- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తుంటే నాకు కన్యాకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు. అతి విచిత్రమైన అతని కథని చెబుతాను విను," అంటూ ఈ విధంగా చెప్పసాగాడు: కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడనే యువకుడుండేవాడు. అతను ధనికుడు. అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడాడు. సుమంతుడు కూడా సంపన్నుడే. ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి కోడలు కూడా అయి, మహా గర్విష్టిగా ఉండేది.
కొంత కాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు. అతని తల్లి భర్తతో బాటు సహగమనం చేసింది. కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి, రెండు నెలలు గడిచాక రాజధాని కేదో పని మీద వెళ్ళాడు. అక్కడ అతనికి అందగత్తెలైన వేశ్యలు కనిపించారు. అతను వారిలో ఇద్దరిని చూసి సమ్మోహితుడై, తన కున్నదంతా అయిపోయిన దాకా వారితో విలాసంగా గడిపి, ఇంటికి తిరిగి వచ్చాడు. అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చీదరించుకున్నది. కౌండిన్యుడు వర్తకం చేసుకుని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగలనియ్యమని బతిమాలాడు. ఆమె నగలనియ్యకపోగా, భర్తను పురుగు కింద కట్టేసి, తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కౌండిన్యుడు హతాశుడై, ఇల్లూ వాకిలీ వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తను కూడా ఆ నౌకలో ఎక్కాడు. సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్తా మునిగిపోయింది. కౌండిన్యుడొక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు. కౌండిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది. అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని, ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకువచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి. అతనా ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకుని, ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పై బట్ట పరుచుకుని పడుకున్నాడు. కొంచెం సేపటికి చీకటి పడింది. ఆ రాత్రి పర్వతం మీద ఒక వింత జరిగింది.
కాశీ రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది. ఆమె అతిలోక సుందరి. ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా, ఉత్తరంగా తల పెట్టుకుని నిద్రపోయింది. ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తె నెత్తుకుని, కౌండిన్యుడు చేరిన పర్వతం మీదికి వచ్చి, ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు. ఆ గుహలో అన్ని రకాల సామాగ్రీ చక్కగా అమర్చి ఉన్నది. రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడినుంచో అతి వేగంగా వచ్చి, ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి, "ఇది ఎవతె? దీన్ని ఎందుకు తెచ్చావు?" అని గదమాయించి అడిగింది. "నీకు ఆహారంగా తీసుకువచ్చాను. ఈ కొండ మీదనే మద్దిచెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకుని ఉన్నాడు. వాణ్ణి నేను తింటాను. వెళ్ళి పట్టుకురా," అన్నాడు రాక్షసుడు తన భార్యతో. వెంటనే రత్నావళి రాక్షసితో, "ఒసే, నీ మొగుడు పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. నువ్వు ముసలిదానివయ్యావని, పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు," అన్నది. రాక్షసుడి భార్య అసూయతో మండిపడి, "సరే, నీ కోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తానుండు!" అని చెప్పి, కౌండిన్యుడున్న చోటికి వచ్చి, అతనితో మంచిగా మాట్లాడి, "నా భర్త నన్ను వదిలి పెట్టేశాడు. వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది. దాన్ని తెచ్చి నీకిస్తాను. దానితో నా మొగుణ్ణి చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి, ఎంత సేవ అయినా చేస్తాను," అన్నది. "నీవు రాక్షసివి. నా వంటి వాళ్ళను తినే దానివి. నీ మాట ఎలా నమ్మటం?" అన్నాడు కౌండిన్యుడు.
ఏ పాపమో చేసుకోబట్టే గదా నేనూ, నా మొగుడూ ఈ రాక్షస జన్మ ఎత్తాం? ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు. నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది," అన్నది రాక్షసి. "సరే, అయితే ఆ శక్తిని తీసుకురా," అన్నాడు కౌండిన్యుడు. రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది. ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు. ఆమె వాడి బారి నుండి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో, "నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో. ఆ చెట్టు కింద ఉన్నాడంటివే, ఆ బ్రాహ్మణ యువకుణ్ణి, నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంటపెట్టుకురా. అతను మంత్రయుక్తంగా మనకు పెళ్ళి చేశాక, కావలిస్తే అతన్ని నువ్వే తిందువుగాని!" అన్నది. మూఢుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది. అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మద్దిచెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో, "ఆ వచ్చేవాడే నా మొగుడు. నిన్ను తినటానికి వస్తున్నాడు. శక్తితో ఒక్కటి పెట్టావంటే చస్తాడు," అని చెప్పింది. రాక్షసుణ్ణి దగ్గిర దాకా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు. ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది. ఆ రాక్షసి కౌండిన్యుడితో, "నేను కిందటి జన్మలో ఔర్వుడనే ముని కుమార్తెను. నా పేరు కందళి. నన్ను నా తండ్రి దూర్వాసుడికిచ్చి పెళ్లిచేశాడు. నేను నా భర్తతో అస్తమానమూ పోట్లాడేదాన్ని. చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు.
పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను. అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షసి బుద్ధి కాదు. అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను. నా భర్త కాశీ రాజైన సుద్యుమ్నుడి కుమార్తెను, రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు. ఆమె ఇప్పుడీ కొండ మీదనే ఉన్నది. నీవామెను పెళ్ళాడు. మిమ్మల్నిద్దరినీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను. నేను మీ ఇద్దరినీ కనిపెట్టి ఉంటాను," అన్నది. కౌండిన్యుడిందుకు సమ్మతించాడు. రాక్షసి ఏనుగు రూపం ధరించి, రత్నావళినీ, కౌండిన్యుణ్ణి తన పైన ఎక్కించుకుని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గర వాలింది. ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. రత్నావళి తన తండ్రితో జరిగినదంతా చెప్పి, "ఈ యువకుడు నన్ను కాపాడాడు. అతనితో బాటు నేను ఏనుగుపైన ఎక్కాను. ఈ రెండు కారణాల చేతా ఇతను నా భర్త కావటానికి అర్హుడు!" అన్నది. కాశీ రాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తె నిచ్చి వైభవంగా పెళ్ళి చేసి, అంతులేని రత్నాలతో సహా మహోదయపురాన్ని అతనికిచ్చేశాడు. ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలూ అన్నారు. "ఇప్పుడు చూడు, నీ భర్తకెలాటి యోగం పట్టిందో! అతన్ని నానా మాటలూ అన్నావు! ఇప్పుడతని దగ్గరకి ఏ మొహం పెట్టుకు పోతావు? పొతే మాత్రం నిన్నతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి? నిన్ను కుక్కకన్నా హీనంగా చూస్తాడు," అన్నారు వాళ్ళు. ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాప పడింది. "ఆయన నా నగలడిగినప్పుడెందు కిచ్చాను కాను?" అని తనను తాను తిట్టుకున్నది.
ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకీ పంపాడు. ఆమె అందులో ఎక్కటానికి సిగ్గుపడి, పల్లకీ తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది. కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. తనను పురుగు కన్నా హీనంగా చూసి, దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వ నిరాకరించిన భార్యను కౌండిన్యుడు, తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు? ఆమె పై నిజంగా ప్రేమ ఉండటం చేతనా? లేక ఆమె అనాదరణ ఫలితంగానే తాను సముద్ర యానం చెయ్యటమూ, సముద్రంలో నౌక మునగటమూ, చివరకు తానొక రాజ కుమార్తెకు భర్త కావటమూ మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వల్లనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు. దానికి విక్రమార్కుడు, "కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమా లేదు, కోపమూ లేదు, కృతజ్ఞతా లేదు. తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి, తన కన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అణకువగా ఉంటుంది. గర్విష్ఠి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు," అన్నాడు. రాజుకీ విధంగా మౌన భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
Comments
Post a Comment