటానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు. నా చెయ్యి మొదట నీ నెత్తిమీదేపెట్టి, ఈ వరప్రభావం ఎలాంటిదో పరీక్షచేస్తాను" అంటూ శివుడిమీదికి దుమికేడు. ఇది చూచి శివుడు హడలిపోయాడు. అయన చటుక్కుని తప్పించుకున్నాడు గాని లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తల మీద పడి, నాశనమై పోవలిసినవాడే! "ఎంత కృతఘ్నుడు!" అనుకుంటూ శివుడు పరిగెత్తటం మొదలెట్టేడు. వృకాసురుడూ శివుడి వెంటపడ్డాడు. మాంసపు కండలన్నీ కోసి ఇచ్చేయటంవల్లా, ఉపవాసాలు చేసి శుష్కించి ఉండటంవల్లా కొంత నీరసంగా ఉన్నాడు కాని లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే! ముందు శివుడూ, వెనుక వృకాసురుడూ పరుగెత్తిపోతూండడం, ఆకాశం మీదనుంచి విష్ణులోకానికి వెడుతున్న నారదమహర్షి చూశాడు. ఆయన తన దివ్యదృష్టివల్ల జరిగిన సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. "వీడికి తపస్సు చెయ్యవలిసిందని ఆలోచన చెప్పింది నేనేకదా! కాని ఈ దుర్మార్గుడు తపస్సు ఇందుకోసం చేసేడన్న మాట! మంచివాళ్ళు పరోపకారంకోసం తమ శక్తులు వినియోగిస్తే, దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు!" అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదోవిధంగా రక్షించాలనుకున్నాడు. పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికెళ్ళి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు.

విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం, నారదుడా సంగతి చెప్పటంతోనే చటుక్కుని లేచాడు. ఏమంటే తన తోటివాడు శివుడు. త్రిమూర్తులలోనూ ఒకడు. బ్రహ్మదేవునిచేత సృష్టిచేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడుతాడు. ఈ లోకాల పని ఐపోయాక, శివుడు వాటిని 'ఇంక పనికిరావు' అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలని ఇలా నాశనం చెయ్యవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతఘ్నుడి చేతిలో నాశనమైపోతే ఎలాగ? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడ ఆలస్యం చెయ్యకుండా బయల్దేరాడు. ఒక పొట్టి బడుగువేషం వేసుకుని, వృకాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్న చోటికొచ్చాడు. ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడు చూచి, ఆయాసం చేత రోజుకుంటూ ఆగి, "ఏమబ్బాయ్ , నీకు శివుడెక్కడైనా కనపడ్డాడా? పిరికిపంద! ప్రాణాలు అరచేతిలో పట్టుకుపారిపోతున్నాడు!" అన్నాడు. అందుకా బ్రహ్మచారి, "శివుడా? కనపడ్డాడు. ఆ కొండమాటున ఎదురయాడు. 'ఎందుకయ్యా, ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెత్తుతున్నావ్?' అని అడిగేను కూడాను. అందుకు ఆయన 'నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనక? ముట్టుకోనిచ్చేవాణ్ణే. కాని వాడి వొళ్ళంతా మాంసపుకండలు కోసేసిన పుళ్లతోటి కంపుగొడుతో అసహ్యంగా ఉంది. ఆ పళాన ముట్టుకుంటానని పట్టు పట్టకపోతే, దగ్గిరగా నది ఉందికదా, ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా వొళ్ళంతా ఒకమాటు కడిగేసుకుని స్నానం చేసి శుచిగా రాకూడదూ? అలా వచ్చి ముట్టుకుంటానంటే నేమాత్రం వద్దంటానా?' అన్నాడు.

ఔనుగాని, నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్? ఎంతలేదన్నా దేవుడాయిరిగదా శివుడు? అతణ్ణి స్నానం చెయ్యకుండా ముట్టుకుంటారుటోయ్" అన్నాడు బ్రహ్మచారి. వృకాసురుడికా మాట వినేటప్పటికి, తాను నీళ్ళుపోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరబాటే అనిపించింది. "ఇదేమిటి? శాస్త్రాలూ, వేదాలూ, చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి, సంధ్య వార్చి, సూర్యునికర్ఘ్యం ఇచ్చి, శుచినైవస్తాను. అప్పుడు శివుడు తనంత తానేవచ్చి, 'ముట్టుకోవోయ్' అంటాడు. గోళ్లతో తీరిపోయేదానికి గొడ్డళ్ళు తేవటం ఎందుకు?" అని అలోచించి, నదికివెళ్ళి, కంఠం లోతువరకూ దిగి, మునగటానికి ముందు జుట్టుముడి విప్పుకుందామని, చెయ్యి తలపైకి పోనిచ్చాడు.  ఇంకేముంది? శివుడా దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసింది! తక్షణం వృకాసురుడి తల వెయ్యి వ్రక్కలై వాడు నాశనమైపోయాడు. తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి, ఈ సంగతేమీ తెలియక ఇంకా పరిగెడుతోనే ఉన్న పరమశివుణ్ణి కలుసుకుని "ఆగవయ్యా, ఇంక ఫరవాలేదు" అని, జరిగినదంతా చెప్పేడు. శివుడంతా విని, "రక్షించావు బాబూ. నన్నేకాదు లోకాలనన్నిటినీ రక్షించావు. లేకపోతే ఈ దుర్మార్గుడు కనపడ్డవాడినల్లా నాశనం చేసేవాడే" అన్నాడు. అందుకు విష్ణువు, "నిజమే. కనుకనే నువ్వు దుర్మార్గులకు అలాంటి వరాలు వీలైనంతవరకూ ఇవ్వకుండా ఉండాలి" అని చెప్పి, శివుణ్ణి కైలాసానికి పంపేసి, తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు.

Comments