పూర్వకాలమందు ఒకసిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసిలిదాని రూపంతో ఎదురుపడి, 'ఏమయ్యా సిపాయీ ! నిన్నూ నీ వేషమూ చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనపడుతున్నావు. మరి, నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను, నే చెప్పినట్టు చేస్తావా?' అన్నది. 'అయ్యో అంతకంటేనా ! ఆ వుపాయం ఏమిటో చెప్పు' అన్నాడు సిపాయి. 'అదుగో, ఆ చెట్టు చూశావా? దాని లోపలంతా డొల్లగానే వుంటుంది, నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకి ఒక మోకు కడతాను. నీవు లోపలనుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మోకు పట్టి లాగుతాను. నువు బయటకు వచ్చేసెయ్యొచ్చు' అని ముసిలిది చెప్పింది. 'సరే' అన్నాడు సిపాయి. అప్పుడు చెట్టులోపలికి దిగిన తరవాత ఏమి చేయాలో ముసిలిది చెప్పసాగింది : 'కిందికి దిగగానే ఒక పెద్ద చావడీ, వరసగా మూడు గదులూ కనబడతాయి. చావడిలో ఎల్లప్పుడూ వేయి దీపాలు వెలుగుతూ వుంటాయి. మొదటిగది తెరవగానే మధ్యని ఒక పెద్ద భోషాణమూ, దానిపైన ఒక భయంకరమైన కుక్కా కనబడతాయి. ఇదుగో నా నీలితివాసి నీకు ఇస్తున్నాను, ఇది నేలమీద పరిచి కుక్కను ఎత్తి దానిమీద పడుకోబెట్టితివంటే అది నిన్నేమీ చేయదు. అప్పుడు భోషాణంలో వుండే రాగినాణాలు నీ ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. ఒకవేళ నీకు రాగినాణాలు అక్కర లేకపోతే, రెండోగది తెరువు. అక్కడ భోషాణం నిండా వెండినాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్కా కనపడతాయి. కుక్కను తివాసిపైన పడుకోబెట్టి, నువు మోయగలిగినన్ని నాణాలు తెచ్చుకో. రాగీ వద్దు, వెండీ వద్దు, బంగారం మీద మోజున్నదంటావా? మూడవ గది తెరువు, ఈ గదిలో భోషాణం మీద మరింత భయంకరమయిన కుక్క వుంటుంది. దాన్ని తివాసీమీద పడుకోబెట్టి, కావలసినంత బంగారం తెచ్చుకో,' అని ముసిలిది రహస్యాలు వెల్లడించింది.
అప్పుడు సిపాయి, 'పెద్దమ్మా ! నువు చెప్పిందంతా బాగానే వుంది. అయితే ఏ ఉపకారమూ లేకుండా ఇటువంటి రహస్యం ఎవళ్లూ చెప్పరుకదా, తెచ్చిన ధనంలో నీకేపాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు, తరవాత పేచీపెడితే కుదరదు' అన్నాడు. "నువు కష్టపడి తెచ్చుకొనే ధనంలో నాకు ఒక్క దమ్మిడీ ఐనా వద్దు, నీవు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగపడే 'చెకుముకిరాయి' మాత్రం తెచ్చి నాకియ్యి. మా అమ్మమ్మ బతికివుండగా ఒకమాటు అక్కడకు వెళ్లి దాన్ని మరిచిపోయి వచ్చింది. అది తెచ్చి పెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగర్త పెట్టుకుంటాము." అని ముసిలిది చెప్పింది. సిపాయి "సరే" నన్నాడు. సిపాయి నడుముకి ముసిలిది మోకు బిగించింది. తన నీలితివాసీ చేతికిచ్చింది. అతను చెట్టు లోపలి నుంచి కిందికి దిగి, వసారా మొదటి గది తెరిచాడు. భోషాణం మీద కూర్చున్న కుక్క బంతులంతేసి కళ్లతో సిపాయి వేపు భయంకరంగా చూచింది. అతను జ౦కు లేకుండా కుక్కను ఎత్తుకుని నీలి తివాసిమీద ఉంచి "వోయి నేస్తం! హాయిగా తివాసి పైన కూర్చో" అన్నాడు.
కిక్కురుమనకండా ఆ కుక్క పడుకుంది. అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగినాణాలు నింపుకొని, తిరిగి భోషాణం మూసివేసి, కుక్కను మళ్లీ దానిపైన కూర్చోబెట్టాడు. తరవాత ఆతను రెండో గది తెరిచేసరికి బండిచక్రాలంతేసి కళ్ళతో భోషాణంమీది కుక్క భయంకరంగా చూసింది. మునపటిలాగానే ఈ కుక్కనూ నీలి తివాసిపైన పడుకోబెట్టి భోషాణం మూత తీసేసరికి అతని కళ్లు జిగాలుమన్నాయి. జేబులలో వున్న రాగి నాణాలన్నీ అక్కడనే విసిరేసి, ఈమారు జేబులలోనూ, సంచిలోకూడా వెండి నాణాలు నింపుకొన్నాడు. మళ్లీ భోషాణం మూతవేసి, కుక్కను దానిపైన కూర్చోబెట్టి మూడవ గదివద్దకు వచ్చాడు. ఇక్కడ వుండే కాపలాకుక్క సామాన్యమైందికాదు. బ్రహ్మరాక్షసంత భయంకరమయింది. దీనికళ్లు గుడిగోపురాలంతేసి పెద్దవి. కాస్తంత జంకు కలిగింది కాని, గుండె నిబ్బరం చేసుకొన్నాడు. దీన్నికూడా నీలి తివాసిపైన పడుకోబెట్టి భోషాణం తెరిచేసరికి, దానినిండా బంగారు నాణాలు వున్నై. సిపాయి కళ్లు మిరుమిట్లు కొలిపాయి. ఆమట్టున, జేబులలోనూ సంచీలోను వున్న వెండినాణాలు విసిరేసి, ఈసారి జేబుల్లోనూ, సంచీలోనే కాకుండా టోపిలనిండా జోళ్లనిండా ఎక్కడ ఖాళీవుంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తరవాత భోషాణం మూసివేసి, కుక్కను దాని పైనబెట్టి, చెట్టుమొదలుకు వచ్చి 'పెద్దమా ! మోకు లాగు' అన్నాడు. 'చెకుముకిరాయి తెచ్చావా?' అని ముసిలిది అడిగింది. 'అయ్యో మరిచానే' అని, వెనక్కు వెళ్లి చెకుముకిరాయి చేత పట్టుకువచ్చి, మళ్లీ ఈసారి 'మోకు లాగ' మన్నాడు.
ముసిలిది మేకు లాగింది. సిపాయి బయటకు వచ్చి "ఇదగో చెకుముకిరాయి. దీనితో ఏమి చేస్తావో చెప్పు" అని అడిగాడు. "ఆ గొడవంతా నీకెందుకు? నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్ళి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకిరాయి నాకివ్వడమే న్యాయం. కనుక, నా చెకుముకిరాయి ఇచ్చేసి, నీ దారిని నువ్వు వెళ్ళు" అని ముసిలిది అన్నది. రాయి సంగతి చెబితే కాని వల్ల కాదని సిపాయీ 'ఇదివరకే చెప్పాను కదా' అని ముసిలిదీ జగడమాడుకొన్నారు. చివరకు ముసిలిది మొండిపట్టు పట్టేసరికి, సిపాయి చర్రున కత్తి దూసి, ఆమె పీక తెగవేశాడు. ముసిలిదాని పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీలి తివాసిలో కట్టి బుజాన వేసుకుని, చెకుముకి రాయి జేబులో వేసుకొని, నాలుగామడల దూరంలో వున్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతులో ఆడుతూ ఉండటంవల్ల సదుపాయంగా భోజనం అమరింది. కోరిన దుస్తులు వేసుకొంటున్నాడు, ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని, దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని వేషమూ, అతని భాగ్యమూ చూచి అనేకమంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటీగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించీ, త్రిలోకసుందరి అయిన రాజకుమారిని గురించీ అతనికి చెప్పారు. "అయితే అమెను నేను చూడాలి. ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి" అని సిపాయి వాళ్లను అడిగాడు.
అందుకు వాళ్లు "వోయి సిపాయీ! రాజకుమారిని చూడటమనేది తేలికయిన పని కాదు. దోమ దూరని కంచు కోటలో ఆమె వున్నది, ఆ కోటలోకి ఎవ్వరూ వెళ్ళటానికి శక్యం కాకుండా చుట్టూ కందకాలు, బురుజులూ కట్టించారు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి, ఒక సామాన్యమయిన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకి అది ఇష్టంలేక, అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి వుంచారు," అని వాళ్లు చెప్పారు. ఐనా, సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు వ్రాశాడు. కాని, రాజుగారు "టట్, వీలులేదు" అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసాలేక, రాతిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి, అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకిరాయి సంగతి జ్ఞాపకంవచ్చి, జేబులోనుంచి తీసి నిప్ప కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా బంతులంతేసి కళ్లు గల కుక్క ప్రత్యక్షమయ్యి, "స్వామీ, మీ కేమీ కావాలో చెప్పండి, తీసుకువచ్చి ఇస్తాను" అన్నది. "భేష్, బాగా ఉన్న" దనుకుని సంతోషించి, "నాకు ధనం కావాలి" అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకిరాయి తమాషా తెలుసుకొన్నాడు. రాతిని నేలమీత ఒకసారి గీస్తే రాగినాణాల గదిలో వుండే కుక్క వచ్చింది. రెండుసారులు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. మూడుసారులు గీసేసరికి బంగారు నాణాల గదిలో వుండే కుక్క వచ్చింది. ఈవిధంగా సిపాయి మూడు కుక్కలచేత డబ్బు తెప్పించి మళ్లీ అతి వైభవంగా కాలక్షేపం చేయసాగాడు.
సిపాయి ఏది కోరినా, కుక్కలు మూడూ ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదికి మరలింది. బంతులంతేసి కళ్లుగల కుక్కను రప్పించి, తన వుద్దేశం చెప్పాడు. ఒక్క క్షణంలో ఆ కుక్క, నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్లారా చూచి సిపాయి మళ్లీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క అమెని తిరిగి కంచుకోటలో దిగబెట్టి వేసింది. మరునాడు వుదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తలిదండ్రులతో గతరాత్రి తనకు ఒక కల వచ్చిందనీ, ఆ కలలో ఒక కుక్క, ఒక సిపాయీ కనపడ్డారనీ, ఆ సిపాయి తన చేయి పట్టుకొన్నాడనీ చెప్పింది. "ఓహో, ఇది తమాషాగా వుంది. నిజం తేల్చుకోవాలి" అని చెప్పి రాణి ఒక ముసలి దానిని రాజకుమారి గదికి కాపలా పెట్టింది. రెండవ రోజున మళ్లీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోబోయింది. ఐతే దాని జాడ కనిపెట్టిన ముసలిది, ఆ కుక్క వెంబడే వెళ్లి, సిపాయి ఇంటి తలుపుమీద సుద్దముక్కతో ఆనవాలు పెట్టి, ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ యిల్లు పట్టుకుందామని రాజూ, రాణీ స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కాని, ఆ బజారున వున్న ఇళ్లన్నిటిపయినా ఒకే మోస్తరుగా ఆనవాళ్లు వున్నై. రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్కే యిలా చేసింది. అందువల్ల అసలు ఇల్లు వారు కనిపెట్టలేకపోయారు.
అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది: ఒక సిల్కు సంచీ కుట్టి, దాని నిండా పిండిపోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి వుంచింది. మాడవరోజున మళ్లీ కుక్క వచ్చి రాజకుమారిని వీపుమీద ఎక్కించుకొని, సిపాయివద్దకు తీసుకుపోయింది. రాణీ కట్టిన పిండి సంచికి అడుగున చిన్న చిల్లి ఉండటం వల్ల దారి పొడుగునా ఆ పిండి రాలింది. ఆ సంగతి కుక్కకు కూడా తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజూ రాణీలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి, ఉరి తీయమని ఆజ్ఞాపించారు. ఆ మరునాడు జెయిలు కాపలావాడు వచ్చి, "రేపు రాజుగారు నిన్ను ఉరితీస్తారు" అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చెకుముకిరాయి బసలో మరిచిపోయి వచ్చానే అని విచారించాడు. సిపాయిని ఉరితీసే రోజు వచ్చింది. జైలు కటకటాలలోంచి చూసేసరికి, ఉరిశిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవటం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరితీసే చోటికి పరుగెత్తి పోతూవుండగా, వాడి కాలి జోడు ఒకటి వూడిపోయింది. వానిని సిపాయి పిలిచి, "ఓరి కుర్రవాడా! ఎందుకంత తొందర! నన్నేకద వురి తీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది! కనుక నాకు ఒక చిన్న పని చేసిపెట్టు, నీకు ఒక రూపాయి బహుమతి ఇస్తాను" అన్నాడు. కుర్రవాడు సంతోషంతో వప్పుకొనే వరకు సిపాయి, తన ఇల్లు ఆనవాలు చెప్పి, అక్కడ వున్న చెకుముకిరాయి తెచ్చిపెట్టమన్నాడు.
నిమిషంలో ఆ కుర్రవాడు చెకుముకి రాయి తెచ్చి ఇచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరితీసే వేళకు జనం అపరిమితంగా మూగారు. సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే, చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉన్నదని అతను రాజుగారితో మనవి చేశాడు: "ఏమీ లేదు. మహాప్రభూ ! ఒక్క చుట్ట కాల్చుకుందామని కోరిక వున్నది. తీరగానే మీరు నన్ను ఊరితీయవచ్చును." అన్నాడు. "ఇదేమంత భాగ్యం. చిన్న కోరికే కదా!" అని రాజుగారు సరేనన్నారు. అప్పుడు సిపాయి చెకుముకి రాయి తీసి నేలమీద ఆరుసార్లు కొట్టేసరికి, భయంకరమైన మూడు కుక్కలూ బంతులంతేసి కళ్లు కలది, బండి చక్రాలంతేసి కళ్లు కలదీ, గుడిగోపురాలంతేసి కళ్లు కలదీ, ప్రత్యక్షమయినాయి. సిపాయి, సంజ్ఞ చేసేసరికల్లా మూడు కుక్కలూ ఎగిరి అక్కడి పెద్దలందరనూ పిక్క పట్టుకొన నారంభించినై. జనం ఎక్కడి వాళ్లు అక్కడనే హడిలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకొన్నది. "వోయి, సిపాయీ! నీకు పుణ్యముంటుంది, నీ కుక్కలను దగ్గిరకు పిలుచుకోని, కట్టేసెయ్యి. ఇదుగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లి చేసి, నా రాజ్యం నీకిస్తున్నాను" అని బతిమలాడేవరకు సిపాయి వాటిని మాయంచేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్లి, రాజకుమారిని ఇచ్చి అతివైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మ రాసిన గీటు ప్రకారం ఆమెను సిపాయికి పెళ్లి చేయక తప్పిందికాదు.
Comments
Post a Comment