పూర్వకాలమందు ఒక మహారణ్యానికి, పులి రాజుగా వుండేది. పులి కింద మంత్రి ఒక రామచిలుక. చిలుకకు దయ, దాతృత్వము, ఉపకార బుద్ధీ ఉండటం చేత, ఎవరువచ్చినా లేదనుకుండా, రాజుగారితో చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ వుండేది. అందుకని, చిలుక హయాములో పులిరాజుకీర్తి దేశదేశాల వ్యాపించింది. ఇలా వుండగా, రాజుగారి కీర్తి వినిన ఒక పేద బ్రాహ్మడు చాలా దూరం నించి ఈ అరణ్యానికి వచ్చి, చిలుకమంత్రిని ఆశ్రయించాడు. బ్రాహ్మడి అవస్థ తెలుసుకుని చిలుక జాలిపడింది. పులిరాజు సంతోషంగా వుండే సమయంలో అతన్ని గురించి అనుకూలంగా రెండు మాటలు చెప్పేసరికి, "సరే, దానికేముంది! దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం గాకుంటే మరెవళ్లు సహాయం చేసేది? బ్రాహ్మడిని సంతోషపెట్టి పంపించవలిసింది" అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుకమంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపింది. ఈ ధనం పట్టుకుపోయి, బ్రాహ్మడు ఏలోపమూ లేకుండా కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. కాని, కొంతకాలం అయేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి, మళ్లా అతను ఎప్పటిలాగ దరిద్రునిగా తయారయినాడు. అయితే, ఈ సమయంలో ధర్మబుద్ధి గల చిలుకమంత్రీ, ఔదార్యం గల పులి రాజూ జ్ఞాపకానికి వచ్చి, బ్రాహ్మడు మరొకసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుకమంత్రికి బదులుగా కాకిమంత్రి కూర్చుని వున్నది.
బ్రాహ్మడు కాకిమంత్రివద్దకు వెళ్లి, తను వచ్చిన పని చెప్పుకున్నాడు. "బ్రాహ్మలను సత్కరించటంకంటే పుణ్య కార్యం మరేమిటున్నది? మిమ్మలినిగురించి రాజుగారితో చెప్పివస్తాను. దయచేసి అలా కూర్చోండి" అని చెప్పి, కాకిమంత్రి పులివద్దకు వెళ్లింది. "పులిరాజా! ఇన్నాళ్లకు మళ్ళీ కోరనికోరికగా నరమాంసం మనకు లభించింది. పిక్కబలిసిన బొజ్జ బ్రాహ్మడు తమ దర్శనానికి రాబోతున్నాడు. అతనిని తగువిధంగా సత్కరించండి" అని సలహా ఇచ్చిపోయి, బ్రాహ్మడిని పులివద్ద ప్రెవేశపెట్టింది. బ్రాహ్మడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి, అతనిపయిన ఉరకబోయింది. అప్పుడు బ్రాహ్మడు హడలిపోతూ చేతులు జోడించి, "ఇదేమిటి పులిరాజా, ఈ విడ్డూరం! పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు. ధనమిచ్చి సత్కరించారు. మీ ధర్మమా అని పిల్లలూ మేమూ ఇప్పటివరకూ హాయిగా మీ పేరు చెప్పుకొని కాలక్షేపం చేశాము. ఏదో ఇప్పుడుకూడా అలానే కటాక్షించి ఏలినవారు సహాయం చేస్తారనీ, దరిద్రబాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను కాని పేదవాడిని కబళించివేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా?" అని అనేసరికి, బ్రాహ్మడిపైన జాలి కలిగి పులి వెనక్కు తగ్గింది.
"ఓయి పిచ్చిబ్రాహ్మడా! పూర్వానికీ యిప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకో లేకపోయినావేమయ్యా? కాలం మారింది, ధర్మం మారింది, మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజు అంటే ఏమిటనుకొన్నావు! కాలాన్నిబట్టి, మంత్రుల సలహాల ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు వెళతాయి. నిరుడువుండిన మంత్రుల సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహాను పుచ్చుకొని నేను ఇలాచేయవలసివచ్చింది. ఐనప్పటికీ, నువు లోగడ మాసొమ్ము తిని వుండటంచేత నీకూ మాకూ సంబంధం ఏర్పడివున్నది. కనుక, నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పటిలో గొప్ప సత్కారమన్నమాట. ఆలస్యం చేయక రెండవ కంటికి తెలియకుండా పారిపో" అని అనేసరికి, బ్రతుకుజీవుడా అనుకొని, బ్రాహ్మడు పరుగుచ్చుకొని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏమి మూట తెస్తాడోనని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకు ఈ సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరయిపోయింది. "ఇంకా నయం, పులిరాజుగారు మింగివేయకుండా బయటపడ్డారు. అదే పదివేలు. బతికివుంటే బలుసాకు ఏరుకుని తినవచ్చు. మంచి మంత్రులు వుండే మరొక రాజును ఆశ్రయించవచ్చు." అని ఆమె, భర్తకు గండం తప్పించినందుకు ముక్కోటి దేవతలకూ మ్రొక్కుకొన్నది.
Comments
Post a Comment